2, మే 2012, బుధవారం

ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో పెరుగుతున్న కుటుంబ హింస


 
ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో కుటుంబ హింస పెరుగుతోందని పోలీసుల సర్వే తెలియజేసింది. ఆర్ధిక పరిస్ధితులు చట్టాల అమలుపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయంపై అమెరికాకి చెందిన ‘పోలీస్ ఎక్సిక్యూటివ్ రీసెర్చ్ ఫోరం’ రెగ్యులర్ గా సమీక్ష జరుపుతుంది. సర్వేలో ప్రతిస్పందించిన 700 సంస్ధలలో 56 శాతం ‘పూర్ ఎకానమీ’ వల్ల కుటుంబ హింస పెరిగిందని తెలిపాయి. ఇది 2011 సంవత్సరం లోని పరిస్ధితి కాగా 2010 లో 40 శాతం సంస్ధలు సంక్షోభ పరిస్ధితులు కుటుంబ హింసను తీవ్రతరం చేశాయని తెలిపాయి.
ఎఫ్.బి.ఐ సాంవత్సరిక క్రైమ్ రిపోర్టు లో కుటుంబ హింస కోసం ప్రత్యేక కేటగిరీ లేదనీ, అయినా మొత్తంగా హింసాత్మక నేరాలు తగ్గుముఖం పట్టినట్లు ఎఫ్.బి.ఐ రిపోర్టు ద్వారా తెలుస్తోందని యు.ఎస్.ఏ టుడే పత్రిక తెలిపింది. కానీ కుటుంబ హింస ఫిర్యాదులకు స్పందించవలసిన అవసరం పోలీసులకు పెరిగిందని సర్వేను ఉటంకిస్తూ పత్రిక తెలియజేసింది. ఉదాహరణకి న్యూజెర్సీ పోలీసుల ప్రకారం కాండేన్ లో 2010 లో 7500 ఫిర్యాదులు అందుకోగా, 2011 వాటి సంఖ్య 9100 కి పెరిగింది. కాండేన్ పోలీసు చీఫ్ స్కాట్ ధాంసన్ ప్రకారం 19 శాతం నిరుద్యోగం ఉన్న కాండేన్ లో కుటుంబాల విచ్ఛిన్నంలో ఆర్ధిక వ్యవస్ధ ప్రభావాన్ని వేరు చేయడం “అసాధ్యం” అని పత్రిక తెలిపింది.
మమ్మల్నీ ఇళ్ళకి పంపారు
2010 తో పోలిస్తే కుటుంబ సంబంధిత హింసాత్మక దాడులు 2011 లో 10 శాతం పెరిగాయని ధాంసన్ తెలిపాడు. కుటుంబ హింస ఫిర్యాదులకు పోలీసులు నానాటికీ అధిక సంక్ష్యలో పోలీసులను కేటాయించ వలసిన అవసరం పెరిగిందని ఆయన తెలిపాడు. పోలీసుల సంఖ్య పెంచడంతో పాటు అధిక సమయం కూడా కేటాయించవలసి వస్తోందని అందువల్లనే కుటుంబ హింస ఫిర్యాదులపై అధ్యయనం చేయాల్సిన అవసరం తలెత్తిందనీ ధాంసన్ తెలిపాడు. గత రెండేళ్లలో తమ పోలీసుల్లోనే 200 మందిని ఇళ్లకు పంపారనీ దానితో ఫిర్యాదులకి హాజరు కావడం కూడా భారంగా మారిందని ఆయన తెలిపాడు.
“ఆర్ధిక కష్టాల వల్లా, నిరుద్యోగం వల్లా కుటుంబాల్లో ఒత్తిడిలు పెరిగినపుడు అది కుటుంబ హింస పెరగడానికి దారి తీస్తోంది. వీధుల్లో కూడా దాన్ని చూస్తున్నాము” అని దాంసన్ ని ఉటంకిస్తూ యు.ఎస్.ఏ టుడే తెలిపింది. యూజీన్, ఒరే పోలీస్ చీఫ్ పీట్ కేర్న్స్ ప్రకారం అమెరికా ఆర్ధిక సంక్షోభం, నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి ల వల్ల తలెత్తిన ఆర్ధిక సమస్యలతో కుటుంబాల్లో దాడులు పెరిగాయని స్పష్టమయింది. 2010 లో ఆగ్రెవేటేడ్ దాడులు 188 నమోదు కాగా 2011 లో వీటి సంఖ్య 234 కి పెరిగిందనీ, చిన్న చిన్న దాడులు 1440 నుండి 1552 కి పెరిగాయనీ ఆయన తెలిపాడు. నైట్ క్లబ్బు ల్లాంటి చోట్ల హింసాత్మక దాడులు పెరగడంతో పాటు రెసిడెన్సియల్ కమ్యూనిటీలలో కూడా అధిక సంఖ్యలో దాడులపై ఫిర్యాదులు అందుతున్నాయని కేర్న్స్ తెలిపాడు.
2009 నాటి ‘నేషనల్ డోమెస్టిక్ వయొలెన్స్ హాట్ లైన్’ సంస్ధ నివేదికను కూడా యు.ఎస్.ఏ టుడే ప్రస్తావించింది. హాట్ లైన్ అధ్యక్షులు కేటీ రే-జోన్స్ ప్రకారం హింసాత్మక దాడులపై ఫిర్యాదులు నానాటికి తీవ్రం అవడానికీ, విస్తరించడానికీ ఆర్ధిక ఒత్తిడి ఒక ముఖ్య కారణం. కనీసం గత రెండు సంవత్సరాలుగా కుటుంబ హింస తాలూకు ఫిర్యాదులు పెరిగిపోవడం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ నుండి పని చేసే ఒక పరిశోధనా సంస్ధ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ చక్ వెక్స్లర్ చెప్పినట్లు యు.ఎస్.ఏ టుడే తెలిపింది.
“ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలు లేదా ఉద్యోగాలు కోల్పోతామన్న భయంతో బతుకుతున్న కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ అదనపు ఒత్తిడి జనాన్ని ‘బ్రేకింగ్ పాయింట్’  ఆవలికి నెట్టేస్తోంది” అని వెక్స్లర్ తెలిపింది.
వ్యవస్ధ లక్షణాలను ప్రజలు అనివార్యంగా భరించాలి. ఆర్ధిక సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రధాన లక్షణం. సంక్షోభాలకు పరిష్కారం చెప్పడానికి బదులు వాటిని ‘సైక్లిక్ క్రిసెస్’ పేరుతో పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు ‘మామూలు’ గా చెబుతున్నారు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో ప్రజలు దుర్భర పరిస్ధితితులు అనుభవించవలసి రావడం ‘మామూలే’ అన్నమాట!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి