2, డిసెంబర్ 2011, శుక్రవారం

ఇరాన్ లో బ్రిటిష్ రాయబార కార్యాలయం విధ్వంసం

ఇరాన్ పైన మరోవిడత అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధించినందుకు ప్రతీకారంగా ఇరాన్ విద్యార్ధులు రాజధాని టెహ్రాన్ లో గల బ్రిటిష్ రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కొద్ది వారాల క్రితం ‘అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ’ (ఐ.ఎ.ఇ.ఎ) ఇరాన్, 2001లో, అణు బాంబుని నిర్మించడానికి ప్రయత్నించిందనడానికి ఆనవాళ్ళు దొరికాయంటూ ‘అభూత కల్పనలతో’ కూడిన నివేదిక ప్రచురించింది. ఐ.ఎ.ఇ.ఎ అంటె అమెరికా తొత్తు సంస్ధ. అమెరికా గీసిన గీత దాటదు. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని చంపడానికి ఇరాన్ కుట్ర పన్నిందంటూ అంతకు ముందు అమెరికా చేసిన ప్రకటనను ఎవరూ విశ్వసించకపోవడంతో అర్జెంటుగా ఐ.ఎ.ఇ.ఎ చేత ఈ దొంగ నివేదికను అమెరికా, యూరప్ లు ఇప్పించాయి. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ పాగా వేయడానికి సహకరించిన బ్రిటన్ ఇంకా అక్కడ కుయుక్తులు కొనసాగిస్తూనె ఉంది. ఇరాన్ పైన మరిన్ని ఆంక్షలు విధిస్తూ బ్రిటన్ తీర్మానం చేయడంతో కోపోద్రిక్తులైన ఇరాన్ విద్యార్ధులు బ్రిటన్ ఎంబసీపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
1979లో ఇలానే ఇరాన్ విద్యార్ధులు అమెరికా ఎంబసీపై దాడి చేసి అక్కడి సిబ్బందిని 444 రోజుల పాటు బందీగా ఉంచుకున్నారు. అప్పటినుండీ అమెరికా, ఇరాన్ ల మధ్య రాయబార సంబంధాలు లేవు. తాజా దాడితో బ్రిటన్ తన రాయబార సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలుపించుకుంది. ఇరాన్ తో రాయబార సంబంధాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందే బ్రిటన్ తో రాయబార సంబంధాల స్ధాయిని తగ్గిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించినా ఆ వార్తను కవర్ చేయని పశ్చిమ పత్రికలు బ్రిటన్ ప్రకటనను మాత్రం తాటికాయంత అక్షరాలతో ముద్రించాయి. కింది ఫొటోలలో చూసినట్లయితే ఇరాన్ విద్యార్ధుల దాడిని అడ్దుకోవడానికి ఇరాన్ పోలీసులు చేసిన ప్రయత్నాలను చూడవచ్చు. కాని రాయిటర్స్ వార్తా సంస్ధ బ్రిటిష్ ఎంబసీ పై దాడి జరుగుతుంటె అడ్డుకున్న నాధుడే కనపడలేదంటూ వార్త రాసింది. కళ్ళు మూసుకు పోయిన ఆ విలేఖరి ‘ది గార్డియన్’ ప్రచురించిన ఈ ఫోటోలను చూసయినా నిజం రాస్తాడని ఆశిద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి