అమ్మా నాన్నలు ఐఏఎస్ అధికారులు! ఇంకేం? సివిల్స్‌ను నా కెరియర్‌గా ఎంచుకోవటం చాలా సహజమని అందరూ ఊహించారు. కిందటి సంవత్సరం సివిల్స్‌లో 90వ ర్యాంకు తెచ్చుకోగానే సివిల్స్‌లో చేరటం 'బాల్యం నుంచీ నా కల' అయివుంటుందని చాలామంది అంచనాకు వచ్చారు!
కానీ వాస్తవం వేరు. సివిల్స్ ఆలోచన నాకు కలిగింది కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే... ప్రైవేటు రంగంతో సంబంధం ఏర్పడిన తర్వాతే!
పాఠశాల చదువు ఒకచోటే ఉండటం మంచిదని సాధారణ అభిప్రాయం. అమ్మానాన్నల బదిలీల మూలంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా పాఠశాలల్లో నేను చదవాల్సివచ్చింది. ఇలా వివిధ ప్రాంతాలు మారటం నాకు మేలే చేసింది. ప్రతి స్కూల్లోనూ విభిన్న వాతావరణం, సదుపాయాల్లో తేడాలు, రకరకాల మనుషులు, ఉపాధ్యాయులు... విస్తృత అనుభవాలు సంపాదించుకోగలిగాను. ఐఏఎస్‌ను సాధించాలనే అభిలాషకు ఇవి అంతర్లీనంగా పనిచేశాయనిపిస్తుంది. ఈ వృత్తిలోనే కదా వైవిధ్యకరమైన అనుభవాలకు ఆస్కారముండేది... నిస్సారమైన క్షణాలకెప్పుడూ తావుండనిది!
ఐఐటీలో బీటెక్
బేగంపేట- హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్లో 1998లో నా పదో తరగతి పూర్తయింది. తర్వాత రత్న జూనియర్ కాలేజీలో చేరాను. ఐఐటీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ (ఎలక్ట్రికల్)లో ప్రవేశించాను. ఇంజినీరింగ్ పూర్తయ్యాక కొద్దికాలం ఓ ప్రముఖ సంస్థలోని పరిశోధన విభాగంలో పనిచేశాను. నా అర్హతలు పెంచుకోవాలని నిర్ణయించుకుని 2008లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లో చేరాను... మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌లో!
ఐఎస్‌బీ అంటే తెలిసిందే కదా? అక్కడి గ్రాడ్యుయేట్లలో చాలామంది భారీ వేతనాలతో ప్రైవేటు కొలువుల్లో చేరిపోతుంటారు. ఇక్కడే సివిల్ సర్వీసెస్ గురించి ఆలోచనలు నాలో మొదలయ్యాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం 'ఉద్యోగ భద్రత' గురించి దృష్టిపెట్టేలా చేసిందనుకోండీ. అమ్మానాన్నలతో చర్చించాను. నిర్ణయాన్ని నా విచక్షణకే వారు వదిలేశారు.
ప్రైవేటు ఉద్యోగంలో చేరకపోవటం వల్ల విలువైన సమయాన్నీ, అనుభవాన్నీ కోల్పోతున్నానని తెలుసు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కొలువుల్లో చేరనివారికి ఒకటి రెండు సంవత్సరాల తర్వాత తగిన ఉపాధి అవకాశాలుండవు కదా!
అయినప్పటికీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమై, అత్యుత్తమంగా రాయాలని నిర్ణయించుకున్నాను!
పరీక్ష రాయాలని నిశ్చయించుకున్నాక నా మేనేజ్‌మెంట్ తరగతుల్లో సంపాదించిన పరిజ్ఞానంపై ఆధారపడ్డాను. Why winners winగురించి చాలా సెషన్లు జరిగేవి. వీటన్నిటిలోనూ ఒక వాస్తవం కనపడేది. విజేతలందరూ తామెంచుకున్న రంగాల్లో నిపుణులు. బాగా కష్టపడతారు. మౌలికాంశాలను విస్మరించరు.
విపరీతమైన పోటీ ఉండే సివిల్స్ పరీక్ష రాయదల్చినపుడు అభ్యర్థికి సరైన వాతావరణం, సరైన mentor ఉండాలి. ఢిల్లీలో కొన్ని ఇన్‌స్టిట్యూషన్లు చూశాను కానీ హైదరాబాద్ వాతావరణమే సౌకర్యంగా ఉంటుందనిపించింది. అన్నిటికీ మించి ఒక Mentorను ఎంచుకోవటం ముఖ్యమనేది తెలిసింది. అంటే... మన ఎదుగుదలపై నిజమైన ఆసక్తి ఉండి శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రేరణను అందించగలిగే వ్యక్తి! ఆ వ్యక్తి తండ్రి కావొచ్చు, పొరుగు వ్యక్తి, అధ్యాపకుడు, స్నేహితుడి తండ్రి.. ఎవరైనా కావొచ్చు. స్నేహితుల సలహా మేరకు బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణను కలిశాక, నా mentorను ఆయనలో గుర్తించాను.
సుదీర్ఘంగా సాగిన కౌన్సెలింగ్‌లో ఆప్షనల్స్‌ను ఎంచుకోవటం చాలా కీలకమని ఆయన వివరించారు. లాభనష్టాలను బేరీజు వేసుకుని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రపాలజీలను ఎంచుకున్నాను. మొదటి సబ్జెక్టు- పరీక్ష తీరు, జనరల్‌స్టడీస్‌ను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. రెండో సబ్జెక్టు- సమాజాన్నీ, దాని సమస్యలను ఆకళింపు చేసుకోవటానికి ఉపకరించింది. అదీ గాక రుజువైన 'ట్రాక్ రికార్డు', తక్కువ సమయంలో చాలామంది విద్యార్థులు అర్హత సాధించిన చరిత్ర ఈ సబ్జెక్టులకుంది. ఈ ఆప్షనల్స్‌ను తీసుకుని తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించిన కార్తికేయ మిశ్రా (IIM Ahmedabad)నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు రెంటికీ ఉమ్మడి విధానంలో శిక్షణ తరగతులకు హాజరయ్యాను. ఐదు నెల్లకంటే ఎక్కువ సమయం కోచింగ్‌కి హాజరవ్వటానికి కేటాయించదల్చలేదు. ఎందుకంటే... ఈ పరీక్షకు spoon feeding కంటే స్వీయ సన్నద్ధతే ముఖ్యమని నాకు తెలుసు. అందుకే ఐదు నెల్ల శిక్షణ తర్వాత ప్రిలిమినరీకి సొంత టైమ్ టేబుల్ తయారు చేసుకున్నాను.
నా మొదటి ప్రయత్నంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా కృషి చేయాల్సివచ్చింది. ప్రిలిమినరీ కోసం సూక్ష్మ అంశాలను సైతం అవగాహన చేసుకోవాలి కదా! (ఆ ఏడాది ప్రిలిమ్స్‌లో ఒక ఆప్షనల్, జనరల్ స్టడీస్ ఉన్నాయి). ఆప్షనల్ కవర్ చేశాక, జనరల్ స్టడీస్‌మీద దృష్టి పెట్టాను.
ప్రిలిమినరీ నెగ్గాను.
తర్వాత వెంటనే ఆంత్రపాలజీపై మనసు కేంద్రీకరించాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రపాలజీలకు సంబంధించి writing practiceఎంతో చేశాను. మౌలిక పాఠ్యపుస్తకాలపై, ఆప్షనల్స్ స్టడీ మెటీరియల్‌పై ఆధారపడ్డాను. జనరల్‌స్టడీస్‌లో పదాల పరిమితి, ప్రశ్నపత్రం తీరు ముందుగా తెలియదు కాబట్టి ఆ ప్రిపరేషన్‌ను ఆ open ended గానే సాగించాను. అదృష్టవశాత్తూ ఆప్షనల్స్‌లో ఎక్కువ ప్రశ్నలు అంచనాల మేరకే వచ్చాయి. తేలిగ్గానే వాటికి జవాబులు రాశాను.
మెయిన్స్ ఫలితాలు వచ్చాక ఇంటర్వ్యూకు సిద్ధమయ్యాను. బయోడేటా, కరంట్ అఫైర్స్‌పై సన్నద్ధమవ్వాలనే సూచన పాటించాను. రెండు నమూనా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. 'ఏం చెపుతున్నావన్నది కాకుండా ఎలా చెపుతున్నావన్నదే ప్రధానం' అని నా mentorపదేపదే చెప్పారు. నిజాయతీగా ప్రవర్తించటం కూడా ముఖ్యమనేది మరో అంశం. ఈ వ్యూహం ఫలించి నా తొలి ప్రయత్నంలో 90వ ర్యాంకు సాధించాను. (ఆప్షనల్స్‌లో బాగా స్కోర్ చేశాను. ఇంటర్వ్యూలో 330కు 230 మార్కులు వచ్చాయి.) ఐఏఎస్‌కు అర్హత పొందుతానని భావించాను. అయితే 'రిస్క్' తీసుకోవద్దన్న సలహా మేరకు మళ్ళీ ప్రిలిమినరీకి సిద్ధమయ్యాను. అదే మంచిదైంది. ఎందుకంటే... మూడు మార్కుల తేడాతో ఐఏఎస్ తప్పిపోయి, ఐపీఎస్ వచ్చింది.
ఆగస్టులో ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. అక్టోబర్లో మెయిన్స్. రెండోసారి మెయిన్స్ రాయటం మొదటిసారంత కష్టమనిపించలేదు. తొలి ప్రయత్నంలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడింది. జనరల్‌స్టడీస్ కోసం ప్రాథమికాంశాలను మరోసారి సరిచూసుకున్నాను; కరంట్ అఫైర్స్ చదువుతూపోయాను. మెయిన్స్ రాసి, సర్దార్ వల్లభాయ్‌పటేల్ పోలీస్ అకాడమీ (హైదరాబాద్)లో ప్రవేశించాను.
పోలీస్ సర్వీసెస్‌లో శిక్షణ అద్భుతమైన అనుభవం. శారీరకంగా, మానసికంగా అవసరమైన క్రమశిక్షణను ఇది అందిస్తుంది. నా శిక్షణను చాలా ఆస్వాదిస్తూ వచ్చా. మార్చిలో మెయిన్స్ ఫలితాలు ప్రకటించారు. ఐపీఎస్ కఠోర శిక్షణ మూలంగా ఇంటర్వ్యూకు తక్కువ సమయం చిక్కినా స్వీయ క్రమశిక్షణ నా ప్రిపరేషన్ ప్రణాళికకు సహాయపడింది. ఇంటర్వ్యూలో factual based questionsఅడిగారు. అడిగిన ప్రశ్నలకు న్యాయం చేసేలా జవాబులు చెప్పాననుకుంటున్నాను. అందుకే దేశంలో అత్యుత్తమ పది ర్యాంకర్లలో ఒకడిగా నిలిచాను. అభ్యర్థులందరికీ నా సలహా ఒకటే. పరీక్షపై సరైన దృక్పథం పెంచుకోండి. అది పరీక్షలో మీ ర్యాంకును/ విజయాన్ని నిర్ణయిస్తుంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి