20, డిసెంబర్ 2011, మంగళవారం

పాతాళానికి చిన్న షేర్లు

మార్కెట్ క్రాష్‌కు మించి పతనం...
ఏడాది వ్యధిలో స్మాల్ క్యాప్ 40 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 33 శాతం డౌన్...
ఇదే వ్యవధికి సెన్సెక్స్ క్షీణత 24 శాతం...
సరికొత్త కనిష్టాలకు 175 చిన్న స్టాక్స్...


దలాల్ స్ట్రీట్ దారుణ పతనంలో చిన్న షేర్లు తుక్కుతుక్కవుతున్నాయి. అమెరికా, యూరప్ ఆర్థిక సంక్షోభ భయాలతో ఏడాదిక్రితం తగ్గుముఖం పట్టిన ఈ షేర్లు తాజాగా దేశీయ సమస్యలతో పాతాళానికి పడిపోతున్నాయి. రూపాయి విలువ ఎన్నడూలేనంత స్థాయికి దిగజారడం, పారిశ్రామికోత్పత్తి అట్టడుగుస్థాయికి చేరడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలతో బెంబేలెత్తిస్తున్నారు. దాంతో డిసెంబర్ నెల డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వెరసి బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 నెలల కొత్త కనిష్టస్థాయికి పడిపోయింది. మరోపక్క స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు ఇంతకు మించిన భారీ పతనాన్నే చవిచూస్తున్నాయి. అనేక చిన్న షేర్లు ఆల్‌టైమ్ కనిష్టాలకూ పడిపోయి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.

మిడ్, స్మాల్ క్యాప్ విభాగంలో తాజాగా 175 కంపెనీల స్టాక్స్ సరికొత్త కనిష్టస్థాయిలకు దిగజారాయి. ఈ జాబితాలో సుజ్లాన్ ఎనర్జీ, యూనిటెక్, ఎన్‌హెచ్‌పీసీ, 3ఐ ఇన్ఫోటెక్, పంజ్‌లాయిడ్, హెచ్‌డీఐఎల్, యునెటైడ్ బ్యాంక్ వంటివి కొన్ని. మరికొన్ని షేర్లు ఆరేళ్ల కనిష్టస్థాయికి పతనమయ్యాయి. పారిశ్రామికోత్పత్తి మైనస్‌లోకి పడిపోవడం, క్షీణిస్తున్న స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటును చూస్తే దేశీయంగా ఆర్థిక మందగమనం స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయని... ఇది స్టాక్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితికి కారణమవుతోందని సెంట్రమ్ బ్రోకింగ్ సీఈఓ సందీప్ నాయక్ అంటున్నారు. దీనికితోడు డాలరుతో రూపాయి మారకం విలువ 54 స్థాయి దిగువకు పడిపోవడం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను ఈక్విటీ మార్కెట్ల నుంచి బయటికెళ్లిపోయేందుకు పురిగొల్పుతోంది.

చితికిపోయిన సూచీలు...
గతేడాది డిసెంబర్ 20న బీఎస్‌ఈ సెన్సెక్స్ 19,889 పాయింట్ల వద్ద ఉండగా... మంగళవారం ఇది 15,175 పాయింట్ల వద్ద ముగిసింది. ఏడాది వ్యవధిలో చూసే ్త దాదాపు 24 శాతం(4,713 పాయింట్లు) ఆవిరైంది. అయితే మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ కంటే కూడా అత్యంత ఘోరంగా కుప్పకూలడం గమనార్హం. గత డిసెంబర్ 20న 9,221 పాయింట్ల వద్దనున్న బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఇప్పుడు 5,466 పాయింట్లకు పడిపోయింది. ఏడాది కాలంలో 41 శాతం(3,755 పాయింట్లు) పడిపోయినట్లు లెక్క. ఇక మిడ్‌క్యాప్ సూచీ 7,558 పాయింట్ల నుంచి 5,076 పాయింట్లకు క్షీణించింది. వెరసి 33% (2,482 పాయింట్లు) మేర తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది.

బ్యాంకింగ్, రియల్టీ బేర్...
వడ్డీరేట్ల ఆధారిత స్టాక్స్ ప్రధానంగా బ్యాంకింగ్, రియల్టీ షేర్లు తాజా మార్కెట్ పతనంలో తీవ్రంగా కుదేలయ్యాయి. ఒకపక్క రిజర్వ్ బ్యాంక్ అదేపనిగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోవడం(తాజా సమీక్షలో విరామం ఇచ్చింది) పారిశ్రామికోత్పత్తికి శరాఘాతంగా మారిన సంగతి తెలిసిందే. దీనికితోడు బ్యాంకింగ్ రంగాన్ని కొద్ది నెలల క్రితం మూడీస్ డౌన్‌గ్రేడ్ చేయడం ఈ స్టాక్స్‌పై కోలుకోలేని దెబ్బతీసింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు గరిష్ట స్థాయిల నుంచి సగానికి పైగానే ఆవిరయ్యాయి. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్‌లు కొత్త కనిష్ట స్థాయిలను తాకుతున్నాయి. ఇక రియల్టీ స్టాక్స్ విషయానికొస్తే... యూనిటెక్ రూ.68 గరిష్టం నుంచి ఇప్పుడు రూ.17.70 కొత్త కనిష్టానికి పడిపోయింది. హెచ్‌డీఐఎల్ కూడా రూ.198 నుంచి రూ.66 స్థాయికి కుప్పకూలింది. ఆర్డర్లు కొరవడటంతో ఇన్‌ఫ్రా షేర్లు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. జైప్రకాష్ అసోసియేట్స్, పుంజ్‌లాయడ్, పటేల్ ఇంజనీరింగ్ తదితర షేర్లు 50 శాతం పైగా పతనమయ్యాయి.

షుగర్ షేర్లకు చేదు గుళిక...: దేశీయంగా చక్కెరకు డిమాండ్‌కు మించి సరఫరాలు ఉండొచ్చన్న అంచనాలకు తోడు ఉత్పాదక వ్యయం కూడా భారీగా పెరిగిపోవడంతో షుగర్ కంపెనీల స్టాక్స్‌ను దెబ్బతీస్తున్నాయి. శ్రీరేణుక షుగర్స్, బలరాంపూర్ చినీ, బజాజ్ హిందుస్థాన్ సహా చాలా షుగర్ స్టాక్స్ ఏడాది కనిష్ట స్థాయిలకు కుప్పకూలాయి.

రాష్ట్ర కంపెనీల షేర్లదీ అధోగతే...
రాష్ట్రానికి చెందిన చాలా కంపెనీల షేర్లు పాతాళానికి జారుతున్నాయి. ప్రధానంగా రియల్టీ, ఇన్‌ఫ్రా రంగాల్లోని షేర్లు కొత్త కనిష్టాలకు పడిపోతున్నాయి. జీవీకే ఇన్‌ఫ్రా ఏడాది గరిష్ట స్థాయి రూ.43.40 కాగా... ఇప్పుడిది రూ.9.56 కనిష్టాన్ని తాకింది. ఇక జీఎంఆర్ ఇన్‌ఫ్రా అయితే... రూ.47.60 నుంచి రూ.17.70 స్థాయికి కుప్పకూలింది. ఐవీఆర్‌సీఎల్ రూ.136 నుంచి ఇప్పుడు రూ.28కి దిగజారింది. ల్యాంకో ఇన్‌ఫ్రా కూడా ఇటీవలే రూ.8.50 కనిష్టాన్ని తాకింది. బీజీఆర్ ఎనర్జీ అయితే ఏకంగా రూ.744 గరిష్టం నుంచి ఇప్పుడు రూ.177కు కుప్పకూలింది.

పతనానికి పలు కారణాలు
మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లోని కంపెనీల షేర్లు 60-90 శాతం వరకు పతనమయ్యాయి. తక్కువ అనుభవం, పరిమిత లిక్విడిటీ(షేర్ల సంఖ్య), ఎఫ్‌ఐఐల నుంచి స్పందన అంతగా లేకపోవడం వంటి కారణాలు ఈ సెగ్మెంట్‌లో భారీ పతనానికి దారితీస్తున్నాయి. ఇంకా నిరూపించుకోవాల్సిన ఈ విభాగాల్లోని కంపెనీలపై ఇన్వెస్టర్లు కూడా ఆసక్తి చూపరు. వీటిలో కొత్తగా నిధుల ప్రవాహం లేదు. ఆర్థిక ఫలితాలు, వడ్డీరేట్లు వంటి అంశాల ప్రభావం ఈ కంపెనీల పనితీరుపై వెంటనే ప్రతిబింబిస్తుంది. ఆకర్షణీయమైన డివిడెండ్ల ప్రకటన, షేర్ల బైబ్యాక్, టేకోవర్లు వంటి ఏదైనా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్న కంపెనీల షేర్ల పతనం కొంత తక్కువగా ఉంది. అయితే, సెన్సెక్స్ 14,000 స్థాయిలో బాటమౌట్ అయితే, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు కోలుకుంటాయని భావించవచ్చు.
- సతీష్ కంతేటి, జాయింట్ ఎండీ-జెన్ మనీ

నష్టపోయే షేర్ల నుంచి ఎగ్జిట్ అవడమే మంచిది...
ప్రస్తుతం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కౌంటర్ల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. పెద్ద కంపెనీలకున్న అనుభవం, రక్షణాత్మక వ్యూహాలు వీటికి ఉండవు. షాక్‌ను తట్టుకునే స్థోమతా తక్కువగా ఉంటుంది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. నగదు లభ్యతా సమస్యే. అయితే, వీటి ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉంటే కొంత వరకు పతనం నుంచి రక్షణ లభిస్తుంది. 14,000 స్థాయిలో సెన్సెక్స్ బాటమ్ కావచ్చు. అప్పు డు పతనం కొంత వరకు ఆగవచ్చు. అయితే, ప్రస్తుతం నష్టాలొచ్చే షేర్ల నుంచి బయటపడటమే మంచిది. పనితీరు, భవిష్యత్ బాగుంటాయని భావించే కంపెనీల షేర్లను దీర్ఘకాలం కోసం హోల్డ్ చేయవచ్చు.
- సాగేరాజ్ బారియా, మేనేజింగ్ పార్ట్‌నర్-ఈక్విటోరియల్స్
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి