24, మే 2012, గురువారం

1250 కోట్ల అదనపు భారం


  • రాష్ట్ర ప్రజలపై పేలిన పెట్రోబాంబు బ సర్కారుకు కాసుల పండగ
  • నాలుగువేల కోట్లకు చేరనున్న ఆదాయం
అతని పేరు రంగయ్య. సగటు మధ్య తరగతి జీవి. నెలకు 20 లీటర్ల పెట్రోలు వినియోగిస్తాడు. ఇప్పటివరకు నెలకు సుమారుగా 1500 రూపాయలు అతను పెట్రోలు కోసం ఖర్చు చేస్తున్నాడు. పెట్రోఛార్జీల పెంపు నిర్ణయంతో ప్రతి నెల అదనంగా సుమారు 150 రూపాయల మొత్తాన్ని పెట్రోలు కోసం ఖర్చు చేయక తప్పనిస్థితి నెలకొంది. అంటే ప్రస్తుతం సంవత్సరానికి 18వేల రూపాయలవుతున్న పెట్రోలు ఖర్చు ఇకపై 19,800 రూపాయలకు చేరనుంది. ఎప్పుడైనా అదనంగా వినియోగించాల్సివస్తే ఈ మొత్తం 20వేల రూపాయలకు చేరుకుంటుంది.

ఇది ఒక్క రంగయ్య పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వినియోగదారులపై 1250 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. ధరల పెంపునకు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ప్రజానీకంపై ఒక్కసారిగా పెట్రో బాంబు పేలింది. సాధారణ ప్రజానీకంపై పడిన ఈ భారం రాష్ట్ర సర్కారుకు మాత్రం కాసులవర్షాన్ని కురిపించనుంది. రాష్ట్ర ఖజానాకు పెట్రోలు విక్రయాల నుండి వ్యాట్‌ రూపంలో వస్తున్న ఆదాయం ఏకంగా 4వేల కోట్లకు చేరనుంది. ప్రస్తుతం ఈ మొత్తం దాదాపుగా 3700 కోట్ల రూపాయలు ఉంది. రాష్ట్రంలో పెట్రోల్‌పై భారీ మొత్తంలో వ్యాట్‌ వసూలు చేస్తుండటమే దీనికి కారణం. 33శాతం మొత్తాన్ని వ్యాట్‌ రూపంలో వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఛార్జీలు పెరిగిన ప్రతిసారి కాసుల పండగ చేసుకుంటుంది. వ్యాట్‌ను తగ్గించాలంటూ ప్రజానీకం చేస్తున్న విజ్ఞప్తిని సర్కారు బేఖాతరు చేస్తోంది.

భారం ఇలా ...!

రాష్ట్రంలో ప్రస్తుతం ఏడాదికి సుమారుగా 15లక్షల కిలోలీటర్ల పెట్రోలును వినియోగిస్తున్నారు. జిల్లా జిల్లాకు ధరల్లో తేడా ఉన్నప్పటికీ సగటున 73 రూపాయలకు లీటరు పెట్రోలు ప్రస్తుతం లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 6.28 రూపాయలను లీటరుకు పెంచుకోవడానికి కంపెనీలకు అనుమతించింది. దానికి అదనంగా 33శాతం వ్యాట్‌ కలపడంతో మరో 2.07 కలిసి మొత్తం రూపాయలు ప్రతిలీటరుపైనా అదనంగా పడనుంది. అంటే ప్రతిలీటర్‌పైనా 81 రూపాయలు తప్పనిసరిగా ఖర్చు చేయాలని పరిస్థితి నెలకొంది. జిల్లాల వారిగా కొంత తేడా ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం పెంచుకోవడానికి అనుమతించిన 6.28 రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం అదనంగా 942 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 33శాతం వ్యాట్‌తో రాష్ట్ర ప్రభుత్వం మరో 310.50 కోట్ల రూపాయల మేర ప్రజానీకం జేబుకు చిల్లుపెడుతోంది. మొత్తంమీద పెట్రోధరల పెంపుతో ప్రజానీకంపై పడే భారం 1250కోట్ల రూపాయలకు చేరింది. రాష్ట్ర ఖజానాకు ఇప్పటికే చేరుతున్న 3700 కోట్ల రూపాయల మొత్తం 4వేల కోట్లకు చేరనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి