15, మే 2012, మంగళవారం

అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్‌


 

* చిన్న ఉద్యోగి నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన నిమ్మగడ్డ ప్రసాద్‌
* వేల కోట్ల రూపాయల వ్యాపారానికి కేరాఫ్‌
* ఎన్నో కంపెనీల్లో కీలక పాత్ర
* మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా ప్రత్యేక గుర్తింపు


నిమ్మగడ్డ ప్రసాద్‌. పేరు మోసిన పారిశ్రామికవేత్త. దేశ విదేశాల్లో ఎన్నో వ్యాపారాలు. వేల కోట్ల రూపాయల బిజినెస్‌. ఓ చిన్న ఉద్యోగిగా జీవితం ఆరంభించి... అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్‌... ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. నిమ్మగడ్డ వ్యాపార సామ్రాజ్యంపై టీవీ ఫైవ్‌ స్పెషల్‌ స్టోరీ.

సిమెంట్‌, విద్యుత్‌, మీడియా, ఇన్‌ఫ్రా, హాస్పిటల్స్‌ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో వ్యాపారాలు. అన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌. కృష్ణా జిల్లాలో జన్మించి... ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ అంచెలంచెలుగా ఎదిగారు. ఘజియాబాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ నుంచి పీజీ డిప్లొమా పొందారు. ఇండియన్‌ మొలాసిస్‌ కంపెనీలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి... వేల కోట్ల వ్యాపారానికి అధిపతిగా ఎదిగారు. 1984లో ఫార్మా రంగంలో అడుగుపెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‌, ఆ రంగంపై ప్రత్యేక ముద్ర వేశారు. 1993లో వోరిన్‌ ల్యాబ్‌రేటరీ జీఎంగా, 1995లో వోరిన్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వరుస టేకోవర్లతో పెద్ద పెద్ద కంపెనీలను సొంతం చేసుకొని వ్యాపారాన్ని విస్తరించారు.

2000 సంవత్సరంలో హెరెన్‌ డ్రగ్స్‌ కంపెనీని కొని దానిని మ్యాట్రిక్స్‌గా మార్చారు. అప్పటి నుంచి మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా పేరు పొందారు నిమ్మగడ్డ ప్రసాద్‌. 2006లో మ్యాట్రిక్స్‌లోని 71.5 శాతం వాటాను మైలాన్‌ ల్యాబరేటరీస్‌కు అమ్మడం ద్వారా బాగా లాభపడ్డారు. ఆ తర్వాత వ్యాపారాన్ని మరింత విస్తరించారు. సిమెంట్‌, విద్యుత్‌, మీడియా, ఇన్‌ఫ్రా, ఆస్పత్రుల రంగాల్లో అడుగుపెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు.

2008లో వాన్‌పిక్‌ స్థాపన ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం నుంచి 15 వేల ఎకరాల భూమి పొందారు. ఈ భూ వ్యవహారంలోనే ప్రస్తుతం సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వాన్‌పిక్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్‌, మా టీవీ ఛైర్మన్‌ కూడా. కేర్‌ హాస్పిటల్‌, ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ బోర్డుల్లో ప్రసాద్‌ సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో కూడా ప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి ఎన్నో వ్యాపారాలతో సంబంధమున్న ప్రసాద్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడం వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి