8, మే 2012, మంగళవారం

ఇరాన్ ఆయిల్ దిగుమతులు ఇండియా తగ్గించాల్సిందే -హిల్లరీ హుకుం


Hillary visits India May 6ఇండియా, ఇరాన్ నుండి చేసుకుంటున్న ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాల్సిందేనని అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ హుకుం జారీ చేసింది. ఇరాన్ దిగుమతులను ఇప్పటికే గణనీయంగా తగ్గించుకున్నందుకు హర్షం వ్యక్తం చేసిన హిల్లరీ, అది చాలదనీ, ఇంకా తగ్గించుకోవాలని కోరింది. ‘ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునేది లేదని’ జనవరిలో పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఒట్టిదేనని హిల్లరీ హర్షం స్పష్టం చేసింది. ఆ రకంగా బహిరంగంగానే ఇండియాకి ఆదేశాలిస్తున్న హిల్లరీని ‘అదేమని’ ప్రశ్నించిన భారతీయ విలేఖరులే లేకపోవడం విచారకరం.
ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునే విషయంలో భారత్ “ఇంకా చేయాల్సింది చాలా ఉంది” అని హిల్లరీ వ్యాఖ్యానించింది. ఇరాన్ అణు కార్యక్రమం ‘శాంతియుత ప్రయోజనాలకే’ అని రుజువు చేసుకోవాలంటే ఆ దేశంపై మరిన్ని ఆంక్షలతో ఒత్తిడి పెంచక తప్పదని ఆమె వ్యాఖ్యానించింది. ఇండియా ఆయిల్ ఉత్పత్తి చేసుకునే దేశం కాకపోయినప్పటికీ ఇరాన్ దిగుమతులను ఇండియా ఎందుకు తగ్గించుకోవాలంటున్నదని విలేఖరులు అడిగిన ప్రశ్నకు హిల్లరీ ఈ సమాధానం ఇచ్చింది. ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకునేలా ఒత్తిడి చేయడమే హిల్లరీ పర్యటనకు ప్రధాన లక్ష్యమని ‘ది హిందూ’ తెలిపింది.
ఇరాన్ అణు విధానం పశ్చిమాసియాలో అస్ధిరతకు కారణమని హిల్లరీ అన్నది. ఇరాన్ అణు బాంబు ప్రపంచానికి ‘వినాశకరం’ అని ఆమె వ్యాఖ్యానించింది. ఇరాన్ తన ప్రవర్తన మార్చుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుతోందనీ అందుకే ఆ దేశంపై ఒత్తిడి పెంచాలనీ హిల్లరీ అన్నది. ఇరాన్ విషయంలో ఇండియా చేయగలదేమిటని ప్రశ్నించగా హిల్లరీ అహంభావ పూరితంగా సమాధానం ఇచ్చింది. “ఇండియా అంతదూరం తీసుకెళితే మేము ఆమోదించం. వాళ్ళు ఇంకా చేస్తారని మేము ఆశిస్తున్నాం. సౌదీ అరేబియా, ఇరాన్ ల నుండి సరిపోయినంత ఆయిల్ సరఫరా ఉందని నమ్ముతున్నాం. అంతర్జాతీయ సమాజంలో ఇది ఇండియా పోషించవలసిన పాత్ర అని భావిస్తున్నాం” అని హిల్లరీ అన్నది.
జూన్ నెల లోపు అమెరికా ఆదేశించిన మొత్తంలో ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులు తగ్గించాలని హిల్లరీ డిమాండ్ చేస్తున్నది. అమెరికా చట్టం ప్రకారం కనీసం 15 శాతం మేరకు దిగుమతులు తగ్గించుకోవాలని గతంలో ‘డెయిలీ మెయిల్’ పత్రిక తెలియజేసింది. రోజుకు 4.25 లక్షల బ్యారేళ్ళ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియా అమెరికా షరతు ఆమోదిస్తే దానిని 3,61,000 బ్యారేళ్ళకు తగ్గించుకోవాలన్నమాట. రోజుకి 63,750 బ్యారేళ్లు దిగుమతి తగ్గించుకోవడం అంటే అది ఇండియా ఆయిల్ బిల్లుని అమాంతం పెంచేస్తుంది.
ఇరాన్ ఆయిల్ కోసం ఇండియా చేసే చెల్లింపుల్లో 45 శాతం రూపాయిల్లో చెల్లించే ఒప్పందం ఇండియా, ఇరాన్ లు చేసుకున్నాయి. ఆ రూపాయిలతో ఇరాన్ మళ్ళీ ఇండియా సరుకులు కొంటుంది. అంటే ఇరాన్ కి చెల్లించే ఆయిల్ డబ్బుల్లో 45 శాతం మనకి తిరిగి వస్తాయన్నమాట. ఇంతకంటే ఆకర్షణీయమైన వాణిజ్య ఒప్పందం మరొకటి ఉండబోదు. అంతర్జాతీయ వాణిజ్యంలో అనధికారిక విదేశీ మారక ద్రవ్యం అయిన డాలర్లకు ఎక్కువ విలువ ఉంటుంది. అలాంటి డాలర్లకు బదులు రూపాయిలు చెల్లించే సువర్ణావకాశం ఇరాన్ ఇండియాకి కల్పిస్తోంది. పైగా వాటితో ఇండియా సరుకులు కొంటోంది. ఈ అవకాశాన్ని రద్దు చేసుకోవాలని హిల్లరీ ఇండియాని దబాయిస్తోంది.
ఇరాన్ ఆయిల్ తగ్గించుకుంటే ఆ మేరకు ఇండియా సరుకుల్ని ఇరాన్ కొనుగోలు చేయదు. అంటే మన ఎగుమతులు తగ్గిపోతాయి. ఎగుమతులు తగ్గిపోవడమే కాక అధిక ధర పెట్టి సౌదీ ఆయిల్ కొంటే దిగుమతుల విలువ కూడా పెరుగుతుంది. అంటే రెండు వైపులా (ఎగుమతులు పెరగడం, దిగుమతులు తగ్గడం) ఇండియా వాణిజ్య లోటు పెరుగుతుందన్న మాట. వాణిజ్య లోటు పెరగడం అంటే ఇండియా విదేశీమారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడమే. ఇండియా లాంటి దేశాలు చచ్చీ చెడీ విదేశీ మారక ద్రవ్య నిల్వలని కూడబెడుతూ ఉంటాయి. అలాంటి నిల్వలను వాణిజ్య లోటు హారతి కర్పూరంలో హరించేస్తాయి.
సౌదీ ఆయిల్ కొనాలని హిల్లరీ చెప్పడం అంటే సౌదీలో తమ కంపెనీలు ఉత్పత్తి చేసే ఆయిల్ కొనాలని పరోక్షకంగా చెప్పడమే. అమెరికా ఆంక్షలు ఇరాన్ అణు విధానం కి సంబంధించినవి కావని, దాని కంపెనీల సరుకులు అమ్ముకోవడమే ఆంక్షల ప్రధాన లక్ష్యమని దీన్ని బట్టి స్పష్టం అవుతోంది. అణు బాంబులే లక్ష్యం అయితే ఇరాన్ కి అణు బాంబులు నిర్మించే సామర్ధ్యం లేదని అమెరికా గూఢచారి వర్గాలు తేల్చేసాయి. ఇరాన్ అణు బాంబు నిర్మించడం లేదని ఇజ్రాయెల్ గూఢచార వర్గాలతో పాటు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి కూడా ఇటీవల ధ్రువపరిచాడు. ఇక లేని ఇరాన్ అణు బాంబు కోసం ఇండియా ఆయిల్ దిగుమతులు తగ్గించుకుని తన వాణిజ్య లోటుని ఎందుకు పెంచుకోవాలి?
అదీ కాక దేశ రక్షణ కోసం ఒక్క అణుబాంబులే కాదు, ఏ బాంబులయినా తయారు చేసుకునే హక్కు ప్రతి దేశానికీ ఉంటుంది. అణు గూండాయిజానికి బలవుతోంది ఒక్క ఇరాన్ మాత్రమే కాదు. ఇండియా కూడా గత నలభై యేళ్లుగా అమెరికా, యూరప్ దేశాల అను గూండాయిజాన్ని ఎదుర్కొంటోంది. ఇందిరా గాంధీ నేతృత్వంలో అణు పరీక్ష జరిపాక భారత దేశానికి ఏ దేశమూ అణు ఇంధనం గానీ, అణు రియాక్టర్లు గానీ, ఇతర అణు పరికరాలు గానీ అమ్మకుండా అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించాయి. దాని వల్ల ఇండియా తానే అణు టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని అమెరికా, యూరప్ ల ఆంక్షలు సోదిలోకి కూడా రావని చాటి చెప్పింది. నాలుగు దశాబ్దాల పాటు అణు గూండాయిజం ఎదుర్కొన్న ఇండియా మరో బాధితురాలు ఇరాన్ కి తోడు నిలవాలసిన కనీస బాధ్యత ఉంటుంది. కానీ భారత పాలకులు ఇది కూడా ఆలోచించే స్ధితిలో లేరని హిల్లరీ సర్టిఫికేట్ బట్టి అర్ధం అవుతోంది.
అమెరికా, యూరప్ ల ఒత్తిడి తోటి భద్రతా సమితి నాలుగు సార్లు ఇరాన్ పైన ఆంక్షలు విధించాయి. అవి కాక అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు స్వయంగా కొన్ని చట్టాలు చేసి వారి చట్టాలు అమలు చేయాలని ఇండియా పైన ఒత్తిడి తెస్తున్నాయి. స్వతంత్ర దేశాల పైన ఆంక్షలు విధించడం సరికాదన్నది ఇండియా విదేశాంగ విధానం. కనీసం తన విధానాన్ని అమలు చేసినా అమెరికా ఆంక్షలను ఇండియా గట్టిగా తిరస్కరించాలి. అలీనోద్యమం ద్వారా ఇండియా సాధించుకున్న పరువు ప్రతిష్టలు ప్రస్తుత పాలకులు ఆంక్షలకు లొంగడం ద్వారా మసకబారుస్తున్నారు. ఈ విధానాన్ని భారత పాలకులు విడిచి పెట్టి భారత దేశం స్వతంత్ర దేశమనీ, పెత్తందారీ దేశాల పెట్టణాన్ని అంగీకరించేది లేదనీ చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.

1 కామెంట్‌: