8, మే 2012, మంగళవారం

జగన్ ఆస్తుల కేసులో 3వ చార్జిషీట్ దాఖలు



  • 08/05/2012
హైదరాబాద్, మే 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ సోమవారం మూడవ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరి కొన్ని చార్జిషీట్లు త్వరలో దాఖలు చేయనున్నట్లు సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. మూడో చార్జిషీట్‌లో ప్రధాన నిందితుడిగా వైఎస్ జగన్, రెండో నిందితుడిగా విజయసాయిరెడ్డి, మూడు జగతి పబ్లికేషన్స్, రామ్‌కీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకట్రామ్‌రెడ్డి, రామ్‌కీ ఫార్మా ఇండియాను చార్జిషీట్‌లో నిందితులుగా నమోదు చేసింది.
88 పేజీలతో కూడిన చార్జిషీట్, 140 డాక్యుమెంట్లు, 72 మంది సాక్ష్యులను విచారించిన నివేదికను సిబిఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ చార్జిషీట్‌లో రామ్‌కీ కంపెనీ, దాని చైర్మన్‌ను నిందితులుగా చేర్చడమే కాకుండా విశాఖ అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా) చైర్మన్‌గా పని చేసి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న జి.వెంకట్రామ్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారు. నిందితులందరిపైనా ఐపిసి 120 బి, 420, 409, 468, 471 సెక్షన్ల కింద, అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 9, 11, 12 సెక్షన్ల కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. రామ్‌కీ ఫార్మా కంపెనీకి సెజ్‌ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున భూములను మంజూరు చేయడంలో జి.వెంకట్రామ్‌రెడ్డి చాలా కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించింది. వుడా చైర్మన్‌గా పని చేసినప్పుడు రామ్‌కీ ఫార్మా ఇండియాకు 1700 ఎకరాలను విశాఖ జిల్లా పర్వాడ దగ్గర కేటాయించారని సిబిఐ చెబుతోంది. ఇదే కాకుండా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద ఉన్న పోలేపల్లి సెజ్‌కు 77 ఎకరాలను అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో రామ్‌కీ యాజమాన్యం భారీగా నిధులను మళ్లించినట్లు సిబిఐ ప్రధాన ఆరోపణ. సుమారు రూ.10 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
మూడో చార్జిషీట్‌లో రామ్‌కీ వ్యవహారంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు పూర్తిగా నీళ్లొదిలిందని తెలిపింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డితో కలిసి రామ్‌కీకి లాభం చేకూరే విధంగా నేరపూరితంగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది.
విశాఖలోని ఉడా పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఏరియాను 250 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించారు. అప్పట్లో వుడా చైర్మన్‌గా పని చేసిన వెంకట్రామ్‌రెడ్డి తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసి కుట్రపూరితంగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది. అప్పటి సిఎం ఒత్తిడి మేరకు రామ్‌కీకి నిబంధనలకు విరుద్ధంగానే కాకుండా వుడా మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా అనుమతులు మంజూరు చేసింది. విశాఖలో ఉన్న ఫార్మా సిటీలో 914 ఎకరాల భూమిని అడ్డదారిలో సంపాదించి,ప్లాట్లుగా విభజించి రామ్‌కీ విక్రయించిందని ఆరోపణ. తద్వారా రామ్‌కీ రూ.133.74 కోట్లు సంపాదించిందని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి