21, డిసెంబర్ 2011, బుధవారం

గడ్కరి కారులో మృతిచెందిన యోగిత కేసు పునర్విచారణకు కోర్టు ఆదేశం

  • ఆర్థికభారమైనా న్యాయపోరాటాన్ని ఆపేది లేదు : మృతురాలి తల్లిదండ్రులు
బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరికి చెందిన కారులో నిర్జీవ స్థితిలో లభ్యమైన ఏడేళ్ల యోగితా ఠాకూర్‌ కేసును పునర్విచారించి దోషులేవరో తేల్చాలని నాగ్‌పూర్‌ కోర్టు నేర దర్యాప్తు విభాగం(సిఐడి)ను ఆదేశించింది. 2009లో జరిగిన ఈ కేసులో ఇదివరలో దర్యాప్తు చేపట్టిన సిఐడి, నాగ్‌పూర్‌ పోలీసులు యోగిత మృతి ఒక ప్రమాదమని తేల్చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై యోగిత కుటుంబం పలు కోర్టులో పోరాడింది. యోగిత శరీరంపై గోళ్ల గుర్తులు, పలు గాయాలు కనిపించాయని, ఇవి ఆమెను హత్య చేయడానికి ముందు అత్యాచారానికి ప్రయత్నించిన వారు చేసినవనేనని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. కేసులో పలుకుబడి వ్యక్తి(గడ్కరి) పాత్ర ఉన్నందునే స్థానిక పోలీసులు తన కూతురి మరణాన్ని ప్రమాదంగా చిత్రించారని యోగిత తల్లి కిరణ్‌ ఆరోపించారు. 'ఈ కేసులో న్యాయం జరగాలంటే సిబిఐతో దర్యాప్తు చేయించాలి' అని ఆమె కోరారు. యోగిత మృతి చెందిన ఏడాది తర్వాత 2010లో ఈ కేసును సిఐడికి అప్పగించారు. దర్యాప్తు నిర్వహించిన సిఐడి పొరపాటున కారులో ఇరుక్కుపోయిన యోగిత ఉపిరాడక మృతి చెందిదని పేర్కొంటూ కేసును ముగించారు. అయితే ఈ కేసులో పోలీసులు సమర్పించిన నివేదికలో పరస్పర విరుద్ధాంశాలుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. మొదట హత్యకేసుగా నమోదు చేసి, గుర్తుతెలియని వ్యక్తులు సాక్ష్యాలను నాశనం చేశారని పేర్కొన్న పోలీసులు, సంవత్సరం తరువాత ప్రమాదంగా తేల్చేయడం గమనార్హం. సంఘటన జరిగిన వెంటనే నమోదు చేసిన పంచనామా నివేదికలో గడ్కరికి చెందిన తెలుపు హోండా సిఆర్‌వి కారులో యోగిత మృతదేహం లభ్యమయినట్లు పేర్కొన్నారు. కానీ వేలిముద్రలు, తదితర సాక్ష్యాలను పక్కనే ఉన్న ఫియట్‌ లినియా కారు నుంచి సేకరించారు. తమ మార్పులకు మద్ధతుగా యోగిత మృతి చెందిన సమయంలో సిఆర్‌వి కారు కాంపౌండ్‌ లోపల లేదని దర్యాప్తు అధికారులు పేర్కొనడం అనుమానించదగిన విషయం. ఈ విషయంలో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయాలను కూడా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదేకాక, పోస్టుమార్టం నివేదికలోనూ యోగిత లోపలి దుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్లు తేలింది. అమె ముఖం, పేదాలు, లోపలి శరీర భాగాలలో గాయాలున్నట్లు గుర్తించారు. అయితే ఇవన్నీ కారు నుంచి వెలుపలికి వచ్చేందుకు బాలిక ప్రయత్నించిన సందర్బంగా చోటుచేసుకున్న గాయాలని పోలీసులు పేర్కొంటున్నారు. యోగిత తండ్రి ఓ దిన కూలి. ఆయనకు ప్రతిరోజు పని దొరకడం కూడా కష్టమే. తల్లి ఇళ్లలో పనిచేస్తూ నెలకు రూ.2000 సంపాదిస్తుంది. ఈ నేపథ్యంలో న్యాయపోరాటం వారికి తీవ్ర ఆర్థికభారంతో కూడుకున్నది. కానీ సరైన న్యాయం లభించేంత వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని వారు దృఢంగా పేర్కొంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి