22, మే 2012, మంగళవారం

ఐపియల్‌తో క్రికెట్ భ్రష్టు పట్టిందా?



Is Ipl Loosing Popularity
జెంటల్మెన్ క్రీడగా క్రికెట్ పేరు తెచ్చుకుంది. అయితే, దాని నుంచి పుట్టిన ఐపియల్ మాత్రం పరువు కోల్పోతోంది. ఐపియల్ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటూ అప్రతిష్ట పాలవుతోంది. ఐపియల్ పుట్టుకే వివాదాస్పదమైంది. అటువంటి ఇప్పుడు దాన్ని మరిన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొంతమంది క్రికెటర్లు డబ్బులు తీసుకుని మ్యాచ్‌లను ఫిక్స్ చేస్తుంటే.. మరికొందరు అమ్మాయిలకు క్లీన్‌బౌల్డ్ అవుతున్నారు. ఐపీఎల్‌కు శ్రీకారం చుట్టిన లలిత్ మోడీయే ఆర్థిక అవకతవకలకూ ఆద్యుడైనట్లు ఆరోపణలున్నాయి. ఐపీఎల్ వివాదం నేపథ్యంలోనే శశిథరూర్ తన కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ఐపియల్ 5కు ఓ వైపు ప్రజల ఆదరణ తగ్గగా, మరోవైపు వివాదాలు, ఆరోపణలు శాపంగా మారాయి. ఇటీవల ఓ చానల్ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ సందర్భంగా 15 మందిలో ఏకంగా 12 మంది ఫిక్సింగ్‌కు సిద్ధపడినట్లు తేలింది. తాజాగా, షారుక్ ఖాన్ వీరంగం, పామర్స్‌బాచ్ వెకిలి చేష్టలతో ఐపీఎల్ మరింత భ్రష్టుపట్టింది. ఓ అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ పామర్స్‌బ్యాచ్ శుక్రవారం జైలు పాలయ్యాడు.

గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ గెలిచిన తర్వాత ఓ హోటల్‌లో పార్టీ జరిగింది. దానికి అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళ, ఆమె ప్రియుడు కూడా వచ్చారు. మందు తాగుదాం రమ్మంటూ వారిని పామర్స్ పిలిచాడు. అయితే, నిద్రపోవాలంటూ ఆ మహిళ వెళ్లిపోయింది. దీంతో, పామర్స్ కూడా వారిని వెంబడించాడు. వారి బెడ్‌రూమ్‌లోకి కూడా దూరాడు. లైంగికంగా ఆమెను వేధించాడు. ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో, ఆమె ప్రియుడు సాహిల్ జోక్యం చేసుకోవడంతో అతడిపైనా తీవ్రంగా దాడి చేశాడు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

పామర్స్‌బాచ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో మరో హైడ్రామా చోటు చేసుకుంది. తనను ఎలా వేధించాడన్న విషయాన్ని ఆ మహిళ తెలియజేస్తున్న సమయంలో పామర్స్‌బాచ్ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. పామర్స్ తమను వెంబడించాడని ఆ మహిళ ఫిర్యాదు చేస్తే.. వారే తన క్లయింట్‌ను పిలిచారని, అందుకే వెళ్లాడని పామర్స్ తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో, హోటల్‌లోని సీసీ టీవీ ఫుటేజ్ తెప్పించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.

ఇంత జరిగినా సిద్ధార్థ మాల్యా మాత్రం పామర్స్‌ను వెనకేసుకువచ్చి, మరో వివాదానికి తెరతీశాడు. "పామర్స్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ చెబుతోంది. కానీ, వాస్తవానికి ఆ అమ్మాయే నన్ను రమ్మని పిలిచింది. కాబోయే భార్యగా ఆమె ప్రవర్తన లేదు'' అని ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు. సిద్ధార్థ మాల్యా వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

వాంఖెడే స్టేడియంలో వీరంగం సృష్టించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌పై ముంబై క్రికె ట్ అసోసియేషన్ (ఎంసీఏ) వేటు వేసింది. ఐదేళ్లపాటు వాంఖెడే స్టేడియంలో అడుగు పెట్టకుండా బహిష్కరించింది. బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో షారుక్ ఓ సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన తాగి ఉన్నాడన్న ఆరోపణలూ వెల్లువెత్తా యి. ఈ నేపథ్యంలో ఎంసీఏ అధికారుల ఫిర్యాదు మేరకు కమిటీ చైర్మన్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అధ్యక్షతన ఎంసీఏ మేనేజ్‌మెంట్ కమిటీ శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. షారూఖ్‌పై నిషేధం విధించింది.

అయినా, తన దుష్ప్రవర్తనకు ఆయన ఏమాత్రం విచారం వ్యక్తం చేయలేదు. పైగా తన చర్యలను సమర్థించుకుంటున్నాడు. అందుకే ఆయనపై నిషేధం విధిస్తున్నాం'' అని వివరించారు. ఎంసీఏ ఫిర్యాదు బీసీసీఐకి అందిందని, మళ్లీ మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ సమావేశానికి హాజరైన బీసీసీఐ సీఏవో రత్నాకర్ షెట్టి చెప్పారు. కాగా.. షారుక్‌కు మద్దతుగా మమతా బెనర్జీ గళమెత్తారు. ఎంసీఏ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు.

వరుస వివాదాలతో భ్రష్టుపట్టిన ఐపీఎల్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ వ్యవహారాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని లోక్‌సభలో పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. ఐపీఎల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోకపోతే ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ హెచ్చరించారు. భారతదేశ సంస్కృతిని ఐపీఎల్ నాశనం చేస్తోందని, దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలని జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ కోరారు.

క్రికెట్‌ ప్రేమికుడు ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కూడా ఐపీఎల్ తీరుపై మండిపడ్డారు. దానిని రద్దు చేయాలని కోరారు. ఐపీఎల్‌పై నిషేధం విధించాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. దే శ భద్రతకు ఇది ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి