12, డిసెంబర్ 2011, సోమవారం

ఇంటర్నెట్‌పై సెన్సార్ ఖడ్గం

చైనా లాంటి నియంతృత్వదేశాలను అలా ఉంచితే, ఒక ప్రజాస్వామ్యదేశంలో పత్రికాస్వేచ్ఛపై సెన్సార్ ఖడ్గాన్ని ఝళిపించడం ఈరోజున ఊహకందని విషయం. మనదేశంలో మూడున్నర దశాబ్దాల క్రితం, బహుశా చివరిసారి, అటువంటి దుస్సాహసానికి పాలకులు పాల్పడిన సంగతీ, అందుకు భారీ మూల్యం చెల్లించుకున్న సంగతీ మనకు తెలుసు. అక్షరంపై ఆంక్షలు సంధించడం ఆత్మహత్యా సదృశమన్నది ఈ దేశంలో ప్రభుత్వాలు నేర్చుకునే తొలిపాఠాలలో ఒకటి. కానీ, కేంద్రంలో కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలతోపాటు విద్యామంత్రిత్వశాఖకూ నేతృత్వం వహిస్తున్న కపిల్ సిబల్‌కు ఆ పాఠం ఇంకా ఒంటబట్టినట్లు లేదు.

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలను ఆకర్షించే అలవాటు ఉన్న సిబల్ ఇటీవల కొంత కాలంగా ‘స్వచ్ఛంద నియంత్రణ’ పాటిస్తున్నారనుకుని సంతోషిస్తుండగానే, ఉన్నట్టుండి హఠాత్తుగా ఆయన మీడియా తోక కత్తిరించే పనికి పూనుకున్నారు. అందులోనూ ఏకంగా ఇంటర్నెట్‌కే గురిపెట్టారు. గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను పిలిచి, తమ సైట్లలో ఉంచడానికి ముందే అభ్యంతరకర వ్యాఖ్యలను, రాతలను వడబోయాలని హుకుం జారీచేశారు. మంత్రి ఆదేశాలు భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా విమర్శలు, ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంటర్నెట్‌కు కత్తెరేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూనే, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలు, మతవిద్వేషాలను రెచ్చగొట్టే రాతలు, దృశ్యాలపై వేటు వేయవలసిందేనని సహచర మంత్రి ఒకరు సిబల్‌కు వంతపాడారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఒకపక్క మంత్రి తీరును తప్పుపడుతూనే, మరోపక్క ఇంటర్నెట్‌లో చోటుచేసుకునే అంశాలలో వడబోత అవసరమేనంటూ రెండునాల్కలతో మాట్లాడుతోంది. 
ఇంటర్నెట్‌లోని సోషల్ మీడియా సైట్లలో అసభ్యతను అంచులు దాటించే అభ్యంతరకర వ్యాఖ్యలు, రాతలు, దృశ్యాలు ఉంటున్న మాట వాస్తవమే. వ్యక్తులను, ముఖ్యంగా రాజకీయనాయకులను వ్యక్తిగతంగా కించపరిచేవీ, పరువు దిగజార్చేవీ వాటిలో ఉంటున్న మాటా నిజమే.

సున్నితమైన మతవిశ్వాసాలను గాయపరిచి, మతవిద్వేషాలను రెచ్చగొట్టే పోకడలు ఎంతైనా అవాంఛనీయాలు, ప్రమాదకారులనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. అదే సమయంలో ఇంటర్నెట్ ‘న్యూ మీడియా’ అన్న సంగతినీ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్‌లో ఉంచిన విషయాలకు హద్దులు గీయడమూ, కత్తెర ప్రయోగించడమంటే ఒక విధంగా ఆకాశంలో బారికేడ్లు నిర్మించడమే. అందులో ఎదురయ్యేవి ముఖ్యంగా ఆచరణపరమైన సమస్యలనీ, ముందే వడబోయాలన్న మంత్రి ఆదేశం అమలు అసలే సాధ్యంకాదనీ ఒక అభిప్రాయమైతే; ముందస్తు వడబోతకు వెబ్‌సైట్లలో తగిన ఏర్పాటు చేసుకోవడమూ సాధ్యమేనని మరికొందరి అభిప్రాయం. 

ఆ సాంకేతిక చర్చను అలా ఉంచితే, అభ్యంతరకర ధోరణులకు అపరిమిత స్వేచ్ఛే కారణం కనుక దానికి కత్తెర వేయవలసిందేనన్న వాదన ఎంతవరకు హేతుబద్ధమో ఆలోచించాలి. స్వేచ్ఛ ఉన్న ప్రతిచోటా అది దుర్వినియోగమై తీరుతుందనుకుంటే అసలు ప్రజాస్వామిక స్వేచ్ఛకే అర్థముండదు. సంస్కారం విధించే స్వచ్ఛంద నియంత్రణ వల్లనే ప్రజాస్వామ్యం, హక్కులు బతికి బట్టకట్టగలుగుతున్నాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. కనుక, స్వయం నియంత్రణ అవకాశాన్ని ఇంటర్నెట్‌కు కూడా ఇవ్వడం ఒక సముచిత పరిష్కారం. అదీగాక, అభ్యంతరకర అంశాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని తొలగించడం వంటి చర్యలు సోషల్ మీడియా సైట్లు తీసుకుంటూనే ఉన్నాయి. 

అయినాసరే, కపిల్ సిబల్ సోషల్ మీడియా సైట్లపై కారాలు, మిరియాలు నూరడం, కొందరు ఆయనకు వంత పాడడమే ఇక్కడ అన్నింటికన్నా అభ్యంతర కరం. సమస్యపై విస్తృతమైన చర్చకు అవకాశమివ్వకుండా, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయకుండా గూగుల్ తదితర కంపెనీల ప్రతినిధులను పిలిపించి తాఖీదులు జారీచేయడం సున్నితమైన మీడియా స్వేచ్ఛలో మొరటు జోక్యంగానే కనిపిస్తుంది. తప్పుడు సంకేతాలనే జారీచేస్తుంది. అన్నా హజారే ఉద్యమానికి సోషల్ మీడియా సైట్లు ఇతోధికంగా ఊతమిస్తున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఖడ్గచాలనం తప్పనిసరిగా భిన్న సంకేతాలనే ఇస్తుంది. సోషల్ మీడియా పీకనొక్కడం చైనాలో, మధ్యప్రాచ్యదేశాలలో, కొన్ని ఆగ్నేయాసియా దేశాలలోనే జరుగుతుంటుంది. 

కపిల్ సిబల్ తన అనాలోచిత చర్య ద్వారా మనదేశాన్ని వాటి సరసన నిలబెట్టి పరువుతీయడం ఎంతైనా విచారకరం. ఇందులో ఇంకా మరికొన్ని వింతలు, వైపరీత్యాలు ఉన్నాయి. ఈ ఏడాది తొలి ఆరునెలలలో, ‘ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయన్న’ కారణంగా తమ వెబ్‌సైట్లలోని ఆయా అంశాలను తొలగించమని కోరిన నాలుగే నాలుగు దేశాలలో భారత్ ఒకటని, ఆ విజ్ఞప్తిని తాము తిరస్కరించామని గూగుల్ వెల్లడించింది. ఇక్కడ మరొక వాస్తవం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తుల పరువు ప్రతిష్టలను దిగజార్చే అంశాలను, మతవిద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను చూపించి కపిల్ సిబల్ ఇంటర్నెట్‌కు కత్తెరేయాలంటున్నారు కానీ, గూగుల్ వెలువరించిన పారదర్శకతా నివేదికలోని వివరాలు అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. 

పభుత్వం తొలగించమని కోరుతూ చేసిన అభ్యర్థనలు మొత్తం 358 కాగా, వాటిలో ప్రభుత్వంపై విమర్శలకు సంబంధించినవి 255 ఉన్నాయి. పరువునష్టానికి సంబంధించినవి 39, విద్వేష ప్రసంగాలకు సంబంధించినవి 8 కాగా, జాతీయ భద్రతతో ముడిపడినది కేవలం ఒకే ఒకటి. కనుక, సోషల్ మీడియాపై కపిల్ సిబల్ కస్సు బుస్సులలోని ఆంతర్యం సుస్పష్టం. ప్రభుత్వంలో అసహనం హద్దులు దాటుతోందనడానికి కపిల్ తీరు తాజా సాక్ష్యం మాత్రమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి