6, డిసెంబర్ 2011, మంగళవారం

యురేనియం ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్



భారత్ నూ, పాకిస్ధాన్ నూ సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను పాకిస్ధాన్ కోరింది. ఇండియాకు యురేనియం ఖనిజాన్ని అమ్మడానికి ఆస్ట్రేలియా పాలక లేబర్ పార్టీ ఆదివారం ఆమోదం తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పాకిస్ధాన్, తమను కూడా ఇండియాతో సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను కోరింది. యురేనియం కొనుగోలు చేయడానికి తమను కూడా అనుమతించాలని కోరింది.
అణు రియాక్టర్లలో యురేనియం ను ఇంధనంగా వాడతారన్నది తెలిసిందే. ప్రపంచంలోకెల్లా యురేనియం నిల్వలు ఆస్ట్రేలియాలో అధికంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్.ఎస్.జి) లో సభ్యదేశం. 1974 లో భారత దేశం అణు పరీక్ష జరిపాక దానికి సమాధానంగా ఈ గ్రూపు ఏర్పడింది. ప్రారంభంలో ఏడు దేశాలు ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నాయి. వివిధ దేశాలు విడిపోయి మరిన్ని దేశాలు ఏర్పడడం వలనా, ఇంకా ఇతర కారణాల వలనా అది ప్రస్తుతం నలభై ఆరుకు చేరింది.
అణు పదార్ధాలను గానీ, అణు సాంకేతిక పరిజ్ఞానం గానీ ఇతర దేశాలకు అమ్మడానికి ఈ గ్రూపు దేశాలు కొన్ని నిబంధనలు విధించుకున్నాయి.  అణు పధార్ధాలు గానీ, సాంకేతిక పరిజ్ఞానం గానీ సరఫరా చేయాలంటే ఆఈ కావలసిన దేశాలు ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం’ (న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ) పైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంతా చేసి ఈ దేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి ఏమన్నా పాటుపడుతున్నాయా అంటే అదేమీ లేదు. కేవలం పెత్తనం చేయడానికే ఈ గ్రూపు ఏర్పడింది.
తాము తప్ప మరొక దేశం స్వంతగా అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడం ఈ పెత్తందారీ గ్రూపుకి నేతృత్వం వహిస్తున్న అమెరియా, యూరప్ లకు ఇష్టం ఉండదు. వీరు గుట్టలు గుట్టలు అణ్వస్త్రాలు పేర్చుకున్నా ప్రపంచానికి రాని ప్రమాదం ఇరాన్, ఉత్తర కొరియా, ఇండియా, పాకిస్ధాన్ లాంటి దేశాలు స్వంతంగా తమ రక్షణ కోసం అణ్వస్త్రాలు తయారు చేసుకుంటే వస్తుందని తెగ బాధపడిపోతుంటాయి. ఆ పేరుతో ప్రపంచ దేశాలపైన అణు గూండాగిరీ చేస్తుంటాయి. ఆ గూండాగిరీలో భాగంగానే ఇండియాకి ఈ దేశాలు ఇప్పటివరకూ అణు పదార్ధాలు గానీ, అణు సాంకేతిక పరిజ్ఞానం గానీ అమ్మలేదు.
ఆర్ధీక సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికాకు తమ దగ్గర పేరుకుపోయిన అణు రియాక్టర్లను అమ్ముకోవడానికి మార్కెట్లు కావలసి వచ్చింది. తాము వాడకుండా పడేసిన రియాక్టర్లను అమ్ముకోవడానికి ఇండియా తేరగా కనపడింది. ఇంకేం, 2008 లో ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం లో భాగంగా పౌర అణు ఒప్పందం కుదుర్చుకుంటున్నామని భారత ప్రభుత్వం తన ప్రజలకు చెప్పింది. ఈ ఒప్పందంతో అణు ఏకాకితనం నుండి ఇండియాను అమెరికా బైటికి లాగిందని పశ్చిమ దేశాలు, వారి పత్రికలు ఇప్పటికీ ఊదగగొడుతుంటాయి. ఒప్పందం ద్వారా ఇండియా మార్కెట్ ను దొరకబుచ్చుకున్నామన్న సంగతి అవి చెప్పవు. భారత ప్రభుత్వం కూడా తన ప్రజలకు ఆ విషయం చెప్పకుండా అణు విద్యుత్ కోసం ‘పౌర అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామనే చెబుతోంది.
అమెరికాలో ‘త్రీ మైల్ ఐలాండ్’ లో అణు విద్యుత్ కర్మాగారం పేలుడు సంభవించాక ఇంతవరకూ మరో అణు విద్యుత్ కర్మాగారాన్ని అమెరికా నిర్మించలేదు. అది నిర్మించకుండా ఇండియా లాంటి దేశాలకు అంటగడుతోంది. అంటగడుతూ తానెంతో ఔదార్యంతో రియాక్టర్లు అమ్ముతున్నట్లుగా ఫోజు పెడుతోంది. కాని ఇప్పటివరకూ అమెరికా ఇండియాతో ఒప్పందానికి దిగలేదు.
రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ దేశాల అధ్యక్షులు, ప్రధానులు వచ్చి అణు రియాక్టర్ల వ్యాపారం విషయమై ఇండియా తో చర్చించి వెళ్ళారు గానీ అమెరికా నుండి అణు రియాక్టర్ల అమ్మకానికి సంబంధించి ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దానికి కారణం కూడా ఇండియాపైనే మోపుతోంది. అణు రియాక్టర్లు, అణు పదార్ధాలు సరఫరా చేసే అమెరికా కంపెనీలు (జనరల్ ఎలక్ట్రిక్, తోషిబా, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్) నాసిరకం పరికరాలు సరఫరా చేసినందువలన గానీ, లోపాలతో కూడిన రియాక్టర్లు సరఫరా చేసినందువలనగానీ ఇండియాలో జపాన్ లో జరిగిన ఫుకుషిమా  ప్రమాదం లాంటి ప్రమాదాలు సంభవించినట్లయితే నష్టపరిహారం అమెరికా కంపెనీలు కూడా కొద్దిగా (కొద్దిగా మాత్రమే) భరించాలని ఇండియా చట్టం చేసింది. దానిని ‘న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్’ అంటారు. ఈ చట్టం రూపొందటంలో కాంగ్రెస్, బి.జె.పి లు కలిసి పని చేశాయి.
ఈ చట్టం అమెరికా కి నచ్చలేదు. ప్రమాదం సంభవిస్తే పరిహారం చెల్లించే బాధ్యత అమెరికా కంపెనీలపైన అసలు మోపకూడదని అమెరికా డిమాండ్ చేస్తోంది. అమెరికా కంపెనీలు లోపాలతో ఉన్న రియాక్టర్లు సరఫరా చేయడం వల్లనో, నాసిరకం పరికరాలు సరఫరా చేసినందువల్లనో ప్రమాదం సంభవించినప్పటికీ అమెరికా కంపెనీలు ఒక్క పైసా కూడా చెల్లించకూడదట! ఇదెక్కడి చోద్యం? ఇంటికి మిక్సీ తెచ్చుకున్నా, గ్రైండర్ తెచ్చుకున్నా. లేదా వాషింగ్ మిషన్ తెచ్చుకున్నా, కం అన్నింటికీ గ్యారంటీ లేకపోయినా వారంటీ ఉంటుంది. ఏమన్నా పార్ట్ లు పోతే కొత్తవి ఇవ్వడమో, ఉచితంగా రిపేర్ చేయడమొ ఏదో ఒక మేరకు నష్టపరిహారం చెల్లిస్తారు. అలాంటిది కొన్ని బిలియన్ల డాలర్ల ఖరీదు చేసే అణు రియాక్టర్లు, అణు పరికరాలు సరఫరా చేస్తే, వాటివలన అణు ప్రమాదం సంభవిస్తే నష్టం చెల్లించమనడానికి తమను అడగరాదని అమెరికా డిమాండ్ చేస్తోంది.
అదీ కాక అణు ప్రమాదం అంటే ఆ కొనుగోలు చేసిన పరికరాల ఖర్చు వరకు నష్టపోయే విషయం కాదిది. అణు ప్రమాదాల ప్రభావం కొన్ని దశాబ్దాల తరబడి ఉంటుంది. కొన్ని తరాల తరబడి ప్రజలు రోగాలతో చస్తారు. వెంటనే ఏర్పడే నష్టం ఒక ఎత్తైతే తరాల తరబడి జరిగే నష్టం మరొక ఎత్తు. ఒక్క ప్రాణాలతోనే ప్రమాదం కాకుండా జీవితాలతో నే ప్రమాదం ఏర్పడుతుంది. అంటే జీవించినన్నాళ్లూ అనేక లోపాలతో, రోగాలతో జీవించవలసి ఉంటుంది. అటువంటి నష్టం భారీగానే ఉంటుంది గనక ఆ నష్టం మేము భరించం పొమ్మని అమెరికా అంటోంది. ప్రమాదం జరిగితే కేవలం 500 కోట్ల రూపాయలు నష్టం భరిస్తే చాలని ఇండియా చట్టం చేస్తే అది కూడా చెల్లించనని అమెరికా అంటోంది.
ఇటువంటి పనికిమాలిన ఒప్పందం తమకు కూడా కావాలని పాకిస్ధాన్ పాలకులు ఇండియాతో పోటీ పడుతున్నారు. ఈ ఒప్పందం గొప్ప ఒప్పందం అనీ, అమెరికా, ఇండియాల సంబంధాలలో మైలు రాయి అనీ ప్రధాని మన్మోహన్, అమెరికా అధ్యక్షుడు ఒబామా చెబుతూ ఉంటారు. భారత ప్రభుత్వం లోని ఇతర మంత్రులు, పెద్దలు కూడా గుర్తొచ్చినప్పుడల్లా ఈ ఒప్పందాన్ని గొప్పగా చెబుతూ ఉంటారు. పాకిస్ధాన్ కూడా ఇటువంటి ఒప్పందం తమకూ కావాలంటె అమెరికా ఇవ్వను పొమ్మంది. ఆ మేరకు పాకిస్ధాన్ ప్రజలకు అమెరికా గొప్ప మేలు చేసిందని అంగీకరించక తప్పదు. కాని పాక్ పాలకులు ఒప్పందంతో పాటు వచ్చే కమీషన్ల పైన ఆశ చావక తమకు పౌర అణు ఒప్పందం కావాలని బేరాలు చేసినా అమెరికా ఇవ్వలేదు.
అమెరికా బదులు చైనా పాకిస్ధాన్ కు అణు విద్యుత్ రియాక్టర్లు అమ్ముతోంది. చైనా కూడా ఎన్.ఎస్.జి లో సభ్యత్వం ఉంది. పాకిస్ధాన్ ఎన్.పి.టి పైన సంతకం చేయలేదు కనక దానికి చైనా అణు రియాక్టర్లు అమ్మడానికి వీల్లేదు అని అమెరికా అభ్యంతరం చెప్పింది. నువ్వు ఇండియాకి ఇస్తుండగా లేనిది నేను పాకిస్ధాన్ కి ఇస్తే వచ్చిందా అని చైనా తిప్పికొట్టింది. అయితే పాకిస్ధాన్ కి కూడా యురేనియం అణు ఇంధనం కావాలి. ఇండియా అణు బాంబులు నిర్మించుకున్నట్లే పాకిస్ధాన్ కూడా నిర్మించుకుంది. ఇండియాలాగే అది కూడా మరిన్ని అణు బాంబులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని తహతహలాడుతోంది. అందువలనే పాకిస్ధాన్ కి యురేనియం అమ్మడానికి పశ్చిమ దేశాలు చస్తే ఒప్పుకోవు. ఇండియాకి అమ్మినప్పటికీ ఇండియా అణు కర్మాగారాల వద్ద ఎన్.ఎస్.జి దేశాలు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తాయి. దానికి ఇండియా అంగీకరించింది. ఆ నిఘా వల్ల విద్యుత్ కి మినహా ఇతర ప్రయోజనాలకు యురేనియం ఇంధనం తరలించడానికి వీలు కుదరదు. పాకిస్ధాన్ పైన కూడా నిఘా ఉంచవచ్చు కదా అనవచ్చు. పాకిస్ధాన్ అణుశాస్త్ర పితామహుడు అణు పరిజ్ఞానాన్ని ఇరాన్, ఉత్తర కొరియాలకు కూడా ఇచ్చాడు. అందువల్ల పాక్ పైన అమెరికాకి అణు పరిజ్ఞానం విషయంలో విపరీతమైన కోపం. కనుక అణు పరిజ్ఞానం విషయంలో పాకిస్ధాన్ ను ఎంటర్‌టైన్ చేయడానికి అమెరికా ఇష్టపడదు.
ఈ నేపధ్యంలోనే పాకిస్ధాన్ ఆస్ట్రేలియాతో బేరం పెడుతోంది. ఆస్ట్రేలియాలోని పాక్ రాయబారి అబ్దుల్ మాలిక్ అబ్దుల్లా ఈ మేరకు ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక తో మాట్లాడుతూ కోరాడు. ఇంతవరకూ లేబర్ పార్టీ ఇండియాకు యురేనియం అమ్మకుండా నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఆదివారంతో ఎత్తి వేశారు.పాకిస్ధాన్ కు యురేనియం ఇంధనం ఇవ్వబోము అని ఆస్ట్రేలియా నేరుగా ఖరాఖండీగా చెప్పకపోవడం గమనార్హం. టెర్రరిజం అంతం చేయడంలో పాకిస్ధాన్ ఇంకా చేయవలసి ఉంది. మిగతా ప్రపంచం పాకిస్ధాన్ తో కూడా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి స్టీఫెన్ స్మిత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అవన్నీ పాకిస్ధాన్ చేత ఆఫ్ఘనిస్ధాన్ లో మరింత సహకారం అందించేలా చేయడానికి వేస్తున్న ఎత్తుగడలు గా భావించవచ్చు. అంతేతప్ప పాకిస్ధాన్ కు యురేనియం ఇంధనం సరఫరా చేయడానికి అమెరికా ఛస్తే ఒప్పుకోదు. ఇండియాలోని పాకిస్ధాన్ వ్యతిరేకులకు దీనివల్ల అమెరికాపై ప్రేమ పెరగచ్చేమో గానీ, అణు అంశాలలో పాకిస్ధాన్ కు సహాయనిరాకరణ చేయడం ద్వారా అమెరికా, ఆస్ట్రేలియాలు ఆ దేశ ప్రజలకు గొప్ప మేలు చేస్తున్న సంగతిని వారు మరువరాదు. పైగా ఇండియాకి అణు రియాక్టర్లు, యురేనియం ఇంధనం అమ్మడం ద్వారా భారత ప్రజలకు తీవ్రమైన నష్టం చేస్తున్నారని కూడా వారు గ్రహించాలి.
ఈస్టిండియా కంపెనీ వాడు వ్యాపారం చేసుకోవడానికే ఇండియా వచ్చాడు తప్ప ఇండియాని అభివృద్ధి చేయడానికి కాదు. వ్యాపారానికి వచ్చి దేశాన్ని ఆక్రమించుకుని దేశ ప్రజలని బానిసలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఒక్క బ్రిటన్ మాత్రమే కాక అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు, జపాన్, రష్యా ఇలా అనేక దేశాల కంపెనీలు కూడా వ్యాపారాల కోసమే ఇండియా వస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు చేయని మేలు జనరల్ ఎలక్ట్రిక్, వెస్టింగ్ హౌస్, వాల్ మార్ట్, టెస్కో, కేరేఫర్ ఇత్యాదిగా గల బహుళజాతి సంస్ధలు చేస్తాయనుకోవడం వెర్రిబాగులతనం తప్ప మరొకటికాదు. అప్పుడు ఒకడే వ్యాపారి గనక భారత దేశానికి మరో ఛాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఒకరికి పదిమంది వ్యాపారులు గనక దేశానికి వారిలో ఒకరిని ఎన్నుకునే స్వేచ్ఛ దొరికింది. అలా వ్యాపారిగా వస్తున్న యజమానిని ఎన్నుకునే స్వేచ్ఛనే రాజకీయ, ఆర్ధిక స్వేచ్ఛగా మన పాలకులు మనకు చెబుతున్నారు. ఏది నిజమన్నదీ ప్రజలే గ్రహించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి