8, ఆగస్టు 2013, గురువారం

హైదరాబాద్‌పై ఆశతో సీమాంధ్రల చారిత్రక తప్పిదం!


అధు‘నూతన’ రాజధానికి అవకాశం .. నిదర్శనంగా నిలుస్తున్న నయారాయ్‌పూర్ సొబగులతో ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని డిస్‌పూర్, గాంధీనగర్, చండీగఢ్.. చూపిన అనుభవాలూ అవే కొత్త నగరం కోసం కోట్లు సిద్ధం.. కాలదన్నుకుంటున్న నేతలు నయారాయ్‌పూర్‌ను నిర్మించినవాళ్లు సొంత రాజధానిని నిర్మించలేరా?

‘సీమాంధ్ర నాయకులు బంగారంలాంటి అవకాశాన్ని వదిలిపెట్టుకుంటున్నారు. మరోసారి చారివూతక తప్పిదం చేస్తున్నారు. విడిపోవడం వల్ల తెలంగాణ బాగుపడడం ఏమోకానీ ఆంధ్రామాత్రం కచ్చితంగా బాగుపడుతుంది. రాజధాని నిర్మాణం, జాతీయ సంస్థల ఏర్పాటు పేరిట, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల రూపేణా తక్షణం పది నుంచి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సీమాంవూధకు వచ్చి పడతాయి. ఇంత చిన్న విషయం మా వాళ్లకు ఎందుకు అర్థం కావడం లేదో! ఒక్క హైదరాబాద్‌కోసం ఇన్ని అవమానాలు ఎందుకు పడాలి?’ అని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జాతీయ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణను వ్యతిరేకించేవారంతా హైదరాబాద్‌ను చూపించే వ్యతిరేకిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదం అంతా హైదరాబాద్‌కోసమే అని సీమాంధ్ర నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. నదీ జలాల పంపిణీ, ఇతర వనరుల పంపిణీ పెద్ద సమస్య కాదు. వాటిని పంచడానికి ఇప్పటికే నిర్ధారిత ప్రమాణాలున్నాయి. ఏ ప్రాంతం ఎన్ని టీఎంసీలను వినియోగిస్తున్నదో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలకు అనుగుణంగా పంపకాలు చేసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న వీరి ఆస్తులు ఎవరైనా గుంజుకుంటున్నారా? హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు, ఎస్టేట్‌లు ఉన్నవారికి బెంగళూరు, చెన్నై, నోయిడా, ముంబై, పుణెలలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఏముంది? ఇక రాజధానిని కోల్పోతామనా? ఇక్కడ రాజధాని పోతే కొత్త రాజధాని రాదా? రాజధానిని నిర్మించడం అంత కష్టమా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త రాజధానులు నిర్మించలేదా? సమైక్యవాదనలు వినిపిస్తున్న సీమాంధ్ర నేతల అభ్యంతరాలు.. అనుమానాలు అవే అయితే.. వాటికి ఎలాంటి ప్రాతిపదిక లేదని నిరూపించేందుకు అనేకానేక ఉదాహరణలున్నాయి. కొత్తగా ఏర్పడిన రాజధానులు.. పక్కా ప్రణాళికాయుతంగా సొబగులు అద్దుకుంటున్నాయి. సమకాలీన అవసరాలకు అనుగుణంగా.. అత్యాధునికంగా రూపొందుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయ్‌పూర్.. పంజాబ్-హర్యానా రాజధాని చండీగఢ్.. గుజరాత్ రాజధాని గాంధీనగర్.. అసోం రాజధాని డిస్‌పూర్! ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇవన్నీ అధునాతన రాజధాని నగరాలే! నయారాయ్‌పూర్ నిర్మాణం ఇంకా కొనసాగుతున్నది. నయారాయ్‌పూర్‌ను 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో 8000 హెక్టార్లలో అద్భుతంగా నిర్మిస్తున్నారు.

ఆశ్చర్యపోవద్దు-నయారాయ్‌పూర్ నిర్మాణంలో కీలక భాగస్వాములుగా ఉంది ఆంధ్రా కాంట్రాక్టర్లే. డిస్‌పూర్‌లో అసోం అసెంబ్లీ, సచివాలయం, ఇతర అన్ని కార్యాలయాల నిర్మాణానికి పదేళ్లక్షికితమే రూ.170 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆధునిక రాజధానులకు ఉన్న మౌలిక సదుపాయాలు, రోడ్లు, విశాల ఉద్యానవనాలు చూస్తే ఎవరికయినా కళ్లు చెదురుతాయి. గాంధీనగర్‌ను సబర్మతీ నదీ తీరంలో 6000 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ నగరాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. దేశంలోనే అత్యంత ప్రణాళికా బద్ధమైన నగరంగా ఖ్యాతిగాంచిన చండీగఢ్‌ను సుమారు 10,000 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. గూగుల్ మ్యాప్స్‌లో ఆ నగరాలను గమనిస్తే ఎంత పద్ధతి ప్రకారం కొత్త రాజధానిని నిర్మించుకోవచ్చునో అర్థం అవుతుంది. నిన్నగాక మొన్న చెన్నైలో 1000 కోట్ల రూపాయల వ్యయంతో తమిళనాడు అసెంబ్లీ, సచివాలయ కాంప్లెక్స్‌ను అప్పటి కరుణానిధి ప్రభుత్వం నిర్మించింది. ‘ఆంధ్రా ప్రాంతం నుంచి లక్ష మంది కాంట్రాక్టర్లు దేశమంతా రకరకాల నిర్మాణ కాంట్రాక్టులు చేస్తున్నారు. జీఎంఆర్, జీవీకే, ఎన్‌సీసీ వంటి అతిపెద్ద నిర్మాణ కంపెనీలు ఆంధ్రా ప్రాంతం వారివే. దేశంలో పెద్ద ఎయిర్‌పోర్టులన్నీ వీళ్లు కట్టినవే. రాజధాని నిర్మించడం వీళ్లకు ఒక లెక్కా?’ అని తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

1973లోనే డిస్‌పూర్‌కు పునాది

అస్సాం (కొత్త పేరు అసోం), మేఘాలయ కలిసి ఉన్నకాలంలో షిల్లాంగ్ రాజధాని. మేఘాలయ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడినప్పుడు షిల్లాంగ్‌ను కొంతకాలంపాటు సంయుక్త రాజధానిగా చేస్తూ 1972 జనవరిలో రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. కానీ దూరాభారాలు, పాలనాసంబంధమైన సమస్యలు, పంతాల కారణంగా ఏడాది తిరుగక ముందే అప్పటి అస్సాం ముఖ్యమంత్రి శరత్ చంద్రసిన్హా తమ రాజధాని కార్యకలాపాలను గౌహతికి మార్చారు. 1973 మార్చిలో అస్సాం అసెంబ్లీ సమావేశాలను గౌహతిలో నిర్వహించారు. ఆ వెంటనే గౌహతిని ఆనుకుని ఉన్న డిస్‌పూర్‌లో నూతన రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. ‘హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనో, ప్రత్యేక రాష్ట్రం చేయాలనో వాదిస్తున్నవాళ్లు ఆంధ్రా పెత్తందార్ల కీలుబొమ్మలు. హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేయాలని చూసే కుట్రలో భాగస్వాములు. తాత్కాలికంగా సంయుక్త రాజధానిగా ఉండడానికి ఎవరికీ పెద్దగా అభ్యంతరాలుండవు. కానీ హైదరాబాద్‌పై తెలంగాణ హక్కులను కాజేయాలని చూసేవారికి ప్రజలు బుద్ధిచెప్పి తీరుతారు’ అని తెలంగాణ జేఏసీ నాయకుడొకరు అన్నారు.


మద్రాసులోనూ విస్తరణలు

ఇప్పుడు హైదరాబాద్ గురించి కొందరు సీమాంధ్ర నాయకులు చేస్తున్న టువంటి వాదనలనే 1953లో ఆంధ్రా నాయకులు మద్రాసు గురించి చేశారు. దీంతో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి కరాఖండిగా రాత్రికి రాత్రి మద్రాసును ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పారు. మద్రాసును ఆంధ్ర రాజధానిని చేయాలని, లేదంటే కనీసం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని, అదీకాకపోతే మద్రాసును రెండుగా చీల్చే కోవమ్ నదికి ఇవతల ఆంధ్ర రాజధాని, అవతల తమిళ రాజధాని చేయాలని చాలాకాలం వాదులాడారు. ఆంధ్ర నాయకుల పేచీలతో విసిగిన రాజగోపాలాచారి చాలా పరుషంగా మద్రాసును ఖాళీ చేసి వెళ్లి పోవాలని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఒకసారి ఆంధ్ర నాయకత్వం దారుణంగా దెబ్బతిన్నది. హడావిడిగా కర్నూలు వచ్చి.. డేరాలు వేసుకుని పరిపాలన సాగించింది.


బొంబాయి వదిలి.. గాంధీనగర్‌కు

గుజరాత్ ఏర్పాటు చేసే సందర్భంలో గుజరాతీలు బొంబాయి ( పస్తుతం ముంబై) గురించి ఇప్పుడు ఆంధ్రా నాయకులు చేసిన వాదనలే చేశారు. బొంబాయిని తామే అభివృద్ధి చేశామని, వందలకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని, నగరాన్ని తామే నిర్మించామని, గుజరాత్‌కు బొంబాయిని రాజధానిగా కొనసాగించాలని వాదించారు. అలాకాని పక్షంలో ఉమ్మడి రాజధానిగానయినా కొనసాగించాలని కూడా పట్టుదలకు దిగారు. అయితే రాజ్యాంగ నిపుణులు ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. ఆ వాదనల్లో పసలేదని కొట్టిపారేశారు. చివరకు గుజరాతీలు గాంధీనగర్‌ను అత్యద్భుతంగా నిర్మించుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి