7, మే 2012, సోమవారం

ఐపిఎల్‌ ఒక జూదం


క్రికెట్‌ ఒకప్పుడు జంటిల్మన్‌ క్రీడ. ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో షారుక్‌ ఖాన్‌, ప్రీతిజింటా, జుహీచావ్లా, శిల్పాశెట్టి వంటి బాలీవుడ్‌ తారల ప్రవేశంతో గ్లామరస్‌ క్రీడగా మారింది. ముఖేష్‌ అంబానీ, విజరు మాల్యా, నెస్‌ వాడియా, రాజ్‌కుంద్రాల చూపు పడటంతో బడా కార్పొరేట్‌ సంస్థగా అవతరించింది. రిలయన్స్‌, బాంబే డయింగ్‌, దక్కన్‌ క్రానికల్‌, ఇండియా సిమెంట్స్‌, యుబి గ్రూపు వంటి వాణిజ్య సంస్థలు ఐపిఎల్‌ ఫ్రాంచైజీలను కొనుక్కోవడంతో వేల కోట్ల రూపాయల లావాదేవీల అంతర్జాతీయ వ్యాపార సంస్థగా రూపాంతరం చెందింది. రూపాయి పెట్టి పది రూపాయల లాభం ఆర్జించే పెట్టుబడిదారులు ఐపిఎల్‌ తొలి సీజన్‌ అయిపోగానే కోట్లాది రూపాయలు నష్టపోయామని లెక్కలు కట్టారు. అయితే ఆ లెక్కలు మన చెవిలో పెట్టిన పువ్వులుగా తర్వాత తేలింది. నిజానికి ఐపిఎల్‌ తొలి సీజన్‌లో అట్టడుగున నిలిచిన దక్కన్‌ ఛార్జర్స్‌తో సహా అన్ని ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయల లాభం ఆర్జించినట్లు తెలిసింది. ఈ బడా కార్పొరేటర్ల పుణ్యమా అని క్రికెట్‌ ఇప్పుడు ఓ జూదంగా మారింది. కోటాను కోట్ల రూపాయల బెట్టింగ్‌ ఉప వ్యాపారంగా అవతరించింది. ఐపిఎల్‌ వ్యాపార లావాదేవీల వివరాలు సంక్షిప్తంగా ఈ వారం అట్టమీది కథలో...
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - నెలరోజుల నుండి క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్న మెగా టోర్నమెంట్‌. 76 మ్యాచ్‌లు నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇప్పటివరకూ సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఐపిఎల్‌లో మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ ఒకవైపు ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీసులో బిజీగా ఉండగా... మరోవైపు చీర్‌ లీడర్స్‌ అభిమానుల్లో వేడి పుట్టించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇంకోవైపు ఫ్రాంచైజీలు తమ ఆదాయంపై లెక్కలు కట్టడంలో తలమునకలై ఉన్నారు. తొలి సీజన్‌ నుండీ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు చెందిన నైట్‌ రైడర్స్‌ జట్టుకు ప్రజాదరణతో పాటు ఆదాయమూ దండిగా వస్తోంది.
డబ్బున్న... పెద్దవాళ్ల వ్యాపారం
ఐపిఎల్‌ పూర్తిగా డబ్బున్న వాళ్ల, ప్రముఖుల వ్యాపారంగా ఉంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లు మాత్రం వారి వ్యాపారం పటిష్టంగా నిలబడేందుకు అవసరమైన ఇంధనం, సిమెంటు, మౌలిక సదుపాయం అందించే ముడిసరుకుగా ఉపయోగపడ్తున్నారు. ఇటీవల కొచి కన్సార్టియమ్‌ ఫ్రాంచైజీలో షేర్‌ హోల్డర్లను ఐపిఎల్‌ మాజీ ఛైర్మన్‌, కమిషనర్‌ లలిత్‌ మోడీ ప్రకటించారు. అయితే ఆ షేర్‌ హోల్డర్లు ఐపిఎల్‌ అనే మహా సముద్రంలో నీటి బిందువులు మాత్రమే. అప్పటి కేంద్ర మంత్రి శశి థరూర్‌ సన్నిహితురాలు సునందా పుష్కర్‌ కూడా కోచి జట్టు ఫ్రాంచైజీలో షేర్‌ హోల్డర్‌గా ఉన్నారని లలిత్‌ మోడీ ప్రకటించారు. ఇది శశిథరూర్‌ మంత్రి పదవికే ఎసరు తెచ్చిపెట్టింది. అయితే ఇది ఇంతటితో ఆగిపోలేదు. అలా ప్రారంభమైన ఆ వివాదంలో లలిత్‌ మోడీ సహా పెద్ద తలకాయలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఐపిఎల్‌ను ఆసరాగా చేసుకొని లలిత్‌ మోడీ కూడబెట్టిన ఆస్తుల వివరాలు కూడా పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. మోడీ ఏకంగా ఒక సొంత విమానాన్నే కలిగి ఉన్నాడు. జట్లను కొనడానికి ఫ్రాంచైజీలు చేయని జిమ్మిక్కు లేదు. ఫక్తు వ్యాపారంగా మార్చిన ఐపిఎల్‌లో కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ప్రవహించాయి. ఈ డబ్బుల లావాదేవీల్లోని అవినీతి, అక్రమాలను వెలికితీయడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు సంస్థలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పది ఫ్రాంచైజీలకు కనీసం మూడు ఫ్రాంచైజీలు - రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఈ మూడు జట్లకూ లలిత్‌ మోడీతో అవినాభావ సంబంధాలున్నాయి.
ఐపిఎల్‌ అంటే ఏంటి?
భారత్‌లో ప్రొఫెషనల్‌ స్థాయిలో నిర్వహిస్తున్న ట్వంటీ20 క్రికెట్‌ ప్రొఫెషనల్‌ ఛాంపియన్‌ షిప్‌. దీన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) నిర్వహిస్తోంది. ఐపిఎల్‌ను బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా పర్యవేక్షిస్తున్నారు. శుక్లా ఐపిఎల్‌ ఛైర్మన్‌, కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐపిఎల్‌లో భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతున్నారు. ఐపిఎల్‌ ఐదవ సీజన్‌ పూర్తయ్యేసరికి అంతర్జాతీయ స్థాయిలో మివే టి20 ఛాలెంజ్‌ (దక్షిణాఫ్రికా), బిగ్‌బాస్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా), బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బంగ్లాదేశ్‌) వంటి లీగ్‌ టోర్నీలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
డబ్బులెలా వస్తున్నాయి?
ఐపిఎల్‌ ఒక్క సీజన్‌లోనే 10 బిలియన్‌ డాలర్లకు పైగా సంపాదించింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి)కు ఏడాది తర్వాత లభించే ఆదాయాన్ని ఐపిఎల్‌ ఒక్క సీజన్‌లోనే సమకూర్చుకోగలిగింది. ఐపిఎల్‌ కంటే దాని ఫ్రాంచైజీలే ఎక్కువగా సంపాదించడం విశేషం. ఐపిఎల్‌ జట్టు నుండి లాభాలు ఆర్జించడానికి ఫ్రాంచైజీలకు చాలా మార్గాలున్నాయి. అవి
* ఫ్రాంచైజీలు వ్యాపార ప్రకటనల కోసం, ప్రమోషన్ల కోసం జట్టును విక్రయిస్తారు. ఆటగాళ్లంతా ఒక్క పైసా తీసుకోకుండానే ఫ్రాంచైజీ చెప్పిన కంపెనీ వ్యాపార ప్రకటనల కోసం పనిచేయాలి. కంపెనీలు చెల్లించే డబ్బు ఫ్రాంచైజీలకు చెందుతుంది.
* ఫ్రాంచైజీలు ఆదేశించే వ్యాపార ప్రకటనలు, ప్రమోషన్లను ఆ జట్టులోని ఏ ఆటగాడూ నిర్లక్ష్యం చేసేందుకు వీల్లేదు.
* ఐపిఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఫ్రాంచైజీల అనుమతి లేకుండా ఐపిఎల్‌ జట్లలో ఆడుతున్న ఏ ఆటగాడు కూడా వ్యాపార ప్రకటనల్లో లేదా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సొంతగా పాల్గొనడానికి వీల్లేదు.
* స్టేడియంలలో టిక్కెట్లు విక్రయించడం ద్వారా లభించిన ఆదాయం ఫ్రాంచైజీలకే చెందుతుంది. నికర లాభాన్ని ఐపిఎల్‌కు, ఫ్రాంచైజీలకు పంచుతారు.
* ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టెలివిజన్‌ హక్కులను విక్రయించడం ద్వారా ఫ్రాంచైజీలు డబ్బును ఆర్జిస్తాయి. మ్యాచ్‌ల సందర్భంగా టెలివిజన్‌లో ఇచ్చే వ్యాపార ప్రకటనల ద్వారా లభించే ఆదాయం మ్యాచ్‌లు ఆడే రెండు జట్లకు, ఐపిఎల్‌కు లభిస్తుంది.
ఉదా : ముంబయి ఇండియన్స్‌, దక్కన్‌ ఛార్జర్స్‌ జట్లు ఒక మ్యాచ్‌ ఆడుతున్నాయి. ఆ మ్యాచ్‌ను కవర్‌ చేస్తున్న టెలివిజన్‌ ఛానళ్లు మధ్య మధ్యలో వ్యాపార ప్రకటనలు ఇస్తాయి. ప్రకటనలకు చెందిన వాటాను టెలివిజన్‌ ఛానళ్లు ఐపిఎల్‌కు చెల్లిస్తాయి. అందులో కొంత డబ్బును ఐపిఎల్‌ ఉంచుకొని మిగిలిన డబ్బును ముంబయి ఇండియన్స్‌, దక్కన్‌ ఛార్జర్స్‌ జట్లకు పంచుతుంది. అందుకే తమ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటాయి.
* స్టేడియం, మైదానంలో వ్యాపార ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు కూడా డబ్బును ఫ్రాంచైజీలకు చెల్లించాలి.
* ఫ్రాంచైజీలు తమ వాటాను మరో ఇన్వెస్టర్‌కు ఎక్కువ విలువకు విక్రయించవచ్చు. కొత్త ఇన్వెస్టర్‌ ఫ్రాంచైజీలో భాగస్వామిగా మారి ఫ్రాంచైజీకి లభించే లాభాల్లో వాటా పంచుకుంటుంది.
* ప్రతి ఐపిఎల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే ఫిక్సింగ్‌ అవుతుంది. ఏ జట్టు గెలవాలో ముందే నిర్ణయించి రెండు జట్లకు చెందిన యజమానులు బుకీల నుండి డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు మిలియన్‌ డాలర్లలో ఉంటుంది. మైదానంలో ఎలా ఆడాలో ప్రతి ఆటగాడికి ముందే తెలిసి ఉంటుంది. ఆటగాళ్లంతా మ్యాచ్‌లో గెలిచేందుకు తెగ కష్టపడుతున్నట్లు నటిస్తారు. అయితే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసినందుకు ఆటగాళ్లు కూడా తమ ఫీజు కంటే ఎక్కువ మొత్తాన్ని ఆర్జిస్తారు. ఫ్రాంచైజీలకు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ప్రధాన ఆదాయ వనరు. వాళ్లకు 70 శాతం ఆదాయం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ద్వారానే లభిస్తుంది. ఐపిఎల్‌లో ఆట నిజమైనది కాదు. ప్రకటనలు, టిక్కెట్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆటగాళ్లంతా మ్యాచ్‌లో కష్టపడినట్లు డ్రామా ఆడతారు! అందుకే 2011 నుండి ఐపిఎల్‌ ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఎక్కువ మ్యాచ్‌లు అంటే ఎక్కువ ఫిక్సింగ్‌లు. ఎక్కువ ఫిక్సింగ్‌లు అంటే ఎక్కువ డబ్బులు.
* ప్రపంచంలోనే అతిపెద్ద జూదం ఐపిఎల్‌. ఇది లైసెన్స్‌ కలిగిన జూదం. ఐపిఎల్‌, బిసిసిఐ, జట్టు యజమానులు, ఆటగాళ్లు, జట్టు మేనేజర్‌, ఐపిఎల్‌తో సంబంధమున్న ఇతర పెద్దలు ఒక్క ఐపిఎల్‌ మ్యాచ్‌తో వేర్వేరు మార్గాల ద్వారా బిలియన్‌ డాలర్లు సంపాదిస్తారు. ఏ జట్టు కూడా తన సామర్ధ్యంతో విజయం సాధించింది అనడానికి వీల్లేదు. ఏ జట్టు విజయమైనా ముందే ఫిక్స్‌ అయి ఉంటుంది.
ఐపిఎల్‌ ట్రోఫీ
డైమండ్లు పొదిగిన డిఎల్‌ఎఫ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) క్రికెట్‌ ట్రోఫీని రోసీ బ్లూ గ్రూపుకు చెందిన ఒర్రా బ్రాండ్‌ డిజైన్‌ చేసింది. బంగారు పత్రంతో తయారు చేసిన ఆటగాడు.. చేతిలో క్రికెట్‌ బ్యాట్‌తో భారత్‌ మ్యాప్‌ పక్కన నిలబడి ఉన్నాడు. మ్యాప్‌ వెనుక భాగంలో వివిధ ఐపిఎల్‌ జట్లకు చెందిన లోగోలు ముద్రించి ఉన్నాయి. 14 మంది నిపుణులైన కళాకారులు ట్రోఫీని తయారు చేశారు. ప్రతి సంవత్సరం ఐపిఎల్‌ టి20 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు నగదు బహుమతితో సహా నమూనా ట్రోఫీని అందజేస్తారు. ఐపిఎల్‌-4లో కొత్తగా రెండు జట్లు చేరడంతో కొత్త ట్రోఫీని తయారు చేశారు.
యూ ట్యూబ్‌నూ ఆకర్షించింది
2010 నాటికి యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే తొలి క్రీడా ఈవెంట్‌గా ఐపిఎల్‌ నిలిచింది. ఇప్పుడు ఇండియా టైమ్స్‌ సహాయంతో యు ట్యూబ్‌లో ఐపిఎల్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. నాలుగో సీజన్‌ పూర్తయ్యేనాటికి దీని బ్రాండ్‌ విలువ 3.67 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గ్లోబల్‌ క్రీడా వేతనాలపై స్పోర్టింగైన్‌ ఇంటెలిజెన్స్‌.కామ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం క్రీడాకారులకు ఎక్కువ వేతనాలు అందిస్తున్న రెండో అతిపెద్ద క్రీడా సంస్థగా ఐపిఎల్‌ నిలిచింది. ఎన్‌బిఎ అత్యధిక వేతనాలు అందిస్తున్న క్రీడా సంస్థ. ఐపిఎల్‌లో ప్రతి ఆటగాడికి అందిస్తున్న సరాసరి వేతనం 3.95 మిలియన్‌ డాలర్లు (19 కోట్ల 75 లక్షలు).
ఫ్రాంచైజీలు
24 జనవరి 2008లో ఎనిమిది ఫ్రాంచైజీలను ప్రకటించారు. 400 మిలియన్‌ డాలర్లతో ప్రారంభమైన వేలం పాటను బిడ్డింగ్‌లో పాల్గొన్న ఫ్రాంచైజీలు 723.59 డాలర్ల వరకూ తీసుకెళ్లాయి. మార్చి 21, 2010లో పుణె, కొచిలకు కొత్త ఫ్రాంచైజీలు ఏర్పాటయ్యాయి. పుణె ఫ్రాంచైజీని సహారా అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ గ్రూపు 370 మిలియర్‌ డాలర్లకు, కొచి ఫ్రాంచైజీని రెండెజ్‌వస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సంస్థ 333.3 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నాయి.
ఆదాయం - లాభాలు
ఇంగ్లండ్‌కు చెందిన బ్రాండ్‌ ఫైనాన్స్‌ అనే కన్సల్టెన్సీ 2010లో ఐపిఎల్‌ విలువను 4.13 బిలియన్‌ డాలర్లు (రూ.18,998 కోట్లు)గా నిర్ధారించింది. ఇదే కన్సల్టెన్సీ 2009లో దీని విలువను 2.01 బిలియన్‌ డాలర్లు (రూ. 9,000 కోట్లు)గా నిర్ధారించడం విశేషం. అంటే ఒకే సంవత్సరంలో ఐపిఎల్‌ విలువ రెండింతలైంది. వివిధ ఫ్రాంచైజీలు సాధించిన లాభనష్టాలపై రెండు విధాలైన లెక్కలున్నాయి. 2009లో టోర్నీలో పాల్గొన్న ఎనిమిది జట్లకు గాను నాలుగు జట్లు లాభాలు ఆర్జించాయని గణాంకాలు చెప్తున్నాయి. అయితే టైమ్స్‌ అనే సంస్థ లెక్కల ప్రకారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు మినహా అన్ని జట్లూ లాభాలు ఆర్జించాయి.
పన్ను మినహాయింపు వివాదం
ఐపిఎల్‌కు ప్రభుత్వం ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఇచ్చింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) సాధించిన లాభాలపై కేంద్ర ప్రభుత్వం పన్నును మినహాయించింది. ఫలితంగా కేంద్రం 45 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. దీంతో వివాదం నెలకొంది. ఐపిఎల్‌ నుండి వినోదపు పన్ను వసూలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఒక సంస్థకు చెందిన న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఐపిఎల్‌కు పన్ను మినహాయింపును తాను సమర్ధించడంలేదని దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందనను కోరుతున్నట్లు జూన్‌ 2011లో మద్రాసు హైకోర్టు పేర్కొన్నది. ఐపిఎల్‌ ఒక క్రీడ కాదని, ఇది ప్రజలకు వినోదం కల్గిస్తోందని దీంతో దీనికి వినోదపు పన్ను వసూలు చేయాలని మద్రాసు కోర్టులో దాఖలైన పిల్‌లో పిటిషన్‌దారులు కోరారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లకు టికెట్లు భారీ ధరలకు విక్రయిస్తున్నారని, ఎక్కువ ధర కలిగిన టికెట్లను అత్యంత ధనవంతులు, ప్రముఖులు మాత్రమే కొనుక్కోగలుగుతున్నారని పిల్‌లో తెలిపారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లు సహా వినోదానికి సంబంధించిన టారిఫ్‌లను ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించాలని పిల్‌లో కోరారు. అయితే ఆదాయపు పన్ను శాఖ ఇప్పటిదాకా ఐపిఎల్‌కు సంబంధించిన వినోదపు పన్ను టారిఫ్‌లను నిర్ణయించలేదు. ఐపిఎల్‌లో కొన్ని ఫ్రాంచైజీలు ఆర్థిక అవకతవకలకు, క్రిమినల్‌ చర్యలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేపట్టనున్నట్లు గతేడాది ఆగస్టులో ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు.
అధికారిక వెబ్‌సైట్‌
ఐపిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ కోసం కెనడాకు చెందిన లైవ్‌ కరెంట్‌ మీడియా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పదేళ్లలో కనీసం 50 మిలియన్‌ డాలర్ల ఆదాయం లభిస్తుందన్న హామీతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ టోర్నీకి అధికారిక వెబ్‌సైట్‌గా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐపిఎల్‌టి20.కామ్‌ కొనసాగుతోంది.
టెలివిజన్‌ రైట్స్‌
ఐపిఎల్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సంబంధించిన గ్లోబల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను భారత్‌కు చెందిన సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌, సింగపూర్‌కు చెందిన వరల్డ్‌ స్పోర్ట్‌ గ్రూపు సొంతం చేసుకున్నాయి. పదేళ్లకు సంబంధించిన ఈ ఒప్పందం విలువ 1.026 బిలియన్‌ డాలర్లు. పై సంస్థలు ఒప్పందంలో భాగంగా బిసిసిఐకి 918 మిలియన్‌ డాలర్లు, టోర్నీని ప్రమోట్‌ చేసేందుకు ఐపిఎల్‌కు 108 మిలియన్‌ డాలర్లు ఇస్తుంది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఐపిఎల్‌ బాంబే హైకోర్టుకు వెళ్లింది. కోర్టులో ఐపిఎల్‌ గెలవడంతో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ బిసిసిఐతో మరో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం పదేళ్ల ఒప్పందానికి బిసిసిఐకి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ 8,700 కోట్ల రూపాయలు (1.74 బిలియన్‌ డాలర్లు) చెల్లిస్తుంది. అందులో 20% ఆదాయం ఐపిఎల్‌కు, 8% ప్రయిజ్‌ మనీకి, 72% ఆదాయం ఫ్రాంచైజీలకు చెల్లిస్తారు. ఈ డబ్బును 2008 నుండి 2012 మధ్యకాలంలో ఇస్తారు.

దక్కన్‌ ఛార్జర్స్‌ లాభాలు - నష్టాలు
ఐపిఎల్‌ తొలి సీజన్‌లో అట్టడుగున నిలిచిన దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు 20 కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ల గణాంకాలు వెల్లడించాయి. నిజానికి ఆ జట్టు తొలి సంవత్సరమే రెండు కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఐపిఎల్‌ ప్రారంభం కాకముందు ఏప్రిల్‌ 10, 2008లో పది రూపాయలు ఉన్న దక్కన్‌ ఛార్జర్స్‌ షేర్‌ విలువ ఏడాది తిరిగే సరికి (జనవరి 22, 2009 నాటికి) రూ.30.9కు పెరిగింది.
తొలి సీజన్‌ తర్వాత చూపించిన నష్టాలు
ఆదాయం : రూ.64 కోట్లు
టెలివిజన్‌ ప్రసార హక్కుల ద్వారా (సెట్‌ మ్యాక్స్‌) : రూ.20 కోట్లు
స్పాన్సరర్ల ద్వారా : రూ.32 కోట్లు
సొంత మైదానంలో టికెట్ల విక్రయం ద్వారా : రూ. 12 కోట్లు
మొత్తం ఖర్చు : రూ.82 కోట్లు
ఫ్రాంచైజీ ఏడాది ఫీజు : రూ.45 కోట్లు
ఆటగాళ్లకు చెల్లించిన మొత్తం : రూ.24 కోట్లు
స్పోర్ట్స్‌ స్టాఫ్‌పై ఖర్చు, ఇతర ఖర్చులు : రూ.13 కోట్లు
మొత్తం నష్టం : రూ.18 కోట్లు

వాస్తవ ఆదాయం ఆదాయం
ఫ్రాంచైజ్‌ హక్కుల ద్వారా ఆదాయం : రూ. 24 కోట్లు
స్పాన్సర్‌షిప్‌ ఫీజులు రూపంలో : రూ. 15.8 కోట్లు
ప్రకటనలు, టికెట్‌ విక్రయాల ద్వారా : రూ. 16.4 కోట్లు
ఇతర మార్గాల ద్వారా : రూ. 0.4 కోట్లు
మొత్తం ఆదాయం : రూ. 56.6 కోట్లు
ఖర్చు
ఆటగాళ్లకు చెల్లింపులు : రూ. 22.7 కోట్లు
నిర్వాహణ, ఇతర ఖర్చులు : రూ. 13.3 కోట్లు
విలువ తగ్గడం : రూ. 17.1 కోట్లు
లెక్కాపత్రం లేని ప్రాథమిక ఖర్చులు : రూ. 0.2 కోట్లు
మొత్తం ఖర్చు : రూ. 53.4 కోట్లు
పన్ను కట్టక ముందు లాభం : రూ. 3.1 కోట్లు
పన్ను కట్టిన తర్వాత లాభం : రూ. 2 కోట్లు
ఒక షేర్‌ విలువ : రూ. 30.9
బెట్టింగ్‌
క్రికెట్‌ను ఆసరా చేసుకొని బెట్టింగ్‌ కూడా ఉప వ్యాపారంగా విజృంభించింది. ముందే ఫిక్స్‌ అయిన మ్యాచ్‌లకు కూడా కోట్లాది రూపాయల బెట్టింగ్‌ నిర్వహిస్తూ అమాయక క్రికెట్‌ అభిమానుల బలహీతలను సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితం ముందే నిర్ణయమైనా బెట్టింగ్‌ చేసేవాళ్లకు లాభం చేకూర్చడంలో భాగంగా ఆటగాళ్లు చివరి నిమిషం వరకూ మ్యాచ్‌ను రక్తి కట్టిస్తూ నటులకే నటన నేర్పేవాళ్లుగా తయారయ్యారు. దేశంలో బెట్టింగ్‌ను నిషేధించినప్పటికీ ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయంటే వారి ప్రభావం ఎంతుందో అర్ధమవుతోంది.

తప్పుడు లెక్కలు
కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు మినహా మిగిలిన జట్లన్నీ తొలి సీజన్‌ తర్వాత నష్టపోయినట్లు లెక్కలు కట్టి బిసిసిఐకి, ఐపిఎల్‌కు సమర్పించాయి. తమకు మొత్తం 315 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఫ్రాంచైజీలు లెక్కలు కట్టాయి. 2010 సీజన్‌ ముగిసే నాటికి దక్కన్‌ ఛార్జర్స్‌ అత్యధికంగా రూ. 87.09 కోట్లు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.65.68 కోట్లు, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ రూ.47.11 కోట్లు, ముంబయి ఇండియన్స్‌ రూ. 42.89 కోట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.35.51 కోట్లు, చెన్నరు సూపర్‌ కింగ్స్‌ రూ.19.30 కోట్లు, కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ.11.85 కోట్లు, రాయల్‌ ఛాలెంజర్స్‌ రూ.5.58 కోట్లు నష్టపోయినట్లు లెక్కలు కట్టాయి. ఇంత భారీ స్థాయిలో నష్టాలొస్తోంటే ఫ్రాంచైజీలు టోర్నీలో ఎలా కొనసాగుతున్నారనే అనుమానం పార్లమెంటరీ కమిటీకి కలిగింది. వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఫ్రాంచైజీల కార్యాలయాలపై దాడులు నిర్వహించాయి. ప్రభుత్వానికి లెక్కలు చూపని డబ్బు (నల్లడబ్బు) భారీ స్థాయిలో వారి వద్ద ఉందన్న చేదు నిజం ఐటి దాడుల్లో తేలింది. ప్రభుత్వానికి ఆదాయపు పన్ను ఎగ్గొట్టేందుకే వీరు ఈ విధమైన తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నది తేలింది.
ఎనిమిది జట్లు - యాజమాన్య వివరాలు
నీతా అంబానీ - ముంబయి ఇండియన్స్‌
యజమాని : ఇండియన్‌ విన్‌ స్పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌.
ముంబయి ఇండియన్స్‌ జట్టుకు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ యజమాని ముఖేష్‌, ఆయన భార్య నీతా అంబానీలు యజమానులని అందరికీ తెలిసిన విషయమే. అయితే షేర్‌ హోల్డర్లలో వారి పేర్లను ఎక్కడా పేర్కొనలేదు. కంపెనీ డైరెక్టర్లుగా అశ్విన్‌ ఖాస్గివాలా, ఆశిష్‌ చౌహాన్‌, సుధాకర్‌ ఉన్నారు. ఫ్రాంచైజ్‌లో రిలయన్స్‌ ఇండిస్టియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఐఐహెచ్‌), షినానో ఇండిస్టియల్‌ రిటైల్‌, తీస్తా రిటైల్స్‌ 90 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే షినానో రిటైల్‌, తీస్తా రిటైల్‌లు ఆర్‌ఐఐహెచ్‌ ఆధీనంలో ఉన్నాయి. దీంతో అటుతిరిగి ఇటుతిరిగి ముంబయి ఇండియన్స్‌ జట్టుకు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ నిజమైన యజమానిగా ఉంది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ అధినేతలుగా ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీలు ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీలుగా కొనసాగుతున్నట్లే. 111.9 మిలియన్‌ డాలర్లకు కొనుక్కున్న ఈ జట్టుకు పదేళ్ల వరకు యజమానిగా ఉంటుంది.
విజరు మాల్యా - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
యజమాని : విజరు మాల్యాకు చెందిన యుబి గ్రూపు 100 శాతం షేర్లు కలిగి ఉంది.
అయితే ఇటీవల నెలకొల్పిన యుబి స్పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ జట్టును సొంతం చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ గ్రూపుపై దాడులు నిర్వహించింది. 111.6 మిలియన్‌ డాలర్లకు కొనుక్కున్న ఈ జట్టుకు పదేళ్ల వరకు యజమానిగా ఉంటుంది.
టి వెంకట్రామ్‌ రెడ్డి - దక్కన్‌ ఛార్జర్స్‌

యజమాని : దక్కన్‌ ఛార్జర్స్‌ స్పోర్టింగ్‌ వెంచర్స్‌.
దక్షిణ భారతదేశపు ప్రముఖ దినపత్రిక దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు 100 శాతం షేర్లు వున్నాయి. జట్టును పదేళ్ల కోసం 107 మిలియన్‌ డాలర్లకు కొనుక్కుంది.
ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌

యజమాని : జిఎంఆర్‌ స్పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌.
ఐటి దాడులు ప్రారంభం కాగానే దక్కన్‌ ఛార్జర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీల మాదిరిగా డేర్‌ డెవిల్స్‌ జట్టు తన యాజమాన్య వివరాలు వెల్లడించింది. జిఎంఆర్‌ హోల్డింగ్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌కు 51 శాతం వాటా ఉంది.
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా - రాజస్థాన్‌ రాయల్స్‌

యజమాని : జైపూర్‌ ఐపిఎల్‌ క్రికెట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌.
మారిషస్‌కు చెందిన ఇఎం స్పోర్టింగ్‌ హోల్డింగ్స్‌, జెఐసిపిఎల్‌ సంస్థలు విదేశాల నుండి నల్లడబ్బును ఇందులో పెట్టినట్లు అనుమానాలున్నాయి. ఈ ఫ్రాంచైజీలో లలిత్‌ మోడీ బినామీ వాటా ఉన్నట్లు విచారణలో తేలింది. 45 శాతం వాటా కలిగిన సురేష్‌ చెల్లారమ్‌ లలిత్‌ మోడీకి తోడల్లుడు. (మోడీ భార్య మినాల్‌ సోదరి కవితను సురేష్‌ పెళ్లి చేసుకున్నాడు). మోడీ సన్నిహిత మిత్రుడు మనోజ్‌ బదాలేకు చెందిన ఎమర్జింగ్‌ మీడియాకు 12 శాతం వాటా ఉంది. సినీతార శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు 12 శాతం వాటా ఉంది. ప్రముఖ మీడియా సంస్థ రూపర్ట్‌ మర్డోక్‌ మానసపుత్రిక బ్లూ వాటర్‌ ఎస్టేట్‌ ఆఫ్‌ లచ్‌లన్‌ మర్డోక్‌ అనే సంస్థకు 32 శాతం వాటా ఉంది.
ఎన్‌ శ్రీనివాసన్‌ - చెన్నరు సూపర్‌ కింగ్స్‌
యజమాని : ఇండియా సిమెంట్స్‌కు వంద శాతం వాటా ఉంది.
ఇండియా సిమెంట్స్‌ విసి, ఎండి అయిన ఎన్‌ శ్రీనివాసన్‌ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఐపిఎల్‌ ఫ్రాంచైజీ తీసుకోవడంతో శ్రీనివాసన్‌ విశ్వసనీయతపై అనుమానాలు వెల్లువెత్తాయి. యాజమాన్యం 91 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది.
ప్రీతిజింటా - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
యజమాని : కెపిహెచ్‌ డ్రీమ్స్‌ క్రికెట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌.
బాంబే డయింగ్‌ యజమాని నెస్‌ వాడియా, బాలీవుడ్‌ తార ప్రీతిజింటా, కాల్‌వే ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ 23 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నారు. లలిత్‌ మోడీ మేనల్లుడు గౌరవ్‌ బర్మన్‌ సోదరుడు మోహిత్‌ బర్మన్‌కు కూడా కొంత వాటా ఉంది. ఐపిఎల్‌లో డిజిటల్‌, మొబైల్‌, ఇంటర్నెట్‌ హక్కులు కలిగిన గ్లోబల్‌ క్రికెట్‌ వెంచర్‌లో గౌరవ్‌ వాటాదారు. మొహాలీ జట్టును 76 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది.
షారుక్‌ ఖాన్‌ - కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కెకెఆర్‌)
యజమాని : నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌.
బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు ఫ్రాంచైజీలో 55 శాతం వాటా ఉంది. సినీతార జుహీచావ్లా, మారిషస్‌లో నివసిస్తున్న జుహీ భర్త జే మెహతాకు చెందిన సీ ఐలాండ్‌ లిమిటెడ్‌ మిగిలిన వాటా కలిగి ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కెకెఆర్‌ కార్యాలయాలపై, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై దాడులు నిర్వహించారు. సీ ఐలాండ్‌ నుండి లెక్కల్లో తేలని నిధులు సమకూరినట్లు ఈ దాడుల్లో తేలింది. మోడీకి మెహతా చిన్ననాటి స్నేహితుడు. షారుక్‌ ఖాన్‌ 75.09 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి