ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
Mon, 28 May 2012, IST
విచారణ జరుగుతున్న దిల్‌కుశ వద్ద, లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా హైలెర్ట్ ప్రకటించారు. జగన్‌ను విచారిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆరున్నర సమయంలో బయటికి వెళ్లిపోయారు. ఏడు గంటల 20 నిమిషాలకు జగన్‌ను అరెస్టు చేశారు. తొలి రోజు ఎనిమిది గంటలు, రెండోరోజు ఏడున్నర గంటలు, మూడో రోజు తొమ్మిది గంటలు జగన్‌ను అధికారులు విచారించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని కొన్ని సంస్థలు, వ్యక్తులకు భూముల కేటాయింపు వంటి మేళ్లు చేసి దానికి ప్రతిఫలంగా జగతి, సాక్షి తదితర తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారన్నది అభియోగం. ఎఫ్‌ఐఆర్‌లో జగన్‌పై నమోదు చేసిన కేసులన్నింటినీ అరెస్టు సమయంలో జగన్‌పై పెట్టారు. ఐపిసి సెక్షన్లు 120 బి (రెడ్ విత్ 420), 409, 420, 477ఎ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13 (1), (సి), (డి) కేసులు నమోదు చేశారు. జగన్‌ను రాత్రంతా దిల్‌కుశలోనే ఉంచి సోమవారం ఉదయం పదిన్నరకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇప్పటికే మొదటి ఛార్జిషీట్‌కు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు జగన్ హాజరు కావాల్సి ఉన్నందున సోమవారం పదిన్నరకు జగన్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలావుంటే అక్రమాస్తుల కేసులో నాలుగో ఛార్జిషీట్‌ను కోర్టులో సిబిఐ సోమవారం దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో అరెస్టయి అనంతరం విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. వారిద్దర్నీ సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఇదీ నేపథ్యం
2010 నవంబర్ 29న జగన్ కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత కొద్ది నెలలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు జగన్ ఆస్తులపై విచారించాలని హైకోర్టుకు లేఖ రాశారు. దాన్ని కోర్టు సూమోటోగా పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ కేసులో టిడిపి నేతలు అశోక్‌గజపతిరాజు, ఎర్రన్నాయుడు తదితరులు ఇంప్లీడ్ అయ్యారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటంతో జగన్ అక్రమాస్తులపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తో విచారణ జరిపించాలని 2011 ఆగస్టు 10న హైకోర్టు ఆదేశించింది. అదే నెల 17న జగన్‌తో పాటు సుమారు 70కి పైగా సంస్థలు, వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 2న జగతి ఆడిటర్ విజయసాయిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. మార్చి 31న జగన్ మొదటి నిందితునిగా, విజయసాయిరెడ్డి రెండో నిందితునిగా చేర్చి మరికొంత మందిపైనా అభియోగాలు మోపి కోర్టులో తొలి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 23న రెండో ఛార్జిషీట్, మే 7న మూడో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో మొదటి నిందితుడు జగన్ అరెస్టు చేయకుండా ఛార్జిషీట్లు దాఖలు చేయడంపై సిబిఐ విమర్శలెదుర్కొంది. మూడో ఛార్జిషీట్ దాఖలు చేశాక వాన్‌పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానందరెడ్డి, మంత్రి మోపిదేవి వెంకట రమణను వరుసగా అరెస్టు చేశారు. శుక్రవారం నుండి విచారణ చేపట్టి ఆదివారం రాత్రి జగన్‌ను అరెస్టు చేశారు. దీంతో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
సాంకేతిక కారణం
సోమవారం కోర్టులో హాజరు కావాలన్న న్యాయమూర్తి ఆదేశాలుండగా దానికి ఒక్క రోజు ముందు జగన్‌ను అరెస్టు చేయడంపై చాలాసేపు సిబిఐ మల్లగుల్లాలు పడినట్లు తెలిసింది. వరుసగా మూడు రోజులు విచారించిన అధికారులు జగన్‌ను మళ్లీ ఎప్పుడు రమ్మనాలనేదానిపై చర్చించారని, కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉన్నందువల్ల అంతకు ముందే అరెస్టు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి