8, డిసెంబర్ 2011, గురువారం

‘వాల్‌స్ట్రీట్’ వెనక ఆహార సమస్య!


బహుళజాతి కంపెనీల కేంద్ర స్థావరం వాల్‌స్ట్రీట్ ముట్టడితో ప్రారంభమైన గొప్ప ప్రజా ఉద్యమం ప్రపంచీకరణ సిద్ధాంతం మూలాలను కదిలిస్తోంది. ఈ శాంతియుత ఉద్యమానికి ‘ఆర్థిక’ కోణం మాత్రమేకాదు ‘ఆహార’ కోణం కూడా ఉంది. తామర తంపరగా ఖండాంతరాలకు వ్యాపిస్తున్న ఉద్యమం కార్పొరేట్ కంపెనీలు ఆహార రంగం మొత్తాన్నీ గుప్పెట్లో పెట్టుకొని ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టుగా మారడాన్ని కూడా ముక్తకంఠంతో నిరసిస్తోంది.

అమెరికాలో 75 శాతం మంది ప్రజలు ఊబకాయంతోనూ, ఆహార సంబం ధమైన దీర్ఘరోగాలతోనూ బాధపడుతున్న వారేనని ఒక అంచనా. పేరాశతో కార్పొరేట్ కంపెనీలు సరఫరా చేసే అనారోగ్యకరమైన, కలుషితమైన ఆహారం పైనే వీరంతా ఆధారపడి జీవిస్తున్నారు. ఆహార సరఫరాపై కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి స్వస్తిపలకడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం. సమాజంలో ‘99 శాతం మంది’ ఆరోగ్యకరంగా నిజమైన ప్రజాస్వామ్యంలో పాలుపంచుకోవడా నికి కంపెనీల చెప్పుచేతల్లో నుంచి ఆహారాన్ని బయటపడెయ్యడం ముఖ్యమని ఆందోళనకారులు భావిస్తున్నారు. ప్రజారోగ్య సంక్షోభానికి, ఆహార సరఫరా వ్యవస్థపై కార్పొరేట్ కంపెనీలు చెలాయిస్తున్న పూర్తి నియంత్రణను అమెరికన్లు అర్థం చేసుకోవాలని ఉద్యమకారులు పిలుపునిస్తున్నారు.

అమెరికా వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కంపెనీలు ఎలా ఏలుతు న్నాయో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. మోన్‌శాంటో కంపెనీ 1996 నుంచి అమెరికాలో జన్యుమార్పిడి సోయాబీన్స్ విత్తనాలు అమ్ముతోంది. ప్రపంచం లోనే రెండో అతి పెద్ద వంట నూనెగింజల పంట సోయాబీన్స్. అమెరికన్లు తినే ఆహారంలో 20 శాతం కేలరీలు సోయాచిక్కుళ్లదే. మనుషులు తినే వందలాది రకాల ప్యాక్‌చేసిన ఆహారోత్పత్తుల్లోనే కాకుండా.. పశువులు, చేపల మేతలో కూడా సోయా చిక్కుళ్లను విరివిగా వాడుతున్నారు. మాంసం, పాలు, గుడ్లు, చెరువుల్లో పెంచిన చేపల్లోనూ ఈ జన్యుమార్పిడి సోయా చిక్కుళ్ల అవశేషాలుం టాయి. మొక్కజొన్న, ఆవాలు, పత్తి, ఆల్ఫాల్ఫా వంటి పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలను కూడా మోన్‌శాంటో కంపెనీ విక్రయిస్తోంది. దిగుబ డుల విలువను బట్టి అమెరికాలో అతిపెద్ద పంట మొక్కజొన్న సాగుకు 93 శాతం జన్యుమార్పిడి విత్తనాలనే వాడుతున్నారు.

అమెరికా ఆహార సరఫరా రంగాన్ని మోన్‌శాంటో, కార్గిల్ బహుళజాతి కం పెనీలు పోటాపోటీగా వశపరుచుకున్నాయి. ఉత్తర అమెరికాలో మాంసాన్ని ఉత్పత్తి చేసే రెండో అతి పెద్ద కంపెనీ కార్గిల్. ఏదైనా రెస్టారెంట్‌కో, కేఫ్‌కో వెళ్లి ప్రోసెస్ చేసిన లేదా ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటే.. అది మోన్‌శాంటో, లేదా కార్గిల్‌కు సంబంధించిన ఉత్పత్తే అయి ఉంటుంది. బహుళ జాతి కంపెనీలు ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఈ ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటాయని, జన్యుమార్పిడి పంట దిగుబడులను వినియోగించడం ద్వారా ఆహారాన్ని విషపూరితం చేశాయని వందనా శివ విమర్శిస్తున్నారు. ఈ పంటలవల్ల తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పశువులు, ఇతర జంతువులు చని పోతున్నాయి. వీటి ప్రభావం మనుషులపై ఎలా ఉంటున్నదో గమనిస్తు న్నామా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

అమెరికా ఆహార వ్యవస్థ కార్పొరేట్ కంపెనీల చెప్పుచేతల్లోకి చేరడం వల్ల ఆ దేశ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. 2000 తర్వాత అమెరికాలో పుట్టిన ప్రతి ముగ్గురిలో ఒకరు మధుమేహం బారిన పడతున్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కన్నా లాభార్జనే లక్ష్యంగా పనిచేస్తున్న కంపెనీల వల్లే దేశ ప్రజల ఆరోగ్యానికి తీరని హాని కలుగుతోందన్న గ్రహింపుతోనే.. వాల్‌స్ట్రీట్‌లో ప్రారంభమైన ఉద్యమం ఇతర దేశాలకు, ఖండాలకు విస్తరిస్తోంది.

ఈ ఉద్యమానికి సమాంతరంగా అమెరికాలో జన్యుమార్పిడి ఆహారంపై ప్రత్యేక ముద్ర వేయాల్సిందేనంటూ వినియోగదారుల ఉద్యమం పెల్లుబికింది. సేంద్రియ వ్యవసాయదారుల జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో 16 రోజుల పాటు ఉద్యమం కొనసాగింది. ప్రపంచ ఆహార దినోత్సవం నాడు అమెరికా అధ్యక్ష భవనం వద్ద వందలాది మంది ర్యాలీతో ఈ ఉద్యమం ముగిసింది. అయితే, బహుళజాతి కంపెనీల వ్యాపారం తగ్గుతుందేమోనన్న భయంతో ఒబామా ప్రభుత్వం మాత్రం జీఎం లేబిలింగ్‌కు ససేమిరా అంటోంది. అమె రికాలో జీఎం లేబిలింగ్ కోసం వినియోగదారులు ఉద్యమించడం ఇదే ప్రథమం కావడం విశేషం.

జన్యుమార్పిడి ఆహార పంటల సాగుపై ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి ఈ ఆందోళన తార్కాణంగా నిలుస్తుంది. ‘మన జీవితాలకు సంబంధించిన వ్యవస్థలను అన్ని విధాలుగా వశపరుచు కున్న కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం సాగుతోంది. ఆహారో ద్యమం స్వతహాగా కార్పొరేట్ వ్యతిరేకోద్యమం. అంతేకాదు.. ఇది వాస్తవిక మైన ఆర్థికవ్యవస్థ పునర్నిర్మాణానికే ఆహారోద్యమం’ అని అమెరికా రచయిత్రి, హక్కుల ఉద్యమకారిణి నోమి క్లీన్ అన్నారు. ‘వాల్‌స్ట్రీట్ ఆక్రమణోద్యమం కేవ లం బ్యాంకింగ్ చట్టాల గురించి మాత్రమే కాదు. ఉత్పత్తిరంగంలో జరగాల్సిం దేమిటో, అది చోటుచేసుకోవడానికి ఆహారోద్యమం బాటలువేస్తోంది. ఇదంతా వాల్‌స్ట్రీట్ ఉద్యమంలో అంతర్భాగమే’నని ఆమె గుర్తు చేయడం గమనార్హం.
పంతంగి రాంబాబు ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి