28, మే 2012, సోమవారం

చంచల్‌గూడ జైలులో విఐపి ఖైదీల రాజభోగం



హైదరాబాద్‌ (వి.వి) : దేశంలోని ప్రముఖ జైళ్లల్లో ఒకటైన నిజాం కాలం నాటి చంచల్‌గూడ జైలుకు ఇప్పుడు విఐపి ఖైదీల రాకతో కొత్త రూపు సంత రించుకుంది. ఈ జైలులో ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీలతో పాటు శిక్ష పడ్డ ఖైదీలు కూడా విఐపి రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ జైళ్లో తొమ్మిది మంది రిమాండ్‌ ఖైదీలతో పాటు ఒక శిక్ష పడ్డ ఖైదీ విఐపి హోదాలో ఉండగా, సోమవారం జగన్‌ రాకతో సంఖ్య పెరిగింది. చంచల్‌గూడ జైలులో ప్రస్తుతం విఐపి హోదాలో ఉన్న రిమాండ్‌ ఖైదీలు ఓబుళాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి ఉన్నారు. వీరి కంటే ముందే అరెస్టు అయిన గాలి జనార్దన్‌రెడ్డి కూడా విఐపి ఖైదీ అయినప్పటికీ అతడు ప్రస్తుతం కర్నా టక జైలులో ఉన్నారు. ఎమ్మార్‌ కేసుకు సంబం ధించి ఐఎఎస్‌ అధికారి బిపి ఆచార్య, జగన్‌ సమీప బంధువు సునీల్‌రెడ్డి, కొనేరు ప్రసాద్‌, విజయరాఘ వన్‌లు రిమాండ్‌ ఖైదీలుగా రాజభోగాలు అనుభవిస్తున్నారు. తాజాగా జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ ప్రసాద్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మనందరెడ్డిలు విఐపి ఖైదీ హోదాలో ఉన్నారు. సోమవారం జగన్‌ కూడా విఐపి ఖైదీ హోదాలో చంచల్‌గూడ జైలుకు రావడంతో ఈ సంఖ్య పదికి చేరింది. ఇంతకు ముందు ఇక్కడే విఐపి రిమాండ్‌ ఖైదీగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. అంతకుముందు అరెస్టు అయి మూడేళ్లు పాటు చంచల్‌గూడ జైళ్లో ఉన్న సత్యం రామలింగరాజు కూడా విఐపి హోదాను అనుభవించారు. ఇక వీరితో పాటు ఫోర్జరీ కేసులో శిక్ష పడి చంచల్‌గూడ జైలులో ఉన్న సూర్య పత్రిక అధినేత నూకరపు సూర్యప్రకాష్‌రావు కూడా విఐపిహోదాను అనుభవిస్తున్నారు. మొత్తం మీద చంచల్‌గూడ జైళ్లో విఐపి రిమాండ్‌ ఖైదీలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇతర రిమాండ్‌ ఖైదీలతో పోలిస్తే వీరికి అనేక వెసులు బాట్లు ఉంటాయి. ఇతర ఖైదీలు ధరించినట్లు కాకుండా సొంత దస్తులు వేసుకోవచ్చు. సొంతంగా వంట వండుకోవచ్చు. పత్రికలు సొంతంగా తెప్పించుకోవచ్చు. ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి