7, డిసెంబర్ 2011, బుధవారం

ఇంటర్నెట్ సామాజిక వెబ్ సైట్లు స్వీయ నియంత్రణ పాటించాలి -కేంద్ర మంత్రి


గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటి ఇంటర్నెట్ సంస్ధలు, సామాజిక వెబ్ సైట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే అంశాల వల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండడానికి స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర సమాచార, ఐ.టి శాఖ మంత్రి కబిల్ సిబాల్ మంగళవారం కోరాడు. అనేక సంస్కృతులు, మతాలు ఉన్న భారత దేశంలో ఏ ఒక్కరి మనోభావాలు గాయపడకుండా ఇంటర్నెట్ సంస్ధలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరాడు. మంత్రి ప్రకటనకు ఇంటర్నెట్ సంస్ధలు వివిధ రకాలుగా స్పందించాయి.
తమ సైట్లలో ప్రచురితమవుతున్న కొన్ని అంశాలని వెబ్ సైట్లు తొలగించాలని కపిల్ సిబాల్ కోరాడు. వివిధ రకాలుగా ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసే అంశాలను, విద్వేష పూరిత ప్రసంగాలను తొలగించడానికి ఇంటర్నెట్ సంస్ధలు నిరాకరించడంతో తమకు మరో దారి లేకుండా పోయిందని కపిల్ సిబాల్ అన్నాడు. యాహూ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ ప్రతినిధులతో సోమవారం ఢిల్లీలో కపిల్ సిబాల్ సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో చేసిన హెచ్చరికలతో అంతర్జాల సంస్ధలలో చర్చ బయలుదేరింది. మతపరంగా ఉద్రిక్తతలకు దారితేసే అంశాలను తొలగించాలని అనేకసార్లు కోరినప్పటికీ అంతర్జాల సంస్ధలు స్పందించలేదని కపిల్ సిబాల్ ‘ది హిందూ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
“వెబ్ సైట్లను అడ్డుకునే బదులు విద్వేష ప్రసంగాలను పోస్ట్ చేసే వ్యక్తులను ఎందుకు ప్రాసిక్యూట్ చేయరాదని కొందరు మిత్రులు అడుగుతున్నారు. అది ఆచరణలో సాధ్యం కాకపోవడానికి మూడు కారణాలున్నాయి. మొదటిది, ఉద్రిక్తతలకు దారితీయగల అంశాలను పోస్ట్ చేస్తున్నవారిలో అత్యధికలు విదేశాల్లో ఉన్నారు. వారు మన చట్టాలకు అందుబాటులో లేరు. రెండోది, తమ సర్వర్లు ఉన్న దేశాలలోని చట్టాలను కారణంగా చూపుతూ అంతర్జాల సంస్ధలు సదరు వ్యక్తుల సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించాయి. మూడోది, ఇటువంటి అంశాల అంశాలు ప్రతిసారీ బహిరంగ కోర్టుల్లో  చట్టబద్ధమైన ప్రక్రియలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిరసనలు ఎదురుకావచ్చు. ఒక్కోసారి హింస కూడా చెలరేగవచ్చు. మీడియాది బాధ్యత ఉన్నా వివరాలు రిపోర్టు చేయబడడం లేదు” అని కపిల్ సిబాల్ అన్నాడు.
“సోషల్ మీడియాపై నిబంధనలు విధించడం నాకు ఆనందకరం కాదు. కాని ఇక్కడ సమస్య ఎదురవుతోంది. పశ్చిమ దేశాలలో ప్రమాణాలకు అనుగుణంగా తాము వివిధ అంశాలను ప్రచురిస్తున్నామని ఇవి ప్రధానంగా చెబుతున్నాయి. అది సరైంది కాదు. అయితే ఈ విషయంతో సంబంధం ఉన్నవారందరితో చర్చలు జరిపి ఒక అంతిమ నిర్ణయానికి రావడాఅనికి ప్రయత్నిస్తాము” అని కపిల్ సిబాల్ వివరించాడు.ప్రభుత్వ నిబంధనలు భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యాలేవిటన్నదీ పూర్తిగా బహిరంగం కాలేదు. ఆందోళనలకు కారణమయ్యే భావాలను ప్రచురించకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్దేశ్యాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి