27, ఆగస్టు 2013, మంగళవారం

రూపాయి పతనం అర్థం చేసుకునేదెలా?


8/26/2013 12:11:36 AM
రూపాయి విలువ .......ఈ మధ్య వార్తల్లో లేని రోజు లేదు. అంతర్జాతీయ విపణిలో మారకపు రేటు దృష్ట్యా రూపాయి విలువ రోజు రోజుకీ క్షీణించడం అటు ఆర్థికమంత్రి నుంచి సామాన్యుడి వరకు కలవరపెడుతోంది.ఇంతకీ రూపాయి విలువ పతనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో డాలర్‌తో సమానంగా ఉన్న రూపాయి విలువ ఈ 66 సంవ త్సరాలలో 62 సార్లు పతనమైంది. రూపాయి విలువ పతనం 2011 నుంచి ప్రారంభమైనా అత్యధికంగా గత రెండేళ్ళకాలంలోనే జరిగింది. ఇటీవల వరుసగా డాలరుతో రూపాయి మారక విలువ వేగంగా క్షీణించడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆసియాలోని ఏ ఇతర వర్థమాన ఆర్థిక వ్యవస్థల్లోనూ ఆయా దేశాల కరెన్సీ విలువ ఈ స్థాయిలో పతనం కాలేదు. రెండు దశాబ్ధాల క్రితం ప్రారంభమైన తొలి విడత సంస్కరణలు ఆరంభంలో స్థూల దేశీయోత్పత్తిని పెంచగలిగినా పేదలకు ఆసంస్కరణల ఫలాలు దక్కలేదు.
ruppe-down
డాలర్‌కు డిమాండ్ పెరగడానికి కారణాలు
ఇటీవల అంక్టాడ్ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్) నివేదికలో భారతదేశంలోని దేశీయ ప్రత్యక్ష పెట్టుబడి 2012లో 26బిలియన్ డాలర్లకు అంటే 29 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఎఫ్‌డిఐ రూపంలో డాలర్లు దేశంలోకి వచ్చినపుడు రూపాయితో మారకం జరుగుతుంది. తద్వారా డాలర్ సరఫరా పెరగడంతో, రూపాయికి డిమాండ్ పెరిగి రూపాయి విలువ పెరగడమో, లేదా నిలకడగా ఉండటమో జరుగుతుంది. 2012లో దేశంలోకి ఎఫ్‌డిఐలు రావడం తగ్గిపోయింది.
-రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవాస భారతీయులకు బాండ్‌లు అమ్మకం ద్వారా విలువైన డాలర్లను పొందిందనే వార్త ప్రచారంలో ఉంది. ప్రవాస భారతీయులు ఈ బాండ్లపై పెట్టుబడి పెడితే రూపాయి పతనం కారణంగా అధిక కరెన్సీ రిస్కుతో పాటు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రవాస భారతీయులు ఇండియాలో లక్ష డాలర్లు పెట్టుబడి పెడితే ఒక డాలరుకు రూ. 55 చొప్పున అతనికి రూ. 55 లక్షలు వస్తుంది. ఈ డబ్బును 10 శాతం వడ్డీరేటుతో పెట్టుబడి పెడితే ఒక సంవత్సరం తరువాత రూ. 55 లక్షలు, (రూ.55 లక్షలు + రూ.55 లక్షలపై 10 శాతం వడ్డీ) 60.5 లక్షలకు పెరుగుతుంది. ఎన్‌ఆర్‌ఐలు పవాస భారతీయులు) ఈ డబ్బును వెనక్కి తీసుకుపోతారు. ఉదాహరణకు ఒక డాలరుకు రూ. 60లు అనుకుంటే ఎన్‌ఆర్‌ఐ రూపాయలను డాలర్లలోకి మార్చుకుంటే అతనికి 100,800 డాలర్లకు కొంచెం, అటూ, ఇటుగా పెట్టుబడి పెట్టిందే వస్తుంది. డాలర్లలో చూసుకుంటే అతనికి లాభం 0.8 శాతమే. వాస్తవంగా లాభం తక్కువైనా ఇది మారక వ్యయాన్ని ఖాతాలోకి తీసుకోదు. కాబట్టి ఎన్‌ఆర్‌ఐలు డాలర్లలోనే పెట్టుబడి పెట్టడమే మంచిది. ఆర్‌బిఐ బాండ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ప్రవాస భారతీయులను ఆకర్షించడానికి ఎక్కువ వడ్డీ ఇవ్వవలసి ఉంటుంది.
-డాలర్ సరఫరా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు దాని డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గత కొన్ని సంవత్సరా లుగా కంపెనీలు డాలర్ల రూపంలో లోన్లు తీసుకుని ఇపుడు తిరిగి చెల్లించవలసి రావడం వల్ల డాలర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
-భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువగా ఉండటం కూడా డాలర్ డిమాండ్ పెరగడానికి తోడ్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనే బంగారం కొనడం, అమ్మడం జరుగుతుంది. దేశంలో బంగారం కొద్ది మోతాదులోనే ఉత్పత్తి అవుతుంది. వినియోగానికి సరిపడా బంగారం కోసం దిగుమతులపైనే ఆధారపడవలసి వస్తుంది. బంగారం దిగుమతి చేసుకుంటే చెల్లింపులు డాలర్లలోనే చేయాలి కాబట్టి, ఇది డాలర్ డిమాండ్ పెరగడానికి దోహద పడింది.
-ఇండియా విద్యుత్ ప్లాంట్ అవసరాలకోసం భారీగా బొగ్గు దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. దేశంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే 2013 మేలో 66-77 మిలియన్ టన్నులు, 43 శాతం దిగుమతులు తగ్గాయి. బొగ్గు దిగుమతి కారణంగా మళ్ళీ డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దేశంలో ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ తవ్వకం జరగటం లేదు. దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా లిమిటెడ్ ఏకస్వామ్యం కలిగి ఉంది. ప్రభుత్వం బొగ్గు రంగంలో ప్రైవేటు పెట్టుబడులను , ప్రోత్సహించాలని చూస్తే కోల్గేట్ కుంభకోణం వెలుగు చూసింది. ఈ కుంభకోణం కారణంగా బొగ్గు గనుల తవ్వకంలో ప్రైవేట్ రంగం ఆగమనం ఆలస్యమవుతుంది. బొగ్గు గనుల నిర్వహణలో నిపుణులు కోల్ ఇండియాకే పరిమితం కావడంతో, అటువంటి నిపుణులను ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయాలంటే కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి అప్పటి వరకు బొగ్గు దిగుమతి చేసుకోవడానికి డాలర్లు చెల్లించ వలసి ఉంటుంది.
-భవిష్యత్‌లో ప్రభుత్వ సామాజిక రంగ విధానాల వలన డాలర్లకు భారీగా డిమాండ్ ఏర్పడవచ్చు. ఈ సంవత్సరం ప్రభుత్వం గోధుమ సేకరణ 25.08 మిలియన్ టన్నులకు అంటే 33 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో భారీగా ధాన్యం నిల్వలు ఉండటం వలన వెంటనే దీని ప్రభావం ఉండదు. ఆహార భద్రత హక్కు చట్టబద్ధమైన హక్కుగా మారడంతో ఆహార ధాన్యాల సేకరణ తగ్గితే ప్రభుత్వం గోధుమలు, వరి దిగుమతి చేసుకోవలసి వస్తే మళ్ళీ డాలర్‌కు డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతానికి అవసరం లేనప్పటికీ, దీన్ని పూర్తిగా కొట్టి పడేయలేం. ఇవి రూపాయి-డాలరు మారకంకు సంబంధించిన ప్రాధమిక-అంశాలు వీటికి రాత్రికి రాత్రే పరిష్కారం కనుగొనలేము.
రూపాయి పతనం - దాని ప్రభావం
-పెట్రోలియం మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం డాలరుతో ప్రతి రూపాయి పతనం వలన రూ. 8,000 కోట్లు, క్రూడ్ ఆయిల్ ధరలు ఒక డాలర్ పెరిగితే రూ॥ 4,000 కోట్లు అదనపు భారం పడుతుంది. మొత్తంగా చూస్తే రూపాయి పతనంతో వసూళ్ళ సంఖ్య రూ. 1,50,000 కోట్ల కు పైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మారకపు రేటు సుమారు రూ. 54 ఉన్నప్పుడు, వసూళ్ళు సుమారుగా రూ. 80,000 కోట్లు ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు.
-రూపాయి పతనంతో ఆయిల్ పై ఎక్కువ ద్రవ్యాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. రూపాయి పతనానికి అనేక కారణాలున్న ప్పటికీ తక్షణ కారణంగా ద్రవ్యోల్భణ ప్రభావం, ఇంధన ధరలు చెప్పుకోవచ్చు. ఆయిల్ ధరలపై నియంత్రణ ఎత్తి వేయడంతో అంతర్జాతీయ ఇంధన ధరల వ్యాపారం దేశీయ ఆయిల్ ధరలను మారకపు రేటు నిర్ణయిస్తుందనేది అపోహ మాత్రమే. ఇంధనం అంతర్జాతీయ వారధిగా ఉండడంతో ఇతర ధరలైన ఉత్పత్తి వ్యయాలు, రవాణావ్యయాలలో ప్రత్యక్షంగా పాత్ర వహిస్తుంది. కాబట్టి రాబోయే కొన్ని నెలల్లో తీవ్ర ద్రవ్యోల్భణం సంభవించే అవకాశం ఉంది.
-దిగుమతి ఆధార పర్రిశమలకు మూల్యహీనీకరణ కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి తక్షణం ప్రభావం చూపుతుంది. మన్నికగల వినియోగ వస్తువులైన మొబైల్స్, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్, వైట్‌గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు మన్నిక కాని వినియోగ వస్తువులైన సబ్బులు, టాయ్‌లెట్‌కి సంబంధించిన వస్తువులు బాగా ప్రియమవుతాయి. ఇటీవల ధరల ప్రభావంతో బాగా ఆందోళనకు గురిచేసే అంశం ఆహార ద్రవ్యోల్భణం.
కరెన్సీ విలువ ఎందుకు పతనమౌతుంది?
రూపాయి పతనానికి గల అనేక కారకాలలో విదేశీ పెట్టుబ డులు బయటికి వెళ్ళడం, అప్పులు, ఈక్విటీలు, అంతర్జాతీ యంగా పటిష్టమైన ఇతర కరెన్సీలు కారణం.నిర్మాణాత్మక కారకాలలో ఇండియాలో కరెంట్ అకౌంట్‌లోటు పెరగడంతో రూపాయి అంతర్జాతీయంగా ఒడుదుడుకులకు లోనవుతుంది. రూపాయి పతనంతో విదేశీ ప్రయాణం కూడా భారంగా మారుతోంది.
రూపాయి పతనం ఎవరికి లబ్ధి?
ఐటీ కంపెనీ దారులకు రూపాయి పతనం వలన ప్రయోజనం కలుగుతుంది. భారత్ సందర్శించాలనుకునే పర్యాటకులకు మారకపు రేటు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రవాస భారతీయులు వారి సొంత ప్రాంతానికి రెగ్యులర్‌గా డబ్బులు పంపేవారు, విదేశీ కరెన్సీ పొదుపును రూపాయలలోకి మార్చుకునే వారు ప్రయోజనం పొందుతారు.
ఈ పరిస్థితి నుంచి బయట పడడానికి ఆకర్షణీయమైన మార్గాలను అన్వేషిస్తామని ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారైన రఘురామ్‌రాజన్ తెలిపారు.
రూపాయి పతనం - 2013
1. 2013 - జనవరి 01 రూ॥ 54.68
2. 2013 - మే 22 రూ॥ 55.66
3. 2013 - జూన్ 10 రూ॥ 58.15
4. 2013 - జూన్ 12 రూ॥ 57.79
5. 2013 - జూన్ 14 రూ॥ 57.51
6. 2013 - ఆగస్టు 22 రూ॥ 65.56

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి