8, ఆగస్టు 2013, గురువారం

కృష్ణాజలాల పంపిణీ వివాదం ఎందుకు?



మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ అనే మూడు కృష్ణా నదీ పరీవాహక రాష్ట్రాలు  ఆ నదీజలాలను ఏ నిష్పత్తిలో పంచుకోవడం ఉచితమో నిర్ధారించడానికి ఏర్పడిన జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నివేదిక 2010 డిసెంబర్ 30న వెలువడింది. ఈ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందనీ, మహారాష్ట్ర, కర్నాటక లాభపడ్డాయనీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకులు, కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశాల లోనూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న వ్యాజ్యంలోనూ ఈ వాదనలు ఉన్నాయి. మరొకపక్క మహారాష్ట్రకూ, కర్నాటకకూ కూడ కోరినంత, తగినంత వాటా రాలేదని, తమకు కూడ అన్యాయం జరిగినట్టేనని ఆయా రాష్ట్రాలవారు వాదిస్తున్నారు.
తమకే, తమ ప్రాంతానికే అన్నీ చెందాలని, మిగిలినవారు మట్టికొట్టుకుపోయినా ఫరవాలేదని, తమ వాదనే సరయినదని, ఇతరుల వాదనలన్నీ అబద్ధమని అనుకోవడం, అనడం ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలలో బాగానే ఉంటుంది. భారత దేశం పేరుకే ఒక్క దేశం అనీ, ఇంకా ఇక్కడ కలిసిపోయిన విభిన్న జాతులు తమ అస్తిత్వాన్ని, తమ సొంత ఆకాంక్షలను పదిలంగానే ఉంచుకుంటున్నాయని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. కాని, అన్ని చోట్లా ఉన్నది ప్రజలేననీ, పాలకుల దుర్మార్గ విధానాలను ఖండిస్తూనే, అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుందనీ గుర్తించాలి. ఉమ్మడి నదుల విషయంలో వేరు వేరు దేశాల మధ్యనే సామరస్యపూర్వకమైన ఒప్పందాలు కుదిరినప్పుడు, ఒకే దేశంలోని వేరు వేరు రాష్ట్రాలు ఇటువంటి ఘర్షణ వైఖరిని తీసుకోనక్కరలేదు.
మరీ ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలలో ఆ నదీ జలాలు మొత్తం తమకే దక్కాలని ఏ ఒక్క రాష్ట్ర నాయకులు కోరినా అది అసంగతమూ అప్రజాస్వామికమూ ప్రజావ్యతిరేకమూ అవుతుంది. దురదృష్టవశాత్తూ కృష్ణాజలాల వివాదంలో మూడు రాష్ట్రాల రాజకీయ నాయకత్వాలూ, అధికారగణాలూ, కొందరు విశ్లేషకులూ అలాగే ప్రవర్తిస్తున్నారు. అసత్యాలూ అర్ధ సత్యాలూ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు చెప్పవలసిన విషయాలన్నీ వాస్తవికంగా చెప్పి మెరుగైన వైఖరి తీసుకునే అవకాశం కల్పించడం లేదు. కొన్ని విషయాలు చెప్పి, కొన్ని విషయాలు దాచి, కొన్ని సగం సగం చెప్పి పరిస్థితినితమ వాదనలకు అనుకూలంగానూ, అనవసరమైన ఉద్రేకాలు పెరిగిపోయేట్టుగానూ మారుస్తున్నారు. నీరు ప్రజల జీవనాధారం గనుక ప్రజలను రెచ్చగొట్టి తమ అబద్ధ, అసంబద్ధ వాదనల వెనుక సమీకరించుకోగలుగుతున్నారు.
నిజంగానే కృష్ణాజలాల పంపిణీలో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి. జరుగుతున్నాయి. మూడు రాష్ట్రాల పాలకవర్గాలకూ, కేంద్ర పాలకవర్గాలకూ, నీటిపారుదల రంగ నిపుణులమనే పేరుతో ప్రజలను, ప్రజాసమస్యలను, ప్రజా ఆకాంక్షలను పట్టించుకోని అధికార యంత్రాంగానికీ ఈ జలాల పంపిణీ ఒక వివాదంగా, తగాదాగానే కనబడింది తప్ప, ప్రజల అవసరంగా, ఆ ప్రజల మధ్య ఐక్యతతో, సామరస్యంతో, చర్చతో పరిష్కరించవలసిన సమస్యగా కనబడలేదు. అంటే ఈ పాలకవర్గ దృక్పథంలోనే మౌలిక సమస్య ఉంది. అంకెలమీద మితిమీరిన శ్రద్ధ, అంకెలగారడీ ద్వారా పాలకవర్గ ప్రయోజనాలను తీర్చే నైపుణ్యం, ప్రజల మధ్య ఘర్షణ చల్లారకుండా చూడాలనే పాలకనీతి, చరిత్రతో, వాస్తవికతతో సంబంధం లేని కుహనా మేధావిత్వం ఇటువంటి ట్రిబ్యునళ్ల, కమిషన్ల, కమిటీల నివేదికలలో రాజ్యం చేస్తాయి, ప్రస్తుత రెండవ కృష్ణాజలాల వివాద ట్రిబ్యునల్ తీర్పులో కూడ ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అందువల్లనే ఈ నివేదికను చూపి ప్రజలను రెచ్చగొట్టడానికి, సంబంధిత రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ మరింత పెంచడానికి రాజకీయ నాయకులకు వీలు కలుగుతోంది.
ఈ నివేదిక బాగోగులను చర్చించే ముందు అసలు సమస్య గురించి తెలుసుకోవాలి.
కృష్ణా నది పడమటి కనుమలలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర పుట్టి 1400 కి.మీ. ప్రవహించి ఆంధ్రప్రదేశ్ లోని హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రధానంగా పడమటి కనుమల వర్షపాతంతో ప్రారంభమయ్యే ఈ నది దారి పొడవునా వెన్న, కోయ్నా, పాంచ్ గంగ, దూద్ గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, భీమ, డిండి, పెద్దవాగు, హాలియా, మూసీ, పాలేరు, మునేరు వంటి చిన్ననదులు, సెలయేళ్లు, వాగులలో ప్రవహించే నీటితో నిండుతుంది.
ఈ ప్రయాణమార్గం మహారాష్ట్రలో 299 కి.మీ., కర్నాటకలో 483 కి.మీ., ఆంధ్రప్రదేశ్ లో 576 కి.మీ సాగగా, ఏడు కి.మీ. మహారాష్ట్ర – కర్నాటక సరిహద్దులో, 35 కి.మీ. కర్నాటక – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో సాగుతుంది. ఈ లెక్కన నది మహారాష్ట్రలో 21.3 శాతం, కర్నాటకలో 34.5 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 41.1 శాతం, సరిహద్దులలో మూడు శాతం ప్రవహిస్తుందన్నమాట.
అయితే నదీజలాలలో రాష్ట్రాల వాటా గురించి మాట్లాడుకునేటప్పుడు కేవలం రాష్ట్రంలో ఆ నది నిడివి మాత్రమే కాక నది పరీవాహక ప్రాంతం (బేసిన్) అనేది కూడ మరొక ముఖ్యమైన సూచిక అవుతుంది. ఎందుకంటే నది నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఆ నదిలో చేరే ప్రవాహాలు లేకపోవచ్చు. అలా చూసినప్పుడు మొత్తం కృష్ణా బేసిన్ ను పన్నెండు సబ్ – బేసిన్ లు గా విభజించారు. ఆ లెక్కప్రకారం కృష్ణానది పరీవాహక ప్రాంత విస్తీర్ణంలో మహారాష్ట్రకు 26.8 శాతం, కర్నాటకకు 43.7 శాతం, ఆంధ్రప్రదేశ్ కు 29.4 శాతం వాటాలున్నాయి. (ఆంధ్రప్రదేశ్ లో నది నిడివి 41.1 శాతం ఉన్నప్పటికీ పరీవాహక ప్రాంతం చాల తక్కువగా 29.4 శాతం ఉండడం అనేక నైసర్గిక కారణాలవల్ల సంభవించింది. చిత్రపటం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తుంగభద్ర సంగమం తర్వాత కుడివైపు కృష్ణానది బేసిన్ దాదాపు లేదని చెప్పవలసినంత తక్కువగా కనబడుతుంది).
నిజానికి ఈ రెండు గణాంకాలు మాత్రమే కాక, ఆ ప్రాంతంలో జనసంఖ్య, ఆ ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలు, ఆ ప్రాంతంలోని జంతు, జీవజాతుల అవసరాలు, పారిశ్రామిక అవసరాలు వంటి వాటిని కూడ లెక్కవేసి ఆ నదీజలాలను ఆయాప్రాంతాలకు న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా పంపిణీ చేయవలసి ఉంటుంది.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఇప్పుడైతే మూడు రాష్ట్రాలు ఉన్నాయి గాని, చరిత్రలోకి వెళ్లిచూస్తే అంతకన్న ఎక్కువో తక్కువో పాలనా ప్రాంతాలు కనబడతాయి. మొత్తానికి ఈ పరీవాహక ప్రాంతమంతా ఒకే పాలన కింద ఉన్న సమయం ఏదీ లేదు. అందువల్ల ఈ నదీ జలాల పంపిణీ ఎలా జరగాలనేది ఆయా ప్రజల అవసరాలనుబట్టి కాక, మరే ఇతర ప్రాతిపదికలనుబట్టి కాక, ఆయా ప్రాంతాల పాలకుల మధ్య సంబంధాలను బట్టి నిర్ణయమయింది.
1850కి ముందు ఈ జలాల వినియోగంలో ఆధునిక ఆనకట్టలు లేవు గనుక వివాదానికి  ఆస్కారం లేకుండింది. ఆతర్వాత కూడ, కృష్ణా జలాల మీద కాకపోయినా, కృష్ణకు ఉపనది అయిన తుంగభద్ర జలాల వినియోగంలో మైసూరు పాలకులకు, హైదరాబాదు పాలకులకు మధ్య 1892లో, 1933లో, మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కూడ చేరి 1944లో ఒప్పందాలు కుదిరాయి.
వలస పాలన ముగిసిపోయి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో బొంబాయి, మైసూరు, హైదరాబాదు, మద్రాసు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 1951 లో రూపొందించిన ప్రతిపాదనను మైసూరు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో కృష్ణా జలాల పంపిణీ రాష్ట్రాల మధ్య వివాదాస్పదం కానున్నదని మొదటిసారిగా బయటపడింది. అయినా 1951 ప్రతిపాదన ప్రకారమే రాష్ట్రాలు పథకాలు తయారు చేయడం, కేంద్రం అనుమతులు ఇవ్వడం మొదలయింది.
ఈలోగా ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దులు మారిపోయేలా 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కృష్ణా నదీపరీవాహక ప్రాంతంలో మూడు రాష్ట్రాలే (మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్) మిగిలాయి. అంతకు ముందు ప్రతిపాదించిన పథకాలు మారిపోయాయి. కేంద్రప్రభుత్వం ఎన్ డి గుల్హాతీ అధ్యక్షతన  నియమించిన కృష్ణా – గోదావరి కమిషన్ 1962లో ఇచ్చిన నివేదికలోనే కృష్ణానదిలో ఎంత నీరు లభ్యమవుతుందో కచ్చితంగా చెప్పలేమనీ, రాష్ట్రాలు కోరుతున్న పరిమాణంలోనైతే నీరు లభ్యం కాదనీ ప్రకటించింది. ఈ పునాది పై కేంద్రప్రభుత్వం 1951 ఒప్పందం ఇక చెల్లదని ప్రకటించి, అప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మాత్రం కొనసాగించాలనీ, నీటి పంపిణీకి శాశ్వత ప్రాతిపదికలు నిర్ణయించేవరకూ మహారాష్ట్ర 400 టిఎంసి, కర్నాటక 600 టిఎంసి, ఆంధ్ర ప్రదేశ్ 800 టిఎంసి మాత్రం వాడుకోవాలని ఆదేశించింది. (టిఎంసి అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ – వందకోట్ల ఘనపుటడుగులు. మరో మాటల్లో చెప్పాలంటే ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు ఉండే నీటి పరిమాణం వందకోట్ల రెట్లు – ఈ నీరు మూడు వేల ఎకరాల నుంచి పది వేల ఎకరాల వరకు పంటలకు సరిపోతుందని వేరు వేరు అంచనాలు ఉన్నాయి).
ఈ పంపిణీకి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలూ అభ్యంతరం తెలిపాయి. ఈ అభ్యంతరాల వల్ల కేంద్ర ప్రభుత్వం 1969లో జస్టిస్ ఆర్ ఎస్ బచావత్ అధ్యక్షతన కృష్ణానదీ జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ ముందు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసిన వాదనల సంక్లిష్టమైన సాంకేతిక విషయాలలోకి ఇక్కడ పోనవసరం లేదుగాని, కృష్ణాజలాలలో తమకు 828 టిఎంసి దక్కాలని మహారాష్ట్ర, 1430 టిఎంసి దక్కాలని కర్నాటక, 1888 టిఎంసి దక్కాలని ఆంధ్రప్రదేశ్ వాదించాయి. అంటే ఈ మూడు అంకెలు కలిపితే కృష్ణానదిలో సాలీనా 4146 టిఎంసి నీరు ప్రవహించవలసి ఉంటుంది.
నీటి కేటాయింపుకు అనుసరించవలసిన ప్రమాణాలు ఏమిటనే విషయంలో మూడు రాష్ట్ర ప్రభుత్వాలూ మూడు రకాల ప్రాతిపదికలను సూచించాయి. మహారాష్ట్ర దృష్టిలో 1. పరీవాహక ప్రాంతంలోని ఉపనదులద్వారా వచ్చే నీటి పరిమాణం, 2. ఆ ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాలు, 3. ఆ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యమైన భూమి, 4. ఆ ప్రాంతంలోని జనసంఖ్య; కర్నాటక దృష్టిలో 1. పరీవాహక ప్రాంత విస్తీర్ణం, 2. వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం, 3. పంటభూమి విస్తీర్ణం, 4. జనసంఖ్య; కాగా ఆంధ్ర ప్రదేశ్ దృష్టిలో 1. 1951 వరకు వినియోగించుకున్న నీరు 2. 1951 నుంచి 1960 వరకు వినియోగించుకున్న నీరు. 3. భవిష్యత్తులో వినియోగించుకోవడానికి ప్రతిపాదిస్తున్న నీరు ప్రాతిపదికలుగా ఉండాలని సూచించాయి.
బచావత్ ట్రిబ్యునల్ సుదీర్ఘమైన విచారణ జరిపి, 1973లో తొలి నివేదికను, 1976లో తుది నివేదికను సమర్పించినప్పుడు కృష్ణానదిలో ప్రవహించే నికరజలాలు 2060 టిఎంసి మాత్రమే అని తేల్చింది. అంటే మూడు రాష్ట్రాలు కలిపి కోరినది బచావత్ వేసిన అంచనాకన్న రెట్టింపు అన్నమాట. ఈ 2060 టిఎంసి అనే లెక్క కూడ అపసవ్యమైనదేనని, కృష్ణానదిలో అంత నీరు లభ్యమయ్యే అవకాశం లేదని అప్పుడే విమర్శించిన నిపుణులు ఉన్నారు. ఈ 2060 టిఎంసి నికర జలాలలో బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు 560 టిఎంసి, కర్నాటకకు 700 టిఎంసి, ఆంధ్రప్రదేశ్ కు 800 టిఎంసి నీటిని కేటాయించింది.
అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అయినా, ఇప్పుడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అయినా కృష్ణానదిలో లభ్యమయ్యే నీరు ఎంత అని లెక్క వేసిన పద్ధతిలోనే చాల అవకతవకలు ఉన్నాయి. ఇవాళ మాట్లాడుతున్న వాళ్లెవరూ ఆ అవకతవకల గురించి మాట్లాడకుండా, తేల్చిన మొత్తం నీటిలో తమకు తక్కువ వాటా వచ్చిందని ఆరోపిస్తున్నారు. అసలు మొత్తం నీటి లెక్కే తప్పయినప్పుడు, వాటా గురించి వివాదం అర్థరహితమవుతుంది.
ఉదాహరణకు బచావత్ ట్రిబ్యునల్ 1894 నుంచి 1972 వరకు 78 సంవత్సరాలలో కృష్ణానదిలో ప్రవహించిన నీటి పరిమాణంలో 75 శాతం విశ్వసనీయతను బట్టి సాలీనా నీటి లభ్యత 2060 టిఎంసి అని తేల్చింది. ఈ నిర్ధారణలో మూడు పొరపాట్లు ఉన్నాయి. ఒకటి, ఇది 78 సంవత్సరాల సగటు నీటి లభ్యత కూడ కాదు. విజయవాడ బ్యారేజి దగ్గర నీటి ప్రవాహాన్ని కొలిచే సాధనాలు ఉన్నందువల్ల, ఆ గణాంకాలు 1894 నుంచి లభ్యమవుతున్నందువల్ల ఈ ప్రమాణాన్ని తీసుకున్నారు. ఆ లెక్కలలో అత్య్ధధికంగా 4165 టిఎంసి నీరు ప్రవహించిన సంవత్సరమూ (1956-57) ఉంది, అతి స్వల్పంగా 1007 టిఎంసి నీరు ప్రవహించిన సంవత్సరమూ (1918-19) ఉంది. మరి ఈ 2060 అనే అంకెకు ఎలా వచ్చారంటే ఒక సంక్లిష్టమైన లెక్క ఉంది – ఈ 78 సంవత్సరాలనూ వాటి ప్రవాహాన్ని బట్టి అవరోహణ క్రమంలో రాస్తూ పోయారు. ఆ వరుసలో 75 శాతం విశ్వసనీయత అంటే 58, 59 సంవత్సరాలలోని ప్రవాహ పరిమాణం తేలింది. అది 2063, 2057 టిఎంసిలుగా ఉంది గనుక ట్రిబ్యునల్ 2060ని నిర్ధారించింది. ఇక్కడ వేరువేరు రాష్ట్రాలు వేరువేరు విశ్వసనీయతా శాతం ఉండాలని వాదించాయి గాని, బచావత్ 75 శాతానికి కట్టుబడింది.
రెండు, నిజానికి ఈ 78 సంవత్సరాలలో 1952లో విజయవాడ దగ్గర పాత ఆనకట్టకు పగుళ్లు రావడం వల్ల కొత్త ఆనకట్ట నిర్మించారు. ఈ నిర్మాణ క్రమంలో 1953 నుంచి 1962 వరకు నమోదయిన లెక్కలు సరైనవి కావని అప్పుడే అభ్యంతరాలు వచ్చాయి. అయినా ట్రిబ్యునల్ ఈ వివాదాన్ని పట్టించుకోలేదు.
మూడు, నిజానికి 1400 కి. మీ. ప్రవహించే నదిలో, వేరువేరు చోట్ల వేరువేరు ఉపనదుల ద్వారా నీరు చేరే నదిలో ఎంత నీరు ప్రవహిస్తుందని తేల్చవలసింది చివరి వంద కి.మీ. దగ్గర ఉన్న సాధనాలను బట్టి కాదు, అక్కడ తప్పనిసరిగా నీరు ఎక్కువగానే ఉండవచ్చు, దాన్నంతా ఎగువకు తీసుకుపోవడం సాధ్యం కాదు.
కాని ఈ తప్పులతడక లెక్కే ఇన్నాళ్లుగా పనిచేస్తూ వస్తోంది. ఇప్పుడు కృష్ణాజలాల పంపిణీ గురించి గొంతెత్తి వాదిస్తున్నవారెవరూ ఈ అసలు విషయాన్ని ప్రస్తావించడమే లేదు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో మరొక కీలకాంశం ప్రస్తుత వివాదాలకు కారణమవుతోంది. ఆ తీర్పులో రెండు పథకాలు ప్రకటించారు. పథకం ఎ కింద నికర జలాల వాటాల పంపిణీ గురించి చెప్పి, పథకం బి లో మిగులు జలాల గురించి తేల్చడానికి ఒక నదీజల వివాదాల పరిష్కార వేదికను పార్లమెంటు చట్టం ద్వారా శాశ్వత ప్రాతిపదిక మీద ఏర్పరచాలని, అది తమ పరిధిలోని విషయం కాదని అన్నారు. ఈ పథకం బి ప్రకారం మిగులు జలాలు 2060 కన్న ఎక్కువగా 2130 వరకూ ఉన్నప్పుడు మహారాష్ట్ర 35 శాతం, కర్నాటక 50 శాతం, ఆంధ్రప్రదేశ్ 15 శాతం వాడుకోవాలని, 2130 కన్న ఎక్కువ ఉన్నప్పుడు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లు చెరి 25 శాతం, కర్నాటక 50 శాతం వాడుకోవాలని అన్నారు. ఈ పథకం బి ని ఆంద్రప్రదేశ్ అంగీకరించలేదు గనుక, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి నదీ జల వివాదాల శాశ్వత పరిష్కార వేదికను ఏర్పాటు చేయలేదు గనుక అది అలాగే ఉండి పోయింది.
ఈ లోగా, పునస్సమీక్ష జరిగేవరకూ మిగులు జలాలను వాడుకునే “స్వేచ్ఛ” ఆంధ్రప్రదేశ్ కు ఉంటుందనీ, కాని అది “హక్కు” కాదనీ బచావత్ చెప్పిన మాటను వక్రీకరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన హక్కుగా వ్యాఖ్యానిస్తూ వచ్చింది. ఆ మిగులు జలాలు వాడుకోవడానికి వీలుగా ప్రాజెక్టులు నిర్మిస్తూ వచ్చింది. ఒకసారి ప్రాజెక్టులు నిర్మాణమయితే, ఆ నీటి మీద హక్కు స్థిరపడుతుందనే అభిప్రాయంతో తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఇలా మిగులును ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే, మహారాష్ట్ర, కర్నాటకలు తమ కేటాయింపులకు లోబడిన నిర్మించుకునే ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టింది. ప్రతిగా ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడ ఆంధ్రప్రదేశ్ నిర్మాణాల మీద అభ్యంతరాలు చెప్పాయి. అలా మూడు రాష్ట్ర ప్రభుత్వాలూ ఒకదానిమీద మరొకటి సుప్రీంకోర్టుకూ, కేంద్ర జల సంఘానికీ, కేంద్ర ప్రభుత్వానికీ, ప్రణాళికా సంఘానికీ ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చాయి.
ఈ నేపథ్యంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడింది. బచావత్ ట్రిబ్యునల్ మీద ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సమీక్ష జరిపి కేటాయింపులను సవరించవచ్చునని ఆ నివేదికలోనే సూచించారు. దాని ప్రకారం 31 మే 2000 తర్వాత సమీక్ష కోసం నియమించవలసిన రెండవ కృష్ణానదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ గా బ్రిజేశ్ కుమార్ అధ్యక్షుడుగా ఏప్రిల్ 2004లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటయింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదుల వాదనలు విని, సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత ఈ ట్రిబ్యునల్ తన తీర్పును 2010 డిసెంబర్ 30న ప్రకటించింది.
మొదటి ట్రిబ్యునల్ కు, రెండవ ట్రిబ్యునల్ కు కొట్టవచ్చినట్టు కనిపించే పోలికలు, తేడాలు కొన్ని ఉన్నాయి. మొదటి ట్రిబ్యునల్ లాగే రెండో ట్రిబ్యునల్ కూడ కృష్ణా నదిలో నీటి లభ్యతను గురించి కాకిలెక్కలు వేసింది. మొదటి ట్రిబ్యునల్ 78 సంవత్సరాల నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని, దానిలో 75 శాతం విశ్వసనీయతను పునాదిగా తీసుకుంటే, రెండో ట్రిబ్యునల్ 47 సంవత్సరాల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని, దానిలో 65 శాతం విశ్వసనీయతను పునాదిగా తీసుకుంది. అందువల్ల మొదటి ట్రిబ్యునల్ కృష్ణానదిలో 2060 టిఎంసి నీరు లభ్యమవుతుందని చెప్పగా, రెండో ట్రిబ్యునల్ 2578 టిఎంసి నీరు లభ్యమవుతుందని చెప్పింది. ఈ కొత్త లెక్క ప్రకారం నికర జలాలలో 666 టిఎంసి మహారాష్ట్రకు, 911 టిఎంసి కర్నాటకకు, 1001 టిఎంసి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. మిగులు జలాల వాటా నిర్ణయించడం తన పరిధిలోని విషయం కాదని, దానికోసం పార్లమెంటులో చట్టం ద్వారా ఒక శాశ్వత సంస్థను ఏర్పాటు చేయాలని మొదటి ట్రిబ్యునల్ అనగా, రెండో ట్రిబ్యునల్ మిగులు జలాలను 285 టిఎంసిగా లెక్కకట్టి, వాటిని ఆంధ్రప్రదేశ్ కు 135 టిఎంసి, కర్నాటకకు 112 టిఎంసి, మహారాష్ట్రకు 38 టిఎంసి కేటాయించింది. నిజానికి ఈ మిగులు జలాల కేటాయింపులో బచావత్ చెప్పిన సూత్రాన్ని (మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లకు చెరి 25 శాతం, కర్నాటకకు 50 శాతం) బ్రిజేశ్ కుమార్ పాటించలేదు.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడిననాటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో “అన్ని గడపలలోన మా గడప మేలు” అనే వాదనలూ, “అన్నీ మాకే రావాలి, ఇతరులకు ఏమీ వద్దు” అనే వాదనలూ చెలరేగుతున్నాయి. చర్చ న్యాయాన్యాయాల పునాదిపై, హేతుబద్ధంగా కాక, కేవలం ఉద్వేగాలను రెచ్చగొట్టడం మీద ఆధారపడి జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, కొందరు నీటిపారుదల రంగ నిపుణులు, సాధారణంగా తెలుగు ప్రచార సాధనాలు లేవనెత్తుతున్న వాదనలలో ముఖ్యమైనవి:
  1. నీటి పరిమాణాన్ని అశాస్త్రీయంగా, తప్పుగా లెక్కగట్టి ఎక్కువ నికర జలాలు చూపించారు. అలా ఎక్కువగా చూపిన నికరజలాల్లో కూడ రాష్ట్రానికి తక్కువ వాటా ఇచ్చారు.
  2. మిగులు జలాలు పూర్తిగా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కే కేటాయించవలసి ఉండగా, దానిలో వాటాలు వేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ 150 టిఎంసి ల నీరు నష్టపోయింది.
  3. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్న జలాలలో దాదాపు 270 టిఎంసి జలాలను (వీటిలో 118 టిఎంసి నికరజలాలు, 150 టిఎంసి మిగులు జలాలు) బ్రిజేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు దక్కకుండా చేశారు.
  4. మిగులు జలాలను ఎగువరాష్ట్రాలకు పంచగూడదని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. ఇప్పుడు రెండో ట్రిబ్యునల్ ఆ సూచనను మార్చివేసింది.
  5. కర్నాటక నిర్మిస్తున్న ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచడానికి ఈ ట్రిబ్యునల్ అనుమతించింది. తద్వారా దిగువకు నీటి ప్రవాహాన్ని అడ్దుకోవడం జరుగుతుంది. కర్నాటకకు బచావత్ కేటాయించిన దానికన్న ఎక్కువగా 177 టిఎంసిలను బ్రిజేశ్ కుమార్ కేటాయించారు. వీటిలో 105 మిగులు జలాలు కాగా, 72 నికర జలాలలోనే. అంటే ఆల్మట్టిలో ఎక్కువ నిలువకు అవకాశం కల్పించినట్టే.

ఈ వాదనలన్నీ పూర్తిగా అసత్యాలు కాకపోయినా అర్ధసత్యాలు. ఈ అన్ని వాదనలకూ ఆ రెండు రాష్ట్రాల వైపునుంచీ జవాబులున్నాయి. అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వ పక్షమూ తీసుకోకుండా హేతుబద్ధంగా చెప్పగలిగిన జవాబులున్నాయి.
ఏకకాలంలో నికర జలాల లెక్క తప్పు అనీ, ఆ తప్పుడు లెక్కలో తమకు ఎక్కువ వాటా కావాలనీ వాదించడం అసమంజసం. లెక్కే తప్పు అనయినా వాదించవచ్చు, అప్పుడు వాటా ఎక్కువ తక్కువల ప్రసక్తి రాదు. లేదా ఆ లెక్కను అంగీకరించి, అందులో మా వాటా తక్కువయిందని వాదించవచ్చు.
మిగులు జలాలు పూర్తిగా దిగువ రాష్ట్రానికే చెందాలనడం తప్పు. మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలు ముందే ఆపగూడదని గాని, మిగులు జలాల వాడకాన్ని పర్యవేక్షించే ఉమ్మడి వ్యవస్థలు ఉండాలని గాని వాదించవచ్చు.
ఇప్పటిదాకా వాడుకుంటున్నాను గనుక, నాకే హక్కు ఉండాలి అని వాదించడం ఉమ్మడి ఆస్తుల విషయంలో సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఉమ్మడి ఆస్తులపై అందరికీ హక్కు ఉంటుంది గాని, ఎక్కువ కాలం వాడుకున్నారు గనుకనో, ముందే వాడుకున్నారు గనుకనో హక్కు ఉండదు. బచావత్ ట్రిబ్యునల్ కూడ ఇది స్వేచ్చే తప్ప హక్కు కాదని స్పష్టం చేసి ఉంది.
ఆల్మట్టి ఆనకట్టను అనవసర వివాదంగా మార్చే బదులు, ఆ ఆనకట్టను ఆ రాష్ట్రానికి కేటాయించిన పరిమాణం లోపలనే కట్టుకుంటున్నట్టయితే ఆమోదించడం, అలా పరిమితం చేసేట్టు చూడడం, ఆ ఆనకట్ట కాలువలను దిగువకు, అంటే కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు కూడ వ్యాపించేలా చర్చలు జరపడం సామరస్యపూర్వకమైన పరిష్కారం అవుతుంది.
అసలు నికర జలాలే బచావత్ లెక్కించినట్టుగా 2060 టిఎంసి ఉన్నాయా అనే వివాదం ఉండగా వాటిని 2578కి పెంచడం, మిగులు జలాలను 285గా లెక్కించడం ఆ నీటి మీద ఆధారపడిన ప్రజలను, రైతులను మాయ చేయడమే తప్ప మరొకటి కాదు. మరొకవైపు ఈ ట్రిబ్యునల్ విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏటా 1300 టిఎంసి పైచిలుకు నీరు వాడుకోవడానికి తగిన నిర్మాణాలను, కాలువలను, పంట విస్తీర్ణాన్ని కలిగి ఉన్నదని స్వయంగా రాష్ట్ర న్యాయవాదులే అంగీకరించారు. మరొకవైపు మిగిలిన రెండు రాష్ట్రాలూ తమ కేటాయింపులకు తగిన నిర్మాణాలను ఇప్పటికీ కట్టుకోలేదు. కనుక “మనం నష్టపోయాం” అని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు చేస్తున్న వాదనలకు అర్థం లేదు. ఇది కేవలం సంకుచిత ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే. కాగా, మరొకవైపు ఈ నాయకులే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకూ, కృష్ణానది ప్రవహించే అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరగడం లేదని గుర్తించడం లేదు. ఆంధ్రప్రదేశ్ కు తగిన వాటా రాలేదని అంటున్నవాళ్లు తెలంగాణ వాటా గురించి మాత్రం మాట్లాడడం లేదు. కృష్ణా డెల్టాలో మూడో పంటకు నీరు అందదేమోనని గగ్గోలు పెడుతున్నవారు ఎగువన కృష్ణానదికి అటూ ఇటూ తాగడానికి గుక్కెడు నీళ్లు, పంటలకు న్యాయమైన వాటా నీళ్లు అందని కర్నూలు, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయని మరచిపోతున్నారు.
అటూ ఇటూ కూడ పాలకవర్గ రాజకీయాలు ఒక నిజమైన ప్రజాసమస్యను ఎలా మసిపూసి మారేడుకాయ చేయగలవో, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా, అబద్ధాల మీద ఆధారపడి రెచ్చగొట్టగలవో చూపడానికి మంచి ఉదాహరణ ఈ కృష్ణాజలాల వివాదం. ఇటువంటి వివాదాలలో జోక్యం చేసుకుని, తగిన సాంకేతిక, ప్రజానుకూల, హేతుబద్ధ వాదనలను ముందుకు తెచ్చి, ప్రజల ఐక్యతనూ, ప్రజా ప్రయోజనాలనూ కాపాడవలసిన బాధ్యత ప్రగతిశీలశక్తుల పైనే ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి