2, మే 2012, బుధవారం

యాపిల్ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగ్గొట్టింది -న్యూయార్క్స్ టైమ్స్


ఎలక్ట్రానిక్ గాడ్గెట్ల దిగ్గజం ‘యాపిల్’ ప్రపంచ వ్యాపితంగా చిన్న చిన్న ఆఫీసులు నెలకొల్పి బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగవేసిందని ది న్యూయార్క్స్ టైమ్స్ శనివారం వెల్లడించింది. కాలిఫోర్నియా కంపెనీ అయిన ‘యాపిల్’ నెవాడా రాష్ట్రంలోని రెనో నగరంలో ఆఫీసు పెట్టడం పన్ను ఎగవేతకు వేసిన ఎత్తుగడల్లో ఒకటని ఆ పత్రిక తెలిపింది. నెవాడాలో కార్పొరేట్ పన్ను సున్నా శాతం కాగా కాలిఫోర్నియాలో 8.84 శాతం కార్పొరేట్ పన్ను వసూలు చేస్తారని తెలిపింది. రెనో ఆఫీసు లాంటివి అనేకం ప్రపంచ వ్యాపితంగా నెలకొల్పి పన్నులు ఎగవేయడం ద్వారా సొమ్ములు కూడబెట్టిందని ఎన్.వై.టైమ్స్ తెలిపింది.
2012 మొదటి క్వార్టర్ లో యాపిల్ 39.2 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించిందని గూగుల్ గత వారం ఒక నివేదికలో తెలిపింది చైనాతో పాటు ఆసియాలోని ఇతర చోట్ల ఐ ఫోన్, ఐ ప్యాడ్ లు రికార్డ్ స్ధాయిలో అమ్ముడుపోవడంతో ఈ లాభాలు సాధ్యమయ్యాయని నివేదిక తెలిపింది. అయితే వివిధ మార్గాలలో పన్నులు ఎగవేయడం ద్వారా లాభాలు పెంచుకుంటున్నాదని పత్రిక తెలిపింది.
రెనో ఆఫీసు, ఐర్లాండు, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లతో సహా అనేక ఇతర తక్కువ పన్నులున్న ప్రాంతాల్లో ఆఫీసులు నెలకొల్పి యాపిల్ తన గ్లోబల్ పన్నుల బిల్లులు తగ్గించుకున్నట్లు యాపిల్ ఎక్జిక్యూటివ్ ని ఉటంకిస్తూ టైమ్స్ తెలిపింది. పన్నుల కోడ్ లో ఉన్న ఖాళీలను వినియోగించుకునేలా యాపిల్ తన కార్పొరేట్ వ్యూహాలను రూపోందించుకుందని టైమ్స్ పత్రిక తెలిపింది. అటువంటి పన్నుల విధానాలను డిజైన్ చేయడంలో పాత్ర ఉన్న మాజీ కంపెనీ అధికారులను సదరు పత్రిక తన కధనానికి ఆధారంగా పేర్కొంది.
రెనో లో ‘బ్రూబర్న్ కేపిటల్’ అనే అనుబంధ సంస్ధను ముందు పెట్టి దాని ద్వారా యాపిల్ కంపెనీ డబ్బుని వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టడం, నిర్వహించడం చేస్తోందని పత్రిక తెలిపింది. అలాంటి పెట్టుబడులు విజయవంతం అయినపుడు సదరు లాభాలను నెవాడా ఆఫీసు పన్నులనుండి కాపాడుతుందని పత్రిక తెలిపింది. యాపిల్ కంపెనీ ట్రాన్సాక్షన్లను లక్సెంబర్గ్ ద్వారా నిర్వహించడం ద్వారా తక్కువ పన్నులు చెల్లించగలిగిందని యాపిల్ ఐ ట్యూన్స్ మాజీ ఎక్జిక్యూటివ్ రాబర్ట్ హట్టా ని ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. “అనుకూల పన్నులు ఉండడం వల్ల లక్సెంబర్గ్ లో ఆఫీసు నెలకొల్పాము” అని రాబర్ట్ హట్టా పేర్కొన్నాడు.
“ట్రాక్టర్లు లేదా స్టీల్ లతో పోలిస్తే డౌన్ లోడ్స్ భిన్నమైనవి. మీరు ఇక్కడ తాకేదేమీ ఉండదు. కనుక మీ కంప్యూటర్ ఫ్రాన్సు లో ఉందా లేక ఇంగ్లాండులో ఉందా అన్నదానితో సంబంధం లేదు. లక్సెంబర్గ్ నుండి కొన్నట్లయితే అది లక్సెంబర్గ్ తో ఉన్న సంబంధమే” అని హట్టా పేర్కొన్నాడు.
పెట్టుబడిదారీ కంపెనీలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తాయనీ, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయనీ, దేశాభివృద్ధికి పాటుబడతాయనీ చేసే బోధలకు యాపిల్ కంపెనీ విధానాలు విరుద్ధం. దేశ నిర్వహణకు పన్నులనేవి ప్రభుత్వాలకు అత్యవసరం. అలాంటి పన్నులను ఎగవేయడం అంటే దేశ నిర్మాణంలో తమకు గల బాధ్యతను తిరస్కరించడమే. ఆ పనిని పెట్టుబడిదారీ కంపెనీలు దశాబ్దాలుగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయి. తద్వారా ట్రిలియన్ల కొద్దీ ఆస్తులు కూడబెడుతున్నాయి. వారికి ప్రభుత్వాలలోని పెద్దలు కూడా లోపాయకారిగా సహాయ పడుతూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి