7, మే 2012, సోమవారం

రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి


PRANABగత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్ వ్యాఖ్యానించాడని ‘ది హిందూ’ తెలిపింది.
“అనేక ఆసియా దేశాల్లో, చైనాను తప్ప, చెల్లింపుల సమతూకం ఒత్తిడికి లోనవుతోంది. ఇది కరెన్సీ  విలువ పతనం కావడానికి దారి తీసింది” అని ప్రణబ్ అన్నాడు. ఫిలిప్పైన్స్ రాజధాని మనీళాలో జరుగుతున్న ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు (ఎడిబి) వార్షిక సమావేశాలకు హాజరయిన ప్రణబ్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రేటింగ్ ఏజన్సీ ఎస్ & పి భారత సావరిన్ రుణం రేటింగ్ తగ్గించిన నేపధ్యంలో భారత ఆర్ధిక వ్యవస్ధకి సంబంధించిన ఫండమెంటల్స్ కొన్నింటిని సవరించుకోవలసి ఉండని కూడా ప్రణబ్ వ్యాఖ్యానించాడు. అంటే, భారత ఆర్ధిక వృద్ధి (జి.డి.పి పెరుగుల రేటు) తగ్గుముఖం పట్టినప్పటికీ అదేమీ పెద్ద విషయం కాదనీ, దేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్ అన్నీ బలంగానే ఉన్నాయనీ నమ్మబలుకుతూ వచ్చిన ప్రధాని మాటలు నిజం కాదన్నమాట! ఇన్నాళ్లూ బలంగా కొనసాగుతూ వచ్చిన ఫండమెంటల్స్, ఎస్ & పి రేటింగ్ సంస్ధ మన రేటింగ్ ను తగ్గించడంతోనే సవరించుకోవలసిన పరిస్ధితికి ఎందుకు దిగజారాయన్నది సమాధానం లేని ప్రశ్న.
2010-11 లో 8.5 శాతం జి.డి.పి వృద్ధి రేటు నమోదు చేసిన ఇండియా 2011-12  సంవత్సరానికి 6.9 శాతం మాత్రమే నమోదు చేసింది. 2011-12 మొదటి క్వార్టర్ నుండీ భారత జి.డి.పి వృద్ధి రేటు పతనం అవుతూ వచ్చింది. ఇదేమీ పట్టించుకోవలసిన విషయం కాదని భారత ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, ప్రధాని ఆర్ధిక సలాహదారు కౌశిక్ బసు లాంటి సంస్కరణల రధ సారధులు నొక్కి చెబుతూ వచ్చారు. కొద్ది నెలలు ఆగితే వృద్ధి రేటు పుంజుకుంటుంది చూడండి అంటూ ఊరిస్తూ వచ్చారు.
తీరా ఆర్ధిక సంవత్సరం ముగిసినా వృద్ధి రేటు పెరగడానికి బదులు ఇంకా పతనమయేసరికి పాలకులు మాట మారుస్తున్నారు. రెండున్నరేళ్ల నుండి కొనసాగుతున్న యూరో జోన్ ఋణ సంక్షోభం ఇపుడు కొత్తగా ఇండియాపై ప్రభావం చూపుతున్నదని, రూపాయి విలువ పతనానికి అదే కారణమనీ చెపుతున్నారు. ఇండియాయే కాకుండా ఇతర ఆసియా దేశాలను కూడా తోడు తెచ్చుకుంటున్నారు.
అయితే ఇతర ఆసియా దేశాల్లో జీడీపీ వృద్ధి రేటు ఎన్నడూ ఇండియా స్ధాయిలో నమోదు చేయలేదు. అవి ఎప్పటిలాగే ఇప్పుడూ చెల్లింపుల సమతూకం సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. భారత దేశం మాత్రమే ఇప్పుడు బి.ఓ.పి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ చెల్లింపుల సమతూకం సంక్షోభాన్ని (బి.ఓ.పి సంక్షోభం) చెప్పుకునే 1991 లో మన్మోహన్ నేతృత్వంలో నూతన ఆర్ధిక విధానాలు దూకుడుగా అమలు చేయడం మొదలు పెట్టారు. ఇపుడు మళ్ళీ అదే పరిస్ధితి తలెత్తుతోందని ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బి.ఓ.పి సంక్షోభానికి పరిష్కారంగా తెచ్చిన నూతన ఆర్ధిక విధానాలు ఇరవై యేళ్ళ తర్వాత అదే పరిస్ధితి తలెత్తడానికి ఎందుకు కారణం అయ్యాయో ఆర్ధిక వేత్త అయిన ప్రధాని చెప్పవలసి ఉంది.
“యూరోజోన్ లోని వ్యవస్ధాగత సమస్యలు, అధికంగానూ అస్ధిరంగానూ ఉన్న కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ఇంధనం ధరలు, సరఫరా చెయిన్లకు గండి పడుతుందన్న భయాలు వ్యాపారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి” అని ప్రణబ్ అన్నాడు. సరఫరా చెయిన్లు అంటూ ప్రణబ్ చెబుతున్నది ఆయిల్ రవాణా మార్గాల గురించి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు యుద్ధ ప్రయత్నాలు చేస్తుండడం, అవే దేశాలు సిరియాలో కూడా కిరాయి తిరుగుబాటు నడుపుతుండడం వల్ల పర్షియా ఆఘాతం ద్వారా జరిగే ఆయిల్ రవాణాకు భంగం ఏర్పడుతుందని భయాలు ఏర్పడ్డాయి.
ఇరాన్ పై దాడికి సిద్ధపడితే తమ హోర్ముజ్ ద్వీపాల వద్ద ఆయిల్ రవాణాని బంద్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఆ ఒక్క హెచ్చరికతోటే అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు వార్ డ్రమ్స్ మోగించడం తాత్కాలికంగా ఆపేసి చర్చల నాటకం ఆడుతున్నాయి. ఇరాన్ అణు విధానం పైన రద్దయిపోయిన చర్చలు మళ్ళీ మొదలయాయి. అయితే చర్చలకు కారణం సమస్యను చర్చలతో పరిష్కారం చేసుకుందామన్న తెలివిడి కంటే అమెరికా, ఫ్రాన్సు ల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడమే.
ఎన్నికలు ముగిశాక మళ్ళీ యుద్ధ హెచ్చరికలు ఊపందుకుంటాయి. ఇరాన్ పై దాడులు జరిగినా ఆశ్చర్యమ్ లేదు. దాడులు జరిగితే అన్నట్లుగానే ఇరాన్ హోర్ముజ్ జల మార్గాన్ని మూసేయవచ్చు. అదే జరిగితే ఇప్పటికే కొండెక్కిన ఆయిల్ ధరలు చుక్కల్ని తాకడం ఖాయం. ఆయిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి గనక ఇతర సరుకుల ధరలన్నీ పెరుగుతాయి. ఇందంతా దేనికయ్యా అంటే పశ్చిమ దేశాల కంపెనీల దోపిడీకి ఇరాన్, సిరియా వనరులు అప్పజెప్పడానికి ఆ దేశాలు నిరాకరించడమే. కంపెనీలకి వనరులు, మార్కెట్లు అప్పనంగా అప్పజెప్పకపోతే ప్రజల నెత్తిపైకి యుద్ధాలు దిగబడతాయి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ, ఇరాన్ దాడి, లిబియా కిరాయి తిరుగుబాటు విధ్వంసం, సిరియా కిరాయి తిరుగుబాటు అలా వచ్చినవే.
ఈ పరిస్ధితికి పరిష్కారం యుద్ధ ప్రయత్నాలు ఆగిపోవడమే. కానీ పెట్టుబడిదారీ కంపెనీలు పాఠాలు నేర్చుకోవని రష్యా, అమెరికాల కోల్డ్ వార్ అనంతరం తిరిగి మొదలయిన ప్రత్యక్ష యుద్ధాలే చెబుతున్నాయి. ఇవేవీ చెప్పకుండా కేవలం యూరో జోన్ ఋణ సంక్షోభంపైనే నెపం నెట్టడం కరెక్టు కాదు. యూరో జోన్ సంక్షోభం తో పాటు జపాన్ సంక్షోభం కూడా పరిష్కారం అయితేనే ఇండియా పరిస్ధితి మెరుగవుతుందని ప్రణబ్ చెబుతున్నాడు. “జపాన్, యూరోప్ లలో ఆర్ధిక రికవరీ మొదలయితే తప్ప ఈ ప్రభావం ఇలాగే కొనసాగుతుంది. యూరోజోన్ సంక్షోభం తన నీడని ప్రసరిస్తుంది” అని ప్రణబ్ వ్యాఖ్యానించాడు. గత దశాబ్దానికిపైగా జపాన్ లో కొనసాగుతున్న ప్రతి ద్రవ్యోల్బణం లేదా అధిక ఉత్పత్తి సంక్షోభాన్ని ప్రణబ్ ప్రస్తావిస్తున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి