28, మే 2012, సోమవారం

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు



హైదరాబాద్, మే 28: విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓబిసి కోటాలోనే మైనార్టీలకు 4.5 రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.
కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో ఓబిసి కోటా 27 శాతంలోనే మైనార్టీలకు 4.5 రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వు చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. మతపరంగా మైనార్టీలకు అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అవసరమంటూ కేంద్రం తరఫు న్యాయవాది అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎటువంటి ఆధారం చూపలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జోరాస్ట్రియన్లు ఒకే వర్గం కిందకు వచ్చే మతస్తులు కారని, వారు వేరువేరు వర్గాలకు చెందిన వారని హైకోర్టు పేర్కొంది. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటి తదితర సంస్థల్లో మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తే, బీసీలకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ ఆర్ కృష్ణయ్య తరఫున వాదించిన న్యాయవాది కె. రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీలకు కేటాయించిన 27శాతం రిజర్వేషన్లలోనే మైనార్టీల్లోని బీసీలకు 4.5 శాతం సబ్ కోటా రిజర్వు చేయాలని ఆదేశిస్తూ కేంద్రం జారీ చేసిన ఆఫీసు మెమొరాండాలు చెల్లవని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించిందని, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను కూడా కేంద్రం పట్టించుకోలేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ నిబంధనల ముందు నిలబడలేదు’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకుర్ తన 25పేజీల తీర్పులో పేర్కొన్నారు.
కేంద్రానికి చెంప పెట్టు: బిజెపి
బిసి కోటానుంచి ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్ల కోటాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇది చారిత్రాత్మక తీర్పని, కేంద్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా ఈ నిర్ణయం తీసుకుందని హైకోర్టు పేర్కొందన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం మతపరమైన రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి