8, డిసెంబర్ 2011, గురువారం

భలేమంచి ‘చౌకబేరం’ భారత్!


ఆరు దశాబ్దాల స్వతంత్రభారత పాలనలో ఎన్నడూ చవిచూడని స్థాయిలో దేశం నేడు సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతోందన్నది అతిశయోక్తి కాదు. కామన్‌వెల్త్ గేమ్స్‌తో ప్రారంభించి వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఛప్పన్నారు సమస్యలు భారత ప్రభుత్వాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. వాటి పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమించాల్సిన ప్రభుత్వాధినేతలు, దాన్ని విస్మరించి దేశంలో కోట్లాది మందికి జీవనోపాథిగా ఉన్న చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అడ్డదిడ్డంగా అనుమతించి దేశాన్ని మరిం తగా సమస్యల ఊబిలోకి లాగటం వెనుక ఏదో రహస్యం ఉందనే అనిపిస్తోంది.

స్వాతంత్య్ర పోరాట కాలంలో విదేశీ వస్త్రాలను, వస్తువులను నడివీధిలో తగలబెట్టి సామ్రాజ్యవాద వ్యతిరేకతను చాటిన అలనాటి భారత జాతీయ కాంగ్రెస్ నేతలకూ, ‘పిదప కాలం పిదప బుద్ధులు’ అన్న సామెతను గుర్తుచేస్తూ వ్యవహరిస్తున్న నేటి కాంగ్రెస్ నాయకులకూ ఎంత తేడా! అని ముక్కున వేలేసుకోవాలనిపిస్తుంది. భరతమాత ఆ నాటి తన ముద్దు బిడ్డలను చూసి గర్వించాల్సిన రోజులు గతించి, తలదించుకోవాల్సిన రోజులు దాపురించాయి. బాధ్యతాయుతమైన స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి, తదనంతరం అయాచితంగా వరించిన భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మన్మోహన్‌సింగ్, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని కించపరచేలా ప్రవర్తించడమే కాక, సామాన్య ప్రజల జీవనోపాధికే ఎసరు పెట్టే నిర్ణయాలకు పాల్పడటం విచారకరం.

మన్మో హన్‌సింగ్ ఒక ఉన్నతోద్యోగిగా చూపిన పాటి చొరవను కూడా దేశ ప్రధానిగా కనబరచకపోవడం అభ్యంతర కరం. ఉద్యోగిగా, ‘సౌత్ కమిషన్’ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశాలపై ఆధారపడే స్థితిని తగ్గించుకోవాలని, బహుళజాతి సంస్థలను అనుమతించడం తగదని చెబుతూ ‘‘వర్ధమాన దేశాల అభివృద్ధి బాధ్యతను, ఆయా దేశాల ప్రభుత్వాలే వహించాలి తప్ప, అప్పనంగా దిగుమతి చేసుకోవడం ఏ దేశానికీ సాధ్యపడదు. కొత్త టెక్నాలజీని అనుసరించే ముందు ప్రజలకు, దేశానికి ఏది అవసరమో ప్రాధాన్యతలను బట్టి జాగ్రత్తగా నిర్ణయించుకుని మరీ ముందుకు సాగాలి. మానవ వనరులను ప్రధానమైనవిగా భావించి, నిరుద్యోగాన్ని పెంచని టెక్నాలజీని మాత్రమే వర్ధమాన దేశాలు ఆహ్వానించాలి’’. నాటి మన్మోహన్‌కూ, నేటి మన్మోహన్‌కూ ఎంత తేడా? ఎంత దిగజారుడు?

అప్పుడు టెక్నాలజీ దిగుమతి పట్లే ఎంతో జాగరూకతను బోధించిన మన్మోహన్, నేడు నేరుగా వంటింటి సరుకులనే దిగుమతి చేసుకోక తప్పదని వక్కాణిస్తున్నారు. ఎంత విడ్డూరం! నాడు వర్ధమాన దేశాల ప్రతినిధిగా మాట్లాడిన మన్మోహన్, నేడు అమెరికాకూ, అది సృష్టించిన ప్రపంచ బ్యాంకుకూ, ప్రపంచీకరణకూ గులాంగా మారి, అవి గీసిన గీటు దాటకుండా ప్రవర్తిస్తున్నారు. దేశాన్నే గులాంగా మార్చేస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా దేశంలో ఒక చిన్న సంస్థానమైన ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ నాడు అలుపెరుగ క సాగించిన పోరాటాన్ని, నేడు సీరియల్‌గా చిత్రీకరించి ఒక టీవీ చానెల్ కొద్ది నెలలుగా ప్రదర్శిస్తోంది. దాన్ని చూస్తుంటే నేటికీ ఒళ్లు ఝల్లు మంటుంది. అలాంటి దేశాన్నీ, దాని ప్రజలను అమెరికాకు పాదాక్రాంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ, దాని ప్రధాని మన్మోహన్‌సింగ్ ఒడిగట్టడం ఆశ్చర్యాన్ని కలిగించక తప్పదు!

ఒకవైపు, బహుళజాతి గుత్త సంస్థల ప్రయోజనాలకు తమ దేశాన్ని ప్రభుత్వాలు కుదువబెడుతున్నాయని, అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉద్యమిస్తుంటే, అదే బహుళజాతి సంస్థలకు మన ప్రధాని వంగివంగి సలాములు చేస్తూ ఆహ్వానించడం సిగ్గుచేటని చెప్పక తప్పదు. చిల్లర వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం ఇది మొదటిసారి కాదు. ఏకవస్తు విక్రయానికి బహుళజాతి సంస్థలకు ప్రభుత్వం ఇదివరకే ఒక సారి అనుమతి ఇచ్చింది. దాంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలోనే, ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకొంది? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొని ఎలా బయటపడాలా అని తలలు పట్టుకొంటున్నాయి. మనదేశం నుంచి దిగుమతులను కూడా తగ్గించుకొన్నాయి. తమ దేశాల్లో తయారైన ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది. ఈ మాంద్యం సృష్టించిన సమస్యలకు బహుళ జాతి సంస్థలు మినహాయింపు కాదు. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి. వారు ఒబామా కాళ్లా వేళ్లాపడి తమను రక్షించమని వేడుకొంటున్నారు. ఆ బహుళజాతి సంస్థల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన ఒబామా, తన పదవీ రక్షణకు ఆ సంస్థల ప్రయోజనాలను కాపాడక తప్పదు. ఇటీవల ఒక సమావేశంలో మన్మోహన్‌ను కలుసుకొన్న ఒబామా, ఆ దిశగా పావులు కదపడం ప్రారంభించాడు. ఇప్పటికే ఏకవస్తువును అమ్ముకోవడానికి నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి, చిల్లర వస్తువుల అమ్మకానికి కూడా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో తటపటాయిస్తున్న భారత ప్రధానితో జరిగిన చర్చల సందర్భంలో, ఆ విషయాన్ని లేవనెత్తి నయాన్నో భయాన్నో ఒప్పించి, తనను బలపరిచే బహుళజాతి సంస్థలను రక్షించుకోవడానికి మన్మోహన్ మెడలు వంచడంలో ఒబామా విజయం సాధించడం గమనార్హం. దేశానికి తిరిగి రావటంతోనే లాంఛనంగా చర్చించి నిర్ణయాన్ని ప్రకటించారు. అహ్లూవాలియా, చిదంబరం, ప్రణబ్ అందరూ ఒకే గూటి పక్షులు కావడంతో ప్రధాని పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. ఆ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా, నిర్ణయం మార్చుకునేది లేదని ప్రధాని మొండిగా వాదిస్తున్నాడంటే, ఒబామా-మన్మోహన్ మధ్య కుదిరిన ‘లవ్ అఫైర్’కున్న శక్తి అది!

తప్పని తెలిసి కూడా తప్పు చేసినవాడు, పట్టుబడితే ఎలా సమర్థించుకోవాలో, ఎలా తప్పుకోవాలో ముందే ఆలోచించుకొంటాడు. ఈ విషయంలో ప్రధాని ఆ పనే చేస్తున్నారు. రైతులు తమ కష్టానికి చక్కటి ప్రయోజనాన్ని పొందుతారని ఎరచూపుతున్నారు. ఇప్పటికే రైతును వ్యవసాయం నుంచి నిష్ర్కమించే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని, అవి నియమించిన కమిటీలే తేల్చి చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల ప్రవేశం ప్రారంభమైంది. ఆదాయపు పన్ను చెల్లించనక్కర్లేదు కాబట్టి జోరుగా ఎగబడుతున్నాయి. వ్యవసాయ కూలీలు లభించటం లేదన్న సాకుతో యాంత్రికీకరణను ప్రోత్సహిస్తున్నారు. మోన్‌శాంటో లాంటి బహుళజాతి సంస్థలు విత్తన మార్కెట్‌ను నెమ్మ దిగా ఆక్రమిస్తున్నాయి. ప్రజలకు ప్రాథమికంగా కావాల్సిన తిండిగింజలకు బదులు వ్యాపారపంటలు, పండ్లు, పూలు పండించమని ప్రోత్సహిస్తున్నారు. మార్కెట్ కమిటీలను ఆచరణలో నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల భూములను లాక్కొని పరిశ్రమాధిపతులకు, రియల్ ఎస్టేట్‌దారులకు కట్టబెట్టేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని విదేశీ సంస్థలు వ్యవసాయంలో కాలుమోపి ఎరువులు, పురుగు మందులు సరఫరా చే స్తామనీ పండిన పంటను వెంటనే కొనుగోలు చేస్తామనీ ఊదరగొడుతున్నారు. తీరా పంటను తీసుకెళితే, చచ్చులు, పుచ్చులున్నాయని వంకలు పెట్టి చెల్లింపులకు చిల్లుబెట్టడమే కాక, కారుచౌకగా వందల వేల టన్నుల్లో కొనుగోలు చేసి శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. దీంతో బజారులో ఉత్పత్తులు దొరక్క విదేశీ ‘కార్పొరేట్’ దుకాణాల మీద ఆధారపడక తప్పడం లేదు. అదను చూసి ధరలు ఆకాశానికి పెంచుతున్నారు. పంజాబ్‌లో సరిగ్గా ఇలాగే జరిగింది.

ఇక్కడే ఇంకో సంగతి చెప్పాలి. కొనుగోలుదారులను ఆకర్షించడానికి మొదట్లో ధరలు తగ్గించి లేదా మార్కెట్లో కన్నా తక్కువ ధరకు అమ్మకం ప్రారంభించి, దేశీయ చిల్లర వ్యాపారస్తులను దివాళా తీయిస్తున్నారు. మరోవైపు, చౌకధరల దుకాణాలను క్రమబద్ధం చేయకపోవటంతో టోకు వ్యాపారస్తుల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఎన్నో అవకతవకలకు తోడు, ప్రభుత్వ అలక్ష్యం రైతును మరింతగా కుంగదీస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించకుండా, విదేశీ పెట్టుబడులే సర్వరోగ నివారిణి అని ప్రచారం చేయడం పచ్చి మోసం. ప్రభుత్వ పరిధిలో ఉన్న చర్యలను కూడా తీసుకోకుండా విదేశీ పెట్టుబడులు అన్ని సమస్యలనూ పరిష్కరిస్తాయని నమ్మజూపడం, ప్రజలను దగా చేయడమే. అదే సందర్భంలో, పౌరులుగా మన వైఫల్యాలను గూర్చి కూడా ఒక మాట చెప్పుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించే పేరుతో నామ్‌కేవాస్తే ధర్నాలు, బంద్‌లు, రైల్ రోకోలు, ప్రదర్శనలతో ప్రభుత్వాన్ని ఏదో చేయగలగుతామనుకోవటం భ్రమగానే మిగిలిపోతుంది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ నాయకులు నాలుగు రోజుల పాటు చేసే హంగామా దీనికో ఉదాహరణ మాత్ర మే. మళ్లీ ధరలు పెరగడం ఎంత మామూలు విషయమో, ధర్నాలూ అంతే. ప్రజా చైతన్యమనే గొడ్డలితో పెకలించాల్సిన సమస్యను, గోటితో మీటితే సరిపోతుందా? అన్యాయాన్ని నిరసిస్తూ అమెరికా, యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రజా ఉద్యమాల నుంచి మన జనం నేడు స్ఫూర్తి పొందాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి