28, మే 2012, సోమవారం

బరిలో 255 మంది



హైదరాబాద్, మే 28: ఉప ఎన్నికల్లో సిసలైన ప్రచారానికి తెరలేచింది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో మంగళవారం నుంచి అంతా పూర్తిస్థాయి ప్రచారంలో నిమగ్నం కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 255మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో నెల్లూరు లోక్‌సభ స్థానానికి 13 మంది అభ్యర్థులు, 18 అసెబ్లీ స్థానాలకు 242మంది ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 280మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు గుర్తించగా, అందులో 25మంది తమ నామినేషన్లను సోమవారం ఉపసంహరించుకున్నారు. తుది జాబితా మేరకు అత్యధికంగా ఒంగోలు నియోజకవర్గంలో 23మంది, రాజంపేట, తిరుపతి నియోజకవర్గాల్లో 19మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మూడు స్థానాల్లో రెండేసి ఈవిఎంలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాగా, ఆళ్లగడ్డ, రాయచోటి, కోడూరు, రామచంద్రాపురం, పరకాల నియోజకవర్గాల్లో 16మంది చొప్పున, మాచర్లలో 13మంది, ఉదయగిరిలో 14మంది, ఎమ్మిగనూరు, అనంతపురంలో 12మంది చొప్పున, పత్తిపాడులో 11మంది, నరసాపురం, రాయదుర్గంలో తొమ్మిది మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, అతి తక్కువగా నరసన్నపేట, పోలవరం నియోజకవర్గాల్లో ఆరుగురు చొప్పున మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కాగా, మొత్తం అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తుగా ఫ్యాన్‌ను కేటాయించారు. ఒక లోక్‌సభ, 17 శాసనసభా స్థానాలకు సిటింగ్ అభ్యర్ధులే ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉండటంతో వారికి తొలి ప్రాధాన్యతగా ఫ్యాన్ గుర్తు కేటాయించగా, తిరుపతి స్థానంలో ఆ గుర్తుకు వేరే అభ్యర్థి నుంచి పోటీ లేకపోవడంతో అక్కడ కూడా ఫ్యాన్ గుర్తే లభించింది.
ఇలాఉండగా, ఎన్నికల ప్రచార సమయంలో వివిధ కారణాలతో అభ్యర్ధులు, పార్టీ కార్యకర్తలపై ముందస్తు అరెస్టులు వద్దంటూ ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై అటువంటి చర్యలు వద్దని, అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. పరకాల స్థానంలో ఒక సిఐ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు తెరాస నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వివరాలు చెప్పాలంటూ అక్కడి కలెక్టర్‌ను కోరుతున్నట్టు చెప్పారు.
ఇలా ఉండగా, ఎన్నికల ప్రచార సమయంలో ముందస్తు అరెస్టుల కారణంగా ప్రచారానికి ఇబ్బందులు కలుగుతూ అభ్యర్థులు నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు భన్వర్‌లాల్‌ను కలిసి ప్రచారంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు వివరించారు. దీనిపై స్పందించిన భన్వర్‌లాల్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి