28, మే 2012, సోమవారం

దేశాన్ని నిర్వీర్యం చేస్తున్న మనీ లాండరింగ్


  • -వి.వి.ఎస్. శర్మ vallury.sarma@gmail.com

హవాలా నెట్‌వర్క్..మనీ లాండరింగ్‌లో ముఖ్యమైన భాగం. నేడు చోటు చేసుకుంటున్న మనీలాండరింగ్ (ఎంఎల్) వల్ల ఆర్థిక సంస్థలకు మాత్రమే కాదు, దేశానికి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. ఇది రోజు రోజుకూ మరింత ఆధునికతను సంతరించుకుంటూ మత్తుమందుల రవాణా నుంచి, ఆర్థిక ఉగ్రవాదం వరకు విస్తరించింది. చాలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ మనీలాండరింగ్‌కు తగిన పరిష్కారాలను (ఎఎంఎల్) కనుగొని సమర్థవంతంగా అమలు జరుపుతున్నాయి. భారత్‌లో ఎంఎల్ వ్యాపారంలో, బిల్డర్లు, రాజకీయ నేతలు, ఎన్నికల ఫైనాన్స్‌కు మధ్య క్విడ్‌ప్రొకొ అనేది ముఖ్యమైన భాగమై పోయంది.
ఆర్థిక సంస్థలు, హవాలా నెట్‌వర్క్‌లు,కంపెనీలు, రాజకీయ నాయకులు, అవినీతి, నల్లధనం.. ఈ నెట్‌వర్క్‌లన్నింటినీ మనీలాండరింగ్ నెట్‌వర్క్ అనుసంధానం చేస్తున్నది. రాజకీయాలు, ధనం, నేరాలు, ఉగ్రవాదాల మధ్య అనైతిక సంబంధాల కారణంగా, హవాలాను సమూలంగా పెకలించి వేయడానికి సాధ్యం కావడం లేదు. హవాలా అంటే ఇన్ఫార్మల్ వాల్యూ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్. ఇది ముఖ్యంగా మనీ బ్రోకర్లకు సంబంధించిన అతిపెద్ద నెట్‌వర్క్. ఇటువంటి నెట్‌వర్క్‌లు అమెరికాలో కూడా రహస్యంగా పనిచేస్తుంటాయి. మరోరకంగా చెప్పాలంటే బ్యాం కింగ్ లేదా ఆర్థిక ఛానల్స్‌కు ప్రత్యామ్నాయంగా, డబ్బును పంపే వ్యవస్థ ఇది! దక్షిణాసియాలో హుండి పూర్తి స్థాయి మనీ మార్కెట్‌కు ఉపకరణంగా అభివృద్ధి చెందింది. తర్వాత క్రమంగా 20వ శతాబ్దం మధ్య నాటికి దీని స్థానాన్ని సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ ఆక్రమించింది. విదేశాల్లో పనిచేసే వలస కార్మికులు స్వదేశంలోని తమ వారికి హవాలా ద్వారానే డబ్బులు పంపుతున్నారు. అయితే మనీ లాండరింగ్ విధానంలో నిధులు ఎక్కడినుంచి వచ్చాయనేది తెలుసుకోవడం దుస్సాధ్యం. ఆవిధంగా అక్రమంగా సంపాదించిన నల్లధనం, తెల్లధనంగా మారిపోతున్నది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరెన్సీ మార్పిడి, ఆటోమోబొయిల్ వ్యాపారాల తర్వాత మూడో స్థానంలో మనీ లాండరింగ్ (ఎంఎల్) వ్యాపారం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా జరిగే మనీ లాండరింగ్ విలువ 1.5 ట్రిలియన్ డాలర్లు! ఈ ఎంఎల్ అనేక రూపాల్లో కొనసాగుతున్నది. భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్ళు, అమ్మకాల లావాదేవీలు యాబైశాతం కంటే ఎక్కువ నల్లధనం ద్వారానే కొనసాగుతున్నాయి.
అమెరికాలో కెవైసి (know your customer) అనే సంక్లిష్ట విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. బ్యాంకు రహస్యాల చట్టం, యుఎస్‌ఎ పాట్రియాట్ చట్టం కింద, వినియోగదారుడిని గుర్తించే కార్యక్రమమే (సిఐపి) కెవైసి విధానం. యుఎస్ తీసుకున్న చర్యల స్ఫూర్తితో, వివిధ దేశాలు కెవైసి విధానాలను అమలు జరుపుతున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే విదేశీ మారక ద్రవ్యం, కరెన్సీ ఎగుమతి దిగుమతులపై పరోక్ష ప్రభావం చూపే సెక్యూరిటీలు, లావాదేవీలను నియంత్రించేందుకు వీలుగా ఫారెన్ ఎక్చేంజ్ రెగ్యులేషన్ చట్టం, 1973 (ఫెరా)ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మారకద్రవ్య నియంత్రణకు మరో కారణమేమంటే.. హవాలా లావాదేవీలను నిరోధించడం. 2004లో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా(ఎఫ్‌ఐయు-ఐఎన్‌డి)ను, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని స్వీకరించడం, విశే్లషించడం, అందరికి పంపిణీ చేయడం ఈ సంస్థ ప్రధాన విధులు. ఇదే సమయంలో ఎఫ్‌ఐయు-ఐఎన్‌డి, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయంగా పనిచేస్తుంది. ఎఫ్‌ఐయు-ఐఎన్‌డి నేరుగా ఎకనామిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్‌కు (ఇఐసి)కి పంపుతుంది. దీనికి ఆర్థిక మంత్రి నేతృత్వం వహిస్తారు. అయితే దేశంలో మనీ లాండరింగ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002 (పిఎంఎల్‌ఎ)ను కేంద్రం అమల్లోకి తెచ్చింది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2011ను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో 2011 డిసెంబర్ 27న ప్రవేశపెట్టారు. భారత్‌లోని చట్టాలను, విదేశాల్లోని చట్టాలకు అనుసంధానించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంకు కెవైసికి సంబంధించిన మార్గదర్శకాలను బ్యాంకులకు 2002లో పంపింది.అయితే నిగూఢంగా పనిచేసే నెట్‌వర్క్‌లకు, బాహ్య నెట్‌వర్క్‌లతో తప్పనిసరిగాసంబంధం ఉండి తీరుతుంది. దీని ద్వారానే మనీ లాండరింగ్ మూడు పద్ధతుల్లో కొనసాగుతుంది. మొదటిది..ఆర్థిక వ్యవస్థలోకి అక్రమ నిధులు వచ్చి చేరడం. దీనే్న ప్లేస్‌మెంట్ అంటారు. రెండవది నిధులను ఇతర ఖాతాలు లేదా ఆర్థిక సంస్థలకు బదలాయించడం. దీనివల్ల నేర మూలాల నుంచి వచ్చిన ధనం...నేర కార్యకలాపాలకు మరింత దూరమవుతుంది. ఇది ‘లేయరింగ్’. ఇక మూడవది ‘ఇంటిగ్రేషన్’. ఈ విధానంలో నిధులను స్వదేశంలో చట్టబద్ధంగా ఆస్తులను సంపాదించుకోవడానికి ఉపయోగిస్తారు. బ్యాంకుల్లో పనిచేసే రిలేషన్‌షిప్ మేనేజర్లు, టెల్లర్లు వంటివారు, యాంటీ మనీలాండరింగ్‌లో శిక్షణ పొంది ఉంటారు. అనుమానాస్పద లావాదేవీల వ్యవహారాన్ని వెంటనే వీరు పై అధికార్లకు విధిగా తెలియపరచాల్సి ఉంటుంది. కెవైసి/ఎఎంఎల్ మార్గదర్శకాల ముఖ్యోద్దేశమేమంటే, నేరస్తులు మనీ లాండరింగ్ లేదా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే కార్యకలాపాలకు బ్యాంకులను ఉపయోగించుకోకుండా చూడటం.
అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు తమ సంపాదనను, రియల్ ఎస్టేట్‌లోని బిల్డర్ల వద్ద జమ చేస్తున్నారు. భూమిపై రాజ్యానికి అపరిమితమైన అధికారం ఉన్నందువల్ల, బిల్డర్లకు ఎప్పటికప్పుడు రాజకీయ నేతల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అంతే కాదు ఈ రంగానికి, బ్యాంకులు చేసే ఫైనాన్స్‌లకంటే, పెద్ద మొత్తంలో లిక్విడిటీ అవసరమవుతుంది. రాజకీయ నాయకులు ఈ అవసరాన్ని తీర్చడమే కాకుండా, భూములను వారికి అందుబాటులోకి తీసుకొస్తారు. అందుకు ప్రతిఫలంగా బిల్డర్లు ఆ మొత్తాన్ని భద్రంగా మరింత వృద్ధి చెందేలా చూస్తారు. చివరకు ఎన్నికల సమయంలో బిల్డర్లు తమవద్ద ఉంచిన ధనాన్ని ఎన్నికల ఖర్చుకోసం రాజకీయ నాయకుల వద్దకు చేరుస్తారు.
కేవలం చట్టం చేసినంత మాత్రాన ఈ మనీ లాండరింగ్ అరికట్టడం కేవలం భ్రమ మాత్రమే. వ్యవస్థను మరింత బలోపేతం చేయడమొక్కటే పరిష్కార మార్గం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి