8, మే 2012, మంగళవారం

హజ్ సబ్సిడీ రద్దు చేసిన సుప్రీం కోర్టు

mecca_haj‘హజ్’ యాత్రకు వెళ్ళే ముస్లిం ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడాన్ని మంగళవారం సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మరో పదేళ్ళలో ‘హజ్’ సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలని తీర్పు నిచ్చింది. మతపరమైన యాత్రలకు సబ్సిడీలు ఇవ్వడం ‘చెడ్డ మతాచారం’ గా అభివర్ణించింది. యాత్రీకులకు తోడు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారిక డెలిగేషన్స్ పంపిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ద్వారా ‘హజ్’ యాత్ర ను రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడింది.
“ఈ విధానాన్ని అంతం చేయాలని అభిప్రాయపడుతున్నాం” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. జస్టిస్ ఆల్టమాస్ కబీర్, రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన బెంచి ఈ తీర్పునిచ్చింది. ‘హజ్ కమిటీ ఆఫ్ ఇండియా’ పని విధానాన్ని, హజ్ యాత్రకు యాత్రీకులను ఎన్నికునే పద్ధతినీ పరిశీలిస్తానని బెంచి తెలిపింది. ప్రధాన మంత్రి ‘గుడ్ వెల్ డెలిగేషన్’ సభ్యుల సంఖ్యను రెండుకి తగ్గించాలని కూడా బెంచి పేర్కొంది.
బోంబే హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. 11,000 మంది హజ్ యాత్రీకులలో వి.ఐ.పి లు గా గుర్తించిన 800 మంది ప్రయాణ ఏర్పాట్లను చూడడానికి ప్రవేటు ఆపరేటర్లను అనుమతించాలని విదేశీ మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ బోంబే హై కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాలు చేయగా అసలు హజ్ సబ్సిడీ యే రద్దు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం కోర్టు పిటిషన్ విచారణ పరిధిని విస్తృతపరిచింది. హజ్ యాత్రీకులకు సబ్సిడీ ఇచ్చే విధానాన్ని మొత్తంగా పరిశీలించాలని బెంచి నిర్ణయించి విచారణ జరిపింది.
తన విధానాన్ని కేంద్రం సమర్ధించుకుంది. యాత్రీకులకు తమ జీవిత కాలంలో ఒక్కసారే సబ్సిడీ ఇచ్చేలా మార్గదర్శక సూత్రాలు అమలు చేశామని తెలిపింది. గతంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి సబ్సిడీ ఇవ్వాలని నిబంధన ఉండగా దానిని జీవిత కాలంలో ఒకసారికి తగ్గించామని తెలిపింది. అంతవరకూ హజ్ కి వెళ్లని వారికి మొదటి ప్రాధామ్యం ఇచ్చేలా నిబంధనలు మార్చామని తెలిపింది. అయితే 2012 లో ఎంత సబ్సిడీ ఇస్తున్నదీ కేంద్రం వెల్లడించలేదు. యాత్ర పూర్తయ్యాకే ఎంతో తేలుతుందని చెప్పి తప్పించుకుంది.
అసలు యాత్రీకుల వెంట వెళ్లడానికి అధికారికంగా డెలిగేషన్ పంపండం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. “ఈ గుడ్ విల్ డెలిగేషన్స్ ని మొత్తంగా రద్దు చేయాలి. అవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 9, 10 సభ్యుల బృందం కూడా అవసరం లేదు” అని బెంచి అభిప్రాయపడింది.
భారత రాజ్యాంగాన్ని సెక్యులర్ రాజ్యాంగంగా రాజ్యాంగ నిర్మాతలు రూపుదిద్దినప్పటికీ భారత ప్రభుత్వాలు మతపరమైన విధానాలకు ఎన్నడూ దూరంగా ఉన్న పాపాన పోలేదు. ఓట్ల కోసం వివిధ మతాలకు అనుకూలంగా నిర్ణయాలు అమలు చేస్తూ వచ్చాయి. మైనారిటీల సంరక్షణ పేరుతో ముస్లిం మత ఛాందసులను ఆకర్షించే విధానాలను అనుసరిస్తూ వచ్చాయి. ఓ వైపు హిందూ మతాచారాలను అన్నిరకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో అవలంబిస్తూ మరో వైపు మైనారిటీ మతస్ధులను ఆకర్షించే ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగించాయి. ఏ మతానికీ ప్రోత్సహించకూడదన్న సెక్యులర్ సూత్రం ఆచరణలో ‘అన్నీ మతాలనూ’ ఆకర్షించే సూత్రంగా రాజకీయ పార్టీలు మార్చివేశాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి