* రేపు జగన్‌ను విచారించనున్న సీబీఐ
* సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
* సీబీఐ తీరుపై అందర్లోనూ ఉత్కంఠ
* అరెస్టు చేసే అవకాశాలున్నాయా?
* కేవలం ప్రశ్నించి వదిలేస్తారా?
* సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఏం చెప్తుంది?
* సడన్‌గా సీబీఐ విచారణకు పిలవడంలో ఆంతర్యం ఏంటి?
* అరెస్టు కుట్రపై మండిపడుతున్న జగన్
* ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపు
రేపు ఏం జరగబోతోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరిలోనూ ఇదే ప్రశ్న. జగన్ CBI విచారణకు హాజరైతే.. పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ఎవరి వాదన వాళ్లు చెప్తున్నారు. కాంగ్రెస్-TDPలు అరెస్టు ఖాయమన్న ధీమాతో ఉంటే.. కుట్రను ఎదుర్కొనేందుకు YSR కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అసలు CRPC సెక్షన్ 41(A) ప్రకారం విచారణ అంటే ఎలా ఉంటుంది. జగన్ అనుమానిస్తున్నట్టు నిజంగానే ఆయన్ను అరెస్టు చేస్తారా!
జగన్ ఆస్తుల కేసు కీలక దశకు చేరింది. రేపు జగన్ CBI ముందు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది. ఉపఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున వచ్చే నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని జగన్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జగన్ లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. జగన్ తరపు లాయర్ పలు అభ్యంతరాలను లేవనెత్తినా.. CRPC 41(A) ప్రకారం ఎప్పుడైనా విచారించే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుందని సీబీఐ లాయర్ వాదించడంతో.. చివరకు జగన్ విచారణకు వెళ్లాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
CRPC 41(A) సెక్షన్ కింద విచారణ జరగడం అంటే సీబీఐ ఈ కేసులో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కేసుకు సంబంధిచిన కీలక సమాచారం దర్యాప్తు సంస్థ వద్ద ఉంటే.. ఎలాంటి ముందస్తు నోటీసూ ఇవ్వకుండా అరెస్టు చేసే అధికారం ఈ సెక్షన్ కల్పిస్తోంది. ఇదే ఇప్పుడు జగన్ అభిమానుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. ఎనిమిది నెలలుగా కేసు విచారణ జరుగుతున్నా ఏనాడూ జగన్‌ను విచారణకు పిలవని సీబీఐ... ఉపఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తీసుకున్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.
తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల్ని తీవ్రంగా తప్పుపడుతున్న జగన్.. సీబీఐ తీరుపై నిప్పులు చెరిగారు. ఉపఎన్నికల వేళ కాంగ్రెస్-TDP కుమ్మక్కై తనను అరెస్టు చేయించేందుకు కుట్రపన్నాయని మండిపడ్డారు. తనకేం జరిగినా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు వైఎస్ మేలు చేసారని తప్పుడు ఆరోపణలు చేస్తున్న సీబీఐ.. చంద్రబాబును ఎందుకు వదిలేస్తోందని ప్రశ్నించారు. బాబు హయాంలో ఇచ్చిన కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం రేపులపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. ప్రజలే కాంగ్రెస్-TDPకి గుణపాఠం చెప్తారన్నారు.
అటు, ఉప ఎన్నికలు పూర్తయ్యేవరకూ జగన్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు వైఎస్సార్‌సీపీ నేతలు. కాంగ్రెస్ హైకమాండ్, కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో సీబీఐ నడుస్తుందని ఫిర్యాదు చేసారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెబుతుండటంతో జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కుట్రలు పన్నుతున్నారని ఈసీ దృష్టికి తెచ్చారు.
సాక్షి అకౌంట్ల నిలుపుదల విషయంలోనూ, ఆస్తుల అటాచ్ కేసులోనూ ఎదురుదెబ్బ తగిలినా.. సీబీఐ దూకుడుగా తన పని చేసుకుపోతోంది. తాజాగా జగన్‌ను విచారించడం ద్వారా కీలక సమాచారం రాబట్టాలని భావిస్తోంది. సాక్షికి చెందిన వివిధ సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయన్న దానిపై కీలక ప్రశ్నలు సంధించబోతోంది. ఇప్పటికే ఇందకు సంబధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన సీబీఐ అధికారులు.. ఈ కేసులో పూర్తి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి