8, ఆగస్టు 2013, గురువారం

తెలంగాణ ఎందుకు?


‘విశాలాంధ్ర నినాదం వెనుక దురాక్షికమణోద్దేశ ప్రేరిత సామ్రాజ్యవాదతత్వం గర్భితమై ఉన్నది’ అని సూత్రీకరించారు నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ! తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉండే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు ఇచ్చుకున్నట్లే రెండు ప్రాంతాలూ విడిపోవచ్చు.. అని చెప్పారు! తెలుగువాళ్లందరికీ ఒకే రాష్ట్రం అన్న నినాదం వెనుక ఉన్న అసలుతత్వాన్ని పసిగట్టి చేసిన వ్యాఖ్యలివి!
‘తెలంగాణ ఆంధ్రకంటే అభివృద్ధి పథంలో ఉంది కనుక, పరిపాలనా దృక్కోణం నుంచి చెప్పాలంటే ఆంధ్ర-తెలంగాణ ఏకీకరణవల్ల తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి లాభం ఉండదన్న అభివూపాయం వ్యక్తమైంది. విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి పథకాల్లో తెలంగాణ ఆకాంక్షలకు తగినంత ఆదరణ లభించకపోవచ్చన్న భయం కూడా ఈ ప్రాంతంవారిలో వ్యక్తమైంది’ ఇది రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌కు నేతృత్వం వహించిన ఫజల్ అలీ తన నివేదికలో పేర్కొన్న అంశాలు!

ఉల్లంఘనలతోభంగపడ్డ గడ్డ ఇది
అనేకానేక ఒప్పందాలకు, రక్షణలకు హామీలు గుప్పించి తెలంగాణను కలిపేసుకున్న ఆంధ్ర నాయకత్వం.. నాటి అనుమానాలను నిజం చేసింది! పెద్ద మనుషుల ఒప్పందం మొదలుకుని.. ఆరొందల పది జీవోదాకా.. అనంతరం దానిని సరిచేసే కమిటీల దాకా.. అనేకానేక ఒప్పందాలను, హామీలను, ప్రకటనలను తుంగలోకి తొక్కారు. ఆఖరుకు విడిపోయే సమయం ఆసన్నమై.. డిసెంబర్ 9 ప్రకటన రూపంలో నోటిదాకా వచ్చిన కూడును తన్నేశారు! రాష్ట్రం విలీనం సమయంలో, ఆ తర్వాత తెలంగాణకు ఇచ్చిన హామీలేంటి? అవి ఎలా ఉల్లంఘనకు గురయ్యాయి? స్థూలంగా ఒకసారి పరిశీలిస్తే...
పెద్ద మనుషుల ఒప్పందం..

తెలంగాణ ప్రాంత ప్రజలందరూ విలీనాన్ని వ్యతిరేకించడంతో 1956 ఫిబ్రవరి 20న పెద్దమనుషుల ఒప్పందాన్ని రూపొందించారు. దీనిపై బెజవాడ గోపాలడ్డి, నీలం సంజీవడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, ఏ సత్యనారాయణరాజు, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నాడ్డి, జేవీ నరసింగరావు, కేవీ రంగాడ్డి సంతకాలు చేశారు. అంతకుముందు 1.2.1956న కర్నూలు శాసనసభలో తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో తెలంగాణ వారినే నియమిస్తామని, తెలంగాణ వారి భూములను కొనుగోలు చేయబోమని, తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్ని వసతులూ కల్పిస్తామని, వారి హక్కులకు భంగం కలిగించబోమని తీర్మానించారు. కర్నూలు శాసనసభ తీర్మానాన్ని తెలంగాణ ప్రజలు లెక్క చేయలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించారు.

ఈ క్రమంలోనే పెద్దమనుషుల ఒప్పందం (జంటిల్‌మెన్ అగ్రిమెంట్) అమలులోకి వచ్చింది. తెలంగాణ మిగులు బడ్జెట్‌ను తెలంగాణ ప్రాంత అభివృద్దికోసమే వినియోగిస్తామని ఇందులో హామీ ఇచ్చారు. తెలంగాణలో విద్యాసంస్థలు నెలకొల్పుతామని, విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల నియామకాలలో ముల్కీ నిబంధనలు పాటిస్తామన్నారు. 20 మంది ప్రజా ప్రతినిధులతో తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పరుస్తామని, తెలంగాణ వ్యవసాయ భూముల క్రయవిక్షికయాలతో సహా ప్రాముఖ్యమైన విషయాలన్నింటినీ ఈ మండలి పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ నుండి ఎన్నికైన ఉపముఖ్యమంత్రి ఈ కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారని పెద్దమనుషుల ఒప్పందంలో రాసుకున్నారు. ప్రత్యేకంగా తెలంగాణకు ఉపముఖ్యమంత్రి పదవి ఉంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన కొద్దిరోజులకే ఉపముఖ్యమంత్రి పదవి ఆరో వేలువంటిదని ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి వ్యాఖ్యానించారు. అక్కడి నుండి జెంటిల్ అగ్రిమెంట్ ఉల్లంఘనలు యథేచ్చగా జరిగిపోయాయి.
ఇవీ ఆ ఉల్లంఘనలు..
-తెలంగాణలోని లక్షల ఎకరాల భూములను పెద్దమనుషుల ఒప్పందాలకు వ్యతిరేకంగా తెలంగాణ జాతీయ కమిటీ అనుమతి లేకుండా కొనుగోలు చేశారు. ఈ క్రమం గురుకల్‌వూటస్ట్ భూముల కొనుగోలు వరకు కొనసాగింది. నిజాంసాగర్ కింద అప్పటికే సాగులో ఉన్న భూములను, భవిష్యత్తులో సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్న భూములు, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని అటవీ భూములను కారుచౌకకు కొని, పట్టాలు చేయించుకున్నారు. దీంతో తెలంగాణ రైతులు తమ భూమిలోనే కూలీలయ్యారు.
-తెలంగాణలోని ఉద్యోగ ఖాళీల్లో ఆంధ్రవూపాంతం వారిని నియమించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ నాలుగో తరగతి ఉద్యోగులుగా ఆంధ్రవూపాంతం నుంచి తెచ్చుకుని, ముల్కీ సర్టిఫికెట్లు ఇప్పించి నియమించారు. ఇలా ఏకంగా లక్షమంది చేరారని గిర్‌గ్లానీ కమిషన్ రుజువు చేసింది. అంతకుముందు జైభారత్‌డ్డి కమిషన్ ఇదే మాట చెప్పింది.
-తెలంగాణ విద్యాసంస్థల సీట్లన్నీ ఈ ప్రాంత విద్యార్థులకే కేటాయించాలన్న నిబంధన ఉన్నా.. ఆంధ్ర ప్రాంత విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారు.
-తెలంగాణ ప్రాంత మిగులు బడ్జెట్ నిధులను ఈ ప్రాంతంలోనే ఖర్చు చేస్తామని హామీలు ఇచ్చి, నిధులను పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి తరలించారు. తెలంగాణ నీళ్లులేక బీడైపోయింది.
-ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, హెచ్‌వోడీల ఏర్పాటులో బాధిత తెలంగాణ ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం దక్కించుకున్నా.. ప్రభుత్వం ఖాతరు చేయలేదు.
-ఆంధ్రవూపాంతం నుండి వలసవచ్చిన ఉద్యోగులు, వ్యవసాయదారులు, వర్తకులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు తెలంగాణ ప్రజలను అవహేళనలకు గురిచేశారు.. చేస్తున్నారు. ఇంగ్లీషురాదని, మాట్లాడేది తెలుగేకాదని, పరిపాలనలో అసమర్థులని, పారిక్షిశామిక వ్యవసాయ రంగాల్లో సోమరుపోతులని, కట్టుబొట్టు ఆటవికమైనదని అపహాస్యం చేశారు.
....పెద్దమనుషుల ఒప్పందాలను పాలకులు తుంగలో తొక్కడంతో 1969లో తెలంగాణ భగ్గుమన్నది. ఈ క్రమంలోనే జనవరి 19, 1969న అఖిలపక్ష నాయకులు 45 మంది కూర్చొని ఒప్పందం కుదర్చుకున్నారు. దీనిని ఆల్‌పార్టీ ఆకార్డ్‌గా వ్యవహరించారు

ఇవీ ఆ ఒప్పందాలు
-ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో నియామకం పొందిన ఉద్యోగులందరినీ వెంటనే తొలగించి వారి స్థానంలో స్థానికులను నియమించాలి.
-ముల్కీ నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగాలలోనేకాకుండా స్వయం ప్రతిపత్తిగల సంస్థలకూ వర్తింపచేయాలి. వీటిని మరికొంతకాలం పొడిగించాలి.
-ఉద్యోగస్తుల సీనియారిటీ విషయాలలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాల నిర్ణయాలను వెంటనే అమలు పరచాలి.
-రాజధాని హైదరాబాద్‌లో విద్యావసతులు విస్తరింపచేయాలి.
-ఆంధ్రవూపాంతానికి వినియోగించిన తెలంగాణ నిధుల లెక్కలు తీసి, అంతమొత్తాన్ని తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలి.
ఈ ఒప్పందాల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. వీటిని దామోదరం సంజీవయ్య వ్యతిరేకించారు. తెలంగాణ ఆందోళనను చల్లార్చేందుకు 11 ఏప్రిల్ 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. దీనిని అష్టసూత్ర పథకం అని వ్యవహరించారు. దీనిలోని అంశాలు..
-ఆంధ్రవూపాంతానికి తరలించిన తెలంగాణ నిధుల లెక్కలు తీయడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించడం. నెల రోజులలో నివేదికను సమర్పించాలని కోరడం.
-మిగులునిధుల తరలింపుతో జరిగిన నష్టానికి పరిహారంగా నిధులను సమకూర్చటం.
-తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయటం.
-నిర్ణయించిన ప్రణాళికలను అమలుపరచడానికి ప్రణాళికా సంఘం సలహాదారుడి అధ్యక్షతన ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయటం.
-తెలంగాణ ప్రాంతీయ సంఘానికి, తరువాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన యంత్రాంగానికి ఇంకా ఎక్కువ అధికారాలను ఇచ్చే ప్రతిపాదన పరిశీలించటం.
-తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడానికి కావాల్సిన రాజ్యాంగ పరమైన కట్టుదిట్టాలను చేయడానికి న్యాయ నిపుణుల సలహాలను కోరటం.
-తెలంగాణ ఉద్యోగుల సర్వీసు సమస్యలకు తగిన పరిష్కారాలను సూచించే బాధ్యతను యూపీఎస్సీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఒక కమిటీకి అప్పగించటం.
-ఆర్నెల్లకోసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రధానమంత్రి సమక్షంలో జరపటం.
అతి ముఖ్యమైన ముల్కీ నిబంధనల సమస్యలకు ఈ పథకం కచ్చితమైన పరిష్కారాన్ని చూపలేకపోయింది. సుప్రీంకోర్టు 3.1.1972న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవేనని చరివూతాత్మక తీర్పు ఇచ్చింది. కానీ తీర్పును ఆంధ్ర ప్రాంతీయులు వ్యతిరేకించి, ఒక ఉద్యమాన్ని లేవదీశారు. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కారు. ఈ క్రమంలోనే తెలంగాణకు ఇచ్చిన హమీలన్నింటినీ పాలకులు ఉల్లంఘించారు. వీటి పర్యవసానంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నానాటికీ ఉధృతమవుతూ విస్తరించింది. విలీనానికి ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో గొంతు విప్పింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి