గత సంవత్సరం మార్చి 11
తారీఖున జపాన్ లో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.9 గా
దాని తీవ్రత నమోదయింది. దీనివల్ల అతి పెద్ద సునామీ సంభవించింది. భూకంపం
వచ్చిన 47 నిమిషాల తర్వాత సునామీ అలలు జపాన్ తూర్పు తీరాన్ని తాకాయి. 20
మీటర్ల ఎత్తున అలలు విరుచుకు పడ్డాయని పత్రికల ద్వారా తెలిసింది. భూకంపం,
సునామీల వలన జపాన్ ఈశాన్య ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉన్న ఫుకుషిమా అణు
విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నది. మూడు రియాక్టర్లలో అణు ఇంధన
రాడ్లు పూర్తిగా కరిగిపోగా, నాలుగో రియాక్టర్లో పాక్షికంగా కరిగిపోయాయని
తాజా వివరాల బట్టి తెలుస్తోంది.
ఫుకుషిమా ప్రమాదం, ఆ
ప్రమాదం తీవ్రతను జపాన్ ప్రభుత్వం, టెప్కో కంపెనీ కప్పి పుచ్చడానికి చేసిన
ప్రయత్నాలను ది ఇండిపెండెంట్ పత్రిక గత సంవత్సరం ఆగష్టు నెలలోనే వెల్లడి
చేసింది. అణు పరిశ్రమలో బిలియన్ల కొద్దీ పెట్టుబడి కలిగి ఉన్న
పెట్టుబడిదారీ కంపెనీలు తమ పెట్టుబడులకు నష్టం రానున్నదన్న భయంతో అణు
ప్రమాదాలని, వాటి తీవ్రతనూ కప్పి పుచ్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు
తెలుసుకోవడం అవసరం. అణు కర్మాగారాలలో జరిగే ప్రమాదాలు ఒక ఎత్తయితే, ఆ
ప్రమాదాల గురించిన నిజా నిజాలను కంపెనీలు ప్రభుత్వాలు దాచి పెట్టడం మరొక
ఎత్తు.
ఫుకుషిమా అణు విద్యుత్
కేంద్రం దేనివల్ల దెబ్బతిన్నది? భూకంపం వల్లనా? ఆ తర్వాత వచ్చిన సునామీ
వల్లనా? భూకంపం వల్ల ఏమీ నష్టం జరగలేదనీ, ఆ తర్వాత వచ్చిన సునామీ వల్లనే
నష్టం జరిగిందనీ జపాన్ ప్రభుత్వమూ, ఫుకుషిమా అణు కేంద్రాన్ని
నిర్వహిస్తున్న ‘టెప్కో’ కంపెనీ వాదించాయి. భూకంపం వచ్చినపుడు రియాక్టర్లు
పనిచేయకుండా ఆటోమేటిగ్గా ఆగిపోయేలా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఫుకుషిమా
అణు కర్మాగారంలో కూడా భూకంపం వచ్చిన వెంటనే రియాక్టర్లు ఆగిపోయాయనీ జపాన్
ప్రభుత్వమూ, టెప్కో లు తెలిపాయి. భూకంపం వల్ల కర్మాగారానికి విద్యుత్ సరఫరా
ఆగిపోయిందని చెప్పాయి.
భూకంపం వల్ల గానీ, మరే
ప్రమాదం వల్ల గానీ ప్లాంటుకి విద్యుత్ సరఫరా ఆగిపోతే జనరేటర్లు పని చేయాలి.
రియాక్టర్లలో ఉండే ఇంధన రాడ్లు నిరంతరం వేడెక్కుతూ ఉంటాయి. వాటిని
చల్లబరచడానికి నిరంతరం నీటిని పంపి చల్లబరచే ఏర్పాట్లు కర్మాగారంలో
చేస్తారు. ఇంధన రాడ్లు చుట్టూ ఉండే నీరు ఎప్పటికపుడు బైటికి వస్తూ ఉంటే,
చల్లబరిచే నీరు ఎప్పటికప్పుడు లోపలికి వెళ్తూ ఉండాలి. ఆ విధంగా వేడెక్కిన
నీరు బైటికి వస్తే చల్లబరిచే నీరు లోపలికి వెళ్తూ ఇంధన రాడ్లు స్ధిరమైన
ఉష్ణోగ్రత వద్ద కొనసాగాలి. ఈ విధంగా నీటిని లోపలికీ, బైటికీ పంపింగ్ చేసే
వ్యవస్ధ నిరంతరం పనిలో ఉంటేనే ఇంధన రాడ్లు వేడెక్కకుండా ఉంటాయి. కూలింగ్
వ్యవస్ధ పని చేయకపోతే ఇంధన రాడ్లు కరిగిపోయి రియాక్టర్ అడుగుభాగానికి చేరి
బైటికి వచ్చేస్తాయి. అలా బైటికి వస్తే రేడియేషన్ వాతావరణంలోకి వెళ్ళిపోయి
పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. మనుషులు, పక్షులు, మొక్కలూ అందరూ రేడియేషన్
విపరిణామాలని ఎదుర్కొంటారు.
ఫుకుషిమా వద్ద భూకంపం,
సునామీల వల్ల విద్యుత్ ఆగిపోయింది. కనుక జనరేటర్లు పని చేయాలి. కానీ సునామీ
వల్ల వచ్చిన నీటిలో మునిగిపోవటంతో జనరేటర్లు పని చేయలేదు. దానితో
కర్మాగారంలో కూలింగ్ వ్యవస్ధ పని చేయడం ఆగిపోయింది. ఫలితంగా ఇంధన రాడ్లు
పాక్షికంగా కరిగాయి. ఇది జపాన్, ప్రభుత్వమూ, టెప్కో ల వివరణ.
అయితే వాస్తవం ఇది
కాదని గత ఆగస్టులో ‘ది ఇండిపెండెంట్’ పత్రిక కధనం ప్రచురించింది. ఈ
విషయాన్ని అంతకుముందే కొంతమంది పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు కూడా
చెప్పారు. వారి మాటలను టెప్కో కొట్టిపారేసింది. వారు నిపుణులు కాదనీ,
వారికేమీ తెలియదనీ, అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారనీ, అసత్యాలు
రాస్తున్నారనీ చెబుతూ వచ్చింది. జపాన్ ప్రభుత్వం కూడా టెప్కోకి
మద్దతునిచ్చింది. వారి వాదన నిజం కాదనీ, అవి వాస్తవాన్ని దాచి పెట్టాయని
‘ది ఇండిపెండెంట్’ కధనం తెలిపింది.
ఏమిటా వాస్తవం? జపాన్
ప్రభుత్వం, టెప్కో కంపెనీ ఏమి దాచిపెట్టారు? అణు రియాక్టార్లలో ఇంధన రాడ్లు
కరిగిపోవడాన్ని సాంకేతికంగా ‘మెల్ట్ డౌన్’ అంటారు. “ఈ ‘మెల్ట్ డౌన్’ అనేది
భూకంపం వల్లనే జరిగింది తప్ప, సునామీ వల్ల కాదు. సునామీ ప్రమాదానికి
తోడయింది” అన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని జపాన్ ప్రభుత్వం, టెప్కో కంపెనీలు
దాచి పెట్టాయి. దాచి పెట్టి సునామీ వల్లనే ప్రమాదం (మెల్ట్ డౌన్)
జరిగిందని ఇండిపెండెంట్ పత్రిక బైటపెట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత
రోజుల్లో జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యూకీయో ఎదనో, టెప్కో అధ్యక్షుడు మసటకా
షిమిజు మెల్ట్ డౌన్ అసలు జరగలేదని చెప్పారని పత్రిక తెలిపింది.
నిజానికి ఫుకుషిమా
కర్మాగారంలో భద్రతా వ్యవస్ధలు అప్పటికే క్షీణ దశలో ఉన్నాయి. పంపింగ్
వ్యవస్ధ కోసం ఏర్పాటు చేసిన పైపులు బలహీనంగా ఉన్నాయి. రీసర్క్యులేషన్
పైపులు, కూలింగ్ పైపులు చిట్లిపోయి, సరైన మరమ్మతులకు నోచుకోక, క్షీణ దశలో
ఉన్నాయి. అలా పైపులు క్షీణ దశలో ఉన్న సంగతిని టెప్కో కప్పి పుచ్చడానికి
ప్రయత్నించిందనీ, ఆ తర్వాత తన తప్పును ఉదాసీనంగా అంగీకరించిందనీ ‘ది
ఇండిపెండెంట్’ తెలిపింది. ఇది పదేళ్ళ (సెప్టెంబరు 2002) సంగతి.
రియాక్టర్లలో ముఖ్యమైన ‘వేడిని బైటికి తీసుకెళ్లే పైపులే’ ఇలా క్షీణ దశలో
ఉన్నట్లు పత్రిక తెలిపింది.
భూకంపంకి 9 రోజుల ముందు
మార్కి 2 న జపాన్ ప్రభుత్వ సంస్ధ ‘న్యూక్లియర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ
ఏజన్సీ’ (నిసా) టేప్కోని హెచ్చరించింది. ప్లాంటులో ఉన్న కీలక పరికరాలను
కంపెనీ పరీక్షించడం లేదని సదరు హెచ్చరిక సారాంశం. రీసర్క్యులేషన్ పంపులని
కూడా పరీక్షించలేదనీ చెబుతూ వెంటనే పరీక్షలు జరపాలని కోరింది. అవసరమైతే
మరమ్మతులు చేయాలనీ చెప్పింది. చేశాక ఆ విషయం తనకు జూన్ 2, 2011 న
నివేదించాలని చెప్పింది. అయితే అదేమీ జరిగినట్లులేదని ‘ది ఇండిపెండెంట్’
తెలిపింది.
ఒక మెయింటెనెన్స్
ఇంజనీరు ని ‘ది ఇండిపెండెంట్’ ఇలా ఉటంకించింది. “అనేక పైపులు తెగిపోవడాన్ని
నేను స్వయంగా చూసాను. ప్లాంట్ అంతటా అనేక పైపులు అలాగే పగిలిపోయాయని నేను
భావిస్తున్నాను. భూకంపం వల్ల ప్లాంటు లోపల పెద్ద ఎత్తున నష్టం జరిగిందనడంలో
ఎలాంటి అనుమానమూ లేదు. రియాక్టర్ 1 కి చెందిన టర్బైన్ గది గోడలో ఒక భాగం
బైటికి వచ్చేయడం నేను చూశాను. ఆ పగులు రియాక్టర్ పైన ప్రభావం చూపింది.”
పత్రిక ప్లాంటులో పని
చేసిన అనేకమందితో పత్రిక మాట్లాడింది. వారు చెప్పినదాని ప్రకారం సునామీ
తాకడానికి మునుపే ఫుకుషిమా రియాక్టర్లలో కనీసం ఒకటి ఘోరంగా దెబ్బతిన్నది.
భూకంపం వల్ల పైపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్లాంటులో అనేక ఇతర పైపులు
కూడా దెబ్బతిన్నాయి. రియాక్టర్ 1 కి చెందిన టర్బైన్ బిల్డింగ్ (రియాక్టర్
పక్కనే ఉండే గది) లో ఒక గోడ భాగం దెబ్బతింది. దీనివల్లనే రియాక్టర్ పైన
తీవ్ర ప్రభావం పడింది. రియాక్టర్ ని చల్లబరిచే నీటిని తీసుకెళ్లే పైపులు
కూడా దెబ్బతిన్నాయి. అంటే రియాక్టర్ ని చల్లబరిచే వ్యవస్ధ దెబ్బతిన్నదని
అర్ధం. ఇక ఇంధన రాడ్లు చల్లబరిచే ప్రక్రియ ఆగిపోయిందని అర్ధం. చల్లబరిచే
ప్రక్రియ ఆగిపోతే ‘మెల్ట్ డౌన్’ మొదలయిందని అర్ధం. దీనిని అర్ధం
చేసుకోవడానికి అణు శాస్త్రవేత్త కానవసరం లేదని ఈ సంగతి చెప్పిన టెక్నీషియన్
చెప్పాడని పత్రిక తెలిపింది. బల్డింగ్ ని ఖాళీ చేయడానికి కారు వద్దకు
వెళ్తుండగా ‘రియాక్టర్ 1′ బిల్డింగ్ ‘collapse’ అవడం మొదలవడాన్ని స్పష్టంగా
చూశానని ఆయన చెప్పాడు. “వాటిలో (గోడలు) పగుళ్లు (holes) కనపడ్డాయి.
ప్రారంభ నిమిషాల్లో ఎవరమూ సునామీ గురించి ఆలోచించలేదు. మేమంతా survival
గురించే ఆలోచిస్తున్నాం” అని ఆయన అన్నాడు.
సాయంత్రం 2:52
ప్రాంతంలో భూకంపం వచ్చింది. 3:29 pm కి ప్లాంటుకి మైలు దూరంలో ఉన్న
రేడియేషన్ అలారం మోగిందని బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపిందని ‘ది
ఇండిపెండెంట్’ పత్రిక తెలియజేసింది. సునామీకి ముందే రేడియేషన్ విడుదలయిందని
దీన్ని బట్టి తెలుస్తోందని పత్రిక వ్యాఖ్యానించింది. భూకంపం వల్ల నేరుగా
రియాక్టర్ నిర్మాణమే దెబ్బతిన్నదని చెప్పడానికి అధికారులు ఎందుకు
నిరాకరించారో పత్రిక వివరించింది. ‘టెప్కో: ద డార్క్ ఎంపైర్’ పుస్తక రచయిత
‘కట్సునోహు ఒనడా’ వ్యాఖ్యలను అది ప్రస్తావించింది. ఆయన ప్రకారం నిర్మాణం
దెబ్బతిన్నదని ప్రభుత్వం గానీ, కంపెనీ గానీ అంగీకరిస్తే, వారు నిర్వహించే
ప్రతి రియాక్టర్ పైనా ప్రజలకి అనుమానాలు తలెత్తుతాయి. అలాంటి రియాక్టర్
వ్యవస్ధలే ఇంకా అనేక రియాక్టర్లకి ఉన్నందున, అవే పైపుల వ్యవస్ధ ఉన్నందున,
అవన్నీ పాతబడినందున వాటి భద్రత పైన కూడా అనుమానం ఏర్పడుతుంది. జపాన్
భూకంపాలకీ నిలయం గనక ఇతర రియాక్టర్ల భద్రత పైన అనుమానాలు ఏర్పడతాయి. ఒనడా
ను ‘ది ఇండిపెండెంట్’ ఇలా ఉటంకించింది.
Mr Onda adds: “When I first visited the Fukushima Power Plant it was a web of pipes. Pipes on the wall, on the ceiling, on the ground. You’d have to walk over them, duck under them – sometimes you’d bump your head on them. The pipes, which regulate the heat of the reactor and carry coolant are the veins and arteries of a nuclear power plant; the core is the heart. If the pipes burst, vital components don’t reach the heart and thus you have a heart attack, in nuclear terms: meltdown. In simpler terms, you can’t cool a reactor core if the pipes carrying the coolant and regulating the heat rupture – it doesn’t get to the core.”
మాజీ న్యూక్లియర్
ప్లాంట్ డిజైనర్ ‘మిత్సుహికి తనకా’ ఇలా వివరించాడు. “టెప్కో బహిరంగ పరిచిన
సమాచారం ప్రకారం ‘కూలెంట్’ (చల్లబరచడానికి లోపలికి పంపే నీరు?) లో చాలా
భాగం అదృశ్యం అయింది. విద్యుత్ ఆగిపోవడం వల్ల ఈ నష్టం జరగదు. అప్పటికే
కూలింగ్ వ్యవస్ధకి తీవ్రమైన నష్టం జరిగి ఉండాలి. దాని వల్ల ‘మెల్ట్ డౌన్’
అనివార్యం గా మారింది.” ‘ది ఇండిపెండెంట్ ఇలా తెలిపింది.
Mitsuhiko Tanaka, a former nuclear plant designer, describes what occurred on 11 March as a loss-of-coolant accident. “The data that Tepco has made public shows a huge loss of coolant within the first few hours of the earthquake. It can’t be accounted for by the loss of electrical power. There was already so much damage to the cooling system that a meltdown was inevitable long before the tsunami came.”
ఆయన ప్రకారం భూకంపం
సంభవించాక 2:52 కి ఎ మరియు బి వ్యవస్ధలకు చెందిన ఎమర్జెన్సీ సర్క్యులేషన్
పరికరాలు రెండూ ఆటోమేటిగ్గా ప్రారంభం అయ్యాయి. కూలెంట్ నష్టం జరిగితేనే ఇది
జరుగుతుంది. 3.04, 3:11 మధ్య కంటెయిన్ మెంట్ పాత్రలో వాటర్ స్ప్రేయర్ ఆన్
అయింది. ఇతర కూలింగ్ వ్యవస్ధలు విఫలం అయినపుడు ఎమర్జెన్సీ గా ఇది
జరుగుతుంది. 3:37 కి సునామీ వచ్చి విద్యుత్ వ్యవస్ధలన్నింటినీ
దెబ్బతీయడానికి ముందే ప్లాంటు ‘మెల్ట్ డౌన్’ ప్రక్రియకి గురయిందని తనకా
వివరించాడు.
టెప్కో కి చెందిన
ఫుకుషిమా కర్మాగారంలో పరీక్షలు జరిపిన అధికారులు అక్కడి పరిస్ధితి గురించి
అనేకసార్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ‘ది ఇండిపెండెంట్’
తెలిపింది. ‘కీ సుగావోకా’ అనే అధికారిని అది ఉటంకించింది. కర్మాగారానికి
సంబంధించిన డేటాను టెప్కో మార్చి వేస్తున్న విషయాన్ని ఈయన 28 జూన్ 2000
తేదీన ప్రభుత్వానికి లేఖ రాశాడు. తీవ్రంగా దెబ్బతిన్న స్టీమ్ డ్రయ్యర్ ని
టెప్కో ఇంకా వాడుతోందని ఆయన ఫిర్యాదు చేశాడు. అప్పటికి పదేళ్ళ ముందు ఆ
సంగతి ఆయన టేప్కోని హెచ్చరించినా అదే కొనసాగిస్తోందని 2000 లో ఆయన లేఖ
రాశాడు. ఈ లేఖ పై మరో పదేళ్ళ దాకా ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదని ఆయన
తెలిపాడు. ప్రమాదం ఏ క్షణంలో నైనా జరగొచ్చని తాను భావించినట్లు సుగోవాకా
తెలిపాడు. ‘ది ఇండిపెండెంట్’ సుగోవాకా ను ఇలా ఉటంకించింది.
“I always thought it was just a matter of time,” he says of the disaster. “This is one of those times in my life when I’m not happy I was right.”
ఫుకుషిమా ప్రమాదం
జరిగినాక దెబ్బతిన్న రియాక్టర్లలో ‘పాక్షిక మెల్ట్ డౌన్’ మాత్రమే జరిగిందని
టెప్కో ప్రకటించింది. ప్రారంభంలో పెద్ద ఎత్తున హెలికాప్టర్ల ద్వారా సముద్ర
నీటిని తెచ్చి చల్లబరచడానికి ప్రయత్నించింది. రియాక్టర్ కోర్ లోకి కూడా ఆ
నీటిని పంపింగ్ చేసింది. కానీ సముద్రపు నీరు వల్ల కర్మాగారం పరికరాలు మరింత
దెబ్బతిన్నాయని నిపుణులు చెప్పారు. ‘తూరు హసూయికే’ టెప్కోలో మాజీ ఉద్యోగి.
1977 నుండి 2009 వరకూ జనరల్ సేఫ్టీ మేనేజర్ గా పని చేశాడు. “ఫుకుషిమా
ప్లాంటులో ప్రమాదం సంభవిస్తే పాటించవలసిన ఎమర్జన్సీ పధకాలు ఉన్నాయి. వాటిలో
రియాక్టర్ కోర్ ని చల్లబరచడానికి సముద్ర నీరు వాడాలన్న సంగతే లేదు. కోర్
లోకి సముద్ర నీరు పంప్ చేయడం అంటే రియాక్టర్ ని నాశనం చేయడమే. అలా
చేయడానికి కారణం ఏమిటంటే మరే ఇతర నీరు గానీ, కూలెంట్ గానీ అందుబాటులో
లేకపోవడమే” అని ఆయన తెలిపాడు.
భూకంపం,
ఫుకుషిమా అణు కర్మాగారాన్ని సాయంత్రం 2:50 ప్రాంతంలో తాకింది. దాదాపు మరో
ముప్పావు గంటకి సునామీ అలలు 20 మీటర్ల ఎత్తున విరుచుకుపడి కర్మాగారాన్ని
ముంచెత్తాయి. మార్చి 12 తేదీన పొద్దు గుంకక ముందు రియాక్టర్ లో నీటి స్ధాయి
పడిపోవడం మొదలయింది. అంటే ఇంధన రాడ్లు వేడెక్కడం మొదలయిందని అర్ధం. దాదాపు
సాయంత్రం 4 గంటలకు టెప్కో ఓ ప్రకటన విడుదల చేసింది. “కంటెయిన్ మెంట్
వెసెల్ (containment vessel) లో అధికంగా ఉంది. కానీ స్ధిరంగా ఉంది” అని ఆ
ప్రకటన పేర్కొంది. ఈ ప్రకటనలో ఒక భాగాన్ని చాలామంది మిస్ ఆయారని ‘డి
ఇండిపెండెంట్’ తెలిపింది: “అత్యవసర వాటర్ సర్క్యులేషన్ వ్యవస్ధ కోర్ లోపలి
నీటియావిరిని (స్టీమ్) చల్లబరుస్తుండేది; అది పని చేయడం ఆగిపోయింది” అన్నదే
ఆ భాగం.
ది ఇండిపెండెంట్ ఇలా
తెలిపింది: రాత్రి 9:51 కల్లా రియాక్టర్ బిల్డింగ్ లోపలి భాగాన్ని ‘నో
ఎంట్రీ జోన్’ గా చీఫ్ ఎక్జిక్యూటివ్ నుండి ఆదేశాలు వచ్చాయి. 11 గంటలకల్లా
రియాక్టర్ కి పక్కనే ఉండే టర్బైన్ బిల్డింగ్ లో రేడియేషన్ స్ధాయి
పెరిగిపోయింది. గంటకి 0.5 నుండి 1.2 మిల్లీ సీవర్ట్ ల వరకూ నమోదు అయింది.
మరో విధంగా చెప్పాలంటే అప్పటికే చాలా ముందునుండే మెల్ట్ డౌన్ మొదలైపోయింది.
ఆ స్ధాయిలో రేడియేషన్ కి 20 నిమిషాల పాటు ఎక్స్ పోజ్ అయితే జపాన్ లో ఒక
న్యూక్లియర్ రియాక్టర్ కార్మికుడుకి ఉన్న 5 సంవత్సరాల పరిమితిని దాటినట్లు
అవుతుంది.
మార్చి 12 ఉదయం 4, 6
గంటల మధ్యలో ప్లాంట్ మేనేజర్ ‘మసావో యోషిడా’ రియాక్టర్ కోర్ లోకి సముద్ర
నీరు పంప్ చేయాలని నిర్ణయించి టెప్కో కి నోటిఫై చేశాడు. అయితే సాయంత్రం 8
గంటలకి రియాక్టర్ లో హైడ్రోజన్ పేలుడు సంభవించిన కొన్ని గంటల వరకూ కూడా
సుముద్ర నీటిని పంపింగ్ చేసే పని మొదలు కాలేదు. అప్పటికే చాలా లేతయిందని
‘ది ఇండిపెండెంట్’ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత రోజుల్లో టెప్కో తాను ముందు
చేసిన ప్రకటనలను కొంతమేరకయినా సవరించుకుందని పత్రిక తెలిపింది. “Reactor
Core Status of Fukushima Daiichi Nuclear Power Station Unit One” అన్న
రిపోర్టు లో ‘సునామికి ముందే కర్మాగారంలోని కొన్ని కీలక భాగాలు, పైపులతో
సహా, దెబ్బతిన్నాయని’ అంగీకరించిందని తెలిపింది.
“దీనర్ధం జపాన్ తో పాటు
ఇతర దేశాల్లో కూడా పరిశ్రమ వర్గాలు రియాక్టర్లు దృఢమైనవని (robust) ఇస్తూ
వచ్చిన హామీలు ఉత్తిదే (blown apart) అని తేలిపోయిందని షాన్ బర్నీ
వ్యాఖ్యానించాడు. ఈయన ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమ సంస్ధ ‘గ్రీన్ పీస్’
కు అణు వ్యర్ధ పదార్ధాలకి సంబంధించిన సలహాదారు. “భూకంప తీవ్రత ఉన్న
ప్రాంతాల్లో రియాక్టర్ల భద్రత గురించి మౌలికమైన అనుమానాలు దీనితో
తలెత్తాయి” అని ఆయన అన్నాడు.
చల్లబరిచే వ్యవస్ధ
దెబ్బతిన్న 16 గంటల తర్వాతా, యూనిట్ 1 లో పేలుడు జరిగిన ఏడెనిమిది గంటలకు
ముందే పెద్ద ఎత్తున ఇంధన రాడ్లు కరిగిపోయాయని టెప్కో కూడా అంగీకరించినట్లు
షాన్ ఎత్తి చూపినట్లు పత్రిక తెలిపింది. “ఇదంతా వారికి తెలిసినందున పెద్ద
ఎత్తున నీటితో ముంచెత్తడానికి తీసుకున్న వారి నిర్ణయం మరింతగా భారీ
స్ధాయిలో, సముద్రంలోకి లీక్ కావడంతో సహా, కాలుష్యం జరిగే అవకాశం గ్యారంటీగా
ఉంది” అని షాన్ ని పత్రిక ఉటంకించింది.
భూకంపం వల్ల
కర్మాగారానికి ఎంత నష్టం జరిగిందో పూర్తిగా ఎవరికీ తెలియదనీ, ఈ నష్టం
వల్లనే ‘మెల్ట్ డౌన్’ జరిగిందనీ కూడా తెలియదనీ పత్రిక వ్యాఖ్యానించింది.
అయితే టెప్కో డేటా ను బట్టీ, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్ని బట్టి చూస్తే
భూకంపం వల్ల జరిగిన నష్టం గణనీయంగా ఉండని స్పష్టమవుతోందని
వ్యాఖ్యానించింది.
హశుయికే వ్యాఖ్యతో ‘ది
ఇండిపెండెంట్’ తన కధనాన్ని ఇలా ముగించింది. “టెప్కో మరియు జపాన్ ప్రభుత్వమూ
అనేక వివరణలు ఇచ్చారు. వాటిలో దేనికీ అర్ధం లేదు. వారు అందజేయని ఒకే ఒక్క
అంశం ‘నిజం’. ఇప్పటికైనా వారు నిజం చెప్పాలి.”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి