17, మే 2012, గురువారం

జగన్ జైలుకెళితే... మంత్రుల అరెస్టూ తప్పదా?

హైదరాబాద్, మే 16: అక్రమ అస్తుల కేసులో కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అరెస్టు అయిన పక్షంలో కొంతమంది మంత్రుల్ని కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో కీలక శాఖల్ని నిర్వహించిన మంత్రుల్లో కొందరి అరెస్టు తప్పదని భావిస్తున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు, కొందరు ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీం నోటీసులు అందుకున్న మంత్రుల్లో కొందరి అరెస్టు అనివార్యంగా తోస్తోందని, జగన్ కేసు బలంగా ఉండాలంటే మంత్రుల అరెస్టు తప్పనిసరి అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ మీద కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం లేదని చెప్పుకునేందుకు అధిష్ఠానవర్గం కూడా మంత్రుల అరెస్టుకు అనుమతి ఇచ్చే అవకాశాలు లేక పోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ హయాంలో రెవెన్యూ శాఖను నిర్వహించిన మంత్రి ధర్మాన ప్రసాదరావును, పెట్టుబడులు, ఓడరేవులు, వౌలిక వసతుల కల్పనా శాఖను నిర్వహించిన మంత్రి మోపిదేవి వెంకట రమణను, ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో వైఎస్ హయాంలో గనుల శాఖను నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను తొలిదశలో అరెస్టు చేయవచ్చునని అనుకుంటున్నారు. ఈ ముగ్గురు మంత్రుల్ని సిబిఐ అధికారులు ఇప్పటికే ఒకసారి విచారించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను, ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరు ఇచ్చిన సమాచారం మేరకు మంత్రి మోపిదేవిని మరోసారి విచారించాలని సిబిఐ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ అంశంపై మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ తనకు సిబిఐ నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని, వస్తే తప్పకుండా వెళతానని చెప్పారు.
జగన్ అరెస్టుపై ఊహాగానాలు
అక్రమ ఆస్తుల కేసులో విచారణను సిబిఐ వేగవంతం చేయడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన జగన్ అరెస్టుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండటంతో ప్రథమ నిందితుడైన జగన్‌ను సిబిఐ ఎప్పుడు అరెస్టు చేస్తుందన్నది చర్చనీయాంశమైంది. జగన్ అక్రమ అస్తుల కేసులో కీలక వ్యక్తి అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను సిబిఐ అరెస్టు చేయడంతో మూడు, నాలుగు రోజుల్లో జగన్‌ను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని కొందరు భావిస్తుండగా, ఈ నెల 28న సిబిఐ కోర్టుకు జగన్ హాజరుకానున్నందున ఆయన్ను తమ కస్టడీలోకి తీసుకునేందుకు సిబిఐ అధికారులు కోర్టును కోరవచ్చునని మరికొందరు అంటున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం అక్రమ ఆస్తుల కేసులో మరికొంతమంది కీలక వ్యక్తులను, ఐఎఎస్ అధికారులను అరెస్టు చేసిన తర్వాతనే జగన్‌ను సిబిఐ అరెస్టు చేయవచ్చునని దీనికి మరికొంత సమయం పట్టవచ్చునని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జగన్ అక్రమాలకు సంబంధించి సాక్ష్యాధారాలను సమగ్రంగా సేకరించిన తర్వాతనే ఆయనను అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో సిబిఐ అధికారులు ఉన్నట్లు తెలిసింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో పారిశ్రామిక వేత్తలు శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులతో పాటు ముగ్గురు ఐఏఎస్ అధికారుల్ని కూడా అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసినట్టే పారిశ్రామిక వేత్తలతో పాటు ఐఎఎస్ అధికారుల్ని కూడా సిబిఐ అరెస్టు చేయనున్నట్లు తెలిసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి