-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాదుడు వాట 78.18%
-
తగ్గించడానికి అనేక అవకాశాలు
పెట్రోలు ధర పెంచిన తరువాత విజయవాడలో లీటరు ధర రూ.80.59 ఉంది. దీన్ని విశ్లేషిస్తే అసలు విషయం మనకు బోధపడుతుంది. ఒక లీటరు పెట్రోలు ధరలో వివిధ అంశాలిలా ఉన్నాయి.
పై అంశాలను పరిశీలిస్తే ఒక లీటరు పెట్రోలు ధరలో కేంద్ర ప్రభుత్వ పన్నులు రూ.14.78. రాష్ట్ర పన్నులు రూ.19.63, మొత్తం పన్నులు కలిపి రూ.34.41గా ఉన్నాయి. ఒక లీటరు పెట్రోలు వాస్తవ ధరలో (బేసిక్ ధరలో) ఈ పన్నులు 78.17 శాతంగా ఉన్నాయి. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న సేల్స్ ట్యాక్స్‌నూ విశ్లేషిస్తే ఈ పన్నులు ఎంత దోపిడీకి దారితీస్తున్నాయో అర్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 33 శాతం సేల్స్ ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నది. ఇది దేశంలోనే అత్యధికం.
అడ్డగోలు వసూళ్లు
సాధారణంగా సేల్స్ ట్యాక్స్‌ను బేసిక్ ధరపై లెక్కించాలి. అలాగే లెక్కిస్తారని మనం భావిస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బేసిక్ ధరకు, ఇతరాలు, కేంద్ర పన్నులు, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు కలిపి మొత్తం మీద 33 శాతం పన్ను వసూలు చేస్తున్నది. అంటే కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తున్నది. ఇది ద్వంద్వ పన్నుల విధానం. వాస్తవానికి కేవలం బేసిక్ ధరమీదనే 33 శాతం వసూలు చేస్తే ఈ పన్ను రూ.14.53 మాత్రమే అయి ఉండేది. కానీ పన్నుల మీద పన్నులు వసూలు చేయడం వల్ల అది రూ.19.63లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నును సగానికి తగ్గించినా సుమారుగా ఏడు లేక ఎనిమిది రూపాయలు తగ్గుతుంది.
కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.14.35 పన్ను వసూలు చేస్తోంది. దీనిలో రూ.6.35 సెంట్రల్ వ్యాట్, రూ.6లు స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.2లు హైవే సెస్‌గా ఉన్నాయి. దీనిలో సెంట్రల్ వ్యాట్‌నుగానీ, ఎక్సైజ్ డ్యూటీనిగానీ తగ్గించినా మరో ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉంది. దేశంలో అత్యవసరమైనదిగా ఉండి మనదేశంలో దొరకక, విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే దాని మీద పన్ను విధించకూడదు.
ధరల పెరుగుదలకు బిజెపి నాంది
1960 దశకంలో అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరిగినప్పుడు, మనదేశంలో ధరలు పెంచకుండా ఉండటం కోసం, ధరల నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని కోసం ఆయిల్ పూల్ అకౌంట్‌ను నిర్వహించారు. ప్రతి లీటరు పెట్రోలు మీద వినియోగదారుల నుండి రూపాయి వసూలు చేసి ఈ అకౌంట్‌కు జమచేశారు. అయితే బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ధరల నియంత్రణా విధానాన్ని రద్దు చేసింది. ఆయిల్ పూల్ అకౌంట్లో ఉన్న 30 వేల కోట్ల రూపాయలను వేరే అవసరాలకు వాడేసింది. ఫలితంగా ఈ రోజు ధరల పెరుగుదల అనేది అంతర్జాతీయ ధరల పెరుగుదల మీద ఆధారపడేట్లుగా చేసింది.
నిజానికి ఈ ధరల పెరుగుదల అంతర్జాతీయంగా పెట్రోలియం ధర పెరగటం వల్ల, రూపాయి విలువ తగ్గడం వల్ల జరుగుతున్నది కాదు. విదేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకొని రిఫైనరీలలో మార్చి, వినియోగదారులకు అందించే వరకు అయ్యే ఖర్చును లెక్కించి, లీటరు పెట్రోలు ధరను నిర్ణయిస్తారు. కానీ ఇటీవలి కాలంలో మన ప్రభుత్వం, విదేశాల్లో రిఫైన్ చేయబడిన పెట్రోలు నేరుగా మనదేశానికి దిగుమతి చేసుకుంటే ఎంత ధర అవుతుందో, ఆ మేరకు మనదేశంలో ఉన్న ధరను పెంచడానికి ప్రయత్నిస్తున్నది. దీనికి ప్రధానమైన కారణం మనదేశంలో ఉన్న శతకోటీశ్వరులు విదేశాల నుండి నేరుగా పెట్రోలు దిగుమతి చేసుకొని, మనదేశంలో అమ్ముకోవడానికి మార్గం సుగమం చేస్తుంది.
మనదేశంలో ఇంధన రంగం మన ప్రజల కోసం ఉండాలి, విదేశీ కంపెనీల కోసం కాదు. అందుకే మనదేశంలో మళ్లీ ధరల నియంత్రణా విధానాన్ని ప్రవేశపెట్టాలి. రిలయన్స్ వంటి ప్రయివేటు కంపెనీలను రద్దు చేయాలి. మనదేశంలో దొరికే పెట్రోలియంపై పూర్తి అధికారం మన ప్రభుత్వానికే ఉండాలి. అప్పుడే దేశంలో పెట్రోలు చౌకగా లభిస్తుంది.
ఎం.వి.ఆంజనేయులు,
కార్యరద్శి, టాక్స్ పేయర్స్ అసోసియేషన్, విజయవాడ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి