స్విస్
బ్యాంకుల్లో దొంగ సొమ్ము దాచిన భారతీయుల సమాచారం పొందడానికి ఇప్పటివరకూ
ఉన్న నిబంధనలు మరింత సరళతరం అయ్యాయని భారత ప్రభుత్వం తెలియజేసింది. ‘బ్లాక్
మనీ’ పై భారత ప్రభుత్వం తలపెట్టిన పోరాటం తాజా పరిణామంతో ఊపందుకుంటుందని
భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రహస్య ఖాతాలున్న
వ్యక్తుల సమాచారం స్విస్ ప్రభుత్వం మనకు ఇవ్వడానికి ఇకనుండి పేరు, చిరునామా
పూర్తిగా ఇవ్వకపోయినా ఫర్వాలేదనీ, సమీప సమాచారం ఇస్తే సరిపోయే విధంగా
నిబంధనలు సడలించారనీ ప్రభుత్వం తెలిపింది.
“సమాచారం కోరుతున్న
ప్రభుత్వం, వ్యక్తి పేరు, చిరునామా లను సూచించడం ద్వారా మాత్రమే కాకుండా
ఇతర పద్ధతుల్లో గుర్తించడానికి తగిన సమాచారం ఇచ్చినా సరిపోతుంది. వ్యక్తి
ఎంతవరకు తెలుసో, కోరిన సమాచారం కల్గిఉన్నాడని భావిస్తున్న వ్యక్తి పేరు,
చిరునామా లు సూచించినా సరిపోతుంది” అని సవరించిన నిబంధన చెబుతున్నదని
ఆర్ధిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
ఇప్పుడున్న ద్వైపాక్షిక
ఒప్పందం ప్రకారం సమాచారం కోరుతున్న దేశం తప్పనిసరిగా తాము సమాచారం కోరే
వ్యక్తి పేరు, చిరునామా లు రెండూ ఇవ్వవలసి ఉంటుంది. దానితో పాటు సమాచారం
కలిగి ఉన్న విదేశీ వ్యక్తి పేరు కూడా చెప్పాలి. ఈ ఐడెంటిటీ వివరాలు
ఖచ్చితంగా ఇవ్వకుండా ఎవరి సమాచారాన్ని స్విస్ ప్రభుత్వం పంచుకునేది కాదు.
“ఇది నిర్భంధపూరితమైన నిబంధన (restrictive provision). అంతర్జాతీయ
ప్రమాణాలకు సరితూగేది కాదు” అని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.
ద్వంద్వ పన్నుల విధానాన్ని తొలగించడానికి కుదుర్చుకున్న తాజా ఒప్పందం (Double Taxation Avoidance
Agreement -డి.టి.ఎ.ఎ) మరింత సరళతరం గా ఉందని ప్రభుత్వం తెలిపింది. “ఈ
ఒప్పందం భారత దేశానికి లబ్ది చేకూరుస్తుంది. ఎందుకంటే సమాచార మార్పిడికి
అవసరమైన ఐడెంటిటీ నిబంధనలకు ఈ ఒప్పందం ‘లిబరల్ ఇంటర్ ప్రేటేషన్’
సమకూర్చింది. ఈ అవగాహన అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగేదిగా ఉంది” అని
ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. సమాచార మార్పిడికి సంబంధించిన ఆర్టికల్ 26
కు ‘సరళతరమైన అవగాహన’ డి.టి.ఎ.ఎ కల్పించిందని సదరు ప్రకటన తెలిపింది.
“నూతన షరతులపై స్విస్
ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ప్రకారం, స్విట్జర్లాండ్ లో ఖాతాలున్న వ్యక్తికి
సంబంధించి పరిమిత వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వారి ఖాతాల సమాచారం
పొందడానికి భారత దేశానికి వీలుంటుంది” అని ప్రభుత్వం తెలిపింది.
స్విట్జర్లాండ్ తో ఉన్న
ద్వైపాక్షిక పన్నుల ఒప్పందాన్ని సవరించడానికి ఇరు దేశాలు ఆగస్టు 2010 లో
ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని జూన్ 17, 2011 తేదీన స్విస్
ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మార్చి 23, 2012 తేదీన భారత కేబినెట్ ఈ
ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ పరస్పర ఒప్పందం ఏప్రిల్ 1, 2011 నుండి అమలులోకి
వస్తుందని ప్రభుత్వం తెలిపింది.
స్విస్ నేషనల్ బ్యాంకు ప్రకారం భారత దేశ వ్యక్తులు స్విస్ బ్యాంకుల్లో $2.5 బిలియన్లు (రు.12,500 కోట్లు) దాచుకున్నారు. సి.బి.ఐ అంచనా
ప్రకారం విదేశీ ఖాతాల్లో భారతీయులు దాచిన మొత్తం రు. 25,000 లక్షల కోట్లు
($500 బిలియన్లు). $1500 బిలియన్ల (రు.75,000 కోట్లు) వరకు దాచుకున్నారన్న
అంచనాలు కూడా ఉన్నాయని సి.బి.ఐ గత ఫిబ్రవరిలో ప్రకటించింది. వివిధ
అధ్యయనాలు అంచనా వేసిన మొత్తం ఇంతకంటే చాలా ఎక్కువ. రు. 60,000 లక్షల కోట్ల
నుండి కోటి కోట్ల వరకూ అంచనాలు ఉన్నాయి. స్విస్ నేషనల్ బ్యాంకు మాత్రం
కేవలం రు.12,500 కోట్లు మాత్రమే తమ దేశంలో ఉన్నాయని చెబుతోంది. ఈ లెక్కన
భారత ప్రభుత్వం గొప్పగా చెబుతున్న ‘లిబరల్ ఇంటర్ ప్రేటేషన్’ వల్ల ఒరిగేదేమీ
లేదని ఇట్టే అర్ధం అవుతోంది.
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం
దరిమిలా జి20 లాంటి అంతర్జాతీయ వేదికలపై బ్లాక్ మనీ ని అరికడతామని వివిధ
దేశాల ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి. బడా కంపెనీల, ముఖ్యంగా వాల్ స్ట్రీట్,
లండన్ లలో ఉన్న ‘టూ బిక్ టు ఫెయిల్’ ద్రవ్య కంపెనీల భారత పడతామని గొప్పలు
పలికాయి. ఈ హామీలు అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి చేస్తున్న నామ
మాత్రపు చట్టాలలో భాగమే భారత ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనలు. అలవిగాని
రీతిలో పెరిగిన మోసాల్ని అరికట్టాలంటే కఠినమైన కొత్త చట్టాలు అవసరం.
దానికి బదులు ఇప్పటికే ఉన్న బలహీన చట్టాలకు నామ మాత్ర సవరణలు చేయడం వరకే
ప్రభుత్వాలు పరిమితమవుతున్నాయని భారత ప్రభుత్వ ప్రకటన ద్వారా అర్ధం
అవుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి