6, మే 2012, ఆదివారం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయతే 16.4 లక్షల ఎకరాలకు నీరు


  • 05/05/2012
హైదరాబాద్, మే 5: తెలంగాణలోని ఏడు జిల్లాల బీడు భూములు సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ళ భారీ ప్రాజెట్టుపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరగడం చారిత్రాత్మకమని సమాచార, సాంకేతికశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం, బిజెపిలు విమర్శలు చేయడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణమని మంత్రి ఆరోపించారు. ఇది ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకమన్నారు.
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే తెలంగాణ జిల్లాల్లో 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అలాగే జంట నగరాలకు తాగునీటితో పాటు వివిధ పరిశ్రమలకు నీరు అందించవచ్చునని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు మహారాష్టల్రో జరుగుతాయని అయితే సాగునీరు మాత్రం మన రాష్ట్రానికి వస్తాయని మంత్రి తెలిపారు. శనివారం ఢిల్లీలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుపై ఒప్పందాలు జరగడం శుభ పరిణామం అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిపాలనా, న్యాయ, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుని సుప్రీంకోర్టు ఆదేశాలతో గేట్ల నిర్మాణాన్ని ఆపించామన్నారు.
2008లో ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసినా టిడిపి, బిజెపి అప్పటి ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించాయని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తించారని చెప్పారు. హంద్రీ - నీవా ప్రాజెక్టులో పనులు దక్కించుకోవడానికి భాను బెదిరించి కాంట్రాక్టులు తనకు అనుకూలంగా ఇప్పించినట్లు సిఐడి చేసిన ప్రకటనపై మంత్రి జవాబిస్తూ నాకు తెలిసి అక్కడ సింగిల్ టెండర్లు రాలేదని ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికే పనులు అప్పచెప్పామని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి దోహదం
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఒప్పందం కుదిరేందుకు చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజతలు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించడానికి ప్రయత్నించిన సిఎం కిరణ్‌ను మంత్రి అభినందించారు. దాదాపు 38,500 కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒప్పందానికి సహకరించిన మహారాష్ట్ర సిఎం పృథ్వీరాజ్ చౌహాన్‌కు కృతజతలు చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి