7, మే 2012, సోమవారం

భారత ప్రజల ఆయిల్ ప్రయోజనాలు దెబ్బ తీయనున్న క్లింటన్ పర్యటన


iran-indiaఆది, సోమ వారాల్లో ఇండియా పర్యటించనున్న అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత ప్రజల ఇంధన ప్రయోజనాలను గట్టి దెబ్బ తీయనుంది. తన పర్యటన సందర్భంగా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు మరింత తగ్గించుకోవాలని హిల్లరీ భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేయనుందని క్లింటన్ సహాయకులు చెప్పారు. అమెరికా ఒత్తిడితో ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేస్తుకున్న భారత ప్రభుత్వం అమెరికా మంత్రి ఒత్తిడికి లోగిపోదన్న గ్యారంటీ లేదు. ప్రపంచ ఆయిల్ ధరలతో పోలిస్తే మేలైన ఇంధనాన్ని చౌకగా సరఫరా చేసే ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకున్నట్లయితే భారత ప్రజలకు పెట్రోల్, డీజెల్ ధరలు మరింత పెరగడం ఖాయం.
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. ఆదివారం సాయంత్రానికల్లా ఆమె కోల్ కతా రానున్నది. అనంతరం ఆమె కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. క్లింటన్ పర్యటన ఉద్దేశ్యాలను ఆమెతో ఉన్న సహాయకులు తెలియజేశారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. కోల్ కతా, న్యూఢిల్లీలలో క్లింటన్ ప్రవేటు చర్చలు జరపనున్నట్లుగా సదరు సహాయకులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో, భారత కేంద్ర ప్రభుత్వంతో అమెరికా విదేశాంగ మంత్రి ‘ప్రవేటు చర్చలు’ జరపడమే అభ్యంతరకరం కాగా దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా దేశ ఆయిల్ దిగుమతులను ప్రభావితం చేయాలని చూడడం మరో ఘోరం.
“ధోరణి అనుకూలంగా ఉన్నా, మరింత ప్రగతి సాధిస్తామని వారు గట్టి హామీలు ఇవ్వాల్సి ఉంది” అని క్లింటన్ సహాయకుడిని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. గత కొద్ది కాలంగా సౌదీ అరేబియా నుండి ఆయిల్ దిగుమతులు పెంచుకుని ఇరాన్ ఆయిల్ దిగుమతుల లోటును పూడ్చుకోవడానికి భారత దేశం ప్రయత్నాలు ముమ్మరం చేసిందనీ, మరిన్ని ప్రత్యామ్నాయాలు ఇండియా వెతుక్కోవలసి ఉందనీ సదరు క్లింటన్ సహాయకుడు అన్నాడు.
జనవరి 1 న తాను ప్రకటించిన ఆంక్షలనుండి తప్పించుకోవాలంటే జూన్ లోగా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాలని అమెరికా షరతు విధించింది. ఇరాన్ అణు బాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదంటూ ఆ దేశంపై నాలుగు సార్లు ఐక్య రాజ్య సమితి భద్రతా సమితి ఆంక్షలు విధించేలా అమెరికా, యూరప్ లు ఒత్తిడి చేశాయి. అవి కాకుండా స్వయంగా ఇరాన్ పై అనేక అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్టాలు చేసింది. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టాలను అమలు చేయాలని భారత దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది.
ఇరాన్ పైన అమెరికా, యూరప్ లు విధిస్తున్న ఆంక్షలు పూర్తిగా ఆ దేశాల కంపెనీల ప్రయోజనాలు సంబంధించినవి. ఇరాన్ ఆయిల్ తవ్వుకుని లాభాలు పొందడానికి అమెరికా కంపెనీలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదు. 1979 లో అమెరికా అనుకూల షా ప్రభుత్వాన్ని ఇరాన్ ‘ఇస్లామిక్ విప్లవం’ కూల్చి వేసింది. విప్లవం తర్వాత అమెరికా ఆయిల్ కంపెనీలను ఇరాన్ నుండి తరిమి వేశారు. అప్పటి నుండీ ఇరాన్ ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి అమెరికా, యూరప్ లు ప్రయత్నిస్తున్నాయి. దానికి ఇరాన్ అణు విధానం వాటికి అనువుగా దొరికీంది.
ఇరాన్ అణు బాంబు ప్రపంచ భద్రత కి ప్రమాదం అంటూ అమెరికా, యూరప్ లు ప్రచారం లంకించుకున్నాయి. వేల కొద్దీ విధ్వంసక అణ్వాయుధాలను పోగేసుకున్న అమెరికా, యూరప్ దేశాలు తమ అణ్వాయుధాల వల్ల లేని ప్రమాదం అసలే లేని ఇరాన్ అణు బాంబు వల్ల ఉన్నదని చెప్పడం పెద్ద మోసం. అసలు వాస్తవం అది కాదు. తమ కంపెనీల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అమెరికా, యూరప్ లు అనేక బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడలు అమలు చేస్తాయి. మానవ హక్కులు, బాల కార్మికులు, మహిళా హక్కులు, అణ్వాయుధాలు, ప్రజాస్వామ్యం, నియంతృత్వం లాంటి అంశాలను బ్లాక్ మెయిలింగ్ కోసం అవి వినియోగిస్తాయి. ఇరాన్ కి సంబంధించి అణు విధానాన్ని అమెరికా ఎంచుకుని అమలు చేస్తోంది.
నిజానికి పశ్చిమాసియాలోనే ఉన్న ఇజ్రాయెల్ వద్ద 200 నుండి 300 వరకూ అణ్వాయుధాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒకసారి వెల్లడించాడు. పాలస్తీనా ప్రజలపై దురాక్రమణ జాత్యహంకార విధానాలను అమలు చేస్తున్న ఇజ్రాయెల్, తమ ఉనికికి భంగం కలిగిస్తే తమ అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్ని భస్మీ పటలం చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాంటి ఇజ్రాయెల్ ని అమెరికా, యూరప్ లు వెనకేసుకొస్తూ అసలు అణ్వాయుధమే లేని ఇరాన్ పైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇరాన్ తోటి అమెరికా, యూరప్ లు జరిపే చర్చలు కూడా ఇరాన్ ఆయిల్ చుట్టూనే తిరుగుతాయి. అమెరికా, యూరప్ దేశాలకి చెందిన బహుళ జాతి ఆయిల్ కంపెనీలకు ఇరాన్ లో ప్రవేశం కల్పించినట్లయితే ఆంక్షలు ఎత్తివేయడానికి సిద్ధపడతాయి.
తమ ఆయిల్ కంపెనీల సమస్యని అమెరికా, యూరప్ లు ప్రపంచంపైన రుద్దు తున్నాయి. మా ఆయిల్ మాదే అంటున్న ఇరాన్ దేశ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని భారత దేశం లాంటి దేశాలపైన ఒత్తిడి తెస్తున్నాయి. భారత దేశ ఖనిజ వనరులను విదేశీ ప్రవేటు కంపెనీలకు నిరభ్యంతరంగా అప్పజెపుతున్న భారత పాలకులు అమెరికా ఆంక్షలు అమలు చేయడానికి నిరాకరిస్తారని ఆశించలేము. ఇరాన్ దిగుమతులు తగ్గించుకునేది లేదని ఆయిల్ మంత్రి జైపాల్ రెడ్డి పైకి ఎన్ని చెప్పినా అధికారులకి మాత్రం ఇరాన్ దిగుమతులు తగ్గించుకోవాలని ఆదేశాలిచ్చాడు. ఈ ప్రక్రియని వేగవంతం చేయాలని క్లింటన్ ఒత్తిడి చేయనుంది. 
అంతర్జాతీయ రాజకీయాల వల్ల ఇరాన్ చౌక ధరలకి ఆయిల్ ని మన దేశానికి అందిస్తోంది. అమెరికా ఒత్తిడి వల్ల ఇరాన్ బదులుగా సౌదీ అరేబియా ఆయిల్ ని ఇండియా  దిగుమతి చేసుకోవలసి ఉంటుంది.  కానీ సౌదీ ఆయిల్ ఖరీదు ఎక్కువ. దాని కంటే ఇరాన్ ఆయిల్ మేలు రకం. సీసం పాళ్ళు ఇరాన్ ఆయిల్ లో తక్కువ. అందువల్ల  సౌదీ ఆయిల్ కంటే ఇరాన్ ఆయిల్ వల్ల కాలుష్యం తక్కువగా వెలువడుతుంది. అదీ కాక ఇరాన్ ఆయిల్ రంగంలో ఇండియా గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. కనుక ఇరాన్ ఆయిల్ తగ్గించుకుంటే అది నేరుగా ఇండియా పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇరాన్ ఆయిల్ కి ఇండియా డాలర్లు చెల్లించనవసరం లేదు. రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. ఆ రూపాయిలతో ఇరాన్ మళ్లీ ఇండియా సరుకులు కొనుగోలు చేస్తుంది. కనుక ఇరాన్ ఆయిల్ తగ్గించుకుంటె భారత దేశ విదేశీ వాణిజ్య బిల్లు పెరిగి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి. అంతే కాక వాణిజ్య లోటు మరింత పెరిగి ఫిస్కల్ డెఫిసిట్ పెరగడానికి దారి తీస్తుంది. ఈ విధంగా  మన వేలితో మన కన్నే పొడుచుకునేలా అమెరికా ఒత్తిడి తెసోదన్న మాట. ఒక్క 2011 లోనే అమెరికా ఒత్తిడి వల్ల ఇరాన్ తో 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఇండియా తగ్గించుకుందని పై గ్రాఫ్ ద్వారా అర్ధం అవుతోంది. 
సౌదీ అరేబియా ఆయిల్ ని అధిక ధరలకి కొనడం అంటే అక్కడ ఉన్న పశ్చిమ దేశాల ఆయిల్ కంపెనీల లాభాలు పెంచడమే. ఇప్పటికే సౌదీ అరేబియా ఆయిల్ ని భారత దేశం అధికంగా దిగుమతి చేసుకుంటోంది. దానిని మరింత పెంచడం అంటె దేసంలో మరింత కాలుష్యం పెంచుకోవడంతో పాటు మరింత విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసుకోవడమే. తమ కంపెనీల లాభాలు పెంచడమే అమెరికా విదేశాంగ విధానాల మౌలిక లక్ష్యం.
భారత దేశ పార్లమెంటు ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవడానికి నిరాకరిస్తున్నట్లు అమెరికా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే పార్టీకి మంద బలంతో కూడిన మెజారిటీ అందిస్తే ఇలాంటి విషయాల్లో పార్లమెంటుతో సంప్రదించకుండా ప్రభుత్వాలు చర్యలు అమలు చేస్తాయి. చిన్నదే అయినప్పటికీ కూటమి ప్రభుత్వాల వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయని ఈ సందర్భంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇరాన్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు సంస్కరణలను వేగవంతం చేయడానికి కూడా క్లింటన్ ఒత్తిడి చేయనున్నదని తెలుస్తోంది. ద్రవ్య రంగంలో (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్) విదేశీ పెట్టుబడులపై నిబంధనలు ఎత్తివేయడం, రిటైల్ రంగంలో విదేశీ కంపెనీల అనుమతి లాంటి నిర్ణయాలు చేయాలని క్లింటన్ కోరనుంది. సంస్కరణలు వేగవంతం చేయడం అంటే విదేశీ కంపెనీలకే ప్రయోజనం తప్ప భారత ప్రజలకు కాదని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి