‘రూకలు
పదివేలున్నా, చారెడు నూకలేగతి‘ అం టారు మనవాళ్లు. ‘ప్రపంచీకరణ’ పుణ్యమా
అని సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణే ప్రజలకు ‘ప్రాణరక్ష’ అని చెప్పి
ప్రభుత్వరంగ వ్యవస్థను ‘బ్రోకర్’ స్థాయికి భారత పెట్టుబడిదారీ పాలనా
వ్యవస్థ దిగజార్చింది. ఫలితంగా మన కరెన్సీ రూపాయి విలువ కాస్తా దేశ
స్వాతంత్య్రానంతరం ఎన్నడూలేని స్థాయికి (డాలర్‌కు పతనమైన రూపా యిల్లో
చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.53) కుప్పకూలింది. 1991లో భారత ఆర్థిక
వ్యవస్థపై అమెరికా రుద్దిన ప్రపంచ బ్యాంకు సంస్కరణల ప్రత్యక్ష ఫలితం ఇది.
1930ల నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి, తద్వారా ప్రపంచ వ్యాప్తంగా
కరెన్సీల ఘోర పతనావస్థకు, పెను నిరుద్యోగానికి ఏ అమెరికా సామ్రాజ్యవాద
పెట్టుబడివ్యవస్థ కారణమయిందో తిరిగి అదే వ్యవస్థ తాజా ప్రపంచ సంక్షోభానికి
కూడా బాధ్యురాలయింది.
ప్రభుత్వాలు లోటుబడ్జెట్‌ల పేరిట అదనపు పన్నులు, సెస్సులు విధిస్తూ సాధారణ
వస్తువుల ధరలను పెంచుతూ ప్రజాబాహుళ్యాన్ని రానురాను ‘సం క్షేమ
రాజ్యవ్యవస్థ’కు దూరం చేస్తున్నాయి. విలువలేని కరెన్సీ నోట్లను ఇబ్బడి
ముబ్బడిగా ముద్రించడం ద్వారా లోటు బడ్జెట్లను పూడ్చాలనుకుంటున్నారు.
కరెన్సీ విలువల మధ్య ఉండవలసిన సమనిష్పత్తిని మొదటి ప్రపంచయుద్ధం తర్వాత
బ్రిటిష్ సామ్రాజ్యపాలనా వ్యవస్థ, రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా
సారథ్యంలోని సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థా తారుమారు చేసి మన ఆర్థిక
వ్యవస్థకు స్థిరత్వం లేకుండా చేశాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనలో బంగారం
ప్రధాన మారకద్రవ్య ప్రమాణంగా ప్రారంభమైన వ్యవస్థ, బ్రిటిష్ కరెన్సీ అయిన
‘పౌండు’ విలువని పెంచుకుని భారత కరెన్సీ రూపాయి విలు వను పెరక్కుండా
అడ్డుకుంది. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమె రికా కూడా బ్రిటిష్
పౌండ్ పెత్తనం స్థానాన్ని డాలర్ కరెన్సీతో ఆక్రమించి ఇం డియా లాంటి వర్ధమాన
దేశాల కరెన్సీల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది. ఈ దెబ్బ ముఖ్యంగా 1966
నుంచీ మన కరెన్సీకి తగిలింది. అమెరికా అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలను
అంతవరకూ శాసిస్తున్న బంగారు మారక ద్రవ్యాన్ని కాస్తా మాధ్యమంగా రద్దు
చేస్తూ డాలర్‌ను ప్రపంచ మారక ద్రవ్యవ్యవస్థగా వర్ధమాన దేశాల నెత్తిన
రుద్దింది. ఆ క్రమంలో వర్ధమాన దేశాలకు ఇచ్చిన హామీలనైనా నెరవేర్చిందా అంటే
అదీ లేదు.
ఎందుకంటే, ప్రపంచంలో ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకించి ప్రయోజనం
కలిగే రీతిలో కాకుండా సమనిష్పత్తిలో దేశాల కరెన్సీల స్థిరత్వానికి చేటు
రాకుండా మారక ద్రవ్య మాధ్యమం రేటును నిర్ణయించాలన్నది ‘బ్రెటన్ ఉడ్స్
కాన్ఫరెన్స్’ లక్ష్యం. కానీ ఈ ప్రమాణాన్ని అమెరికా ఉల్లంఘించినందువల్లే,
ఇతర దేశాల కరెన్సీల విలువను అమెరికన్ డాలర్‌కు మాత్రమే అనుకూలంగా
ముడిపెట్టినం దువల్లే వర్ధమాన దేశాల కరెన్సీలు అస్థిరత పాలయ్యాయి.
కాబూలీవాలా తరహా వడ్డీలపైన, అద్దె-కొనుగోలు తరహా లావాదేవీలపైన ఆధారపడిన
పెట్టు బడిదారీ వ్యవస్థలో దేశ సంపదైన జాతీయోత్పత్తుల విలువకూ, ప్రజల తలసరి
ఆదాయాలకూ మధ్య అసమవ్యవస్థకే గాని సమస్థితికి అవకాశం ఉండదు. అంతేగాదు,
దేశీయంగా ఎప్పుడైతే బంగారం నిల్వల విలువకు సమానమైన రూపాయి మారకం వ్యవస్థను
రద్దు చేసుకుని డాలర్ మారకం వ్యవస్థను మనం అంటకాగుతూ వచ్చామో దాని తాలూకు
అనర్థాలన్నీ రూపాయిని, ప్రజల దైనందిన జీవితాలను కూడా చుట్టబెడుతూ వచ్చాయి.
1966లో, ఇందిరాగాంధీ హయాంలో డాలర్ ఒక్కింటికి చెల్లించుకోవలసివచ్చిన రూ.6
ఎక్కడ? నేడు అదే డాలర్‌కు చెల్లించుకోవాల్సి వస్తున్న రూ.53 ఎక్కడ?!
బ్రెటన్ ఉడ్స్ సమా వేశం నిర్ణయం ప్రకారం మానవ హక్కుల పరిరక్షణ, ఐక్యరాజ్య
సమితి ప్రణా ళిక ప్రకారం ప్రజాస్వామ్య రాజకీయవ్యవస్థ, ప్రజాప్రయోజనాల
రక్షణకు అనువైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దేశాల అనుల్లంఘనీయమైన కర్తవ్యంగా
ఉండాలి. కానీ, ఈ మూడు విధాన లక్ష్యాలనూ అమెరికా నాయకత్వంలో ఉన్న ప్రపంచ
బ్యాంకు, ఈఎంఎఫ్, ప్రపంచ వాణిజ్యసంస్థ బాహాటంగా ఉల్లంఘించి ఊరేగుతున్నాయి.
సామ్రాజ్యవాద పాలకులు ‘ప్రపంచీకరణ’ నినాదం చాటున చేస్తున్న పని ప్రపంచాన్ని
దారిద్య్రీకరించడం. తద్వారా మరికొన్నాళ్లపాటు కునా రిల్లుతున్న తమ వ్యవస్థ
పునాదుల్ని కాపాడుకోవడం. రాక్షసంగా ఫైనాన్స్ పెట్టుబడులను ఎగుమతి చేయడం
ద్వారా అంతిమంగా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తమ పాదాక్రాంతం చేసుకోవడానికి
దింపుడు కల్లం ఆశతో అమెరికా తెగిస్తున్నది. భారత పాలనావ్యవస్థ ఈ చక్రబంధంలో
కూరుకుపోతోంది.
ఇందుకు అనుగుణంగానే అనవసరపు నోట్ల ముమ్మరాన్ని
నియంత్రించి, ప్రజాబాహుళ్యం నిత్యావసర సరుకుల ధరలను అందుబాటులో ఉంచడానికి
బదులు లోటుబడ్జెట్ విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వరంగ వ్యవస్థను
బలోపేతం చేయడానికి బదులు ప్రపంచ బ్యాంకు, అమెరికా తాఖీదుల ప్రకా రమే గతంలో
ఉన్న నామమాత్రపు విధి నిషేధాలను కూడా సడలించుతోంది, తొలగించుతోంది. ఇందులో
భాగమే తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారీ రాయితీలతో (100 శాతం
పెట్టుబడులకు) దేశీయ పరిశ్రమలలోకి ముఖ్యంగా చిన్న, మధ్యరకం వ్యాపార వర్గాల
చొరవను తుంచివేస్తూ ఆహ్వాని స్తోంది. ఒక వైపు నుంచి స్పెక్యులేషన్‌కు,
స్టాక్ మార్కెట్‌లో తక్కువ షేర్లపై అపార లాభాలు గుంజడానికి అవకాశం కల్పించే
జూదగొండి వ్యవస్థను ప్రోత్స హిస్తూ, ఇంకొక వైపు నుంచి సామాన్య, మధ్యరకం
మదుపుదార్లకు పెట్టుబడి అందకుండా బ్యాంకు వడ్డీ రేట్లను పెంచేస్తున్నారు.
ఇంకొక వైపు నుంచి వడ్డీ రేట్లను తగ్గించాలని ప్రైవేట్ బడాపారిశ్రామిక
వేత్తలు బీద అరుపులు అరుస్తున్నారు. రూపాయి మారకం విలువ కోతకు గురవడంవల్ల
మన కరెన్సీకి, తద్వారా ఆర్థిక వ్యవస్థకూ రెండు విధాల ‘క్షవరం’ అవుతుంది.
అంటే, పతన మైన రూపాయి విలువలో మనం అమెరికాకు ఎగుమతి చేసే సరుకులను ఎక్కువ
సంఖ్యలో పంపుకోవలసి వస్తుంది. అలాగే మనం దిగుమతి చేసుకునే సరుకులకు డాలర్
విలువలో మనం ఎక్కువ రూపాయలను చెల్లించుకోవలసి వస్తుంది. ఈ రెండు రకాల
‘క్షవరం’ ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మరింతగా కుప్ప కూలుతుంది. పెట్రోలియం
ఉత్పత్తులు సహా అన్ని రకాల వస్తువుల ధరలూ చుక్కలంటుతాయి. నోట్ల ముమ్మరాన్ని
అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టే పేరుతో రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లు
పెంచుతుంది, అదే వాదనతో పెట్రోలియం ఉత్ప త్తుల ధరల్ని పెంచాలనీ సలహా
ఇస్తుంది. ప్రభుత్వం చేసే రుణాలకు మారు పేరే భారీ లోటు ద్రవ్య విధానం. ఈ
విధానం వల్ల ‘అంతా బాగానే ఉండబట్టే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతోంది
కాబోలు’ననీ భ్రమించే ప్రజలు తమ కొను గోలు శక్తితో నిమిత్తం లేకుండా
ప్రభుత్వపరంగా వస్తువులకు కృత్రిమంగా కల్పించే ‘అదనపు గిరాకీ’ వల్ల మరింతగా
అప్పుల పాలవుతారు. 1991లో దేశంలోకి బలవంతంగా దిగుమతి చేసుకున్న ప్రపంచ
బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణల ఫలితంగా - కృత్రిమ ఊహాగానాల ద్వారా
మార్కెట్‌లోనూ, స్టాక్ మార్కెట్‌లోనూ ప్రవేశించి షేర్ల విలువను తారుమారు
చేసే స్పెక్యులేటివ్ శక్తులు బలపడ్డాయి. ఉత్పత్తుల రవాణాపైన, సరుకు
నిల్వలపైన ఉండాల్సిన నియంత్రణ సడలిపోయింది.
వ్యవసాయ మార్కెట్లలో
రైతాంగ ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రవేశించవలసిన ప్రభుత్వ సంస్థలను ఆ
బాధ్యతల నుంచి ఉపసంహరిం చేశారు. వస్తూత్పత్తులను కాస్తా స్టాక్ మార్కెట్
జూదానికి గురిచేశారు. రైతాం గానికి, పేద, మధ్యతరగతి ప్రజాబాహుళ్యానికి
అవసరమైన నిధుల్ని కాస్తా తీసుకుపోయి స్పెక్యులేటర్లకు అందుబాటులో ఉంచారు.
ఇక ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుంది? రూపాయి విలువకు రక్షణ ఎప్పుడు
దొరుకుతుంది? వ్యవ సాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను, ఉత్పత్తినీ
పెంచడానికి ప్రభుత్వమే ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ద్వారా,
స్పెక్యులేషన్ వ్యాపారాన్ని అణచి వేయడం ద్వారా, ప్రభుత్వ పరంగా మార్కెట్లో
సరుకుల సేకరణను వాటి పంపి ణీని విస్తృతం చేయడం ద్వారా, అరుదుగా లభించే
సరుకులను... ముఖ్యంగా దిగుమతి అయ్యే వస్తువులను క్రమబద్ధీకరించడం ద్వారా,
పెట్రోలియం ఉత్పత్తులపైన పన్నుల భారాన్ని తగ్గించి, దేశీయ ఆర్థిక వ్యవస్థను
ప్రపంచ సంక్షోభపు ఒడిదుడుకుల నుంచి తప్పించడం ద్వారా రూపాయి విలువను
కాపాడుకుని తద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టుకోవడం సాధ్యమని ఆర్థిక
నిపుణులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక
విధా నాలు అమెరికా, ప్రపంచ బ్యాంకు ఒత్తిళ్ల మూలంగా ప్రభుత్వ జోక్యాన్ని
అను మతించవు. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం వద్ద
ఉన్న ఆయుధం ఒక్కటే. వడ్డీరేట్లు పెంచి, వివిధ రంగాల అభివృద్ధిక్రమాన్ని
కుంటుపరచి, సరుకులకు గిరాకీని కాస్తా తొక్కిపెట్టి ఉంచడం.
అయితే ఈ పద్ధతిలో ధరలను అదుపు చేయడమంటే, అది చాలా ఇబ్బం దితో కూడుకున్న పనే అవుతుంది.
ఎందువల్ల? ఈ కృత్రిమ ప్రయోగంవల్ల ఉపాధి అవకాశాలకు కోత పెట్టాల్సివస్తుంది.
వేతనాలను తగ్గించాల్సి వస్తుంది. తద్వారా సరుకులకు గిరాకీని
తగ్గించాల్సివస్తుంది. కానీ ఇది సాధ్యపడదు. ఎందుకంటే అనేక మాసాలుగా మనం
చూస్తూనే ఉన్నాం. ధరలను నియంత్రిం చడం కోసం 16 సార్లు వడ్డీరేట్లు పెంచినా,
ధరలపైన ఎలాంటి ప్రభావమూ ఉండదని తేలిపోయింది. పోనీ చైనా మాదిరిగా డాలర్‌తో
‘యువాన్’కు ఉన్న పీటముడిని సడలించుకున్న చందంగా మన రూపాయి విలువను
పెంచుకునే స్వతంత్రమైన కరెన్సీ విధానాన్ని భారత పాలకులు రూపొందించుకునే సాహ
సం చేయగలరా? అదీ లేదు. స్థానికంగా వర్తక లావాదేవీలకు ఆటంకం లేకుం డా
సాగించుకునేందుకు వీలుగా 1,500 స్థానిక సొంత కరెన్సీలను చెలామణి లోకి
తెచ్చుకున్న దేశాలు ఉన్నాయని బెర్నార్డ్ లైటర్ అనే అంతర్జాతీయ ద్రవ్య
మారకవేత్త, ‘యూరో’ను రూపకల్పన చేసిన నిపుణుడూ పేర్కొంటున్నాడు.
అన్నింటికన్నా విచిత్రమైన సంగతి ఏమిటంటే అటు ఆడమ్‌స్మిత్, ఇటు కీన్స్
ప్రభుత్వాలు రెగ్యులేటరీ వ్యవస్థ ద్వారానే ఆర్థిక వ్యవస్థను నిర్వహించాలని
చెప్పినా, దానిని ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ కాలదన్నింది. ఈ సందర్భంలో
అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అవసానదశలో చేసిన హెచ్చరిక సదాస్మ
రణీయం. ‘‘రానున్న రోజుల్లో ప్రైవేట్ కార్పొరేషన్లు గణతంత్ర వ్యవస్థల్ని
తినే స్తాయి’’!! మనం ఈ రోజు చూస్తున్నది అచ్చంగా అదే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి