12, డిసెంబర్ 2011, సోమవారం

తొందరపాటు, తోకముడుపు





చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల ప్రవాహానికి అనుమతించాలన్న ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకోవడం అనూహ్య పరిణామం. అది ఉచితమా, కాదా అన్న చర్చను అలా ఉంచితే, ఈ వెనకడుగు రాజకీయంగా యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టకు శరాఘాతం. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగతంగా కూడా ఎదురు దెబ్బ. అవినీతి కుంభకోణాలతో అట్టుడుకుతున్న గత ఏణ్ణర్ధకాలంగా ఈ ప్రభుత్వంలో ఆకు కూడా కదలడం లేదనీ, నిష్క్రియతకూ నిస్తేజానికీ అది మారుపేరుగా మారిందనే విమర్శ తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హఠాత్తుగా చిల్లరవ్యాపారంలో ఎఫ్‌డీఐ ప్రతిపాదన తెచ్చి ఆశ్చర్యపరచింది. 

ఒకే బ్రాండ్ ఉత్పత్తుల విషయంలో ఇప్పటికే అనుమతించిన 51 శాతం ఎఫ్‌డీఐని నూరుశాతానికి పెంచాలనీ, బహుళ బ్రాండ్ ఉత్పత్తుల విషయంలో కొత్తగా 51 శాతం మేర ఎఫ్‌డీఐని అనుమతించాలన్న కీలక ప్రతిపాదనపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. శీతాకాల సమావేశాల ప్రారంభంలో చేసిన ఆ ప్రకటన పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించి, తొమ్మిది రోజుల పాటు ప్రతిష్టంభనకు దారితీసింది. కుడి, ఎడమ తేడాలు లేకుండా విపక్షాలే కాక; తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), డీఎంకే వంటి మిత్రపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయానికి, ఆరు నూరైనా సరే కట్టుబడి ఉంటానన్న అభిప్రాయాన్నే ప్రభుత్వం మొదట్లో కలిగించింది. అంతలోనే, ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడం విపక్షాల ముందు ఓటమిని అంగీకరించడమే. 

యూపీఏ తొలివిడత పాలనలో మన్మోహన్‌సింగ్ భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని వ్యక్తిగత ప్రతిష్టాంశంగా తీసుకున్నట్టే, ఇప్పుడు చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐనీ తీసుకున్నారు. అణు ఒప్పందంపై పట్టుబట్టినట్టే దీనిపైనా పట్టుబట్ట బోతున్నట్టు కనిపించారు. చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డీఐని అనుమతించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఉద్ఘాటించడమేకాక, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీని ఒప్పించేందుకు తనే రంగంలోకి దిగారు.

వామపక్షాలు మద్దతు ఉపసంహరించడంతో తన ప్రభుత్వ అస్తిత్వం ప్రమాదంలో పడినా సరే, అణు ఒప్పంద సాకారానికే నాడు మన్మోహన్ సింగ్ ప్రాధాన్యమిచ్చారు. విజయమూ సాధించారు. ఎఫ్‌డీఐ విషయంలోనూ అదే జరగనుందా అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తోకముడిచి ‘యాంటీ క్లైమాక్స్’ ను ఆవిష్కరించడం విచిత్రం.

యూపీఏ తొలివిడత, మలివిడత పాలనలలో ఉన్న హస్తిమశకాంతరం ముంజేతి కంకణమే. అవినీతి ఆరోపణలలో, అకర్మణ్యత ఊబిలో కూరుకుపోయిన ప్రస్తుత ప్రభుత్వంలో తన మాట చెల్లించుకునే నైతికస్థైర్యం అడుగంటిందన్నది నిర్వివాదం. 

అయితే, చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డీఐకి పూర్తిగా తలుపులు బార్లా తెరవాలన్న ప్రభావశీల నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం కనీసమైన ‘హోంవర్క్’ కూడా చేయకపోవడమే మరింత విస్మయకరం. ఇటువంటి అంశాలలో ఏ ప్రభుత్వమైనా మొదట రాజకీయ ఏకాభిప్రాయసాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. చర్చ ద్వారా ప్రజాభిప్రాయ సమీకరణకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాతే పార్లమెంటు ముందుకు వెడుతుంది. ప్రస్తుత సందర్భంలో అటువంటివేవీ జరగకపోవడమే ఆశ్చర్యం. హఠాత్తుగా ఈ ప్రతిపాదన చేయడం ప్రభుత్వ ఆంతర్యంపైనే అనుమానాలు రేకెత్తించింది. అధికధరలు, లోక్‌పాల్, నల్లధనం వగైరా అంశాలనుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడగా కొన్ని పక్షాలు దీనిని ఆక్షేపించాయి. చివరికి తృణమూల్, డీఎంకే వంటి మిత్రపక్షాలను సైతం విశ్వాసంలోకి తీసుకోకపోవడం ప్రభుత్వంలో కనీసమైన రాజకీయ పరిణతినే ప్రశ్నార్థకం చేసింది. సాక్షాత్తు ప్రధాని రంగంలోకి దిగి కూడా మిత్రపక్షాన్ని ఒప్పించలేకపోవడం ఆ పదవీ ప్రతిష్టను మసకబార్చుతుంది. ఇంత జరిగాక, విలువైన పార్లమెంటరీ సమయంలో తొమ్మిది రోజులు కాలి బూడిదైన తర్వాత, ఏకాభిప్రాయ సాధన దిశగా సంప్రదింపుల ప్రక్రియ ఇక ప్రారంభిస్తామనీ, రాష్ట్రాలలో ఎఫ్‌డీఐ విధానాన్ని అమలు చేయవలసిన ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడతామని ప్రభుత్వం సెలవిస్తోంది. అది మొదటే ఎందుకు జరగలేదన్న ప్రశ్నకు జవాబు లేదు. కింద పడినా పైచేయి నాదే అన్నట్టు, నిర్ణయం ఉపసంహరణ భంగపాటు కాదని ప్రభుత్వం బుకాయిస్తోంది. 

ఎఫ్‌డీఐకి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఒకే బ్రాండ్ ఉత్పత్తులలో ఎఫ్‌డీఐని అమలు చేస్తున్న అనుభవం వెలుగులో మంచి, చెడులను సమీక్షించుకునే వెసులుబాటు మనకు ఉండనే ఉంది. ఇక ఎఫ్‌డీఐని వ్యతిరేకించడంలో ఆయా రాజకీయపక్షాల అవకాశ వాదమూ గందరగోళాన్ని పెంచుతోంది. ఇప్పుడు చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డీఐకి ససేమిరా అంటున్న బీజేపీ తను అధికారంలో ఉన్నప్పుడు దానిని సమర్థించింది. ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న డీఎంకేకు చెందిన మురసోలి మారన్ ఒకే బ్రాండ్ ఉత్పత్తులలో నూరుశాతం ఎఫ్‌డీఐకి తలుపులు తెరిచారు. అప్పుడు డీఎంకే, తృణమూల్ కూడా దానిని సమర్థించాయి. ఇంకో విచిత్రం ఏమిటంటే, అప్పట్లో భారత వాణిజ్య పారిశ్రామిక మండలుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉండి చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డీఐ అనుమతికి విశేష కృషి చేసిన డా. అమిత్ మిత్రా ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఎఫ్‌డీఐ అనుమతివల్ల ఉండే లాభ నష్టాలతో సహా ఈ ప్లేటు ఫిరాయింపు వింతలు, విడ్డూరాలు కూడా ప్రజలకు తెలియాలి. తెలుసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. విస్తృతమైన చర్చా. సంప్రదింపులే అందుకు మార్గం. మొదటే జరగవలసిన ఆ ప్రక్రియను ఇప్పుడు చేపడతామని అంటున్న ఈ ప్రభుత్వం తీరే ఇక్కడ అత్యంత హాస్యాస్పదం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి