అమెరికా
జననాలలో జాతి పరంగా చూస్తే తెల్లవారి జననాల సంఖ్య మైనారిటీలో పడిపోయింది.
జులై 2011 తో ముగిసిన సంవత్సరంలో తెల్లజాతి ప్రజల్లో జననాల సంఖ్య మొత్తం
జననాల్లో 49.6 శాతం నమోదయినట్లు బి.బి.సి తెలిపింది. నల్లజాతి
ప్రజలు, హిస్పానిక్ లు, ఆసియా ప్రజలతో పాటు సమ్మిళిత జాతులలో జననాల సంఖ్య
50.4 శాతంగా నమోదయింది. హిస్పానికేతర తెల్లజాతి ప్రజలు మొదటి సారిగా
జననాల్లో మైనారిటీలో ఉన్నారని బి.బి.సి తెలిపింది. తెల్లవారిలో
జననాల సంఖ్య తగ్గిపోవడానికి ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న తీవ్ర సమస్యలే
కారణమని సోషలిస్టులు అభిప్రాయ పడినట్లు కూడా ఆ సంస్ధ తెలిపింది.
ఆగస్టు 2010 నుండి
జులై 2011 వరకూ మైనారిటీ ప్రజల్లో జననాలు 2.02 మిలియన్లని అమెరికా సెన్సస్
బ్యూరో తెలియజేసింది. వీరి వాటా మొత్తం జననంలో 50.4 శాతం కాగా 1990 లో 37
శాతం మాత్రమే. మొత్తంగా చూస్తే అమెరికాలో జననాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఈ
తగ్గుదల తెల్లవారిలో అధికంగా ఉందని సెన్సస్ బ్యూరో తెలిపింది. 2008 నుండి
తెల్ల జాతి ప్రజల్లో జననాల సంఖ్య 11.4 శాతం పడిపోగా ఆ సంఖ్య మైనారిటీ
జాతుల్లో 3.2 శాతం మాత్రమేనని న్యూ హామ్ షైర్ యూనివర్సిటీ లో సోషియాలజిస్టు
కెన్నెత్ జాన్సన్ ని ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది.
“ఇది ముఖ్యమైన లాండ్
మార్క్. తమ పెద్దవారి కంటే మరింత వైవిధ్యపూరిత భిన్నత్వంలో ఇప్పటి తరం
పెరగనుంది” అని హోవర్డ్ యూనివర్సిటీ కి చెందిన సోషియాలజిస్టు రోడరిక్
హేరిసన్ వ్యాఖ్యానించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. మొత్తం
అమెరికా జనాభాలో మైనారిటీ ప్రజల జనాభా 36.6 శాతం గా ప్రస్తుతం ఉంది. అయితే
హిస్పానిక్ ల జనాభా పెరుగుదల ఉచ్ఛ స్ధాయికి చేరుకుందనీ, ఇక ముందు వారి
సంఖ్య తగ్గుతుందనీ మరికొందరు జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లాటినో ప్రజల జనాభాలో
ఎక్కువ మంది యువకులేననీ కనుక మునుముందు వారి సంఖ్య పెరగవచ్చనీ పాపులేషన్స్
బ్యూరో ప్రతినిధి మార్క్ మాదర్ తెలిపాడు. అయితే లాటినో ప్రజల్లో జననాల రేటు
తగ్గిపోతున్నదనీ, దానితో పాటు వలసలు కూడా తగ్గుతున్న పరిస్ధితిని
పరిగణిస్తే దేశంలో మరింత మార్పుకు దోహదం చేయవచ్చనీ మాదర్ తెలిపాడు.
తెల్లవారి జననాలు మైనారిటీ లో పడవచ్చునని చాలా కాలంగా అనుకుంటున్నదేనని న్యూయార్క్ టైమ్స్
తెలిపింది. మరి కొద్ది కాలం వరకూ తెల్లవారే మెజారిటీ గా కొనసాగినప్పటికీ
మైనార్టీ పిల్లలు ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో దేశ ఆర్ధిక వ్యవస్ధపై
విస్తృత ప్రభావం పడనున్నదని ఆ పత్రిక అభిప్రాయపడింది. డిస్ట్రిక్ట్
కొలంబియా తో పాటు మరో నాలుగు రాష్ట్రాలలోనూ, న్యూయార్క్స్, లాస్ వేగాస్,
మెంఫిస్ లాంటి మెట్రో నగరాల్లోనూ తెల్లవారు మైనారిటీ జనాభాగా ఉన్నారనీ
‘బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్’ లో సీనియర్ జనాభా శాస్త్రవేత్త విలియం ఫ్రే
చెప్పాడని టైమ్స్ తెలిపింది. యువకుల సంఖ్య వైవిధ్యంగా ఉంటే ఆ వైవిధ్యం
మరికొన్ని తరాల పాటు కొనసాగుతుందని ఫ్రే అభిప్రాయంగా టైమ్స్ తెలిపింది.
మైనారిటీ ప్రజల్లో హిస్పానిక్ లలో జననాలే ఇతరుల కంటే అధికంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్
తెలిపింది. జులై 2011 తో ముగిసిన సంవత్సరంలో హిస్పానిక్ లలో జననాలు 26
శాతం ఉండగా, 15 నల్లవారిలోనూ, 4 శాతం ఆసియన్లలోనూ సంభవించాయి. ఇతర జననాలు
సమ్మిళత జాతులుగా తెలుస్తోంది. జాతుల పరంగా చూస్తే తెల్లవారిదే (49.6%)
ఇప్పటికీ అగ్ర స్ధానం. కానీ తెల్లవారి సగటు వయసు 42 సంవత్సరాలు. అంటే
ఎక్కువమంది ముదిమి వయసులో ఉన్నారనీ, మహిళల్లో అధిక శాతం జన్మనిచ్చే వయసు
దాటిపోయారనీ అర్ధం.
లాటినో ప్రజల సగటు వయసు
27 సంవత్సరాలు మాత్రమేనని ప్యూ హిస్పానిక్ సెంటర్ లో జనాభా శాస్త్రవేత్త
జెఫ్రీ పాస్సెల్ తెలిపాడు. 2000, 2010 మధ్య దేశంలోకి వలస వస్తున్న
హిస్పానిక్ ల కంటే అమెరికాలో జన్మిస్తున్న హిస్పానిక్ లు ఎక్కువగా ఉన్నారని
ఆయన తెలిపాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి