27, డిసెంబర్ 2011, మంగళవారం

ఇరాన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం, రాళ్ళతో కొట్టి గానీ లేదా ఉరితీయడం ద్వారా గానీ



వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయబడి జైలులో శిక్ష అనుభవిస్తున్న నడి వయసు ఇరానియన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం ఇంకా మిగిలే ఉందని ఇరాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. వేరోక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి “సకినే మొహమ్మది అష్తియాని” అనే మహిళకు గత సంవత్సరం ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను రాళ్ళతో కొట్టి చంపడం ద్వారా అమలు చేయాలని ఇరాన్ కోర్టు తీర్పు ఇవ్వడంతో దానికి వ్యతిరేకంగా ప్రపంచం అంతటా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఏ ఖతార్ లోనో, సౌదీ అరేబియాలోనో ఈ విధంగా వ్యభిచారం నేరంపై ఓ మహిళకు మరణ శిక్ష విధించి రాళ్ళతో కొట్టి చంపాలని తీర్పు ఇచ్చినట్లయితే ఆ విషయం అసలు బైటికి పొక్కి ఉండే అవకాశమే ఉండేది కాదు. బైటికి పొక్కినా ఆ అంశాన్ని పశ్చిమ దేశాల పత్రికలు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉండేవి కాఫు. వీలయితే అటువంటి వార్తలు బైటికి రాకుండా చెయ్యడానికి పశ్చిమ వార్తా సంస్ధలు శాయ శక్తులా సహకరిస్తాయి కూడా. ఇరాన్ పై బురద జల్లే కార్యక్రమాన్ని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలూ, వాటిని అనుసరించే మూడో ప్రపంచ దేశాల వ్యాపార వార్తా సంస్ధలు వదులుకోవు గనకనే అస్ధియాని మరణ శిక్షపై ఇంత గొడవ జరుగుతోంది.
సకినే అస్ధియానీ పదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తూ ఇప్పటికే జైలులో ఉంది. తన భర్తను చంపిన కేసులో సహకరించినందని నిర్ధారిస్తూ కోర్టు పదేళ్ల శిక్ష వెయ్యడంతో ఆమె జైలులో ఉంది. రాళ్ళతో కొట్టి చంపాలన్న తీర్పు పట్ల అంతర్జాతీయంగా మానవ హక్కుల సంస్ధలు ఆందోళన వ్యక్తం చెయ్యడంతో ఇరాన్ ప్రభుత్వం ఆ శిక్షను గత సంవత్సరం సస్పెన్షన్ లో పెట్టింది. అయితే అస్ధియానికి మరణ శిక్షను అమలు చేయడాన్ని ఇరాన్ ప్రభుత్వం సస్పెండ్ చెయ్యలేదు. అస్ధియానిని రాళ్ళతో కొట్టి చంపాలన్న శిక్షను ఉరి తీసి చంపడంగా మార్చగల అవకాశాలను న్యాయ నిపుణులు పరిశీలన చేస్తున్నట్లుగా ఇరాన్ న్యాయ విభాగ అధికారులు తెలిపారు.
“తొందరేమీ లేదు. …రాళ్ళతో కొట్టి చంపాలన్న శిక్షను ఉరి తీసి చంపడంగా మార్చవచ్చో లేదో పరిశీలిస్తున్నాం” అని తూర్పు అజర్‌బైజాన్ రాష్ట్ర న్యాయ విభాగపు అధిపతి మాలేక్ అజ్దర్ షరీఫి తెలిపాడు. పరిశోధన ఫలితం వచ్చాక శిక్ష అమలవుతుందని ఆయన చెప్పాడు. వివాహిత స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే రాళ్లతో కొట్టి చంపాలని చట్టం చెబుతుందని ఆయన చెప్పాడు. భర్త హత్యానంతరం అస్ధియాని వ్యభిచారానికి (అక్రమ సంబంధం) పాల్పడ్డట్టుగా 2006 లో కోర్టు నిర్ధారించి రాళ్ళతో కొట్టి చంపాలని శిక్ష వేసింది. అనంతరం భర్త హత్యకు సాధనంగా ఉపయోగపడిందన్న ఆరోపణ కోర్టులో రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష ఆమెకు విధించారు.
ముస్లిం మతంలో స్త్రీ, పురుష వివక్ష ఇతర మతాలకు మల్లే కొనసాగుతోంది. పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహమాడే అవకాశం ఇస్తూ స్త్రీలను గడపదాటరాదని శాసించే నిబంధనలు ముస్లిం మతంలో దండిగానే ఉన్నాయి. మతంతో సంబంధం లేకుండా స్త్రీలు అన్ని మతాల్లో ఈ విధమైన అణచివేతకు గురవుతున్నారు. స్త్రీలకు ఆర్ధికంగా స్వయం నిర్ణయ హక్కు లేకపోవడం ఈ పరిస్ధితికి దారితీసిన ప్రధాన కారణంగా ఉంది. స్త్రీలు ఆర్ధిక స్వతంత్రులు కానీయకుండా చేయడానికి మతాలు తగిన నియమ నిబంధనలు అమలు చేస్తున్నాయి. అన్ని మతాల్లోనూ స్త్రీలపై అణచివేత కొనసాగడానికి వ్యతిరేకంగా స్త్రీ, పురుషులిరువురూ ఐక్యంగ పోరాడవలసిన అవసరం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి