- -పరాంజయ గుహ థాకుర్తా
స్టాక్ మార్కెట్ల పతనానికి, రూపాయి మారకం విలువ తగ్గడానికి ఐరోపా సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు కారణమని భారత ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ మే 17వ తేదీన చేసిన ప్రసంగంలో చెప్పారు. గ్రీసు రాజకీయ పరిణామాల ప్రభావం వల్ల అంచనాలన్నీ తలకిందులయ్యాయని అన్నారు. ‘గ్రీసు ఓటర్లు ఓ రాజకీయ పార్టీని ఓడించి మరో రాజకీయ పార్టీకి పట్టం కట్టడంతో యూరో జోన్‌లో సంక్షోభం అంతమవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని, దాని దెబ్బకు మే 17న ఆసియా మార్కెట్లన్నీ కుదేలయ్యాయని, ఇది మనం నివసిస్తున్న సంక్లిష్ట పరిస్థితికి దర్పణమని, దానిని మనం ఉపేక్షించజాలమని’ ప్రణబ్ వివరించారు. దీన్ని ఎదుర్కొనడానికి భారత ప్రభుత్వం త్వరలో కొన్ని పొదుపు చర్యలు తీసుకోగలదని చెప్తూ ఆ వెంటనే అంతమాత్రాన భయాందోళనకు గురికావలసిన పనిలేదని ఆర్థిక మంత్రి అన్నారు. ‘ప్రజలు ఇష్టపడినా లేకున్నా...నేను కొన్ని పొదుపుచర్యలను ప్రకటిస్తాను. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మేము స్పందిస్తున్నామనే సంకేతాలను పంపడమే మా ఉద్దేశం’ అని ఆయన అన్నారు.
ఆయన ప్రకటించబోయే పొదుపుచర్యలేమిటో? పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడమా? వంటగ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడమా? వెల్లడించలేదు. కానీ పెట్రోల్ ధరలు ఏకంగా లీటరుకు రొ. 7.50 చొప్పున కనీవినీ ఎరుగుని రీతిలో పెరిగాయ. ఇదే సమయంలో వంటగ్యాస్ సిలిండర్‌పై మరో యాబయ రూపాయలు పెంచుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయ. ఇక మిగిలిన డీజిల్‌ను ఉపేక్షించబోరనేది ఎవరికైనా తేలిగ్గా అర్థమయ్యే విషయం. మరి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన పొదుపు చర్యలు ఈవిధంగా సామాన్యుల నడ్డి విరగ కొట్టడం దగ్గరినుంచి మొదలయ్యాయ. ప్రభుత్వం ఎటువంటి సరికొత్త చర్యలు చేపట్టినా ముందుగా బలయ్యేది సామాన్యుడే అన్న సత్యం ఈవిధంగా మరోసారి ఆవిష్కృతమైంది. అయితే సాధారణ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థూల ఆదాయం (జిడిపి)లో రెండు శాతానికి తగ్గిస్తుందని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను భారీగా పెంచడం తథ్యమని అప్పుడే అనుకున్నాం. అనుకున్న విధంగానే పెట్రోలు ధరను మునె్నన్నడూ కనీ విని ఎరుగని రీతిలో పెంచడానికి నేపథ్య మిదీ.అయితే గమ్మత్తేమిటంటే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిన సమయంలో మన దేశంలో పెట్రోలియం ధరలను పెంచడం విచిత్రంగా తోచవచ్చు కానీ అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదలవల్ల కలిగిన ప్రయోజనాన్ని రూపాయి మారకం విలువ బాగా తగ్గడం వల్ల మనం పూర్తిగా పొందలేకపోయమనే సత్యాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
నిజానికి డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి మారకం విలువ బాగా తగ్గడానికి ప్రధాన కారణం 2011-12 ఆర్థిక సంవత్సరంలో అంతకు క్రితం సంవత్సరంతో పోల్చినప్పుడు భారత వాణిజ్యలోటు పెద్దమొత్తంలో 56శాతం పెరగడమే (దిగుమతులకు, ఎగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసం) కారణం. అంతకు ముందు సంవత్సరం (2010-11)తో పోల్చినప్పుడు దిగుమతులు మూడవ వంతు పెరగగా, ఎగుమతులు సగానికి తగ్గిపోయాయి. 2010-11లో ఎగుమతులు అంతకు ముందు సంవత్సరం కన్నా 41శాతం పెరిగాయి. ప్రధానంగా వాణిజ్యలోటు పెరగడం వల్ల విదేశాలకు చెల్లించవలసిన బకాయిల మొత్తం (విదేశీ కరెన్సీల రాక పోకల మధ్య తేడా) పెరుగుతాయ. ఇప్పుడది జాతీయ స్థూల ఆదాయం (జిడిపి)లో నాలుగు శాతం కన్నా ఎక్కువగా ఉంది. అంత పెద్ద లోటు కొనసాగడం దేశ ఆర్థిక వ్యవస్థకు అంత శ్రేయస్కరం కాదు. దీన్ని అరికట్టడానికి గట్టి సర్దుబాటు చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రూపాయి మారకం విలువ తగ్గడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. గడచిన కొద్ది వారాలలో విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు స్టాక్ ఎక్స్‌ఛేంజిలలో కొత్త పెట్టుబడులు పెట్టడం లేదు. అంతే కాకుండా తాము ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తాలను డాలర్లలోకి మార్చుకొని విదేశాలకు తరలించుకొని పోతున్నారు. దీనివల్ల రూపాయ చెల్లింపుల్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనాల్సి వచ్చిన ఫలితంగా పతనపథంలో రూపాయ వేగంగా పయనించింది. సాధారణంగా రూపాయి పతనమైనప్పుడు దాని విలువను పెంచడానికి రిజర్వుబ్యాంక్ మార్కెట్లలో డాలర్లను గుమ్మరించడం ఆనవాయితీ. అయతే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంక్ ఆ పని చేయడం లేదు. అందువల్లనే రూపాయ విలువ భారీగా పతనమైనప్పుడు మాత్రమే తాము మార్కెట్లలో జోక్యం చేసుకుంటామని, తాత్కాలికంగా జరిగే హెచ్చుతగ్గుల విషయంలో తాము కలుగజేసుకోబోమని రిజర్వు బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రూపాయి పతనమైనప్పుడు అది ఎగుమతి దారులకు ఊతమిస్తుంది. వారి వస్తువులు, సేవల విలువ తగ్గుతుంది. దానివల్ల వాణిజ్యలోటు తగ్గడానికి ఉపకరిస్తుంది. కానీ ఇప్పుడది జరగడంలేదు. కారణమేమిటి? దిగుమతులు తగ్గడం లేదు. ప్రస్తుతం మన దేశం చేసుకుంటున్న మొత్తం దిగుమతుల్లో మూడవ వంతు ముడిచమురు ఉంటుంది. మన దేశ ముడిచమురు అవసరాల్లో 80శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. దానికితోడు భారతీయ ఎగుమతి మార్కెట్లు పెరగడం లేదు. నిజానికి బృహత్ మాంద్యం వల్ల పశ్చిమ దేశాలకు మన ఎగుమతులు తగ్గిపోయాయి. మాంద్యం ఇంకా కొనసాగుతోంది. చైనా వృద్ధిరేటు కూడా మందగించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఐరోపా సంక్షోభం దేశ ఆర్థిక రంగానికి గుదిబండగా తయారైంది. ఐరోపా సంక్షోభం ప్రభావం వల్ల అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు ఒక్క రూపాయి మాత్రమే కాక అన్ని దేశాల కరెన్సీలు పతనమయ్యాయి. సంక్షోభం ప్రభావం వల్ల యూరో రూపంలో ఉన్న పెట్టుబడులు, మార్కెట్ స్పెక్యులేషన్‌లో ఉపయోగించే ధనం డాలర్లుగా పరివర్తనం చెందడమే దీనికి కారణం. ఇంతకు ముందే చెప్పినట్లు ఇది రూపాయి పతనం చెందడానికి సంబంధించిన ఒక పార్శ్వం మాత్రమే. ప్రభుత్వ పాలన సజావుగా సాగకపోవడం, ఆర్థిక వృద్ధి కుంచించుకుపోవడం, దేశంలో డిమాండ్‌కు సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల ద్రవ్యోల్బణం భారీగా పెరగడం, పారిశ్రామిక ప్రగతి తగ్గిపోవడం వంటి కారణాలు కూడా భారతీయ కరెన్సీ పతనానికి దోహదం చేశాయి.
మనం అరాచక ప్రపంచంలో నివసిస్తున్నాం. ఐరోపా నుంచి భారత్ నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయా? ఐరోపాలో 27 దేశాలున్నాయి. ఉమ్మడి కరెన్సీని ఉపయోగిద్దామని 17 దేశాలు నిర్ణయించుకుని యూరో మండలంగా ఉమ్మడి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. త్వరలోగ్రీసు యూరో మండలం నుంచి వైదొలగవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే రాజకీయంగా విభిన్న సిద్ధాంతాలు గల దేశాల సమాఖ్యను ఆర్థికంగా ఏకంచేసి నియంత్రించడం పాక్షికంగానే సాధ్యం కాగలదని యూరో మండలానికి కలిగిన అనుభవం చెప్తోంది. భారత్ ఎదుర్కొన్న అనుభవం అందుకు భిన్నంగా ఉంది. దేశం రాజకీయంగా ఏకమై ఉన్నప్పటికీ ఆర్థికంగా విఘటించి ఉంది. ఆర్థిక సంస్కరణల విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందుకే ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దేశంలో ఆర్థిక సంస్కరణలలో ముఖ్యమైంది వస్తువులు, సేవలపై ఉమ్మడి పన్నును అమలు చేయడమని చాలామంది నమ్మకం. దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు దానిని వర్తింపజేయడం. దానివల్ల అవినీతి తగ్గుతుందని, భారతావని అంతటికీ ఏకీకృత మార్కెట్ ఏర్పడగలదని నిపుణుల అభిప్రాయం. అది జరిగేనా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి