August 30, 2013
న్యూఢిల్లీ, ఆగస్టు 29: సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయకుండా ఇంకా పదవులు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను ఆ ప్రాంత ఉద్యోగ సంఘాల నేతలు నిలదీశారు. గురువారం ఇక్కడ వారితో జరిగిన సమావేశంలో వాడీవేడిగా చర్చలు జరిగాయి. విభజన ప్రకటనను వెనక్కు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఇటు నేతలు, అటు ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. విభజన నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని అడ్డుకోనందుకు, ఆ తర్వాతా దాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేనందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఉద్యోగ ప్రతినిధులు మండిపడ్డారు.
"ఇంకా ఏం సాధిద్దామని మీరు పదవులు పట్టుకు వేళ్లాడుతున్నారు? కనీసం ఉద్యమ తీవ్రత గురించి కూడా ఇక్కడి అధిష్ఠానానికి తెలియజేయలేకపోతున్నారు? రాజీనామాలు చేయకుండా జనంలో తిరగగలమనుకుంటున్నారా? రాజీనామాలు చేసి జనంలోకి రండి.. మిమ్మల్ని గెలిపించే పూచీ మాది'' అని నేతలతో ఉద్యోగ నేతలు ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ ప్రతినిధులు విజృంభిస్తుంటే వారికి సర్ది చెప్పడమే కాంగెస్ నేతల పనైంది.
మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, కావూరు సాంబశివరావు, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడీ శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ పాల్గొన్నారు. ఉద్యోగుల తరఫున ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుతోపాటు దాదాపు 30 మంది వివిధ సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చివరికి సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధమేనని, అయితే రెండు రోజుల సమయం అవసరమని మంత్రులు చెప్పినట్లు తెలిసింది.
కాగా, సెప్టెంబర్ 7న తాము జరుపుతున్న సభకు రావాలని మంత్రులు, ఎంపీలను సీమాంధ్ర ఉద్యోగులు కోరారు. ప్రజాప్రతినిధులంతా వేదికపై కూర్చుంటే అధిష్ఠానంపై ప్రభావం పడుతుందని చెప్పారు. కానీ తెలంగాణ నేతలు కూడా ఇదే పని చేస్తారని, దీనివల్ల ఉద్యమం భగ్నమవుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే తమ తరఫున ప్రతినిధిని పంపే విషయం చర్చించి చెబుతామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కాగా, త్వరలో అందరి భాగస్వామ్యంతో కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో సీమాంధ్ర ఉద్యోగుల నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది.
రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే అంతా మట్టికరుస్తారని, ప్రజలు మిమ్మల్ని స్వాగతించరని ఒక నేత అన్నప్పుడు అది నిజమేనని కావూరు సాంబశివరావు అంగీకరించారు. సీమాంధ్రలో తిరగలేని పరిస్థితి నెలకొన్నదని తనకు తెలుసునన్నారు. అందరూ ముందుకు వస్తే రాజీనామా చేయడానికి సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. మొత్తం కేంద్రమంత్రులు, ఎంపీలంతా ఇప్పటికిప్పుడు రాజీనామా లేఖలపై సంతకం పెట్టాలని ఆయన ప్రతిపాదించారు. బ్లాంక్ చెక్‌లాగా రాజీనామా లేఖ రాసివ్వమంటారా? అని ఆయన ఉద్యోగులను అడిగారు. "పోనీ సభలోనే రాజీనామాలను ఆమోదించమని స్పీకర్‌ను నిలదీయమంటారా? అలా చేస్తే ఆమె వెంటనే ఆమోదించక తప్పదు.. రాజీనామా చేశాక ఏం చేయాలో చెప్పండి. నేను మాత్రం రెడీ. మాకు ప్రజలే అధిష్ఠానం కాంగ్రెస్ నాయకత్వం కాదు'' అని కావూరు స్పష్టం చేశారు.
కాగా, మరో కేంద్ర మంత్రి పళ్లంరాజు కూడా ఇలాగే స్పందించారు. "రాజీనామా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలీ ఉద్యమం ఎలా మొదలైంది? అది చివరి వరకు ఉంటుందా? మేమంతా రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నందు వల్ల వెనక్కుపోయేది లేదని వాళ్లు చెబుతున్నారు. మేం వారిని నిర్ణయం మార్చుకునేలా ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదంతా రాజకీయ క్రీడ. సమైక్యంగా ఉంటే మా పార్టీకి ఏ ప్రయోజనం ఉంటుంది? మా పార్టీని గెలిపిస్తారా?'' అని ఆయన ప్రశ్నల పరంపర కురిపించినట్లు తెలిసింది.
మరోవైపు సమైక్యాంధ్ర కోసం గట్టిగా పట్టుబట్టాల్సిన సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం కావాలంటూ నాన్ సీరియస్ ప్రకటనలు ఎందుకు చేశారని కేంద్ర మంత్రి చిరంజీవిని అశోక్‌బాబు అడిగారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ.. తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినప్పుడు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోమని సూచించారని, అందుకే ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేశానని వివరించారు. "కనీసం హైదరాబాద్‌ను యూటీ అయినా చేస్తే మనకు భద్రత ఉంటుందని భావించాను. మీకు ఈ ప్రతిపాదన నచ్చకపోతే చెప్పండి. నేను సినిమా రంగంలో అనుభవించిన స్థాయి కంటే ఈ మంత్రి పదవి నాకేమీ గొప్ప కాదు. ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. అంతా కలిసి ఒక్క మాట అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. ఒక్క క్షణం కూడా ఆలోచించను'' అని ఆవేశంగా చెప్పారు.
మరో మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కూడా ఉద్యోగులు నిలదీశారు. రాయలసీమ నేతలతో వచ్చి రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చిన మాట వాస్తవమేనా? ముందుగా విభజనకు ఎందుకు అంగీకరించారు? అని ప్రశ్నించారు. అయితే తాను రాయలతెలంగాణ గురించి మాట్లాడలేదని, ప్రతిసారీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెబుతూ వచ్చానని, ఒక వేళ సమైక్యంగా ఉంచలేకపోతే రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా చీల్చాలని ప్రతిపాదించినట్లు మంత్రి వివరించారు. రాజీనామా చేయడానికి తాను కూడా ఏమాత్రం వెనుకాడబోనని, ఇప్పుడంటే ఇప్పుడు రాజీనామాకు సిద్ధమేనని అన్నారు.
ఇప్పటికే రాజీనామాలు చేశామని, పదవుల కోసం తాము పాకులాడుతున్నామని అనుకోవద్దని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లు తెలిసింది. "కావాలంటే స్పీకర్ రేపే రాజీనామాలు ఆమోదించేలా చేయగలం కాని దాని వల్ల ఏం జరుగుతుంది? వీరమరణం చెందామన్న తృప్తి తప్ప ఏం మిగులుతుంది? సభలో ఇతర పార్టీల వారు మాకు ఎందుకు సహాయం చేస్తారు?'' అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఆ తర్వాత లోపలి నుంచి ఒత్తిడి చేసేందుకు అవకాశముండదని, అప్పుడు బయట ఎంత గొడవ చేసినా బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన వాదించారు.
తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మాట్లాడే హక్కు ఉంటుందని ఉండవల్లి తెలిపారు. బిల్లును ఏదో విధంగా అడ్డుకునేందుకు, కాగితాలు చించేందుకు, మైకులు విరగొట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. "మహిళా బిల్లు కాగితాలు చించేస్తే ఆగిపోలేదా? మొత్తం 23 మంది తిరగబడితే ఏం చేస్తారు? బహుశా నేనే కాగితాలు చించేయవచ్చేమో? మేమంతా అడ్డుకుంటే రాజ్యాంగ సవరణ ఆమోదించడం అంత తేలిక అవుతుందా? సభలో డివిజన్ కోరినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేయడం కూడా పార్టీ పెద్దలకు అంత సులభం కాదు'' అని ఆయన వాదించారు. అయితే మిమ్మల్ని ఇప్పటికే సస్పెండ్ చేశారని, ఇక ముందు కూడా అలాగే చేసి బిల్లును ఆమోదింపజేసుకుంటే ఏం చేస్తార ని ఒక ఉద్యోగ ప్రతినిధి అనుమానం వెలిబుచ్చారు.
అక్కడ బిచ్చగాళ్లు, పిల్లలు కూడా వీధుల్లోకి వస్తున్నారని పార్లమెంట్‌లో వాదించినంత మాత్రాన తెలంగాణ బిల్లు ఆగిపోదని ఉద్యోగులు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుకున్నదని, ఇప్పుడే రాజీనామా చేయడం మంచిదని, తర్వాత కలిసి ఉద్యమిద్దామని ఉద్యోగ నేతలు చెప్పారు. ఉద్యమ తీవ్రత గురించి ఇక్కడి వారెవరికీ తెలిసినట్లు లేదని, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు నాలుక కోస్తా అన్నా ఇక్కడికి సమాచారం ఇచ్చేవారూ లేరని అన్నారు. హైదరాబాద్ యూటీ చేయాలని కొందరు వాదిస్తున్నారని, సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లోనే కాక నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లో లేరా అని ప్రశ్నించారు.
సీమాంధ్ర తగులబడిపోయినా, ఇక్కడివారికి చీమైనా కుట్టినట్లుంటుందని తమకు అనిపించడం లేదన్నారు. ఇంత తీవ్రత నెలకొన్నా దిగ్విజయ్ సింగ్ నిమ్మకు నీరెత్తినట్లు నిర్ణయం వెనక్కు తీసుకోమని చెబుతున్నారని మండిపడ్డారు. కాగా సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు మంత్రులంతా ఎప్పుడెప్పుడు ఏమి చేశారో మంత్రి జెడీ శీలం కూడా సుదీర్ఘంగా వివరించారు. లగడపాటి రాజగోపాల్ మధ్యమధ్యలో సంధానకర్తగా వ్యవహరిస్తూ ఉద్యోగుల బాధలను గురించి వివరించారు. కలిసికట్టుగా చర్యలు తీసుకోకపోతే అధిష్ఠానం దిగిరాదని చెప్పారు.
రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసిన ఉద్యోగుల సంఘం నేతలను పనబాక లక్ష్మి తీవ్రంగా ప్రశ్నించారు. "తెలంగాణపై ఇతర పార్టీలు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు వారిని నిలదీయకుండా మా పార్టీని ఇప్పుడు ఎందుకు నిలదీస్తున్నారు? ఇతర పార్టీలు తెలంగాణ ఇవ్వాలని కోరినప్పుడు ఉద్యమించకుండా ఇప్పుడు ఎందుకు ఉద్యమిస్తున్నారు? మీరేమీ చేయనందు వల్లే ప్రజల్లో స్పందన లేదని చెప్పాల్సి వచ్చింది. పరిస్థితిని మేం కూడా ఊహించలేదు. అయినప్పటికీ అధిష్ఠానం మనసు మార్చేందుకు ఎంతో కష్టపడుతున్నాం'' అని పనబాక అన్నారు.
ఈ మాటతో నెల్లూరుకు చెందిన విద్యార్థి సంఘం నేత కృష్ణ యాదవ్ ఆమెతో వాగ్వాదానికి దిగారు. "ఏమిటి మేడమ్, మీరు చేసిన ప్రయత్నాలు.. ఒక్క ప్రయత్నం గురించి చెప్పండి. మీరు అంత కష్టపడితే నిర్ణయం ఎందుకు వెనక్కు తీసుకోవడం లేదు? ఇంతకాలం నిర్ణయం తీసుకోరని భావించినందు వల్లే మౌనంగా ఉన్నాం. అధిష్ఠానం మనసు మార్చుకోదని తెలిసినా ఇంకా పదవులు పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నారు?'' అని అన్నట్లు తెలిసింది. దీంతో మీరలా మాట్లాడితే నేనిక చెప్పేదేమీ లేదని ఆమె మౌనం పాటించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి