17, మే 2012, గురువారం

హ్యాకర్ల చేతిలో 'సుప్రీం' వెబ్‌సైట్


న్యూఢిల్లీ, మే 17: సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను అనానిమస్ అనే హ్యాకర్ గ్రూపు కొన్ని గంటల పాటు హ్యాక్ చేసింది. వీడియోలు, ఫైళ్లు షేర్ చేసే 'విమియో', మరికొన్ని సైట్లను బ్లాక్ చేసినందుకు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు ఆ గ్రూపు తన ట్విటర్ అకౌంట్‌లో ప్రకటించుకుంది. "నమస్తే ఇండియా. ప్రస్తుత ప్రభుత్వాన్ని 'ట్రాష్' చేసి, కొత్త ప్రభుత్వాన్ని 'ఇన్‌స్టాల్' చేయాల్సిన సమయం ఆసన్నమైంది. గుడ్ లక్'' అని ఆ సందేశంలో తెలిపింది. ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీలు) ప్రముఖ వీడియో సైట్లయిన విమియో, ఇతర ఫైల్‌షేరింగ్ సైట్లను బ్లాక్ చేయడంపై ఫేస్‌బుక్, ట్విటర్‌లలో పలువురు ఇటీవల కామెంట్లు చేస్తున్నారు.

ఇలా నిషేధానికి గురైనవాటిలో కొన్ని టోరెంట్ సైట్లు కూడా ఉన్నాయి. పెద్ద సినిమాలు విడుదలైన కొద్ది రోజులకే అవి ఇంటర్‌నెట్‌లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయని, దీంతో పైరసీ గురించి నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలుగు సినిమా దమ్ము, తమిళ సినిమా 3ల పైరసీని నిరోధించేందుకు మద్రాస్ హైకోర్టు నుంచి కాపీరైట్ లాబ్స్ అనే చిత్రనిర్మాణ సంస్థ ఉత్తర్వులు పొందింది. దీంతో తాము కొన్ని యూఆర్ఎల్స్‌ను బ్లాక్ చేయాల్సిందిగా ఐఎస్‌పీలకు నోటీసులు ఇచ్చినట్లు సంస్థ సీఈవో హరీష్‌రాం తెలిపారు. మెగాఅప్‌లోడ్, ఫైల్‌సానిక్ లాంటి సైట్లు మనదేశానికి వెలుపల ఉంటున్నాయని, వీటిలో ఆన్‌లైన్ పైరసీ తీవ్రంగా ఉంటోందని రిలయన్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ టాండన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్ కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వెలువడినా.. దానికి హిట్లు ఎక్కువ కావడంతో అది ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిందని ఏఐసీసీ కంప్యూటర్ విభాగం చైర్మన్, మాజీ ఎంపీ విశ్వజీత్ సింగ్ తెలిపారు. మరోవైపు.. తమ వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ఢిల్లీ బార్ కౌన్సిల్ తెలిపింది. ఈ మేరకు పోలీసులకు కౌన్సిల్ ఫిర్యాదు చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి