24, మే 2012, గురువారం

స్పెయిన్‌లో విద్యకు కోతలపై నిరసన


  • వీధుల్లోకొచ్చిన లక్షలాది మంది
తమ హక్కుల రక్షణ కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు వీధుల్లోకి రావడంతో మంగళవారం స్పెయిన్‌లో మెజారిటీ విద్యా సంస్థలు మూతబడ్డాయి. ప్రభుత్వం విద్యా రంగ వ్యయాల్లో వందల కోట్ల యూరోలు కోతపెట్టడానికి నిరసనగా వారు వీధుల్లోకొచ్చారు. ఈ సమ్మె ఎలిమెంటరీ స్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకూ జరిగింది. మూడు ప్రాంతాలు మినహా మొత్తం 17 ప్రాంతాల్లోనూ జరిగింది. ప్రదర్శనల్లో పది లక్షల మందికిపైగా ఉపాధ్యాయులు, 70 లక్షలకుపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పొదుపు ప్యాకేజీని ఇలాగే అమలు చేస్తూ పోతే విద్యా రంగానికిస్తున్న సబ్సిడీలు 20 శాతానికి పైగా తగ్గిపోతాయి. ఈ చర్యల వల్ల విద్యారంగ పరిస్థితులు క్షీణిస్తాయని, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు లేఆఫ్‌కు గురవుతారని, ట్యూషన్‌ ఫీజులు విపరీతంగా పెరుగుతాయని యూనియన్లు తెలిపాయి. 'వారు సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా మా నుంచి దొంగిలిస్తున్నారు. దాన్ని జరగనివ్వరాదు. ఈ సమ్మె ద్వారా మేము ఏమైనా సాధించగలమా అనేది నాకు తెలియదు. కానీ దీనివల్ల ఏదో ఒకటి జరగవచ్చు' అని ప్రదర్శనలో పాల్గొన్న ఒక విద్యార్థి తెలిపాడు. ఒక్క 2012లోనే మూడు వేల కోట్ల యూరోల కోతలకు అదనంగా మరిన్ని కొత్త పొదుపు చర్యలు ప్రవేశపెట్టేలా స్పెయిన్‌ ప్రభుత్వాన్ని యూరోజోన్‌లో విస్తరిస్తున్న సంక్షోభం ముందుకు నెడుతోంది. ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలు నిరుద్యోగ రేటును 25 శాతానికి పెంచింది. 25 ఏళ్ళ లోపువారిలో ఆ రేటు రెట్టింపుగా ఉంది. ఈ పరిస్థితి స్పెయిన్‌ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ అక్కడ పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు, సమ్మెలు జరుగుతున్నాయి. మే మధ్యలో స్పెయిన్‌లోని 80 నగరాల్లో జరిగిన ప్రదర్శనల్లో లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి