28, డిసెంబర్ 2011, బుధవారం

భగవద్గీత నిషేధానికి నో

భారతీయ తత్వానికి అద్దంపట్టే భగవద్గీతపై రష్యాలో ఆరు నెలలుగా నెలకొన్న వివాదానికి తెరపడింది.
పిటిషన్‌ను తోసిపుచ్చిన రష్యా కోర్టు
తీర్పుపై భారత్, ఇస్కాన్ హర్షం
రష్యాకు విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కృతజ్ఞతలు


మాస్కో/న్యూఢిల్లీ: భారతీయ తత్వానికి అద్దంపట్టే భగవద్గీతపై రష్యాలో ఆరు నెలలుగా నెలకొన్న వివాదానికి తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలకు గౌరవం దక్కింది. దౌత్యపరంగా భారత్ సాగించిన గట్టి ప్రయత్నాలకు తగిన ఫలితం లభించింది. భగవద్గీత రష్యన్ అనువాదం ‘భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్’పై నిషేధం విధించాలంటూ సైబీరియాలోని టామ్స్క్‌లో దాఖలైన పిటిషన్‌ను కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఇస్కాన్ వ్యవస్థాపకులైన ఎ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాద రష్యన్ భాషలోకి అనువదించిన ఈ ‘గీత’ సాంఘిక వ్యతిరేకతను, ద్వేషాన్ని పెంచుతుందంటూ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ వాదించింది. అందువల్ల ఈ అనువాద గ్రంథాన్ని రష్యన్ ఫెడరల్ తీవ్రవాద సాహిత్యం జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. అడాల్ఫ్ హిట్లర్ రాసిన ‘మీన్ కాంఫ్’ సహా ఇప్పటికే నిషేధించిన వెయ్యికిపైగా పుస్తకాల లిస్టులో దీన్ని కూడా చేర్చాలని పట్టుబట్టింది. అయితే ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఇస్కాన్ తరఫున వాదించిన లాయర్లు మిఖాయిల్ ఫ్రాలోవ్, అలెగ్జాండర్ సాఖావ్ గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం సాఖావ్ స్పందిస్తూ ‘రష్యా నిజమైన ప్రజాస్వామిక సమాజంగా మారుతోందని జడ్జీల నిర్ణయం తెలియజేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

భారత్ హర్షం

కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వంతోపాటు ‘ఇస్కాన్’ హర్షం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశంపై వివేకమైన తీర్పును ప్రశంసిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వివాదానికి తెరపడటం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ తీర్పు సాధ్యమయ్యేలా చేసిన రష్యాలోని స్నేహితులందరినీ అభినందిస్తున్నామని కొనియాడింది. భారత్, రష్యా ప్రజలకు ఉభయ దేశాల సంస్కృతిపై సంపూర్ణ అవగాహన ఉందని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని...ఉమ్మడి నాగరికత విలువలను అవమానించేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్ని అయినా తోసిపుచ్చుతామనే సందేశాన్ని తాజా ఉత్తర్వులతో ఇచ్చినట్లు అయిందని చెప్పింది. కోర్టు కేసు విషయంలో తమకు మద్దతు పలికినందుకు రష్యాకు భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. కోర్టు తీర్పు మెచ్చుకోదగ్గదని రష్యాలోని భారత రాయబారి అజయ్ మల్హోత్రా అన్నారు. కోర్టు తీర్పు సంతోషం కలిగించిందని మాస్కోలోని ఇస్కాన్ విభాగం సభ్యురాలు, హిందూ కౌన్సిల్ ఆఫ్ రష్యా చైర్మన్ సాధుప్రియా దాస్‌తోపాటు ఢిల్లీలోని ఇస్కాన్ ప్రతినిధి బ్రజేంద్ర నందన్ తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి