30, ఆగస్టు 2013, శుక్రవారం

ఆరోగ్యం ఆంధ్రకు..జబ్బులు తెలంగాణకు పంచిపెట్టిన సమైక్యాంధ్ర


8/31/2013 6:39:10 AM
సమైక్య రోగం!
-ఆరోగ్యం ఆంధ్రకు..జబ్బులు తెలంగాణకు పంచిపెట్టిన సమైక్యాంధ్ర
-నిజాం కాలం..ప్రతి జబ్బుకూ ప్రత్యేక ఆస్పత్రి
-బొక్కల దవాఖాన, ఉస్మానియా, నీలోఫర్,చెస్ట్ హాస్పిటల్.. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల
-ఆనాడే ప్రజలకు స్పెషాలిటీ వైద్యంవిలీనం తర్వాత వెలుగులు మాయం ప్రభుత్వ ఆస్పత్రుల సమాధులపై
కార్పొరేట్ ఆస్పత్రుల పునాదులు వైద్య విద్యలోనూ సీమాంధ్రకే చాన్సులు ఆస్పత్రుల అధిపతులూ అక్కడివారే
ఆధిపత్యం పోతుందనే విభజనకు వ్యతిరేకతనాలుగు జిల్లాల సీమలో నాలుగు కాలేజీలు10 జిల్లాల తెలంగాణలోనూ నాలుగే కాలేజీలురాజధాని నుంచి తరలిపోయిన హెల్త్ వర్సిటీ

ap-copy
హైదరాబాద్, ఆగస్టు 30 (టీ మీడియా):ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో.. ఆంధ్రకు ఆరోగ్యం అందితే.. తెలంగాణకు రోగాలు మిగిలాయి! కష్టసుఖాలు కలిసి పంచుకుందామని తెలంగాణను కలిపేసుకున్న సీమాంధ్ర నాయకత్వం.. ఈ ప్రాంతంలో అప్పటికే బలంగా స్ధిరపడి ఉన్న వైద్యరంగాన్ని నాశనం చేసింది. కీలక ఆస్పత్రుల ఆలనాపాలనా పట్టించుకోకుండా.. వాటిని ఉద్దేశపూర్వకంగా శిథిలావస్థకు చేర్చారు. ఒకప్పుడు సాధారణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించిన నగరంలో కార్పొరేట్ ఆస్పవూతులను పుట్టకొక్కుల్లా పెరగనిచ్చారు! వాటిలో సాధారణ, మధ్యతరగతి ప్రజలు వైద్యం చేయించుకోవడం అంటే ప్రాణం పోయేంత పరిస్థితి కల్పించారు! నగరంలోని కీలక ఆస్పత్రులన్నింటిలో సీమాంధ్రులను నింపేశారు! పారిశుధ్యం వంటి అడ్డమైన చాకిరి చేసే నాల్గో తరగతి ఉద్యోగులు తప్ప.. అంతా తెలంగాణేతరులే! నిమ్స్‌లాంటి చోట్ల ఆ మాత్రం కూడా తెలంగాణవారికి అవకాశం ఇవ్వలేదు. వైద్యారోగ్యశాఖలోనూ ఇదే తంతు.

వైద్య విద్య విషయంలోనూ అదే ధోరణి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలల్లో అత్యధికం సీమాంధ్ర జిల్లాలోనే ఏర్పాటయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో కొత్త కాలేజీలు లేకపోవడంతో ఇక్కడి విద్యావంతులకు స్టెత్ పట్టుకునే భాగ్యం దక్కలేదు. సీమాంధ్రలోనే ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉండటంతో వారికే త్వరగా పోస్టింగ్‌లు రావటం.. వాటి ఆధారంగా సీనియారిటీ పెరగడంతో కీలక పదవుల్లో ప్రస్తుతం వారే తిష్ఠవేసి ఉన్నారు. ఆంధ్రతో విలీనానికి ముందు తెలంగాణలో గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు నిజాం కాలం నుంచే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రైవేటు కాలేజీగా ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీని ప్రభుత్వం తన పరిధిలోకి తెచ్చుకుంది. తప్పించి.. కొత్తగా ఒక్క కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి సీమాంధ్రలోని గుంటూరు, విశాఖపట్నంలో రెండు కాలేజీలు ఉండేవి. ఇప్పుడు అవి ఆరుకు పెరిగాయి. ఇవి చాలవన్నట్లు నెల్లూరులో మరో కాలేజీని ఏర్పాటు చేసేందుకు ఆగమేఘాల మీద పనులు జరుగుతున్నాయి. ఇక ఒక్క కాలేజీ కూడా లేని నాలుగు జిల్లాల రాయలసీమలో నాలుగు కాలేజీలు ఏర్పాటు చేశారు. వైద్యవిద్యలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు పెరగడం, తెలంగాణ ప్రాంత నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆ కాలేజీని నాలుగేళ్ల పాటు నాన్చినాన్చి 2013-14సంవత్సరానికి 100మెడికల్ సీట్లు తెచ్చారు.

ఇక రిమ్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు కాలేజీలకు గాను రెండు ఆంధ్రలో, ఒకటి రాయలసీమలో నెలకొల్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఒక పాత భవనంలో రిమ్స్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటికీ ఇక్కడ కాలేజీకి స్టాఫ్‌లేరు. పక్కా భవనం లేదు. కానీ.. కడప రిమ్స్‌కు ఒకేసారి రూ.100కోట్లు మంజూరు చేసి భవనాలు పూర్తి చేశారు. ఇక్కడ పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా లక్ష రూపాయల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అదే అదిలాబాద్ రిమ్స్ కాలేజీలో గతేడాది వరకు మహారాష్ట్ర నుండి లెక్చరర్లను అద్దెకు తెప్పిస్తూ పాఠాలు చెప్పిస్తున్నారు. ఇదీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన మెడికల్ వైద్య.

హెల్త్ యూనివర్సిటీ.. తెలంగాణకు నో ఎంట్రీ
ఆరోగ్యరంగంలో సీమాంధ్ర వెలుగులు 1986 ఏప్రిల్ 9న ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌తో విరజిమ్మడం మొదలైంది. తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు.. దీనిని ఉస్మానియా పరిధినుంచి తప్పించి.. విజయవాడకు తరలించారు.

యూనివర్సిటీలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మార్చిన చరిత్ర ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే లేదు. కేవలం తెలంగాణ ప్రాంత గుర్తుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఉందన్న కారణంతో దీన్ని విజయవాడకు తరలించారనే విమర్శలున్నాయి. దీనికితోడు ఇంత పెద్ద యూనివర్సిటీ పరిధిలో ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా ఉద్యోగిగా లేడంటే అతిశయోక్తి కాదు. మొన్నటిదాకా ఒక ఉద్యోగి ఉన్నా.. తెలంగాణ ఉద్యమం తరువాత అతను కూడా ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యకు సంబంధించిన ఈ యూనివర్సిటీలో పూర్తిగా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులే ఉన్నారు. కొంత కాలం క్రితం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో పెట్టినా దానికీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తినే ఇన్‌చార్జిగా పెట్టుకున్నారు. యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది వైఎస్ చాన్సలర్లుగా పని చేస్తే అందులో ఏడుగురు సీమాంధ్రులే. ప్రస్తుత వీసీ ఐవీ రావు తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మరికొంత కాలం పని చేసేందుకు ఆయనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

నాన్‌లోకల్ బన్‌గయా లోకల్
మెడిసిన్ సీట్లలో లోకల్ కోటా 85 శాతం, అన్ రిజర్వుడు కోటా 15శాతంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ విద్యార్థి అయినా ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్సిటీ పరిధిలోనే చదువుకుంటాడు. కానీ సీట్లు నింపే విషయంలో మాత్రం రీజియన్ల వారీగా సీట్లను నింపుతోంది. దీని వెనుక సీమాంధ్రకు ఎక్కువ సీట్లు ఇప్పించుకునే భరీ కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 4 ప్రకారం లోకల్ విద్యార్థులకు సీట్లు కేటాయింపులు చేసిన తరువాత 15శాతం అన్‌రిజర్వుడు సీట్లను మెరిట్ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో రెండు ప్రాంతాలకు చెందినవారు ఉండొచ్చు. కానీ అన్‌రిజర్వుడు అనే పదాన్ని తొలగించి 15శాతం రిజర్వుడుగా మార్చుకుని తెలంగాణ సీట్లలో 15శాతం సీమాంధ్రులు చేరిపోయారు.

దీనికి తోడు లోకల్ కోటాలో 1986 నుండి 1997వరకు సీమాంధ్రలో చదువుకున్న విద్యార్థులు కూడా నాలుగేళ్లు తెలంగాణలోనే చదవినట్లు తప్పుడు సర్టిఫికెట్లు తీసుకుని తెలంగాణలో సీట్లు పొందుతున్నారు. ఇలా తెలంగాణలో వేల సంఖ్యలో మెడికల్ సీట్లు సీమాంధ్రులు కొట్టేశారని అధికారులు చెబుతున్నారు. దాదాపు 11ఏళ్ల పాటు ఈ తతంగం సాగింది. తెలంగాణలో ప్రతి 75వేల మందికి ఒక్కసీటు ఉంటే, రాయలసీమలో 23వేల మందికి ఒక్కసీటు చొప్పున.. ఆంధ్రలో 33వేల మందికి ఒక్కసీటు చొప్పున ఉన్నాయి.

రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ఒకే విధానంగా సీట్లు నింపితే తమ ప్రాంతానికి సీట్లు తక్కువ అవుతాయన్న ఆలోచనతోనే సీట్లను రాష్ట్రస్థాయిలో చూడకుండా, రీజియన్ల వారీగా చూడటం మొదలు పెట్టారన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీని వల్ల సీట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆంధ్ర, రాయలసీమలో ర్యాంకు ఎక్కువ వచ్చినా వారికి సీట్లు దక్కుతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రలో ఎస్టీ బాలుర విభాగంలో 8691ర్యాంకు వస్తేనే సీటు దక్కుతుంది. అదే రాయలసీమలో 6456ర్యాంకు వస్తే సీటు దక్కుతుంది. కానీ తెలంగాణలో 3701ర్యాంకు వస్తేనే సీటు. ర్యాంకు మరోవంద, రెండు వందలు పెరిగినా తెలంగాణ వ్యక్తికి సీటు గల్లంతే.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీల ప్రాంతాల వివరాలు
1. ఐవీ రావు (1986-1988) సీమాంధ్ర
2. ఎల్ సూర్యనారాయణ (1988-1994) సీమాంధ్ర
3. సీఎస్ భాస్కరన్ (1994-1997)
4. జీ శ్యాంసుందర్ (1997-2004) తెలంగాణ
5. ఆర్ సాంబశివరావు (2004-2007) సీమాంధ్ర
6. పీవీ రమేష్ (2007-2007) సీమాంధ్ర
7. ఏవీ కృష్ణంరాజు (2007-2010) సీమాంధ్ర
8. ఐవీ రావు (2010 నుంచి పదవిలో) సీమాంధ్ర

2011లో రీజియన్ల వారీగా ర్యాంకులు, సీట్ల వివరాలు
రీజియన్ ఓసీ (బాలికలు) ఎస్టీ (బాలికలు) ఓసీ(బాలురు) ఎస్టీ(బాలురు)
ఆంధ్ర 1221 8775 981 691
రాయలసీమ 1595 8528 1273 6458
తెలంగాణ 985 3763 685 3701


కాలేజీలు సీట్ల సంఖ్య
ఉస్మానియా 250
గాంధీ 200
కాకతీయ 200
నిజామాబాద్ 100
ఆదిలాబాద్ రిమ్స్ 100
మొత్తం 850
కర్నూలు 200
అనంతపురం 100
తిరుపతి 200
కడప రిమ్స్ 150
మొత్తం 650
ఆంధ్రా మెడికల్ 200
కాకినాడ 200
విజయవాడ 100
ఒంగోలు రిమ్స్ 100
శ్రీకాకుళం రిమ్స్ 100
మొత్తం 700

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి