17, మే 2012, గురువారం

నిబంధనలకు నిలువు పాతర



హైదరాబాద్, మే 16: మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డప్రసాద్ చేపట్టిన వాడరేవు, నిజాంపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) ప్రాజెక్టుకు 15 వేల ఎకరాల భూములను మంజూరు చేయడంలో ఆనాటి ప్రభుత్వం నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారం జివోలు జారీచేసి పేదల భూములను పెద్దలకు పంచిపెట్టింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టం అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం రాయితీలు కల్పించి మరీ భూములను ధారాదత్తం చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్, అతనికి సహకరించిన ఆనాటి వౌలిక, పెట్టుబడుల శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి బ్రహ్మానందరెడ్డిలను అరెస్టు చేసిన అనంతరం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం వారిని హాజరుపర్చారు. ఈ సందర్భంగా సిబిఐ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిమ్మగడ్డ ఆనాటి ప్రభుత్వంతో కుమ్మక్కై వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం భూములకు కారు చౌకగా పొందారని ప్రస్తావించింది. 15 వేల ఎకరాల భూములను పొందేందుకు నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో రూ.854 కోట్ల పెట్టుబడులు పెట్టారని, ఇందులో వాన్‌పిక్ ప్రాజెక్టు రాకముందే రూ.505 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ పేర్కొంది. తాను లబ్ధిపొందినందుకు ప్రతిగా కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, సిలికాన్ బిల్డర్స్, సండూర్ పవర్ కంపెనీల్లో భారీగా నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టారని సిబిఐ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఈప్రాజెక్టు కోసం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 15 వేల ఎకరాలు అవసరమవుతుందని నిర్ధారించిన తర్వాత బ్రహ్మానందరెడ్డి ఆనాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యుత్సాహం చూపించి భూములు కేటాయించాలని ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే నిమ్మగడ్డ ట్రిక్స్ అన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూశాయని సిబిఐ వివరించింది. 2007 డిసెంబర్, 2008 జనవరిలో అన్ని వౌలి వసతులతో కూడిన పోర్టు నిర్మాణానికి చొరవచూపుతూ మ్యాట్రిక్స్ ఎక్స్‌పోర్టు హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని నిమ్మగడ్డ స్ధాపించారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు 2008 ఫిబ్రవరిలో రస్ అల్ ఖైమా (ఆర్‌ఏకె) ప్రభుత్వ సలహాదారు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చింది. అనంతరం జరిగిన సంప్రదింపులతో 2008 మార్చి 11న ఆర్‌ఏకె ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వాన్‌పిక్‌పై అవగాహన ఒప్పందం జరిగింది. ఇందుకు నోడల్ డిపార్టుమెంట్‌గా ఆంధ్రప్రదేశ్ వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ (ఐఅండ్‌ఐ)ను కూడా ఏర్పాటు చేశారు. అనంతరం 2008 మార్చి 29న ఆర్‌ఏకె ప్రభుత్వానికి చెందిన ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఇక్కడే నిమ్మగడ్డ చక్రం తిప్పి మొత్తం కధ నడిపించాడు. ఆర్‌ఏకె ప్రభుత్వం తరఫున వాన్‌పిక్ ప్రాజెక్టు అమలుకు భారత దేశ భాగస్వామిగా మ్యాట్రిక్స్ ఎక్స్‌పోర్టు హోల్డింగ్స్ ముందుకు వచ్చిందని, ఇక మీదట ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా సంప్రదింపులు జరిపేందుకు తమ తరఫున ఆ సంస్థ పనిచేస్తుందని లేఖ రాసింది. అదే రోజు నిమ్మగడ్డ ప్రసాద్, ఆర్‌ఏకె వ్యాపార అవగాహన ఒప్పందం చేసుకున్నారు. 51 శాతం వాటాలు ఆర్‌ఏకె ఇన్‌ఫ్రాకు, 49 శాతం వాటాలు మ్యాట్రిక్స్ ఎక్స్‌పోర్టుకు ఉండే విధంగా ఒప్పందం జరిగింది. అనంతరం వాన్‌పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీని ఏర్పాటు చేశారు. 2008 జూన్ 30న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఐఅండ్‌ఐ శాఖ ఒక మెమొరాండం తయారుచేసి సంబంధిత మంత్రి ద్వారా ప్రస్తావనకు తెచ్చారు. రూ.2700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రతిపాదన వచ్చింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన రాయితీల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు ఎలాఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలని, కాకుంటే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని మంత్రివర్గంలో నిర్ణయం జరిగింది. బూట్ పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం జరిగింది. ఆ ప్రకారం 2008 జులై 10న జివో జారీ అయ్యింది. ఆ తర్వాత రోజే బ్రహ్మానందరెడ్డి, నిమ్మగడ్డ మధ్య రాయితీలకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో మంత్రివర్గ నిర్ణయాలకు సంబంధం లేకుండా తప్పిదాలు జరిగాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు ఇచ్చిన రాయితీలతో పోలిస్తే వాన్‌పిక్‌కు ఇచ్చిన రాయితీలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తమ విచారణలో తేలిందని సిబిఐ పేర్కొంది. అంతేకాక వాన్‌పిక్ కోసం సేకరించిన భూముల యజమానులకు చెల్లించాల్సిన మొత్తం వాస్తవానికి రూ.150 కోట్లు కాగా, నిమ్మగడ్డ రూ.450 కోట్లు చెల్లించారు. అదీ చెక్కుల రూపంలో కాకుండా నగదు రూపంలో చెల్లించడం, రూ.300 కోట్లు అవసరం లేకున్నా చెల్లించడం వెనుక ఆయన వ్యక్తిగతంగా లబ్ధిపొందే యత్నం చేశారని గమనించినట్లు సిబిఐ పేర్కొంది. అప్పటి ప్రభుత్వ నిర్ణయం కారణంగా నిమ్మగడ్డ కంట్రోల్‌లో ఉన్న వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం 13 వేల ఎకరాలు ఆయన ఆధీనంలో ఉన్నాయని సిబిఐ తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి