30, మే 2012, బుధవారం

విశ్వనాథుడే.. విశ్వవిజేత


:
మాస్కో, మే 30: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఐదోసారి విశ్వవిజేతగా నిలిచాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన ర్యాపిడ్ గేమ్ టై-బ్రేకర్‌లో ఆనంద్ ఇజ్రాయెల్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్‌ను మట్టికరిపించి వరుసగా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆనంద్ కెరీర్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించడం మొత్తం మీద ఇది ఐదోసారి. ఈ చాంపియన్‌షిప్‌లో ఇంతకుముందు జరిగిన 12 గేముల్లో వీరిరువురు 6 పాయింట్ల చొప్పున సాధించి సమవుజ్జీలుగా నిలువడంతో ఫలితాన్ని తేల్చేందుకు మాస్కోలోని త్రెత్యకోవ్ గ్యాలరీలో ఆదివారం ర్యాపిడ్ చెస్ టై-బ్రేకర్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో ఆనంద్ 2.5-1.5 పాయింట్ల తేడాతో గెల్ఫాండ్‌ను చిత్తుచేసి విజయవంతంగా ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలుపుకున్నాడు. ర్యాపిడ్ చెస్ టై-బ్రేకర్‌లో ఆనంద్-గెల్ఫాండ్‌ల మధ్య సాగిన తొలి గేమ్ 33 ఎత్తుల అనంతరం డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో ఆనంద్ 77 ఎత్తుల్లో గెల్ఫాండ్‌ను ఓడించాడు. ఆ తర్వాత మిగిలిన నాలుగు గేముల్లో రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో ఆనంద్ వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆనంద్ టైటిల్ సాధించడం వరుసగా ఇది నాలుగోసారి కాగా, మొత్తం మీద ఐదోసారి. కెరీర్‌లో తొలిసారి 2000 సంవత్సరంలో విశ్వవిజేతగా నిలిచిన ఆనంద్, ఆ తర్వాత 2007, 2008, 2010 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు ప్రపంచ టైటిళ్లు సాధించిన విషయం విదితమే. 2007 నుంచి ఆనంద్ ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతున్నాడు.
టోర్నమెంట్ ఫార్మాట్‌లో ఎనిమిది మంది ఆటగాళ్ల మధ్య 2007లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి టైటిల్ సాధించిన ఆనంద్, ఆ తర్వాత చాలెంజర్లతో నిర్వహించిన చాంపియన్‌షిప్ ఫార్మాట్‌లో రష్యాకు చెందిన వ్లాదిమిర్ క్రామ్నిక్‌ను 2008లోనూ, బల్గేరియాకు చెందిన వాసెలిన్ తొపొలోవ్‌ను 2010లోనూ ఓడించి విశ్వవిజేతగా కొనసాగుతున్నాడు. తాజాగా, గెల్ఫాండ్‌పై సాధించిన విజయంతో ఆనంద్ ఐదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించినట్టయింది. ఈ విజయంతో మొత్తం ప్రైజ్ మనీ (2.55 మిలియన్ల అమెరికా డాలర్లు)లో 55 శాతం మొత్తాన్ని (1.4 మిలియన్ డాలర్లు) ఆనంద్ కైవసం చేసుకోగా, మిగిలిన మొత్తాన్ని గెల్ఫాండ్ దక్కించుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి