22, మే 2012, మంగళవారం

మూడు నాలుగు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు

హైదరాబాద్/ మాచర్ల, మే 22: మూడు నాలుగు రోజుల్లో తనను అరెస్టు చేసేందుకు ఢిల్లీ, రాష్ట్రంలోని కొన్ని రాజకీయ శక్తులు కుట్ర పన్నుతున్నాయని కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు మంగళవారం గుంటూరు జిల్లా మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవస్థానం సెంటర్‌లో అభిమానులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ తనను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పెద్దలు, ముఖ్యమంత్రి, గవర్నర్, డిజిపిలు చర్చించారని ఆరోపించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సిబిఐతో రహస్య మంతనాలు జరుపుతున్నాయని అన్నారు. ఢిల్లీనుంచి వచ్చిన అధిష్ఠానం దూత, కేంద్రమంత్రి వయలార్ రవి, డిజిపి, ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, సిబిఐ జెడితో రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం అందిందని జగన్ అన్నారు.
రాష్ట్రంలో విధ్వంసక పరిస్థితిని సృష్టించి, ఆ నెపాన్ని తనపై వేసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలే చేశారనే అపవాదు వేసేందుకు కుట్ర జరుగుతోందని జగన్ అన్నారు. వచ్చే నెలలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావని తెలిసి ఎన్నికలు జరగకుండా వాయిదా వేసేందుకు కుట్ర పన్నుతున్నారని వాపోయారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ముఖ్య నేతలు 18 నియోజకవర్గాలపై సర్వే నిర్వహించుకున్నారని, ఆ నివేదికలో డిపాజిట్లు కూడా రావని తేలటంతో వారు ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నారని అన్నారు.
వారి కుట్రను అడ్డుకోండి: ప్రధాని,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు జగన్ లేఖ
తనపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా కుట్ర పన్నుతున్నాయని జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ప్రధాని మన్మోహన్, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఎస్‌వై ఖురేషికి విడివిడిగా రాసిన లేఖల్లో ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికలను ఎదుర్కొనలేక, ప్రజాభిప్రాయానికి తలవంచలేక రాజకీయంగా కుట్రపన్నడం సిగ్గుచేటని లేఖలో పేర్కొన్నారు. తాను చేస్తున్నది ఆరోపణ కాదని, తనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు కుట్ర జరిగింది వాస్తవమని జగన్ ఆ లేఖల్లో వివరించారు. గత వారంలో ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, డిజిపి దినేష్‌రెడ్డితో రహస్య భేటీ నిర్వహించారని ఆయన ఆరోపించారు. కుట్రలో భాగంగానే వచ్చే 3, 4 రోజుల్లో సిబిఐ తనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. తనను అరెస్టు చేసే సందర్భగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నుతున్నట్టు ఆయన ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిపించడం ద్వారా ఉప ఎన్నికలను వాయిదా వేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరడం, ఆయన ఎన్నికల కమిషన్‌కు సూచించడం ఈ కుట్రలో భాగమని పేర్కొన్నారు. తనను సిబిఐ త్వరలోనే అరెస్టు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి అధ్యక్షుడు బొత్స, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, విపక్ష నేత చంద్రబాబు సహా కాంగ్రెస్, టిడిపి నేతలు పలువురు త్వరలోనే తనను అరెస్టు చేయనున్నట్టు ప్రకటనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కుట్రలో కొన్ని పత్రికలు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయని జగన్ ఆరోపించారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గవర్నర్‌ను కలిసినట్లు, తర్వాత డిజిపి కూడా గవర్నర్‌ను కలిసి తాజా పరిస్థితిని వివరించినట్టు తాను పత్రికల్లో చూశానని జగన్ వివరించారు. కేవలం ఇవి ఆరోపణలు కావని, కొద్దిరోజుల కిందట జరిగిన అత్యంత అవమానకర రీతిలో జరిగిన కుట్రకు వాస్తవ చిత్రమని, కుట్రకు సంబంధించి విశ్వసనీయ సమాచారం తనకు అందినందువల్లే వీటిని మీ దృష్టికి తీసుకువస్తున్నట్టు ప్రధానికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు రాసిన లేఖల్లో జగన్ పేర్కొన్నారు. తనను అరెస్టు చేసినట్లయితే విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకులు ప్రకటనలు చేయడం గమనార్హమని, టిడిపి అధినేత చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకేసి ఆరు నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు కూడా రాబోతున్నట్టు చెప్పారని తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కుట్ర పన్ని దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ ప్రకటనలను బట్టి స్పష్టమవుతోందని జగన్ వ్యాఖ్యానించారు. ఈనెల 28న వ్యక్తిగతంగా తానుకాని, తన న్యాయవాదిగాని హాజరు కావాలంటూ ఈనెల 9న సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసిందని, అయితే సిబిఐ కోర్టుకు హాజరైన సందర్భంలో తన అరెస్టు తప్పదంటూ కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రచారం చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? వీరి ప్రకటనల వెనుక ఉన్న కుట్ర ఏమిటి? అని జగన్ ప్రశ్నించారు.
మరోపక్క నగర పోలీసులు భయానక పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, సెంట్రల్ జోన్ డిసిపి సిబిఐ కోర్టును రెండుసార్లు సందర్శించారని, హైదరాబాద్‌కు వచ్చే అన్ని రహదారులను ఈనెల 27న మూసి వేయాలంటూ డిజిపి కార్యాలయం రహస్య ఉత్తర్వులను జారీ చేసిందని ఆయన ఆరోపించారు. ఇటీవల సిబిఐ అరెస్టు చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విచారణలో ఆయనతో తన పేరును బలవంతంగా చెప్పించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు ఆయన నిరాకరించడంతో అరెస్టు చేశారని అన్నారు.
ఉప ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలిచే అవకాశాలు లేవని కాంగ్రెస్, టిడిపిలు గ్రహించాయని, అందువల్లనే ఉప ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామాన్ని అవమాన పరిచేలా, అపహాస్యం చేసేలా పన్నిన కుట్రను అడ్డుకోవాలని ప్రధానిని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను జగన్ కోరారు.
వయలార్ రవిని కలిశాననడం
వాస్తవం కాదు: డిజిపి
కాంగ్రెస్ నేత వయలార్ రవిని తాను కలిసినట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేసిన ఆరోపణను డిజిపి వి దినేశ్‌రెడ్డి ఖండించారు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు. గతంలో వయలార్ వచ్చినప్పుడుగానీ ఇప్పుడుగానీ తాను కలిసి మాట్లాడింది లేనేలేదని ఒక ప్రకటనలో దినేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రుల నుంచే మొదలు...
తొలిగా ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసిన హైకమాండ్
న్యూఢిల్లీ, మే 22: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఎంపీ జగన్మోహన్‌రెడ్డి అరెస్ట్‌కు ముందే ఇద్దరు రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ మంత్రులను సైతం అరెస్టు చేశాం. తరువాతే జగన్‌ను అరెస్టు చేశామని చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. అవినీతి కేసులో అరెస్టు చేయాల్సిన నలుగురు కాంగ్రెస్ మంత్రుల నుంచి ఇద్దరిని మొదట అరెస్టు చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం ఈ అంశంపై కొన్ని గంటలపాటు సమాలోచనలు జరిపింది. రాష్టమ్రంత్రులు ధర్మాన ప్రసాద్, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరోమంత్రి పేరు అరెస్టు కావాల్సిన వారి జాబితాలో ఉన్నాయి. నలుగురిలో మొదట ఇద్దరిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ నేతలు మల్లాగుల్లాలు పడుతున్నారు. ధర్మాన ప్రసాద్, సబితా ఇంద్రారెడ్డిని అరెస్టు చేయటాన్ని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మత్సకారుడైన మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేయటం వలన వెనుకబడిన కులాల ఓటర్లు దూరం అవుతారని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన మరోవర్గం వాదిస్తున్నట్టు తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతిలో దాదాపు ఎనిమిదిమంది మంత్రులు పీకలవరకు మునిగి ఉన్నట్టు సిబిఐ దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఈ ఎనిమిది మందిలో నలుగురి జాబితా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నలుగురినీ తప్పకుండా అరెస్టు చేయనున్నారు. అయితే నలుగురిలో మొదట ఇద్దరిని అరెస్టు చేసి, తరువాత ఏడెనిమిది రోజులకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చూపించాలన్నది వ్యూహం. అయితే ఉప ఎన్నికలకు ముందు ఈ అరెస్టులు చేసే బదులు, పోలింగ్ ముగిసిన వెంటనే చేయటం మంచిదని సీనియర్ నాయకుడు వాదిస్తున్నట్టు తెలిసింది. ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మంత్రులను అరెస్టు చేయటం వలన పార్టీకి నష్టం జరుగుతుందని ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ హైకమాండ్‌కు స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మొదట ఇద్దరు రాష్ట్ర మంత్రులను అరెస్టు చేసి, తరువాత ఒకటి రెండు రోజుల్లో జగన్‌ను అరెస్టు చేయాలన్నది వారి వాదన. సిబిఐ మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈనెల 28న జగన్ సిబిఐ కోర్టు ముందు హాజరైనప్పుడు అదుపులోకి తీసుకోవాలని అనుకున్నారు. ఈనెల 28న అరెస్టు చేయని పక్షంలో పోలింగ్ ముగిసిన అనంతరం 13 లేదా 14న అరెస్టు చేయాలని అనుకున్నారు. అయితే ఇద్దరు రాష్ట్ర మంత్రులను అరెస్టు చేసిన తరువాత మూడు నాలుగు రోజులకే జగన్‌ను కూడా అరెస్టు చేయటం మంచిదని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు సీనియర్లు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద వాదిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగన్ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుల బృందం రెండు మూడు రోజుల్లో అరెస్టుల పర్వంపై తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు తుది నిర్ణయం తీసుకున్నా, మొదట ఇద్దరు రాష్ట్ర మంత్రులను అరెస్టు చేసిన తరువాతనే జగన్‌ను అరెస్టు చేస్తారని ఏఐసిసి వర్గాలు స్పష్టం చేశాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి