సిద్దిపేట,
డిసెంబర్ 7 : తెలంగాణ జిల్లాల రైతులకు సాగునీరందించేందుకు
ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని ప్రభుత్వం మూడేళ్ల క్రితమే చేపట్టింది. అప్పటి
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఈ పథకానికి పలుచోట్ల శంకుస్థాపనలు
చేశారు. ముఖ్యమంత్రులు మారుతున్నా నిధులు మాత్రం నీటి బొట్ల మాదిరిగా
రాలుస్తున్నారు.
ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో ఈ పథకం పలుమార్లు శాసనసభ, శాసనమండలిలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు వరదాయిని కానున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా
కల్పించాలని 2011 డిసెంబరు 5న శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ
మేరకు కేంద్రం ఆమోదం కోసం పంపాలని కోరింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు
ప్రస్తుత స్థితిగతులపై శాసనమండలి సమావేశంలో స్పెషల్ మెన్షన్ కింద సభ్యులు
ప్రస్తావించారు.
పథకం పూర్తి చేసే గడవు మరో ఆరే ళ్లు పొడిగిస్తున్నట్లు వారడిగిన ప్రశ్నలకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి వివరణ ఇస్తూ చేతులు
దులుపుకున్నారు. తెలంగాణలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్
ప్రజలకు తాగునీరందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 2013
నాటికి పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని
సవరించి 2018-19 నాటికి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు
జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రాన్ని కోరుతామన్నారు. లేనట్టయితే ప్రధాని
సహాయనిధి కింద ప్రత్యేక నిధులను తీసుకొచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తామని
మంత్రి వివరించారు. ఈ వివరణ చూస్తే నిర్ణీత గడువులో ప్రాజెక్టు పూర్తయ్యే
సూచనలు కనిపించడం లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను 29
ప్యాకేజీలుగా విభజించారు.
ఆదిలాబాద్,
నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సాగు, తాగునీరు అందేలా 15
ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజీలు 2014-15ల వరకు పూర్తి చేయాలని
నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యదాస్ 2011జూన్ 30న ఉత్తర్వులు జారీ
చేశారు. కేంద్ర జలసంఘానికి సమర్పించిన ప్రాజెక్టు పూర్తి నివేదిక(డీపీఆర్)
ప్రకారం ఈ కార్యచరణను రూపొందించినట్లు ప్రకటించారు. ఆ ప్రకటనకు కాలం
చెల్లినట్లేనని సోమవారం మంత్రి శాసనమండలిలో ఇచ్చిన జవాబుతో వెల్లడైంది.
జిల్లాలో 11 నుంచి 14వరకు నాలుగు ప్యాకేజీలలో పనులు చేపట్టాలని
నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా మధ్య మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు,
అక్కడి నుంచి చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివార్లలో నిర్మించే
రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు.
ఈ రిజర్వాయర్ 1.7
టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇక్కడి నుంచి 30 వేల
ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి సిద్దిపేట మండలం
ఇమాంబాద్ శివార్లలో నిర్మించే రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తారు. దీని
సామర్థ్యం 1.5 టీఎంసీలు. ఇక్కడి నుంచి లక్షా 10 వేల ఎకరాల భూమికి సాగునీరు
అందిస్తారు. ఇమాంబాద్ నుంచి సిద్దిపేట మండలం తడకపల్లి శివార్లలో 1.5
టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. అక్కడ 50
ఎకరాల భూమి సాగులోకి వస్తుందని ప్రతిపాదించారు.
అక్కడి నుంచి కొండపాక
మండలం తిప్పారం శివార్లలో 1 టీఎంసీ సామర్థ్యంతో కట్టే రిజర్వాయర్‌కు
నీటిని చేరవేసి 50 ఎకరాల భూమిని సేద్యంలోకి తెస్తారు. ఇక్కడి నుంచి వర్గల్
మండలం పాములపర్తిలో నిర్మించే ఒక టీఎంసీ సామర్థ్యపు రిజర్వాయర్‌కు నీటిని
పంపింగ్ చేస్తారు. అక్కడ 40 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తారు. మెదక్ జిల్లాలో
జరిగే పనుల కోసం రూ.1938 కోట్లు ఖర్చవుతాయని మూడేళ్ల క్రితం అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లా అంతటికి నీరందించాలనే డిమాండ్ ఉన్నది. 2009
నవంబరు 16న సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల
జలసాధన సమితి చైర్మన్‌గా ఉద్యమం చేపట్టారు. అది మూన్నాళ్ల డ్రామాగా
ముగిసింది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లా అంతటికి నీరందించాలంటే మరిన్ని
రిజర్వాయర్లు అవసరమవుతాయి.
తిరిగి ప్రారంభమైన సొరంగం పనులు
పథకం పనుల నిర్వహణ కోసం జిల్లాలో ఎంత భూమి ఎక్కడెక్కడ అవసరమవుతుందో
అధికారులు సర్వే చేశారు. కానీ, భూసేకరణకు సంబంధించి ఉత్తర్వులు, నిధులు
విడుదల కాలేదు. చిన్నకోడూరు మండలం చెలుకలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని
ఎల్లాయిపల్లి శివార్లలో పెద్దగండి చెరువు సమీపంలోని ప్రభుత్వ భూమిలో
రెండున్నరేళ్ల క్రితం ప్రాణహిత-చేవెళ్ల పనులు ప్రారంభించారు.
సదరన్ ఇంజనీరింగ్
వర్క్స్, మెగా ఇంజనీరింగ్, బీహెచ్ఈఎల్ కంపెనీలు సంయుక్తంగా ప్రభుత్వ భూమిలో
సొరంగం తవ్వకం పనులు చేపట్టాయి. 9.5 మీటర్ల డయాతో సుమారు 9 కిలోమీటర్ల
సొరంగం తవ్వాల్సి ఉండగా 800 మీటర్ల దూరం పూర్తి చేశారు.
పూర్తయిన పనులకు కూడా నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు అక్కడికి
తెచ్చిన భారీ యంత్రాలను ఆరు నెలలకే ఇతర ప్రాంతాలకు తరలించారు. సొరంగ
మార్గానికి అడ్డుగోడ కట్టి వదిలేశారు. పని ప్రదేశంలో నిర్మించిన భవనాలు
ఖాళీగా ఉన్నాయి. అక్కడ పనులు జరిగినపుడు 300 మందికి వసతి కల్పించారు.
సుమారు రెండేళ్ల
తర్వాత అదే కాంట్రాక్టర్లు సొరంగం తవ్వకం పనులను ప్రారంభింపజేశారు.
సొరంగానికి అడ్డుగా నిర్మించిన గోడను తొలగించి పనులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం 45 మంది మాత్రమే వివిధ యంత్రాలతో పనిచేస్తున్నారు. త్వరలో సుమారు
300 మంది కార్మికులతో పనులు వేగవంతం చేస్తామని కాంట్రాక్టర్ సంబంధిత
వ్యక్తులు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి రూ.42 వేల
కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 2008-09లో రూ.210 కోట్లు, 2009-10లో
రూ.600 కోట్లు, 2010-11లో రూ.680 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం
ప్రకటించింది.
నిధులు నామమాత్రంగా
విదిల్చారు. రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్రకు ప్రయోజనం చేకూరే ప్రాజెక్టుల
నిర్మాణం విషయం లో నిధులు విడుదల చేస్తోంది. కానీ, తెలంగాణను సస్యశ్యామలం
చేసే ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడం లేదు. పనులు పూర్తి
చేయాల్సిన గడువు పెంచుతూ కాలయాపన చేస్తున్నది. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుకు
జాతీయ హోదా కల్పించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకోవాలని పలువురు
కోరుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి