3, నవంబర్ 2011, గురువారం

కూడూ, నీడా, చదువూ లేని ఫార్ములా 1 రేసు రోడ్డు నిర్మాతలు



ఢిల్లీకి సమీపంలో భారత దేశ సంపన్నులకు సంతోషం చేకూర్చే ఫార్ములా 1 రేసు మొట్ట మొదటి గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి. భారత దేశ ధనికుల విలాసాలను పట్టి చూపే ఫార్ములా 1 రేసు ఓవైపు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆ రేసు కోసం రోడ్డును అందంగా పటిష్టంగా నిర్మించి పెట్టిన కూలీలకు ఇంతవరకూ కూలి డబ్బులు దక్కని దయనీయ పరిష్దితి నెలకొని ఉంది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ తాను సాధించిన అభివృద్ధికి మురిపెంగా చూపుకునే సాక్ష్యాలలో ఫార్ములా 1 రేసు ఒకటి. అత్యంత ఖరీదయిన ఈ పోటీలను వీక్షించడానికే వేలు, లక్షలు ఖర్చుపెట్టవలసి ఉంటుంది. అటువంటి ఖరీదైన రేస్ కోర్స్ ను నిర్మించిన కూలీ నిర్మాతలకు కూలీ ఇవ్వాలన్న జ్ఞానం లేకపోవడాన్ని ఏమనాలి?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నొయిడాలో అంతర్జాతీయ స్ధాయిలో పోటీలు నిర్వహించడానికి ‘బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్’ పేరుతో సౌకర్యాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. సర్క్యూట్ నిర్మాణానికి కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లకు పన్ను రాయితీలు కూడా యు.పి ప్రభుత్వం ఇచ్చింది. అంత ధనికవంతమైన సర్క్యూట్ నిర్మాణానికి పన్ను రాయితీ ఇవ్వవలసిన అవసరం ఏమిటని కూడా సుప్రీం కోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఆ సర్క్యూట్ లోనే ఆదివారం ఇండియాలోనే మొదటి సారిగా ‘ఫార్ములా 1′ కారు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం అనేక మంధి భారత ధనికులు, ధనిక క్రీడాకారులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ పోటీలను వీక్షించడానికి అతి తక్కువ టికెట్ ధర రు. ఐదువేల వరకూ ఉండగా ఖరీదైన టికెట్ లక్షన్నర రూపాయలవరకూ ఉన్నది.
లెక్కగడితే కూలీలకు బాకీ ఉన్న మొత్తం కలిపినా, అత్యంత ఖరీదైనా టికెట్ ధర ఉంటుందో లేదో అనుమానమే. పని చేయించుకుని కూడా ఆ పనికి సొమ్ము చెల్లించడానికి రేపు, మాపు అని తిప్పుకుంటున్నారని అక్కడ పని చేసిన కూలీలు చెబుతున్నారు. బుద్ధ సర్యూట్ కి సమీపంలోనే తాత్కాలికంగా నిర్మించుకున్న అతుకుల గుడారాల నీడన కూలీలు నివసిస్తున్నారు. గుడారాలని చెప్పడానికి వీల్లేదు. చాపలతోటీ, పాత గుడ్డలతోటీ గుడారం షేపులో నిర్మించుకుని వాటిని పడుకోవడానికి మాత్రమే వారు ఉపయోగిస్తారు. మిగిలిందంతా ఆరుబైటే. రోజంతా ఎండలోనే వారు గడుపుతుంటారు. చిన్నపిల్లల దగ్గర్నుండి ముసలి వారి వరకూ కూలి చేసి కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.
బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్ కి సమీపంలో కనీసం 50 మంది కూలీలను పలకరించినట్లుగా ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. గత రెండు నెలలనుండి ఆ తాత్కాలిక షెల్టర్లలో నివసిస్తున్నట్లు వారు తెలిపారు. సర్యూట్ ప్రధాన గేటుకి కొన్ని వందల మీటర్ల దూరంలోనే కూలీల గుడారాలు డజను వరకూ ఉన్నాయి. వారిలో అందరూ నిరక్షరాష్యులే. మధ్య ప్రదేశ్ లోని పేద గ్రామీణ ప్రాంతాలనుండి వలస వచ్చిన కూలీలను కాంట్రాక్టర్లు వినియోగించారు. సర్క్యూట్ యజమాని ‘జేపీ గ్రూపు’ కు తమను ఒక కాంట్రాక్టర్ అప్పజెప్పాడని కూలీలు తెలిపారు. ఆరు నెలలపాటు ప్రాధమిక అవసరాలు నెరవేరడం వరకే తమకు సొమ్ము ఇచ్చారని కూలీలు చెప్పారు. రోజుకు రు.120/- ఇస్తామని చెప్పినా ఇంతవరకూ గతి లేదని వారు తెలిపారు. ఎప్పుడు అడిగినా వాయిదా వేస్తున్నారని చెప్పారు. పిల్లలను బడికి పంపించాలని తమకూ ఉంటుందనీ కాని బడులకు దూరంగా పనులకు వచ్చాక ఇక చదువుకునే వీలెక్కడ దొరుకుతుందని వారు ప్రశ్నించారు.

రోజులో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ వారానికి ఏడు రోజుల చొప్పున తాము పని చేశామని కూలీలు తెలిపారు. “మాకు బట్టలిస్తామని చెప్పారు. నివసించడానికి వీలుగా ఇళ్లకోసం ఏదైనా సమకూరుస్తామని చెప్పారు. కాని ఏమీ ఇవ్వలేదు” అని వారన్నారు. సర్క్యూట్ నిర్మించిన వ్యవసాయ భూముల్లో ఒక్కోసారి రోజు ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉన్నా ఎక్కడికీ పోలేని పరిస్ధితి వారిది. రొట్టె, కాసిన్ని కూరగాయలు మాత్రమే వారు తినగలుగుతున్నారు. తాగడానికి శుభ్రమైన నీరు వారికి లేదు. అక్కడి పరిస్ధితుల వలన అనేక సార్లు పిల్లలు, పెద్దలు జబ్బుల బారిన పడినా వైద్య సౌకర్యం వారికి కలిగించలేదు.
మోటార్ రేసింగ్ సర్యూట్ నిర్మాణం మొదటి నుండీ వివాదాస్పదంగానే ఉంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఈ లోగా ప్రభుత్వం మారడంతో అది వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు యు.పిలో ప్రారంభం అవుతుండేసరికి చంద్రబాబు బాధను వ్యక్తం చేస్తున్నాడు. బుద్ధ సర్క్యూట్ ఒకవైపు దేశంలో పెరుగుతున్న ఆర్ధిక అసమానతలను వెల్లడిస్తుండగా, మరొక వైపు అంతకంతకూ పెరుగుతూ పోతున్న భారత ధనికుల సంపదలను పట్టి చూపుతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ సర్క్యూట్ నిర్మాణంతో చుట్టు పక్కల ప్రాంతాలన్ని అభివృద్ధి సాధిస్తాయని ఆశిస్తున్నారు. 150 మైళ్ళ పరిధిలో ఉన్న బీడు భూములు, పేద గ్రామాలు, చిన్న పట్టణాలు, ఢిల్లీ ఆగ్రాల మధ్య ఉన్న పడావు భూములు అన్నీ అభివృద్ధి సాధిస్తాయని వారి ఆశగా చెబుతున్నారు.
కాని స్ధానిక గ్రామీణుల కధనం మరొకరకంగా ఉంది. సర్క్యుట్ వలన వందల మంది విద్యార్ధులు తమ స్కూళ్ళనుండి దూరంగా నెట్టివేయబడ్డారని వారు చెబుతున్నారు. ఫలితంగా చదువులను వారు అర్ధంతరంగా వదిలివేయవలసి వచ్చింది. భూసేకరణ జరిపినప్పుడు ఉద్యోగాలు లభిస్తాయని ఆశ చూపారని ఇప్పుడవేవీ లేవనీ వారు వెల్లడించారు. ప్రజోపయోగం కోసం అంటూ భూముల్ని బలవంతంగా లాక్కుని ప్రజలకు ఏ ఉపయోగమూ లేకుండా చేశారనీ, చట్టాలను ధనికులకు అనుకూలంగా వినియోగిస్తున్నారని తమ భూములనుండి తరిమివేయబడిన గ్రామీణులు అనేకం ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. పట్టించుకోవలసిన ప్రభుత్వమే ధనికుల పంచన చేరాక ప్రజల గోడు వినేదెవ్వరు?
అయితే జెపీ గ్రూపు మాత్రం కూలీ చెల్లించని సంగతి తమకు తెలియదని చెబుతోంది. కూలీల పరిస్ధితులు కూడా తమకు తెలియవని కంపెనీ ప్రతినిధులు పని చేస్తున్నారు. ప్రధాన గేటుకి కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉన్న కూలీల తాత్కాలిక షెల్టర్లు వారికి ఎప్పుడూ కలబడలేదట! “కార్మికుల బాగోగులకోసం అన్ని చర్యలూ తీసుకుంటాం. ఉదయం టీ, మధ్యాహ్న భోజనం, మధ్య మధ్యలో విశ్రాంతి, రవాణాకు వాహనాలు అన్ని సమకూరుస్తాము. ఇన్నాళ్లు బాగానే నడిచింది. రెండున్నర సంవత్సరాలనుండి ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఫిర్యాదులేవీ లేవు” అని వారు చెప్పారని గార్డియన్ తెలిపింది.
ఇంతా చేసి తాము నిర్మించిన రోడ్లు ఎందుకో అవి నిర్మించిన కూలీలకు తెలియకపోవడం ఆసక్తికరం. ఏదో పోటీలు జరుగుతాయట కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి వెలుగు నీడలలో వెలుగు ధనికులకు దక్కుతుండగా, నీడలలో చీకటి బ్రతుకు శ్రమజీవుల వంతవుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి